MohanPublications Print Books Online store clik Here Devullu.com

పచ్చిమిరపతో క్యాన్సర్‌ దూరం!-green spots, Cancer, పచ్చిమిరప, క్యాన్సర్‌

ఔషధ విలువల గని
వేప చెక్క- కరక్కాయల చూర్ణాన్ని గానీ, వేప చెక్క - ఉసిరికాయల చూర్ణాన్ని గానీ 6 గ్రాముల మోతాదులో నెల రోజుల పాటు సేవిస్తే చర్మవ్యాధులు నయమవుతాయి.
20 మి.లీటర్ల వేపాకు రసంలో ఒక స్పూను తేనె కలిపి సేవిస్తే, కడుపులోని పలురకాల క్రిములు నశిస్తాయి.
వేపనూనెకు సమానంగా నీలగిరి తైలం కలిపి, కీళ్లమీద రోజుకు రెండుసార్లు మర్ధన చేస్తూ, పైన వేడినీటితో కాపడం పెడుతూ ఉంటే నరాల నొప్పులు తగ్గుతాయి.
వేపాకులను నీడన ఎండించి, కాల్చి బూడిద చేయాలి. 10 గ్రాముల బూడిదను ఒక గ్లాసు నీటితో కలిపి సేవిస్తే, మూత్ర పిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.
వేపాకులకు సమానంగా మారేడు ఆకులను కలిపి మెత్తగా రుబ్బి తలకు పట్టించి 12 గంటల పాటు ఉంచాలి. ఈ విధంగా నెలరోజులు చేస్తే రాలిపోయిన తల వెంట్రుకల స్థానంలో తిరిగి కొత్త వెంట్రుకలు మొలుస్తాయి.
వేపనూనెను తలకు పట్టించి, గంట తర్వాత, వేపాకు క షాయాన్ని తలకు మర్దన చేస్తే, తల పై వచ్చే దురదలు, కురుపులు, పుండ్లు, చుండ్రు, పేలు హరిస్తాయి.
వేపనూనెకు సమానంగా, తేనె కలిపి, దానిలో దూది ముంచి చెవిలో పెట్టుకుంటే చెవి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
50 మి.లీ వేప పుల్లల కషాయంలో మూడు గ్రాముల త్రికటు చూర్ణం కలిపి, రోజుకు రెండు పూటలా భోజనానికి అరగంట ముందు తాగుతూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
చప్పటి తిండే తినాలా..?
నాకు గత నాలుగేళ్లుగా హై- బిపి సమస్య ఉంది. రోజూ వాకింగ్‌ చేస్తూనే ఉన్నా, అయినా రక్తపోటు మాత్రం తగ్గడం లేదు. ఏ డాక్టర్‌ వద్దకు వెళ్లినా పూర్తిగా మాత్రల మీదే ఆధారపడితే సరిపోదు, మీ ఆహారంలో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించేయండి. బిపి అదుపులోకి వచ్చేదాకా అసలు మొత్తంగానే మానేస్తే ఇంకా బెటర్‌ అంటున్నారు. నాకేమో ఉప్పు ఏ కాస్త తగ్గినా ముద్ద దిగదు. ప్రతి భోజనంలోనూ అదనంగా ఉప్పు వేసుకుంటాను. ఉప్పు లేని ఆ చప్పటి తిండి తినడం నా వల్ల కాదు. అయినా, ఉప్పు తగ్గించకుండా బిపిని అదుపు చేసే మార్గాలేమీ లేవా?
- కె. రాజారెడ్డి, జగిత్యాల
మొదట్నించీ మీరు ఎక్కువ మోతాదులో ఉప్పు తినడానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి అలా అనిపిస్తోంది గానీ, ఓ నెల రోజుల పాటు మనసు నిగ్రహించుకుని ఉప్పు లేకుండా తినండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు తింటున్న ఈ మోతాదును అప్పుడు భరించలేరు. నిజానికి ప్రపంచంలో కెల్లా చప్పటి భోజనమే, ఉత్తమ భోజనం. ఉప్పులో నేరుగా బిపిని పెంచే గుణం ఉంది. హై బిపి ఉంటేనే అని కాదు. ఆ సమస్య లేని వారు కూడా ముందు జాగ్రత్తగా ఉప్పును మానేయడం లేదా బాగా తగ్గించేయడం క్షేమకరం. ఉప్పులో ప్రధానంగా సోడియం ఉంటుంది. ఇది రక్తపు సాంద్రతను పెంచుతుంది. ఫలితంగా బిపి పెరుగుతుంది.
వాస్తవానికి కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాలే గానీ, ఆకు కూరల్లో, కాయగూరల్లో సహజంగా ఉండే సోడియమే శరీరానికి సరిపోతుంది. అది చాలదన్నట్లు అదనంగా ఉప్పు వేసుకుంటే అధికరక్తపోటు సమస్య మీ జీవితకాలపు నేస్తమవుతుంది. మీరు రోజూ వాకింగ్‌ చేస్తున్నామన్నారు.
అయితే ఆ వాకింగ్‌ 45 నిమిషాల దాకా ఉండాలి. ఏదో పదీ, పదిహేను నిమిషాలు చేసి సంబరపడితే ప్రయోజనమేమీ ఉండదు. ఒకవేళ అలా 45 నిమిషాలూ చేసినా, ఉప్పు వాడకాన్ని మాత్రం తగ్గించాల్సిందే. మరో విషయం ఏమిటంటే, ఉప్పు వాడకంతో బిపి ఎలాగూ పెరుగుతుంది. దీనికి తోడు ఉప్పు పరోక్షంగా మధుమేహానికి కూడా దారి తీస్తుంది. ఉప్పులోని శరీర రసాయన ధర్మాన్ని మార్చే గుణమే ఇందుకు కారణం. ప్రస్తుతానికి మీకు మధుమేహం లేకపోయినా ఉప్పు వాడకాన్ని ఇలాగే కొనసాగిస్తే ఏదో ఒక రోజు మధుమేహం బారినపడటం ఖాయం. అందుకే ఇప్పటికైనా ఉప్పు తగ్గించడానికి సిద్ధం కండి. లేదంటే ఇప్పుడు మీన్న హై బిపి తో మధుమేహం చేయి కలుపుతుంది. ఆ తర్వాత ఇక మీ ఇష్టం.
- డాక్టర్‌ జి. సత్యనారాయణ, జనరల్‌ ఫిజిషియన్‌
నీళ్లన్నీ తోడెయ్యాలి!
ఆయుర్వేద మూలికల కోసం అరణ్యమంతా తిరిగి తిరిగి అలసి సొలసి ఒక వైద్యుడు నదీ చెంతనున్న చెట్టు కింద వాలిపోయాడు. కాసేపు సేద తీరిన తర్వాత లేచి కూర్చుని నది వైపు చూస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. ఒక పిచ్చుక నదిలోకి వెళ్లి నోటి నిండా నీళ్లు పట్టుకుని ఒడ్డున వచ్చి ఆ నీటిని వదిలేస్తోంది. వెంట వెంట ఆ కార్యాన్ని చేస్తూనే ఉంది. దాదాపు ఒక గంట పాటు ఆ తంతు అలా చూస్తూ ఉండిపోయాడు. ఎండ మండిపోతున్నా, ఆ పిచ్చుకలో కాసింతైనా విసుగు, అలసటా లేవు.
తన ప్రక్రియను అలా కొనసాగిస్తూనే ఉంది. చూసీ, చూసీ ఇక ఉండబట్టలేక, ఆ పిచ్చుక దగ్గరగా వెళ్లి నిలుచున్నాడు. అయినా అతన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోతూనే ఉంది. అతడు ఇంక ఆగలేక ‘అమ్మా! చాలా సేపటి నుంచి చూస్తున్నాను. నోటి నిండా నీరు పట్టుకు వచ్చి ఒడ్డున వదిలేస్తున్నావు. అయితే ఇలా ఎందుకు చే స్తున్నావో నాకైతే అర్థం కాలేదు. అందుకే నేరుగా నిన్నే అడిగేద్దామని వచ్చాను. ఏం చేస్తున్నావు? ఎందుకింత శ్రమ పడుతున్నావు తల్లీ!’’ అన్నాడు. అతనికేసి ఒక క్షణం పాటు అలా చూసి ‘‘ఏమీ లేదయ్యా! ఈ నది అంచునే నేను గుడ్లు పెట్టాను. నది అలలు ఒక్కసారి ఎగిసిపడి నా గుడ్లన్నీ తనలోకి తీసుకుపోయాయి.
అందుకే ఈ నది నీళ్లన్నీ బయటికి తీసేసి, నా గుడ్లు నేను తిరిగి తెచ్చుకోవాలని ఈ పని చే స్తున్నాను’’ అంది పిచ్చుక. ఆ మాటలు విన్న బాటసారి పగలబడి నవ్వుతూ. ‘‘ఓ పిచ్చి తల్లీ! నది ఎంత పెద్దది నీ నోరు ఎంత చిన్నది! నీ నోటితో నదిలోని నీళ్లన్నీ బయటికి పంపిస్తావా? నీ జీవితకాలమంతా తోడినా నది నీళ్లు అయిపోవు. ఈ పిచ్చి ప్రయత్నం మానుకుని, నీ దారిన నువ్వు వె ళ్లిపో!’’ అన్నాడు బాటసారి. అందుకు సమాధానంగా ‘‘అయ్యా! నాకదంతా తెలియదు సాధ్యాసాధ్యాల మీమాంసలోకి నేను వెళ్లడం లేదు. నా గుడ్లు నేను తిరిగి తెచ్చుకోవాలన్నది నా సంకల్పం.
అందుకోసం నా సర్వశక్తులూ ధారవోస్తాను ఈ విషయంలో నేను రాజీపడే ప్రసక్తే లేదు’’ అంటూ మళ్లీ తన పనిలో తాను నిమగ్నమయ్యింది పిచ్చుక. ఆ మాటలు విన్న బాటసారి పిచ్చుక కేసి ఆశ్చర్యంగా చూశాడు. ఈ పిచ్చుకలో ఉన్న సంకల్పబలంలో వెయ్యోవంతు ఉన్నా మనిషి ఎన్నెన్నో అసాధ్యాల్ని సాధ్యం చేయగలడు కదా! అనుకుంటూ బాటసారి ఆ పిచ్చుకకేసి ఎంతో ఆరాధనగా చూస్తూ స్నానం కోసం నదిలోకి దిగిపోయాడు బాటసారి.

పచ్చిమిరపతో క్యాన్సర్‌ దూరం!
గుడ్‌ ఫుడ్‌
పచ్చి మిరపకాయ మన జీవక్రియల వేగాన్ని దాదాపు 50 శాతం పెంచుతుంది. కాబట్టి దీన్ని తీసుకుంటే దాదాపుగా జీరో క్యాలరీలు తీసుకున్నట్లే. అందుకే స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకున్నవారు మిరపకాయలను తీసుకోవడం మంచిది. (పరిమితం లేదా కాస్తంత ఎక్కువగా తీసుకుంటే చాలు). ∙పచ్చి మిరపలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్లను మరింత సమర్థంగా నిరోధిస్తాయి.
∙పచ్చి మిరపకాయలు రక్తంలోని కొలెస్ట్రాల్‌ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. తద్వారా గుండె, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. పక్షవాతం అవకాశాలను తగ్గిస్తాయి. ∙పచ్చిమిరపకాయలలోని క్యాప్ససిన్‌ అనే పదార్థం వల్లనే దానికి ఆ కారపు రుచి. ఈ కారపు ఫ్లేవర్‌ తాకగానే ముక్కు, సైనస్‌లలోని మ్యూకస్‌ పలచబారి బయటకు వచ్చేస్తుంది.
ఇలా మిరపకాయ జలుబునూ, సైనస్‌ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తుంది. ∙పచ్చి మిరపకాయలో విటమిన్‌–సి, బీటా కెరోటిన్‌ పుష్కలం. అందుకే మిరపకాయలు తినేవారిలో వారిలో మేని నిగారింపు ఎక్కువ. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి. ∙పచ్చి మిరపలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. అందుకే చర్మంపై ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు మిరపకాయలు తినేవారిలో అది వేగంగా తగ్గుతుంది. ∙తగినంత మోతాదులో మిరపకాయలను తినడం వల్ల ఆ రుచితో ఆహ్లాద భావన కలుగుతుంది. దానికి కారణం మెదడులో స్రవించే ఎండార్ఫిన్‌లు. అందుకే మిరప కొరికిన రుచి తగలగానే సంతోషంగా, రుచి చాలా బాగున్నట్లుగా అనిపిస్తుంది. ఎండార్ఫిన్లు మెదడు మూడ్స్‌ను సరిచేయడమే ఇందుకు కారణం. ∙పచ్చిమిరపలో విటమిన్‌–కె కూడా ఎక్కువే. అది గాయాలైనప్పుడు రక్తస్రావం అయ్యే ప్రమాదాలను అరికట్టడమే కాకుండా ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది.

విష్ణుమయం
ఆత్మీయం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీహరి. అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ తానుంటానన్నాడు కాబట్టి విష్ణువును స్థితికారుడనీ, సమస్త ప్రాణులనూ రక్షించే వాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. విష్ణువు అంటే విశ్వమంతా నిండిన వాడని అర్థం. ఈ సృష్టిలో అత్యుత్తమమైనవిగా పేర్కొనదగ్గ జ్ఞానం, అమరత్వం, వాత్సల్యం, సౌశీల్యం మొదలైన సమస్త సద్గుణాలు, నవరస భరితాలైన వస్తు వాహనాభరణాలు, రాజోపచారాలు, దైవోపచారాలు, సమస్త సదాచారాలకు ఆధారభూతమైన సంపదలన్నింటికీ శ్రీహరే ఆధారభూతుడు. సమస్త దేవగణాదులలోనూ విష్ణువు కంటే మిన్న అనదగ్గవాడు లేడు.
అదేవిధంగా ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రం కంటె అధికమైనది లేదు. దుష్టరాక్షసులకు వరాలనిచ్చి, లోకాలను ఇబ్బందుల పాలు చేసి, చివరకు తాము కూడా ఇబ్బందుల పాలైన బ్రహ్మను, మహేశ్వరుడినీ కూడా విష్ణువే కాపాడిన ఉదంతాలు మనం చూస్తుంటాం. మంత్రపుష్పం అంతా విష్ణుమయమే. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుభగవానుని విశేషాలు తెలిపేవే విష్ణు సహస్రనామాలు. ఈ నామాలన్నీ విశ్వవ్యాప్తమైన ఆయన శక్తిని, అనంతమైన ఆయన లీలలనూ తెలియచేస్తూ, మనం ఏ రూపంలో భగవంతుడిని కొలిచినా దేవుడొక్కడే అనే భావనను కలుగచేస్తాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం