MohanPublications Print Books Online store clik Here Devullu.com

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం_mopidevi_subramanya swamy


mopidevi kumaraswamy subramanya kumaraswamy murugan
మోపిదేవి

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం



పుట్టలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరుడు!

తండ్రీతనయులు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగులచవితి రోజున ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి పుట్టకు విశేషపూజలు నిర్వహిస్తారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సుమారు అయిదు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. సర్పాకృతిలో తనయుడైన కుమారస్వామీ లింగాకృతిలో శివుడూ కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రాహు, కేతు, సర్పదోషాలను నివారించే ఇలవేలుపుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు.

స్థలపురాణం... 
ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినీపురంలో సేదతీరుతుండగా జాతివైరాన్ని మరచి పాము, ముంగిస, నెమలీ ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్యతేజస్సును విరజిమ్ముతూ ఉన్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి చూడగా కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దివ్యదృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటుచేసి ఆరాధించాడు. ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి, తాను పుట్టలో ఉన్నాననీ, తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమనీ ఆజ్ఞాపించాడట. స్వప్నవృత్తాంతాన్ని పెద్దలకు తెలియజేసిన పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి, షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామి మహిమలను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులూ, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులూ ఆలయ అభివృద్ధికి విశేష కృషిచేశారు. కాలక్రమంలో ఆ మోహినీపురమే మోపిదేవిగా ప్రసిద్ధిచెందింది.

లింగరూపంలో.. 
తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. దీన్నే పానపట్టం అని కూడా అంటారు. ఆలయ ప్రదక్షిణమార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుడిని అభిషేకిస్తారు. పుట్ట నుంచి గర్భగుడిలోకి దారి ఉందనీ, ఆ దారిలోనే దేవతా సర్పం సంచరిస్తుందనీ భక్తుల నమ్మకం. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు.

పుట్ట బంగారం... 
సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప రూపంలో పుట్టలో కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. నాగుల చవితి రోజున పుట్టదగ్గరకు వెళ్లి ఆయన్ను పూజిస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారని ఇక్కడివారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి సంకేతం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.

అర్చనలూ... ఉత్సవాలూ... 
దీపావళి అనంతరం వచ్చే నాగులచవితితోపాటు నాగపంచమి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పుట్టలో కొలువైన సుబ్రహ్మణేశ్వరుడికి పాలుపోసి, క్షీరాన్నాన్ని నివేదిస్తారు. వల్లీదేవసేనా సమేతుడైన స్వామికి ఇక్కడ నిత్యశాంతి కల్యాణం జరుగుతుంది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాధారణ అభిషేకాలు, వూయల సేవలు, రాహు - కేతు - సర్పదోష పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సాయంత్రం జరిగే రజత బిల్వార్చన మరింత ప్రత్యేకం. మాఘమాసంలో షణ్ముఖుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక దీపోజ్వలన, ఆరుద్రోత్సవాలు, ఏటా ఆషాఢమాసంలో ఆడికృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చిన్నారులకు చెవిపోగులు కుట్టించడం, బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, నామకరణం లాంటి క్రతువులకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఇలా చేరుకోవచ్చు.. 
విజయవాడకి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఉయ్యూరు, పామర్రు మీదగా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు. తక్కువ సమయంలో ఈ ఆలయాన్ని చేరుకునేందుకు మరో కొత్త రహదారిని కూడా ఏర్పాటుచేశారు. విజయవాడ నుంచి యనమలకుదురు మీదుగా బస్సు ప్రయాణం సాగుతుంది. మచిలీపట్నం, గుడివాడ నుంచి కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
- ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి 
ఫొటోలు: కె.ఎస్‌.ఎన్‌.మూర్తి
#పుట్టలో_వెలసిన
#సుబ్రహ్మణ్యేశ్వరుడు


వేయి పడగల మీద.. 
కోటి మణుగుల నేల..
మోపిదేవి స్వామి
వేయిపడగల మీద .. కోటి మణుగుల నేల.. మోసి అలసిన స్వామి.. మోపిదేవి స్వామి.. హరుని కంఠం వీడి హరిని నిద్దుర లేపి కదిలిరా.. కదలిరా..’’ అంటూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విశిష్టతను తెలియజేసే చిత్ర గీతం నేటికీ చాలా ఆలయాల్లో మార్మోగుతుంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మోపిదేవిని పూర్వం కుమారక్షేత్రమని, మోహినిపురమని పిలిచేవారని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది. ఓ సందర్భంలో పార్వతీదేవి, తన తనయుడైన కుమారస్వామిని మందలించిందట. స్వామి పశ్చాత్తాపంతో తపస్సు చేసేందుకు భూలోకంలోని ఈ ప్రాంతానికి వచ్చి సర్పరూపం దాల్చి పుట్టలో ఉండి తపస్సు చేస్తున్నాడట. కొంతకాలానికి అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరాన గల మోహినీపురం చేరుకుని నదిలో స్నానం చేసేందుకు వటవృక్షం చెంతకు చేరగా, అక్కడే ఉన్న పుట్టలో నుంచి దివ్యమైన కాంతిపుంజం కానరావడంతో దివ్యదృష్టితో శోధించగా, పుట్టలో తపస్సు చేసుకుంటున్న కుమారస్వామి దర్శనమిచ్చాడట. అగస్త్యముని స్వామి తపస్సుకు భంగం కలగకుండా, పుట్టలోపల ఉన్న శివలింగాన్ని బయటకు తీసి పుట్టపై ప్రతిష్టిస్తారు. అనంతరం ఈ ప్రాంతానికి కుమారక్షేత్రంగా నామకరణం చేసి అగస్త్యముని ఇక్కడ నుంచి వెళ్లిపోయారని, ఈ కుమారక్షేత్రమే తరువాత కాలంలో మోహినీపురంగానూ, మోపిదేవిగానూ రూపాంతరం చెందినట్టు ఆలయ చరిత్ర తెలియజేస్తోంది.

దేవతలచే పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లింగాకృతి కొన్నేళ్ల తరువాత అదృశ్యమై ఇక్కడున్న పుట్టలో ఉండిపోయింది. ఈ పుట్టకు దగ్గరలో వీరారపు పర్వతాలు అనే భక్తునికి స్వామి కలలో కనబడగా పుట్టలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసి ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రాంతంలో ప్రతిష్టించినట్లు, అనంతరం దేవరకోట సంస్థానాధీశులైన శ్రీమంతురాజా యార్లగడ్డ వారి వంశీయులు నిత్యధూప, దీప, నైవేద్యాలతో పాటు కొంత భూమిచ్చి శిఖర, గోపుర మండపాలతో స్వామివారికి ఆలయం నిర్మించారు. నాటినుంచి స్వామివారు భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటున్నారు. సుబ్రహ్మణ్యషష్ఠికి స్వామికి భక్తులు విశేషపూజలు చేస్తారు.
– ఉప్పల సుబ్బారావు, సాక్షి, మోపిదేవి, కృష్ణాజిల్లా

ఇలా వెళ్లాలి
అమరావతి, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే భక్తులు తెనాలి చేరుకుని అక్కడ నుంచి రేపల్లె రావాలి. ఇక్కడ నుంచి మచిలీపట్నం, చల్లపల్లి వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగవచ్చు. రేపల్లె రైల్వేస్టేషన్‌ నుంచి మోపిదేవికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి వచ్చే వారు కరకట్ట మీదుగా మోపిదేవి వార్పు నుంచి మోపిదేవికి 59 కి.మీ, లేదా నడకుదురు మీదుగా వయా చల్లపల్లి నుంచి మోపిదేవికి 64 కి.మీ దూరం ఉంటుంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వెళ్లే బస్సులు ఎక్కితే ఆలయం ముందు దిగొచ్చు.
#mopidevi
#VenugopalSwamy













No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list