పుస్తకమేరా శాశ్వతం!
ఎన్ని మాధ్యమాలు వచ్చినా, ఎంత అభివృద్ధి జరిగినా.. మనిషికి పుస్తకం ఇచ్చే జ్ఞానమే అంతిమం. అదే.. శాశ్వతం. చీకట్లో ఉన్న మనిషి మస్తిష్కంలో పుస్తకం వెలుగుపూలు పూయిస్తుంది. కానీ నేటి తరం ఆ పుస్తకాలకు ఇస్తున్న ప్రాధ్యానం ఎంత? సోషల్ మీడియా, టీవీ, సినిమా లాంటి వినోద మాధ్యమాలకు ఎందుకు అలవాటు పడిపోతున్నది. శాశ్వతంగా మనల్ని వెలుగుబాటలో నడిచేలా చేసే పుస్తకంతో ఎందుకు దోస్తీ కట్టడం లేదు? ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ ఈ తరం మాధ్యమాలు. అవీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ అవి శాశ్వతం కాదు. పుస్తకమే శాశ్వతం. పుస్తకం పంచే వెలుగే.. శాశ్వతం. రండి.. ఈ పుస్తక దినోత్సవం నుంచి పుస్తకాలతో దోస్తీ చేద్దాం.
పుస్తకం.. చీకట్లో ఉన్న మనిషి మస్తిష్కంలో వెలుగుపూలు పూయిస్తుంది. కొత్త
ప్రపంచానికి దారి చూపే దీపం పుస్తకం. నువ్వు చదివే పుస్తకాన్ని బట్టి నీ
వ్యక్తిత్వమేంటో చెప్పొచ్చు అంటారు. నిజమే పుస్తకం మనుషుల వ్యక్తిత్తాలను,
వ్యక్తుల మనస్తత్తాలను చెప్పకనే చెప్పేస్తుంది. మనిషిని ఉన్నత శిఖరాలకు
చేరుస్తుంది. అలాంటి పుస్తకం కోసం ఎంతమంది సమయం కేటాయిస్తున్నారు? ఎంతమంది
రెగ్యులర్‌గా పుస్తకాలు చదువుతున్నారు? నేటి తరానికి మార్గదర్శకమవ్వాలని
నాటి తరం ఎన్నో పుస్తకాలు చదివి, శోధించి, మధించి ఎన్నో పుస్తకాలు, విజ్ఞాన
భాండాగారాలు సృష్టించారు. మరి నేటి తరం ఆ పుస్తకాలతో చెలిమి చేస్తున్నదా?
పుస్తకం గొప్పతనం ఏంటి? ఈ నెల 23న ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ సందర్భంగానే ఈ
వారం ముఖచిత్ర కథనం.
ఒక కథ..
పూర్వం
ఒక మారుమూల పల్లెటూర్లో రాము, సోము అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు.
వారిద్దరూ చదువు సంధ్యలు మాని, అల్లరిచిల్లరగా తిరుగుతుండేవారు. వారిని
చూసి తల్లిదండ్రులు నిత్యం బాధపడేవారు. వారిలో ఎప్పుడు మార్పు వస్తుందో అని
ఆలోచించేవారు. అలా ఒకరోజు పొరుగూర్లో ఒక సాధువు వచ్చాడని, ఆయన ఎలాంటి
వారినైనా మార్చేస్తాడని ఊర్లో మాట్లాడుకుంటుంటే విన్నాడు. తన ఇద్దరు
కొడుకులను తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లాడు ఆ తండ్రి. తన సమస్య
చెప్పుకున్నాడు. సాధువు రాము, సోము ఇద్దరినీ చూసి చెరొక పుస్తకం ఇచ్చాడు. ఆ
పుస్తకం నిండా నేను మంచి బాలుడను అని ఒకే వాక్యం పేజీల కొద్ది రాసి ఉంది. ఆ
పుస్తకాలు వారిద్దరికీ ఇస్తూ చూడండి బాబూ.. ఈ పుస్తకం ప్రతిరోజూ ఉదయం,
సాయంత్రం పూర్తిగా చదువాలి. క్రమం తప్పకూడదు అని చెప్పాడు. నాలుగు రోజులు
చదివేసరికి రాముకు విసుగు పుట్టింది. అయినా.. ఈ పుస్తకంలో పెద్దగా
చదువాల్సిన విషయం ఏముందీ? ఒకే వాక్యం తిప్పి తిప్పి రాశాడు. ఒకవేళ ఈ
పుస్తకంలోంచి ఏదైనా ప్రశ్న అడిగినా సమాధానం ఒకటే నేను మంచి బాలుడను అని.
అది నాకు గుర్తుంది. ఇక ఈ పుస్తకం చదువాల్సిన అవసరం లేదు అని పుస్తకం
పక్కకు పడేసి ఎంచక్కా ఎప్పట్లాగే ఆటపాటల్లో మునిగిపోయాడు. సోము మాత్రం
ప్రతిరోజూ సాధువు చెప్పినట్టు ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఒకరోజు చదువుతూ
చదువుతూ మధ్యలో ఇలా ఆలోచించాడు ఈ పుస్తకంలో నేను మంచి బాలుడను అని రాసి
ఉంది. అదే నేను రోజూ చదువుతున్నాను. కానీ నేను మా అమ్మానాన్న చెప్పినట్టు
వినడం లేదు. బడికి వెళ్లడం లేదు. జులాయిగా తిరుగుతున్నాను. ఒకవేళ నేను ఈ
పుస్తకంలో ఉన్న వాక్యాన్ని నిజం చేసి మంచి బాలుడిగా మారిపోతే నాకు ఈ
పుస్తకం చదువాల్సిన అవసరం రాదు అనుకున్నాడు. అంతే మరుసటి రోజు నుంచి
ఉదయాన్నే లేవడం, బడికి వెళ్లడం, సాయంత్రం ఇంటికి వచ్చాక చదువుకోవడం ఇలా తన
దినచర్య మొత్తం మార్చేసుకున్నాడు. రాము వచ్చి ఆడుకుందాం రారా.. అంటూ
పిలిచినా సోము వెళ్లేవాడు కాదు. కొన్నిరోజుల తర్వాత వారి తండ్రి మళ్లీ ఆ
ఇద్దరినీ సాధువు దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు సాధువు ఇద్దరి ప్రవర్తనలో
వచ్చిన మార్పును గమనించాడు. సోముకు మరో పుస్తకం ఇచ్చాడు. రాముకు అదే
పుస్తకం మళ్లీ ఇచ్చాడు. ఈ కథలో నీతి ఏంటంటే.. పుస్తకంలో ఏం రాసి ఉంది అనేది
కాదు. మనం ఆ పుస్తకాన్ని చదివామా లేదా? చదివితే అందులో ఉన్న విషయాన్ని
ఎంతవరకు ఆచరించాం అనేది ఈ కథ సారాంశం. ఒక పుస్తకం జీవితాన్ని, ఆలోచనా
విధానాన్ని మార్చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.
టైమ్ ఉండదు
పుస్తకాలు
పెద్దగా చదువను. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే టీవీ, ఫేస్‌బుక్, వాట్సప్,
యూట్యూబ్‌తో టైమ్‌పాస్ చేస్తా. ఒక పుస్తకం చదువడం మొదలుపెడితే దాన్ని
పూర్తి చేస్తేనే అందులో ఏముందో తెలుస్తుంది. దానికి కొన్ని రోజులు
పడుతుంది. అదే సోషల్ మీడియా, టీవీ అయితే టైమ్‌పాస్‌కి టైమ్‌పాస్, ప్రపంచంలో
ఏం జరుగుతుందో, దేన్ని ఫాలో అవాలో తెలుస్తుంది. అందుకే పుస్తకాల జోలికి
పెద్దగా వెళ్లను. పుస్తకం చదివే అంత టైమ్ ఉండదు కూడా.
- ఎ.నూతన, విద్యార్థిని, హిమాయత్‌నగర్
పుస్తకం తెరిస్తే...
శ్రీశైలం
బాగా డబ్బున్న వ్యక్తి. పాలవ్యాపారంలో కలిసొచ్చి కోట్లు కూడబెట్టాడు.
కష్టపడి పైకొచ్చాడు కాబట్టి, తన కొడుకు ఆరుష్ కూడా కష్టపడి పైకి రావాలని
కోరుకుంటాడు. ఆరుష్ ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రతీ పుట్టినరోజు
నాడు కొడుకుకు ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చేవాడు శ్రీశైలం. అలా ఆరుష్ ఇంటర్‌కి
వచ్చాడు. ఆరుష్ తండ్రి దగ్గరికెళ్లి నాన్నా.. ఈ పుట్టినరోజుకు నాకు
పుస్తకం వద్దు. బజాజ్ పల్సర్ బైక్ కొనివ్వు అని అడిగాడు. కొన్నిరోజులు
గడిచాక మరొక బర్త్ డే వచ్చింది. ఆరోజు శ్రీశైలం ఉదయాన్నే లేచి పూజ చేసుకొని
ఆరుష్ గదికి వెళ్లాడు. కొడుకును నిద్రలేపి ఎప్పటిలాగే మంచి పుస్తకాన్ని
పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. ఈసారి కూడా పుస్తకమే గిఫ్టుగా ఇవ్వడంతో
ఆరుష్‌కి కోపం వచ్చి ఆ పుస్తకం తండ్రి మీదకు విసిరేసి విసురుగా ఇంట్లోంచి
బయటకు వెళ్లిపోయాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆరుష్‌కి
ఉస్మానియా యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఆ కార్యక్రమానికి
మిగిలిన వారంతా తల్లిదండ్రులతో వచ్చారు. ఆరుష్ మాత్రం ఒక్కడే వెళ్లాడు.
డాక్టరేట్ తీసుకున్న మిగతా వారంతా తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకోవడం
చూసి ఆరుష్ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని బయల్దేరాడు. ఊళ్లోని
ఇంటికి వెళ్లి చూస్తే తాళం ఉంది. పక్కింటి వాళ్లను అడిగాడు. మాకు తెలియదు
అన్నారు. చుట్టుపక్కల వాళ్లందరినీ అడిగి చూశాడు. ఆరుష్ వాళ్ల ఇంటి వెనుకాల
ఉండే మహిళ పదేళ్ల క్రితం వాళ్ల కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు
తట్టుకోలేక శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి
ఆయన భార్య గుండె ఆగి చనిపోయింది అని చెప్పింది. ఏడ్చుకుంటూ ఆరుష్ ఆ
ఇంటికెళ్లి తాళం పగులకొట్టి చూశాడు. ఇల్లంతా చెత్త, బూజుతో నిండిపోయి ఉంది.
భయపడుతూనే పైన ఉండే తన గదికి వెళ్లాడు. తలుపు తెరిచి చూశాడు. పదేళ్ల
క్రితం తండ్రి ఇస్తే కింద పడేసిన పుస్తకం అక్కడే ఉంది. ఏడ్చుకుంటూ
వణుకుతున్న చేతులతో పుస్తకం తెరిచి చూశాడు. కొన్ని పేజీల తర్వాత ఆ బుక్‌లో
బజాజ్ షోరూంలో పల్సర్ 220 బైక్ కొన్న లక్ష రూపాయల రశీదు ఉంది. తొందరపడి
పుస్తకం తెరువనందుకు అప్పుడు బాధపడ్డాడు. తల్లిదండ్రులను కోల్పోయాడు.
తండ్రి ఇచ్చిన బహుమతి అందుకోలేపోయాడు. చూశారుగా.. ఈ కథలో కేవలం పుస్తకం
తెరువకపోవడం వల్లనే ఆరుష్ తిరిగి పొందలేనంతగా నష్టపోయాడు. అదే జీవితాంతం
పుస్తకానికి దూరమైతే ఇంకా ఎంత కోల్పోవాల్సి వస్తుందో ఆలోచించండి.
మీకు తెలుసా!
ప్రపంచ
ప్రఖ్యాత తత్తవేత్త అరిస్టాటిల్ పుస్తకాల పురుగు. ఆయనను అందరూ నడిచే
విజ్ఞాన సర్వస్వంగా భావించేవారు. ఒకవైపు పుస్తకాలు చదువుతూ, నడుస్తూ
శిష్యులకు పాఠాలు చెప్పేవాడట. అందుకే ఆయన ఏర్పాటు చేసిన విద్యాలయానికి
పెరిపిటాటిక్ అకాడమీ అంటే నడిచే విద్యాలయం అని పేరొచ్చింది. పుస్తకాల
మీదున్న ప్రేమతో ఆయన ప్రపంచం నలుమూలల నుంచి పుస్తకాలు తెప్పించేవాడు. ఆయన
దగ్గర ఉన్న పుస్తకాలన్నీ గుట్టలుగుట్టలుగా పేరుకుపోయేవట. ఆ తర్వాత వాటిని
వర్గీకరించి ఒక లైబ్రరీగా సెట్ చేశారట ఆయన శిష్యులు. ఆ తర్వాత అరిస్టాటిల్
తన పుస్తకాలన్నింటినీ తన ప్రియ శిష్యుడు తియోప్రాస్ట్రస్‌కి వారసత్వంగా
ఇచ్చేశాడు. తియోప్రాస్ట్రస్ అరిస్టాటిల్ ద్వారా సంక్రమించిన పుస్తకాలతో
పాటు తాను సంపాదించుకున్న పుస్తకాలన్నింటినీ కలిపి తన శిష్యుడు నెలియస్‌కి
ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏథెన్సులోని రాజకీయ పరిస్థితులకనుగుణంగా నెలియస్ ఆ
పుస్తకాలన్నింటినీ తీసుకొని ఏథెన్స్ పట్టణం వదిలి స్కెప్సిస్‌కి మకాం
మార్చాడు. అయితే దురదృష్టవశాత్తు నెలియస్ వారసులంతా నిరక్షరాస్యులు. వారికి
పుస్తకాల విలువ తెలియదు. ఫలితంగా పుస్తకాలు, లైబ్రరీ నిర్లక్ష్యానికి
గురైనాయి. నెలియస్ శిష్యులు అట్టాలిడ్ రాజులు అలెగ్జాండ్రియా లైబ్రరీకి
పోటీగా పెరగామమ్‌లో తాము నెలకొల్పిన లైబ్రరీ కోసం తమ దగ్గరున్న
పుస్తకాలన్నీ స్వాధీనం చేసుకుంటారని భయపడి ఆ పుస్తకాలను ఒక నేలమాలిగలో
దాచారు. చాలారోజుల తర్వాత అపెల్లికాన్ అనే లైబ్రేరియన్ ఎంతో డబ్బు
వెచ్చించి నెలియస్ వారసుల నుంచి అరిస్టాటిల్ పుస్తకాలన్నింటినీ కొన్నాడు.
అప్పటికే అందులో చాలా పుస్తకాలు జీర్ణావస్థలో ఉన్నాయి. వాటికి ఆయన నకళ్లు
రాయించాడు. ఆ తర్వాత మిగతా పుస్తకాలన్నీ స్కెప్సిస్ నుంచి రోమ్ నగరానికి
చేరాయి. అదీ పుస్తకానికి ఉన్న విలువ. ఒక పుస్తకం విలువ తెలియాలంటే ఆ
పుస్తకం చదివైనా ఉండాలి. లేదంటే.. ఒక పుస్తకం చదివి తన జీవితాన్నే
మార్చుకున్న వ్యక్తిని కలిసైనా ఉండాలి.
మనల్ని గుచ్చి, గాయపరిచి,
ఇబ్బందిపెట్టే రచనలు, పుస్తకాలే మనం చదువాలి. మనం చదువుతున్న పుస్తకం మన
తలపై మొట్టి మేల్కొల్పాలి. మనల్ని ప్రభావితం చేయాలి. పుస్తకం మనలో
గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగ పగులకొట్టాలి అన్నాడు జర్మన్ రచయిత
ఫ్రాంజ్ కాఫ్కా. నిజమే అలాంటి పుస్తకాలు చదివినప్పుడే మనలో ఒక మార్పు
మొదలవుతుంది. ఒక మధనం పురుడుపోసుకుంటుంది. కానీ నేటి తరం ఆ పని
చేస్తున్నదా? పుస్తకాలంటే కేవలం స్కూల్లో, కాలేజీలో పాఠాలు నేర్చుకునేవి
గానో, లేదంటే అవి చదివితే పరీక్షల్లో మార్కులు తెచ్చే సాధనాలుగానో
భావిస్తున్నారు. సమాజాన్ని, జీవితాన్ని, సాహిత్యాన్ని, కొత్త ఆలోచనా
విధానాన్ని నూరిపోసే పుస్తకాలు కదా నేటి యువతరం చదువాల్సింది. పుస్తకం
కన్నతల్లి పాత్ర పోషిస్తుంది అంటాడు మాక్సిం గోర్కీ. అవును.. ఏది మంచో, ఏది
చెడో వేలు పట్టి నేర్పిస్తుంది అమ్మ. పుస్తకం కూడా అలాంటిదే.. కాకపోతే
వేలు పెట్టి మనం చదువుకోవాలి. అక్కడ ఉన్న విషయమంతా మెదడులో తిష్ట వేసుకొని
కూర్చొని ఏం చేయాలో, ఏం చేయొద్దో విచక్షణ నేర్పిస్తుంది. కన్నతల్లితో
మాట్లాడే సమయం కూడా కేటాయించలేని ఈ కాలం యువతరం పుస్తకాలకు సమయం
కేటాయించగలదా? దీనికి కారణాలు కూడా లేకపోలేదు. మారుతున్న అలవాట్లు, వినోద
మాధ్యమాలు, సోషల్ మీడియా ప్రభావం నేటి తరాన్ని పుస్తకాలకు దూరం
చేస్తున్నాయి. యువతరం పుస్తకంతో దోస్తీ చేయాల్సిన అవసరం ఉంది.
కాలగమనానికి
పుస్తకాలే పునాది. నిన్నటి చరిత్రను, నేటి వర్తమానాన్ని రేపటి తరానికి
అందించే మాధ్యమమే పుస్తకం. అలాంటి పుస్తకం పట్ల అందరికీ అభిమానం, ఆసక్తి
మాత్రమే ఉంటే సరిపోదు. ప్రేమ కూడా ఉండాలి. పిల్లల్లో పుస్తక పఠనం పట్ల
ఆసక్తి కలుగాలంటే ముందుగా బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులే. లక్ష్య
నిర్దేశానికి, జీవన మనుగడకు, మానసిక ఉల్లాసానికి ప్రేరణగా నిలిచేవి
పుస్తకాలే. సోషల్ మీడియా, ఓపికలేని తత్తం, స్పీడు యుగానికి అలవాటు పడడం,
తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్ని ఆస్వాదించే తత్తం పెరగడం వల్ల నేటి యువతలో
పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోతున్నది. ఇది వారి మానసిక ఎదుగుదలకు ప్రమాద
సూచిక. ఏది మంచో, ఏది చెడో స్వయంగా తెలుసుకునే శక్తి కేవలం పుస్తక పఠనం
వల్ల మాత్రమే అలవడుతుంది. తల్లిదండ్రులు ఒక దశలో, గురువులు ఒక దశలో,
స్నేహితులు, తోటివారు ఒక దశలో తోడుండినా... ఎల్లప్పుడూ తోడుండేది కేవలం
పుస్తక పఠనం వల్ల వచ్చిన విజ్ఞానమే. మానవ విలువలు పెంపొందించడానికి
పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి. వేడుకలు, బహుమతి ప్రధానోత్సవాలు,
పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా మంచి పుస్తకం
ఇచ్చే సంప్రదాయానికి ఇప్పటికే తెరలేసింది. కాకపోతే ఆ పుస్తకాలను
అటకెక్కించకుండా అందులోని సమాచారాన్ని, విషయాన్ని బుర్రలోకెక్కిస్తే
మంచిది. స్నేహితులు లేకపోయినా పర్వాలేదు. కానీ పుస్తకం చదివే అలవాటు
లేకపోతే ఆ వ్యక్తికి, సమాజానికి రెండింటికీ చేటే అంటారు పెద్దలు. యూరప్,
అమెరికా, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్,
ప్లాస్మా టీవీ, వర్చువల్ రియాలిటీ గేమ్‌లతో పాటు గదిలో ఓ అల్మారా నిండా
పుస్తకాలుంటాయి. రోజులో అంతో ఇంతో పుస్తక పఠనానికి కేటాయిస్తారు వారు. మన
దేశంలో కూడా ప్రతీ ఇంట్లో ఎన్నో కొన్ని పుస్తకాలున్నప్పటికీ చదివే ఆసక్తి
వేగంగా తగ్గుతున్నది.
చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి
పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. ఎందుకంటే నిజంగా జ్ఞానవంతుడైన వాడు మీ
చొక్కాను చూడడు. ఆ వ్యక్తిలోని జ్ఞానాన్ని గమనిస్తాడు. మాటను, రాతను ఒక
ఇరుసులో కలుపుకొని ముందుకుసాగే జోడెడ్ల బండి భాష. ఆ భాషను తన కడుపులో
దాచుకొని ప్రపంచానికి పంచేదే పుస్తకం. అక్షరం మనిషిని అద్భుతమైన శ్రవణ
ప్రపంచం నుంచి తటస్థమైన దృశ్యంలోకి బదిలీ చేస్తుంది. అందుకే ఒక సరికొత్త
లోకంలో విహరించాలన్నా, విజ్ఞానపు రెక్కలు కట్టుకొని అనంత లోకాల్లోకి ఎగిరి
పోవాలన్నా పుస్తక పఠనాన్ని మించిన మార్గం లేదు.
గైడెన్స్ కావాలి..
మా
దగ్గరికి ఎక్కువగా నలభై ఏళ్ల వయసు వాళ్లే వస్తుంటారు. 25 నుంచి 35 వయసు
పాఠకులు కూడా వస్తారు. కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మా దగ్గర అన్ని
వయసుల వారికి కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నిజానికి యువతను
దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పుస్తకాలు అప్‌డేట్ చేస్తుంటాం. కానీ వారు
ఎక్కువగా పోటీ పరీక్షల కోసం మాత్రమే పుస్తకాలు కొంటున్నారు. చాలా
తక్కువమంది నవలలు, సాహిత్యం పుస్తకాలు కొంటున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఏ
పుస్తకాలు చదువాలో, అసలు పుస్తకాలు ఎందుకు చదువాలో వారికి సరైన గైడెన్స్
లేదు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ కూడా పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి ఒక
ప్రధాన కారణం. తక్కువ సమయంలో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికే మాధ్యమాల పట్ల
ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇప్పటి తరం. అది పుస్తకంలో దొరకదు. దీనికి
తోడు పని ఒత్తిడి, ఖాళీ సమయం దొరకకపోవడం, పోటీ జీవితాలు, లైబ్రరీలు
కావల్సినంత లేకపోవడం, యువతను ఆకట్టుకునే పుస్తకాలు అన్నిచోట్ల అందుబాటులో
లేకపోవడం పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు.
పుస్తకం వల్ల వచ్చే జ్ఞానం తప్పితే, మిగతావన్నీ తాత్కాలికమే అన్న విషయం
గుర్తుపెట్టుకుంటే మళ్లీ కచ్చితంగా అందరూ పుస్తకాలు చదువుతారు.
-సాంబశివరావు, నవోదయ బుక్‌హౌజ్ యజమాని, కాచిగూడ
నిబంధన విధించాలి!
నేను
చాలా పుస్తక ప్రదర్శనల్లో గమనించాను. వస్తే చాలా పెద్దవయసు వారు, అంటే..
నలభై, యాభై పైబడిన వయసు వారు, లేదంటే బొమ్మల పుస్తకాలు కొనుక్కోవడానికి
తొమ్మిది, పదేళ్ల పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. సరిగ్గా పాతిక
సంవత్సరాలున్న వాళ్లెక్కడైనా కనిపిస్తారా అంటే చుక్కల్లో చంద్రుడిగా ఎక్కడో
ఒకరు కనిపిస్తున్నారు. దీనికి కారణం నేటి యువతంతా ఎలక్ట్రానిక్ మీడియా,
సోషల్ మీడియాకు అడిక్ట్ అయింది. స్పీడు కోరుకుంటున్నారు. గంటలు గంటలు
చదివేదంతా క్షణాల్లో యూట్యూబ్‌లో చూసేద్దామన్న ఆలోచన పెరిగిపోయింది. దీనికి
కారణం టెక్నాలజీ అభివృద్ధి చెందడం కూడా. ఒకప్పుడు రేడియోలో ప్రతిరోజూ
పుస్తక పఠనం కార్యక్రమం ఉండేది. కొంతకాలానికి అది తీసేసి పుస్తక పరిచయం అనే
కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు అసలు పుస్తకం ఊసే లేదు. ఇదిలాగే కొనసాగితే
కొంతకాలం తర్వాత పుస్తకమంటే ఏంటి? అనే తరం మన కళ్ల ముందు తిరుగుతుంది.
దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రాథమిక స్థాయి నుంచే పుస్తక పఠనం నిబంధనగా,
విధిగా పెట్టాలి. మా కాలంలో అలా ఉండేది కాబట్టే.. ఎన్నో పుస్తకాలు
చదువగలిగాం. నేటి యువతకు ఫలానా కవి, రచయిత రాసిన పుస్తకం చదవండయా అని
చెబితే.. ఓ నాలుగైదు పేజీలు చదువుతారు. ఆ తర్వాత బద్దకిస్తారు. అదే
చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం తప్పనిసరి చేస్తే చదువుతూ ఎదుగుతారు. ఎదుగుతూ
చదువుతారు.
-తనికెళ్ల భరణి, నటుడు, రచయిత, దర్శకుడు
-గొప్ప పుస్తకాలలో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడతారు. అత్యంత విలువైన వారి ఆలోచనలను అందిస్తారు. వారి ఆత్మలను మనలో ప్రవేశపెడతారు.
-పుస్తకమనేది నువ్వు నిజం చేసుకోవాలనుకున్న ఒక కల. దాన్నెప్పుడూ నువ్వు చేతిలోనే పట్టుకుంటావు.
-పుస్తకాలను, స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి. వాటి ప్రభావం జీవితమంతా ప్రతిబింబిస్తుంది.
-మంచి పుస్తకం మన దగ్గరుంటే మనకు మంచి మిత్రులు వెంట లేని లోటు కనిపించదు.
-డిజిటలైజేషన్‌లో భాగంగా పుస్తకాలు, గ్రంథాలను పీడీఎఫ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారు.
-తెలుగు భాషలోనే 23, 257 పుస్తకాలు డిజిటలైజ్ చేయబడ్డాయి. ఈ పుస్తకాలు పీడీఎఫ్ రూపంలో www.dli.ernet.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో
ఉన్నాయి.
-ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మంది పుస్తకం ముట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపట్లేదట.
-ప్రతీ ఏడాది ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ఏదో ఒక నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంటారు.
-2017లో రిపబ్లిక్ ఆఫ్ గినీలోని కొనాక్రీ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించారు.
-ఈ ఏడాదికి గ్రీస్‌లోని ఏథెన్స్ నగరాన్ని ఎంపిక చేశారు.
-ప్రపంచంలో ఎక్కువగా పుస్తకాలు చదివేవారు భారతీయులే.
-భారతీయులు వారానికి సగటున 10.2 గంటల పాటు పుస్తకపఠనం చేస్తున్నారు.
-మారుతున్న క్రమంలో పుస్తక పఠనంపై మోజు తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పుస్తక పఠనంలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు.
-మొట్టమొదటి పుస్తకం 8వ శతాబ్దంలో ప్రింట్ చేశారు. ఈ పుస్తకానికి ఉడ్‌బ్లాక్స్ వాడారు.
-ఆ తర్వాత రెండో పుస్తకం 14వ శతాబ్దంలో చైనా, కొరియా పుస్తకాలు ప్రింట్ చేయడం ప్రారంభించాయి.
-దీని బరువు 1500 కేజీలు. ఈ పుస్తకంలో 429 పేజీలున్నాయి.
-ప్రపంచంలో అతి చిన్న పుస్తకం కూడా ఉంది. ఇందులో కేవలం 30 పేజీలే ఉంటాయి.ఈ పుస్తకం చదువాలంటే మైక్రోస్కోప్ ఉండాల్సిందే.
-ఎంతటి క్లిష్టమైన సమస్యలకైన సులభంగా పరిష్కారాలు సూచించగలరు.
-పుస్తకం
చదివితే.. పుస్తక పఠనం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. టీనేజ్‌లో గనుక పుస్తకం
చదువడం అలవాటైతే అది జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది.
-ఏ విషయం గురించి ఎంత మాట్లాడాలన్న అవగాహన, విషయ పరిజ్ఙానం అభివృద్ధి చెందుతుంది.
-సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. సామాజిక స్పృహ పెరిగి బాధ్యత గల పౌరులుగా ఎదుగుతాం.
-పుస్తకపఠనం మనిషికి శ్వాసక్రియలాంటిది. పుస్తకం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలే తప్ప నష్టాలేవీ ఉండవు.
-వారి మాటల్లో ఎదుటివారిని కట్టి పడేసే పదజాలం, నైపుణ్యం పెరుగుతుంది.
-పుస్తకం చదువడం అనేది ఆహ్లాదకరంగా, మనసుకు నచ్చిన పనిగా భావించే వారి ఆలోచనలు మిగతా వారి ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయి.