MohanPublications Print Books Online store clik Here Devullu.com

మన్యం కొండ తెలంగాణ తిరుపతి_manyamkonda_TenganaTirupati



manyamkonda మన్యం కొండ  తెలంగాణతిరుపతి manyamkonda_ TenganaTirupati

manyamkonda మన్యం కొండ  తెలంగాణతిరుపతి manyamkonda_ TenganaTirupati

మన్యం కొండ 

తెలంగాణ తిరుపతి


కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా... కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మన్యంకొండ దేవస్థానం. తిరుపతి వెళ్లలేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సుచేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. సుమారు 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహం... ప్రత్యేకతలు.

ఆహ్లాదభరిత వాతావరణం...
ఎల్తైన గుట్టలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం, ఒడలు పులకింప జేసే చల్లనిగాలి, గుట్టపైనుంచి వచ్చే ఓంకారనాదం భక్తులను కట్టిపడేస్తాయి.

దేవస్థానం చరిత్ర...
దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీరప్రాంతంలోగల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవాకార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబసభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో అర్ఘ్యం వదులుతుండగా చెక్కని శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషశాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్‌ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. 

హనుమద్దాసుల కీర్తనలతో ఖ్యాతి...అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతోపాటు స్వామివారి ఉత్సవాలకు తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్తకుండలో అన్నం, పచ్చిపులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి నివేదిస్తారు.

నిత్యకల్యాణం.. పచ్చతోరణం
మన్యంకొండ దిగువ కొండవద్ద అలమేలు మంగమ్మ గుడి ఉంది. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం.

స్థలపురాణం...
శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానానికి 58 ఏళ్ల చరిత్ర ఉంది. 1937లో అప్పటి నైజాంసర్కార్‌ దేవస్థానం నిర్మాణానికి దిగువ కొండ వద్ద 42 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు.

ఎలా వెళ్లాలి..?
హైదరాబాద్‌ నుంచి నేరుగా మన్యంకొండకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్‌ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్‌ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్‌లో దిగితే మహబూబ్‌నగర్‌ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే మహబూబ్‌నగర్‌ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. పాసింజర్‌ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.  – అబ్దుల్‌ మొక్తదీర్,సాక్షి, దేవరకద్ర రూరల్, మహబూబ్‌నగర్‌ జిల్లా #manyamkonda
#VenkateswaraSwami
#manyamkonda
#VenkateswaraSwami

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list