MohanPublications Print Books Online store clik Here Devullu.com

మహాతర్పణ పర్వం_Mahatrappana Parva, Pithir Yargam
మహాతర్పణ పర్వం

ఇప్పుడు జరుగుతున్నది మహాలయపక్షం. దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో... ప్రతి మానవుడు వారి పితృదేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు ఋణపడి ఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. తల్లిదండ్రులు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తరువాత, తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధ కర్మలు చేయాలి. శ్రాద్ధకర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లితండ్రులను కాపాడుకోవాలి– అని ఒప్పుకున్నారు.

‘‘మనం సమర్పించే నువ్వులు, నీళ్ళు, అన్న పిండాలు, ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా? మనకళ్ళ ముందు చనిపోయినవారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా? పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే, వారికోసమని ఇవన్ని చెయ్యటం పిచ్చిపని’’ అని కొందరి వాదన. మీకు ఒక కథ చెబుతాను... ’’ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నానికి పైచదువులకై పంపించాడు. కొన్నిరోజులలో ఫీజు కట్టాలి. ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్‌ మనీయార్డరు ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాసాడు. ‘‘తండ్రి కాస్త కలవరపడ్డాడు.

అతను టెలిగ్రాఫ్‌ కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్‌ మనీయార్డరు ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ గుమాస్తా ‘‘డబ్బు మీ అబ్బాయికి పంపబడింది. అతనికి చేరుతుంది’’ అని అన్నాడు. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు. అతను గుమాస్తాతో ‘‘నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది. వాటికి మీరు కన్నం కూడా చేయలేదు. మరి మా అబ్బాయికి ఎలా పంపారు?’’ అన్నాడు.

గుమాస్తా అతనితో ‘‘మీ అబ్బాయికి చేరుతుంది’’ అని భరోసా ఇచ్చాడు. తరువాత అతను సందేశాలు పంపే పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు.కాని వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు చేరింది. పితృదేవతలకు పిండప్రదానం చెయ్యడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుట్టినట్టైతే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి, దాణా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు. అది వారికి చెందుతుంది అంతే.

ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్‌ మనీయార్డరు ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా? అతను ఈ దేశంలో నివసించకపోయినా, అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి, ఇక్కడ రూపాయిలలో ఇచ్చినా అక్కడి డాలర్లుగానో, పౌండ్లగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఉండవలసినది తల్లితండ్రులయందు కృతజ్ఞతా భావం. శాస్త్రంపై నమ్మకం. శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? ‘‘నేను నా ఇష్టం వచ్చిన చిరునామా రాస్తాను. పోస్ట్‌ డబ్బాలో వెయ్యను. మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు.’’

టాగ్లు: Mahatrappana Parva, Pithir Yargam, మహాతర్పణ పర్వం, పితృ యజ్ఞం
No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం