నిత్యం దేవుడి ముందు దీపం వెలిగించడం భారతీయ దైవ ఆరాధనలో ఒక ముఖ్య భాగం. దీప ప్రకాశనం నిజానికి బాహ్యంగా జరుగుతున్నా, వెలిగేవి మాత్రం మనిషి లోపలి లోకాలు. అంతర్జోతిరాకాశం వికాసం పొందడమే దీప ప్రకాశనం అసలు లక్ష్యం. వెలుగు అనే మాటకు ఆధ్యాత్మిక పరిభాషలో ‘స్పష్టత’ అని అర్థం. విశ్వాసాల్లో, ఆలోచనల్లº, ఆచరణలో స్పష్టత ఏర్పడితేనే- వికాసం సాధ్యం అవుతుంది. దీప ఆరాధన, జ్యోతి ప్రకాశనం వంటి మాటలకు అర్థం, లక్ష్యం- స్పష్టతే!
దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. రామకృష్ణ పరమహంస అనే జ్యోతి వెలిగించిన మరో దీపం పేరు స్వామి వివేకానంద. మహాత్మాగాంధీ తన ఆత్మజ్యోతి ద్వారా భారతీయుల హృదయాల్లº స్వరాజ్య ఇచ్ఛ అనే దీపాన్ని వెలిగించారు. ఈ రెండు సందర్భాల్లºనూ జరిగిన ప్రక్రియ ఒకటే. అది అస్పష్టతలోంచి స్పష్టత వైపు ప్రయాణం. భగవంతుడి విషయంలో వివేకానందుడికి ఒక స్పష్టత ఏర్పడింది రామకృష్ణుల ద్వారానే! స్వరాజ్య సమరం విషయమై జాతికి స్పష్టమైన క్రియాశీలత రూపుదిద్దుకున్నది- గాంధీజీ వల్లనే!
‘తొక్కింది తాడును’ అనే స్పష్టత మనిషికి ఏర్పడిన మరుక్షణం- చీకట్లో పామును తొక్కానన్న భయం మనసులోంచి ఎగిరిపోతుంది. జీవితంపట్ల అవగాహన, స్పష్టత ఏర్పడినప్పుడుభయసందేహాలు దూరమై మనిషి మనుగడ సుఖమయం అవుతుంది. జీవన గమనం ఆనందయానమై సాగుతుంది. జీవితాన్ని అలా స్పష్టంగా అర్థం చేసుకోవడాన్నే పెద్దలు ‘ఆత్మజ్ఞానం’గా చెబుతారు. గుండె గుహలో వెలిగిన దీపం అజ్ఞానపు చీకటిని పారదోలేసరికి ఆత్మజ్ఞానం ఆవిష్కారం అవుతుంది. కనుక దీపం పెట్టడమంటే కేవలం వత్తికి నిప్పు ముట్టించడం కాదు- మనిషిలో వెలుగులు నింపడం! అది దేవుడి ముందు ఎందుకు చేస్తామంటే- పరంజ్యోతి వికాసంతో అనుసంధానం చేయాలన్న పారమార్థిక లక్ష్యంతో! నిప్పును వంటింట్లో ముట్టిస్తే- అది మంట, దేవుడిగూట్లో వెలిగిస్తే దాని పేరు దీపం! గుండెల్లో చీకటి తొలగాలంటే- మంటతోకాదు, దీపంతోనే సాధ్యం అవుతుంది. అదే దీపారాధనలోని అంతరార్థం. దీపారాధన ఇహపరాలను వెలిగిస్తుంది. భౌతిక, మానసిక ఆవరణలను జ్యోతిర్మయం చేస్తుంది.
విశేషకాంతులను వెదజల్లే అధునాతన విద్యుద్దీపాలను అధునిక శాస్త్ర విజ్ఞానం ఆవిష్కరించింది. అయినా ఇప్పటికీ సభాసంప్రదాయాల్లో జ్యోతి ప్రకాశనం ఒకానొక శుభారంభ సూచికగా నిలిచే ఉంది. దానికి కారణం దీపం సభాసదులందరి అంతస్సీమలను జ్యోతిర్మయం చేస్తుంది కాబట్టి! ఈ దీపం మరో దీపాన్ని వెలిగించగలదు గాని ఎంత గొప్పదైనా విద్యుద్దీపానికి మరో దీపానికి జËన్మనిచ్చే సామర్థ్యం లేదు, ఉండదు!
సంప్రదాయబద్ధంగా నిర్వహించే దేవాలయాలన్నింటా ఒక ఆచారాన్ని మనం గమనించవచ్చు. గర్భగుడిలో మూలవిరాట్టును అర్చకులు నూనెదీపం వెలుతురులోనే దర్శింపజేస్తారు. దానిలో అంతరార్థం ఏమంటే, గుళ్ళో అయినా, దేవుడి గూట్లో అయినా- దీపం పెట్టామంటే ఆ వెలుగులో ఎదురుగా ఉన్న దేవుడి పటాన్ని మాత్రమే కాకుండా గుండెల్లో దేవుణ్ని కూడా గుర్తించమని చెప్పడానికే! మానవ దేహానికి అదే గర్భగుడి. దీపం ఆధ్యాత్మిక వికాసానికి సంకేతం, స్పష్టతకు గుర్తు! - ఎర్రాప్రగడ రామకృష్ణ
---------------------------
దీపారాధన
♦ వత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు వత్తులను (దీపారాధన) వెలిగించాలి.
♦ ఉదయం పూట తూర్పు దిశగా రెండు వత్తులు ఉండేటట్లు దీపం ముఖం ఉండాలి.
♦ సాయంత్రం పూట ఒక వత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి.
♦ శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
♦ దైవప్రసాదాన్ని పారవేయరాదు.
♦ దీపాన్ని నోటితో ఆర్పరాదు.
♦ ఒక దీపం వెలుగుతుండగా, రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు.
♦ దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
♦ దేవుని పూజకు ఉపయోగించే ఆసనాన్ని వేరొక పనికి వాడరాదు.
♦ దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రాలు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565