MohanPublications Print Books Online store clik Here Devullu.com

అక్కన్న మాదన్నల విడిది కేంద్రం మహేశ్వరం!-Akkanna Maddanna Vidhithi Kendram


అక్కన్న మాదన్నల విడిది కేంద్రం మహేశ్వరం!

ఈ ఊరిపేరు మహేశ్వరం. ఒకప్పుడు మహంకాలి మహేశ్వరం. హైదరాబాద్‌కి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పేరులోనే మహేశ్వరుడున్న ఊరు ఇది. ఇప్పుడు ఆ ఊరు మాంఖాల్ మహేశ్వరంగా మారిపోయి.. రెండూళ్లుగా విడిపోయాయి. శతాబ్దాల కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల ఏలుబడితో ప్రత్యక్ష.. పరోక్ష అనుబంధమున్న ప్రాంతమిది. పార్వతీ పరమేశ్వరులు కొలువున్న ఊరు. బంగారం పండే భూములకు కేంద్రంగా పేరున్న మహేశ్వరం ఊరి ప్రారంభంలో కోనేరుతో స్వాగతం పలుకుతుంది. అది ఏండ్ల చరిత్ర ఉన్న రాజరాజేశ్వరుని కోనేరు. పేరు శివగంగ!
గ్రామ స్వరూపం
ఊరు: మహేశ్వరం
మండలం: మహేశ్వరం
జిల్లా: రంగారెడ్డి
జనాభా: 14000
పురుషులు: 7500
మహిళలు: 6500
పిన్‌కోడ్: 501359
సరిహద్దులు
తూర్పు: తుమ్మలూరు
ఉత్తరం: సిరిగిరిపురం
దక్షిణం: పులిమామిడి
పడమర: మన్సాన్‌పల్లి
ప్రధాన వృత్తి: వ్యవసాయం
Temple
అయిదు వందల అడుగుల పొడవు, రెండు వందల యాభై అడుగుల వెడల్పు ఉన్న జలాశయం ఇది. గంగను జటలో పట్టిన శివుడు.. గంగ నీటితో స్నానమాచరించిన చోటు. అంటే శివుడి తలభాగంలో కాకుండా గంగలోనే శివుడు వెలిశాడు ఇక్కడ. కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగింది. సౌందర్యోపాసకులను కట్టి పడేసే మహత్తుగలిగిన శివగంగ ఆలయం పద్మాకారంలో ఉంటుంది. గంగ మధ్యలోనున్న శివాలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు పద్మరేకుల్లా ఉంటాయి. శివ పార్వతుల ఆలయాలతో పాటు మొత్తం 18 ఆలయాలు.. శివగంగకు నాలుగువైపులా 18 మెట్లు నిర్మించారు. 
అక్కన్న మాదన్నల దృష్టి :
కాకతీయుల కాలంనాటి చరిత్రకు దర్పంగా ఆలయం పక్కనే గడికోట ఉన్నది. ఈ గడికోటలోనే శివాలయం.. విష్ణుగంగ. కోదండ రామస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ ఏకశిలా నిర్మాణాలే. విష్ణుగంగ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చుట్టూ ఆర్చీలు.. మధ్యలో కొలను అలనాటి అద్భుత కళా నిర్మాణానికి అద్దం పడుతుంది. కోదండ రామస్వామి దేవాలయం వెనుక అక్కన్న మాదన్నల కచేరి కేంద్రం ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ఇంతకూ ఈ శివగంగకు.. మహేశ్వరానికి అక్కన్న మాదన్నలతో సంబంధమేమిటంటే.. నాలుగొందల సంవత్సరాల కింద క్రీ.శ 1658 నుంచి 1687 వరకు గోల్కొండను పాలించిన అబూహసన్ తానీషా కాలంలో ఇదే ఊరిలో ఆయన మంత్రులు అక్కన్న.. మాదన్నలు తిరుగాడేవాళ్లు. విడిది కోసం తరుచూ మహేశ్వరానికి వచ్చేవారని గ్రామస్తులు అంటున్నారు. భద్రాచలం నిర్మాణానికి ముఖ్యపాత్ర వహించిన అక్కన్న, మాదన్నలు, కంచర్ల గోపన్నలతో మహేశ్వరం ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నది. అక్కన్న మాదన్నల తండ్రి భానూజీ పంతులు మహేశ్వరం పక్కన ఉన్న హన్మకొండలో శిస్తులు వసూలు చేసే అధికారి. ఆయన అక్కన్నపల్లి, మాదన్నపల్లి, భానుపురం అనే మూడు గ్రామాలను నిర్మించాడు. ఈ రోజు అవి అకాన్‌పల్లి, మన్‌సాన్‌పల్లి, సుభాన్‌పల్లిగా వాడుకలో ఉన్నాయి. అక్కన్న మాదన్నలు ఈ ప్రాంతంలో 108 దేవాలయాలు కట్టించారట. అందులో ఒకటి మాంఖాల్ మహేశ్వరంలోని రాజరాజ్వేరాలయం. ఇదే కాక మహంకాళి అమ్మవారికి ఇంకొక గుడి కూడా ఉండేది. 
Temple1
ఆధ్యాత్మిక కేంద్రం :
మహేశ్వరం పరిసర ప్రాంతాలు ఆ రోజుల్లో ఆధ్యాత్మిక శోభతో భాసిల్లినట్లు నేటికీ కొన్ని ఆధారాలున్నాయి. అక్కన్న మాదన్నల కాలం నాడే ఇక్కడ మరికొన్ని ఆలయాలు వెలసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. నేటి మహేశ్వరంలో ఏదో ఒక చోట శివలింగాలు బయల్పడటమే దీనికి నిదర్శనం. మహేశ్వరంలో అక్కన పూజించిన కోదండ రామాలయం, శివగంగ, విష్ణుగంగ అనే కోనేర్లు, వీరమ్మ కుంట అనే చెరువు, వారు కట్టించిన ఒక పెద్ద కోట ఉండేవి. పక్కనే ఉన్న ఫకీర్‌గూడలో హనుమాన్ దేవాలయాన్ని కూడా కట్టించారు. అక్కన్న మాదన్న, తానీషాల యుగం దక్షిణాదిన హిందూ, ముస్లిం సమైక్యతకు నిదర్శనమనీ ఈ కట్టడాలు, ఇప్పుడు లభిస్తున్న ఆనవాళ్లు చెప్తున్నాయి. ఈ ప్రాంతమంతా మందిరాలు, మఠాలతో విలసిల్లేది. ప్రజలు కూడా సుఖంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న కట్టడాలు శిథిలాస్థలో ఉన్నాయి. ఈ సుందర కట్టడాలను చూసేందుకు వచ్చిన సందర్శకులకు శివగంగ తెలియని చరిత్రగానే మిగిలిపోయింది. కనీసం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకైనా శివగంగ గొప్పదనం గురించి ఇక్కడి వందల ఏళ్లనాటి సైనికుల కత్తుల ఖణఖణలు.. గుర్రాల గిట్టల చప్పుళ్లు.. శతఘ్నుల భీకర శబ్దాలు.. గుర్రాలపై తిరగాడిన అక్కన్న మాదన్నల వైభవం.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పర్యటన తెలియకుండానే ఉన్నది. ఇవన్నీ తెలుసుకుని.. శివగంగ ప్రణవ నాదాలతో వాతావరణం నిండిపోగా.. మనసు గుడి ఆహ్లాదరకంగా మారి మహేశ్వరం మంచి పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది! 
Temple2
ఛత్రపతి శివాజీ సందర్శన :
అబూహసన్ తానీషా ఆహ్వానం మేరకు గోల్కొండ వచ్చిన మరాఠా మహావీరుడు ఛత్రపతి శివాజీ అక్కడ కొన్నాళ్లు ఉన్నాడట. గోల్కొండలో ఉన్న కాలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలాన్ని దర్శించుకునేందుకు శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ గ్రామాల మీదుగా బయలుదేరాడు. ఆయన పరిజనంతో మాంఖాల్ మహేశ్వరం, జిన్నాయిగూడ నరసింహస్వామి దేవాలయం కూడా దర్శించుకున్నాడు. జిన్నాయిగూడెంలో శివాజీ ఒక కోటను కూడా కట్టించుకున్నాడట. ఆ కోట అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. మరాఠా యోధుడు శివాజీనీ ఆహ్వానించడం.. గోల్కొండలో ఆయన చిత్రపటాన్ని ప్రతిష్టించడం.. సుల్తానుల రాజ్య విస్తరణను అణగదొక్కాలనే ప్రణాళిక వేయడంతో గోల్కొండ రాజ్యంపై ఔరంగాజేబు దాడిచేశాడు. దాంట్లో భాగంగానే గోల్కొండతో అనుబంధమున్న శివగంగపై కూడా దాడిచేసి గుడిని ధ్వంసం చేసి శివలింగాన్ని కోనేరులో దాచిపెట్టారని స్థానికులు అంటున్నారు. అప్పటి నుంచి ఆ ఊరు పేరుకే మహేశ్వరం. ఊళ్లో మహంకాళి గుడి ఉన్నది. మహేశ్వరుడు లేడు. గుడికి కొద్ది దూరంలో గడి.. గడిలో రాముడు లేని గుడి.. ఒక మూలన అమ్మవారి చిన్న గుడి.. ఆ పక్కనే గడిలో అలనాటి మసీదు.. ఇంకోపక్క గడిలో స్కూలు.. ఆ పక్కనే పంచాయతీ ఆఫీసు.. శతాబ్దాల నాటి చరిత్రకు మూగ సాక్ష్యాలుగా కనిపిస్తుంటాయి! అయితే 1980 ప్రాంతంలో శంకర్‌ఖత్రీ అనే ఉపాధ్యాయుడు కొలనులో దాచిపెట్టిన శివలింగాన్ని తీసి పునఃప్రతిష్టించాడు. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించాడు. అలా శివగంగకు గత వైభవాన్ని కొంతవరకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని స్థానికులు చెప్తుంటారు! 
Temple3
చారిత్రాత్మకం:
కాకతీయుల నాటి గడికోట ఎంతో చారిత్రమకమైంది. పురాతన కట్టడాలు మహేశ్వరం నిర్మాణం చేసుకోవడం అదృష్ణంగా భావిస్తున్నాం. అవి మళ్లీ జీవం పోసుకొనేలా పునర్నిర్మాణం చేపట్టాలి. మహేశ్వరంలోని గడికోటను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. దీంతో గడికోటకు అనుసంధానంగా ఉన్న శ్రీశివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి చెందుతుంది.
-కూన యాదయ్య
పూర్వవైభవం రావాలి:
గడికోటకు మళ్లీ పూర్వవైభవం రావాలి. గతంలో పాలకులు ఎన్నో కళ్లబొల్లి మాటలు చెప్పారు. ఆనాడు ఔరంగజేబు దాడిలో ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకున్న వారు లేరు. మన తెలంగాణ ప్రభుత్వంలోనే మళ్లీ గడికోటకు పూర్వవైభవం రావాలి. ఇందుకు పురావస్తు శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
-కాకి కుమార్
Temple4
-గంజి వెంకటేశ్, 9705347284

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం