MohanPublications Print Books Online store clik Here Devullu.com

కావేరి పుష్కరాలు_KAVERI_PUSHKARALU_GHATS


కావేరి పుష్కరాలు

నదులు మన పుణ్యభూమికి ఆ భగవంతుడిచ్చిన వరం. నిత్యం మన పరిసర ప్రాంతాలలో పుష్కలంగా ప్రవహిస్తూ మన నిత్యావసరాలకు, పంటపొలాలకు మరియు అన్ని విధాలైన అవసరాలకు కూడా ఉపయోగపడుతూ జనజీవనాన్ని సుగమం చేస్తూ, సాక్షాత్తూ భూమి మీద పారే దేవతలు అని చెప్పవచ్చు. మనదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో జీవనదులు ప్రవహిస్తున్నాయి. ప్రతి నదీమతల్లికి పన్నెండు సంవత్సరాలకొకసారి పుష్కరం అనే పెద్ద పండుగ మనం జరుపుకుంటాము. పుష్కర సమయం సమస్త దేవీ దేవతలకు మరియు పితృదేవతలకూ కూడా ఈ నదులు నిలయమై ఉంటాయని మన పురాణాలు మరియు శాస్త్రాలు చెప్తున్నాయి. పుష్కర సమయంలో ఆ నదీమతల్లులు పొంగిపారుతూ మన జీవితాలను సుఖశాంతులతో నింపాలని ప్రార్ధిస్తూ, పుష్కర స్నానాలను ఆచరించి, అంజలి ఘటించి ఆ నది వొడ్డున పితృదేవతలకు తర్పణాలు వదలడం మన ఆచారం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన మన పితృదేవతలు పుణ్యలోకాలను పొందుతారు అని నమ్మకం.

నదీమతల్లికి పసుపు కుంకుమలతో “గంగ పూజ” జరిపి తమ సౌభాగ్యాన్ని పది కాలాలపాటు చల్లగా చూడమని ప్రార్ధనలు జరుపుతారు స్త్రీలు. పురుషులు ఈ పుష్కరం జరుగుతున్న నది వొడ్డున తమ పితృదేవతలకు తర్పణాలను వదిలి వారికి పుణ్యలోక ప్రాప్తికి మార్గం సుగమం గావిస్తారు

పుష్కర సమయంలో ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని స్నాన ఘట్టాలూ భక్తులతో కిటకిటలాడుతూ ఎంతో చక్కటి పవిత్రమైన వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉంటాయి. ఆ ప్రాంతాలలోని గుళ్ళూ గోపురాలు భక్తులతో, వారు చేసే వివిధ రకాల పూజలతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటాయి.

గురుడు తులా రాశిలో ప్రవేశించినప్పుడు కావేరీ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది పుణ్యనది అయిన కావేరీ నదికి పుష్కరం రావడం విశేషం. ఈ నెల అనగా సెప్టెంబర్ 12వ తారీఖు నుండి ప్రారంభం అయి ఈనెల 23 వ తేదీ వరకూ కావేరీ నదికి ‘ఆదిపుష్కరాలు’ జరగనున్నాయి. ఈ పుష్కరాలకు పుష్కర స్నానాలు చేయడానికి స్నానఘట్టాలకు వచ్చే భక్తులకు అన్ని విధాలైన సౌకర్యాలను అందించే దిశగా కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.


పుష్కర స్నానం ఎంతో పవిత్రం మరియు పుణ్యప్రదం అని పెద్దలు సూచించారు. ఈ సమయంలో అన్ని నదులలోనూ కొత్త నీరు ప్రవహిస్తూ ఉంటుంది. తమ పరీవాహక ప్రాంతంలోని అన్ని అడవులు మరియు వృక్ష సంపదను తాకి ప్రవహించడం చేత ఆ వృక్షాలకు గల ఔషధ గుణాలను ఆ నీటిలో నిక్షిప్తం చేసుకొని ప్రవహిస్తాయి. ఆ నీటిలో మునకలు వేసి స్నానం చేయడం ఎన్నో విధాలైన శారీరక మరియు చర్మ సంబంధిత అనారోగ్యాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుందని పెద్దలు చెప్తారు.

కావేరీ నదీ విశేషాలను చూద్దాం :

సాక్షాత్తు దక్షిణగంగగా పిలువబడే కావేరీనది కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఎన్నో ప్రదేశాలను కలుపుతూ ఆ ప్రదేశాలను సస్యశ్యామలం చేస్తోంది.

కావేరీ నది పుట్టుక:

పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో ఉండే కావేరుడు అనే రాజు సంతాన లేమి కారణంగా దుఃఖితుడై సంతానం కొరకు బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. ఆయన కఠోర తపస్సుకు మెచ్చి లోపాముద్ర అనే బాలికను ఆయనకు కుమార్తెగా ప్రసాదిస్తాడు బ్రహ్మ. ఆమె కావేరుడి కుమార్తెగా పెరిగినది కావున ఆమెకు కావేరి అనే పేరు వచ్చింది. ఆ బాలికను ఎంతో చక్కగా పెంచి యుక్తవయసు వచ్చేకా ఆమెను అగస్త్య మునికి ఇచ్చి వివాహం చేయ తలపెట్టాడు. ఆ సమయంలో కావేరి ఒక షరతు విధిస్తుంది. ఆ షరతు ప్రకారం అగస్త్యుడు ఆమెను ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఉండరాదు అని. దాని ప్రకారం అగస్త్యుడు ఆమె మాటకు కట్టుబడే ఉండేవాడు. కానీ ఒక సమయంలో శిష్యులకు విద్యను బోధిస్తూ ఆ పనిలో నిమగ్నమై ఈ కావేరిని ఒంటరిగా వదిలాను అనే విషయాన్ని మరిచిపోతాడు. ఈ విషయం కావేరికి కోపం తెప్పిస్తుంది. ఆ కోపంలో ఆమె కావేరి నదిగా మారి ప్రవహించడం ప్రారంభించింది అనేది ప్రాచుర్యంలో ఉన్న ఒక కథనం.

మరొక వృత్తాంతంలో కావేరిని విడిచి ఉండరాదు అనే నియమం ఉండడం చేత అగస్త్యుడు ఆమెను తన కమండలంలో జలరూపంలో నిలిపి తనతోటే ఉంచుకునేవాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో క్షామం వచ్చి ప్రజలందరూ నీరు లేక విలవిలలాడుతుండడం వల్ల అక్కడి ప్రజలందరూ విఘ్నేశ్వరుడికి మొరపెట్టుకోగా ఆయన ఒక గోవు రూపం దాల్చి గడ్డి మేస్తున్నట్టుగా నటిస్తూ ఆ కమండలంలోని నీటిని క్రిందికి పడదోస్తాడు. ఆ నీరు కావేరీ నదిగా ఆ ప్రాంతాన్ని అంతా తడుపుతూ క్షామం తీర్చిందని అంటారు.

కథనం ఏదైనప్పటికీ కావేరీ నది ఆ ప్రాంతాన్ని కొండలు గుట్టలు వాగులు అన్నీ కలుపుతూ సస్యశ్యామాలం చేస్తూ ప్రవహిస్తోంది అనడం నిర్వివాదాంశం. ఈ కావేరీ నదీ జన్మస్థలం తలకావేరి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు అనే జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం నుండి కావేరీనది కర్ణాటక, తమిళనాడు మరియు పాండిచ్చేరిలలో ప్రవహిస్తూ వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తోంది.

ఈ కావేరి నదికి హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నోయ్యల్ మరియు అమరావతి అనేవి ఉపనదులు.

తలకావేరి, కుషాల్ నగర్, శ్రీరంగపట్టణం, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పూంపుహార్ అనే నగరాల గుండా ప్రవహిస్తూ ఆయా ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉండేలా చేస్తోంది కావేరి. కూర్గ్ ప్రాంతంగుండా ప్రవహిస్తున్న ఈ నది, అత్యంత ప్రసిద్ధమైన చందనపు అడవుల ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపజేయడానికి కారణమవుతోంది.

నదులు ఉన్న చోటనే జనావాసాలు, పుణ్యతీర్థాలు మరియు అడవులు అన్నీ విలసిల్లుతాయి అనే విషయాన్ని ఋజువు చేస్తూ ఈ నది ఒడ్డున సుప్రసిద్ధ పుణ్యస్థలాలైన శ్రీరంగం, కుంబకోణం లను చూడవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతి నొందిన బృందావన్ గార్డెన్స్ కూడా ఈ నదీ పరీవాహంలోనే ఉన్నాయి.

తలకావేరి:

తలకావేరి కావేరీ నది జన్మస్థలం. ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న చిన్న కొండ పై అగస్త్య మహర్షి తపస్సు చేసిన స్థలం ఉంటుంది.

భగంద క్షేత్రం:

శ్రీ భాగందేశ్వర మందిరం ఉన్న భాగమండల ప్రాంతం కూడా ముఖ్యమైన స్నాన ఘట్టాలలో ఒకటి. ఇది ప్రాచీన భగంద క్షేత్రం. ఈ ప్రాంతంలో శ్రీ భగందమహర్షి నివసించేవారని, వారి శిష్యులతో సహా వారి ఆశ్రమం ఈ క్షేత్రంలో ఉండేవారని అని చెప్తారు. భాగమండల ఆలయం వద్ద త్రివేణి సంగమ స్థలం కలదు. ఈ ప్రదేశంలో పితృతర్పణాలు చేస్తారు. ఈ త్రివేణి సంగమ స్నానం ఎంతో పుణ్యప్రదం.

కృష్ణరాజ సాగర :

వేణుగోపాల స్వామి ఆలయం హోయ్సాల రాజుల కళానైపుణ్యానికి తార్కాణం. కృష్ణరాజ సాగరానికి సమీపంలో ఉన్న ఈ మందిరం మైసూరు జిల్లాలో ఉన్న చెన్నకేశవ మందిర నిర్మాణం జరిగిన సమయంలోనే జరిగినది అని చెప్తారు. ఈ వేణుగోపాల స్వామి మందిరం ఉన్న ప్రదేశం కూడా కావేరీ నదీ పుష్కర స్నానానికి ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి.

శ్రీరంగపట్టణం:

శ్రీ రంగపట్టణంలో ఆది రంగనాథుడు కొలువై ఉన్నాడు. ఈ మందిరం మైసూరుకు దగ్గరలో ఉంది. ఈ ప్రదేశం కూడా ముఖ్యమైన స్నాన ఘట్టాలలో ఒకటి.

సోమనాథపురం:

మైసూరు హోయ్సాల రాజుల కళా ప్రతిభను చాటి చెప్పే 12 వ శతాబ్దానికి చెందిన వైష్ణవ దేవాలయం చెన్నకేశవ ఆలయం. ఈ ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. ఈ మందిరం మూడవ నరసింహ మహారాజు సమయంలో నిర్మించారు. కావేరీ నదీ పుష్కర స్నాన ఘట్టాలలో ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలలో ఇదీ ఒకటి.

శివనసముద్రం:

మధ్య రంగనాథుడు కొలువై ఉన్న ప్రదేశం శివనసముద్రం. ఈ ప్రాంతంలోని జలపాతాలు పర్యాటకులకు కనులవిందు చేస్తూ కొండల మీదుగా క్రిందకి జాలువారుతూ ఉంటాయి.

శ్రీరంగం:

అంత్య రంగనాథుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం శ్రీరంగం. ఈ పేరు వినని వారుండరు. ప్రఖ్యాత శ్రీవైష్ణవ క్షేత్రమైన ఈ శ్రీరంగం ధనుర్మాసంలో ఎంతో ప్రత్యేకమైన పండుగ శోభను సంతరించుకుంటుంది. ఆ సమయంలోని ఉత్సవాలను తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు.ఈ శ్రీరంగం వేయి స్తంభాల మండపం, ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు మరియు 24 మంటపాలు కలిగిన క్షేత్రం.

తిరువయ్యూర్:

ప్రఖ్యాత వాగ్గేయకారుడైన శ్రీ త్యాగరాజ స్వామి నివసించిన స్థలం మరియు మందిరం కలిగిన క్షేత్రం తిరువయ్యూర్. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు ఇక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఆరాధనోత్సవాలలో పాల్గొనడానికి సంగీతకారులంతా తరలి వస్తారు. ఈ క్షేత్రం కూడా కావేరీ నదీ పుష్కర స్నాన ఘట్టాలలో ముఖ్యమైన ఘట్టము.

తంజావూర్:

ఈ కావేరీ నది వొడ్డున తంజావూరులోని బృహదీశ్వరాలయం కూడా ముఖ్యమైన శైవక్షేత్రం. మొత్తం 12 శివాలయాలు మరియు 4 వైష్ణవ క్షేత్రాలతో ఈ నదీ పరీవాహక ప్రాంతమంతా ఎంతో పవిత్రము మరియు సుమనోహరముగా భాసిల్లుతోంది.

చిదంబరం:

ఈ నదీ పరీవాహంలోనే ప్రసిద్ధమైన మరియు అతి ప్రాచీనమైన దేవాలయం చిదంబరంలో ఉంది. ఈ ఆలయంలో ప్రళయ తాండవమాడుతున్న మహేశ్వరుని అతి పెద్ద మూర్తిని చూడవచ్చు. ఈ నటరాజ మందిరంలో మూర్తులు ఎన్నో నృత్యభంగిమలతో నటరాజ నాట్యవైభావాన్ని చాటుతూ ఉంటాయి. పంచాలింగాలలో ఒకటైన ఆకాశ లింగం ఈ చిదంబరం క్షేత్రంలో వెలసినది.

కావేరీ పుష్కర సమయంలో అనువైన పుష్కర స్నాన ఘట్టాలను చూద్దాం:
తలకావేరి, కొడగు
భగమండల, కొడగు
కుషాల్ నగర్, కొడగు
శ్రీరంగపట్టణం, మాండ్య జిల్లా
మాండ్య, మాండ్య జిల్లా
శివనసముద్ర, మాండ్య జిల్లా
తలకాడు
కనకపూర్, కర్ణాటక
ముతాతి, కర్ణాటక
సోమనాథపుర, కర్ణాటక 
మెట్టూర్, సేలం జిల్లా, తమిళనాడు
పల్లిపాలయం, నమ్మక్కల్ 
వేలూర్, నమ్మక్కల్
భవాని, తిరునాన 
ఈరోడ్, ఈరోడ్ జిల్లా, తమిళనాడు 
కొడుముడి, ఈరోడ్ జిల్లా, తమిళనాడు 
తిరుచిరాపల్లి 
తిరువయ్యూరు, తంజావూర్ జిల్లా 
స్వామిమలై, తంజావూర్ జిల్లా 
కుంభకోణం, తంజావూర్ జిల్లా 
పూంపుహార్, నగపట్టిణం జిల్లా

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం