MohanPublications Print Books Online store clik Here Devullu.com

సెల్ఫీ_selfie



సెల్ఫీ కావొద్దు కిల్ఫీ

‘ఒరేయ్‌.. ఆ ప్రవీణ్‌ డేర్‌డెవిల్‌ సెల్ఫీకి ఫేస్‌బుక్‌లో ఎన్ని లైక్‌లు వచ్చాయో చూశావా’
‘జూలో దూరంగా నిల్చుని సింహంతో సెల్ఫీ దిగడం గొప్ప కాదులేరా..’
‘నువ్వు కూడా ఏదో ఒకటి చేసి.. వానికంటే ఎక్కువ లైక్‌లు కొట్టకపోతే క్రేజ్‌ ఏముంటుంది?’
‘అవున్రా.. అందర్నీ ఫిదా చేస్తా..’
‘అదేదో చేస్తే నువ్వే చేయాల్రా! మావల్ల కాదు!’
‘రేప్పొద్దున వూరవతల రైల్వేలైన్‌ దగ్గర కలుద్దాం. మీరంతా అక్కడికి రండి. ఆ ప్రవీణ్‌కు ఎలా జలఖ్‌ ఇస్తానో చూద్దురు’
ఇరవైవేల విద్యుత్‌ వోల్టుల తీగల కింద.. వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది రైలు. పదిమంది కుర్రాళ్లు చేతుల్లో సెల్‌ఫోన్లు పట్టుకుని.. రైలు పట్టాల మీద నిల్చున్నారు. సమీపిస్తున్న రైలును చూసి భయంతో కేకలు వేస్తూ.. పరుగులు తీశారంతా. పట్టాల పక్కన ఓ కుర్రాడే మిగిలాడు. కళ్లలో కాస్త భయం.. కాళ్లలో సన్నటి వణుకు.. ప్రాణమంటే లెేక్కలేనితనం..! వెనక్కి తగ్గితే వెక్కిరిస్తారేమోనన్న చిన్నతనం. అరుపులతో దోస్తులు రెచ్చగొడుతున్నారు. ఆ కుర్రాడు కళ్లు మూసుకుని.. సెల్ఫీని క్లిక్‌మనిపించాడు. మరు క్షణానికే రైలు దూసుకొచ్చింది. కళ్ల ముందే శరీరం తునాతునకలైంది. ఆ సెల్‌ఫోన్‌లో అతనికి అదే ఆఖరిచిత్రం..! ఆ సెల్ఫీ రాసిన మరణశాసనమే కిల్ఫీ!!


సింహాలు, పులులు, ఏనుగులతో సెల్ఫీలను నిషేదించింది గుజరాత్‌ ప్రభుత్వం. క్రూర మృగాలతో సెల్ఫీలు దిగుతూ ఇద్దరు మృత్యువాత పడ్డాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది.
కర్ణాటక ప్రభుత్వం ఏకంగా నాలుగువందల నో సెల్ఫీజోన్‌లను ప్రకటించింది. ఇటీవలే ‘కిల్ఫీ’లకు గురికాకండని ప్రకటనలు ఇస్తోంది.
తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన యువకుడు నరేన్‌... ఇటీవలే ఉత్తరాఖండ్‌లోని చీలా జలాశయంలో సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు.
ఒక్కో సెల్ఫీ తీసుకోవడానికి పట్టే సమయం ఏడు నిమిషాలు. సగటున వారానికి కనీసం ఒక గంట సెల్ఫీలకే సరిపోతోంది. జీవితకాలంలో ఒక్కొక్కరు ఎంతలేదన్నా పాతికవేల సెల్ఫీలను క్లిక్‌ చేస్తున్నారట. అందుకని ఎప్పుడు ఏమరపాటుగా ఉన్నా.. కిల్ఫీ ముప్పు పొంచి ఉందని మరవొద్దు..


సిక్స్‌‘టీన్‌’లో అద్దం పట్టుకుంటే వదలని పిల్లలు.. 16 మెగాపిక్సల్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకుంటే వదులుతారా? ఆ వయసులో శరీరాకర్షణ మీద మోజు ఎక్కువ. ఒకప్పుడు అద్దం ముందు అందచందాలను చూసుకుని మురిసిపోయేవారు. ఇప్పడు ఫోన్‌ చేతికి వచ్చింది. అదే లోకమై కూర్చుంది. ఒక్క సెల్ఫీ క్లిక్‌మనిపించి.. సోషల్‌మీడియాలో పోస్టు చేస్తే.. క్షణాల్లో అందరికీ వెళుతుంది. ఆత్మీయుల నుంచి.. అంతే వేగంతో స్పందన తిరిగొస్తుంది. లైకులు, కామెంట్లు, ఎమోజీలు.. అదొక సరదా! కెఫెటేరియాలు, విహారయాత్రలు, పెళ్లిళ్లు, కళాశాల వేడుకలు, పుట్టిన రోజులు, కిట్టీ పార్టీలు, స్నాతకోత్సవాలు.. ఒక్కటేమిటి? ఎక్కడపడితే అక్కడ.. చేయిచాపి మరీ సెల్ఫీలతో గోలగోల చేస్తోంది కొత్తతరం. ఆ సరదా అక్కడితో ఆగిపోతే ఫరవాలేేదు. ఇంకేదో చేయాలి? అబ్బురపరచాలి. ఏ సాహసమో, సంచలనమో చేస్తే కానీ.. మనసు కుదుట పడదు. ఆ విపరీత ఆలోచనలతోనే వస్తోంది సమస్య. కళ్ల ముందే ముప్పు ఉందని తెలిసీ.. దిగితే అక్కడే సెల్ఫీలు దిగాలన్న పంతానికి పోతున్నారు. అది ఎత్తయిన కొండ రాయి చివరి అంచు కావొచ్చు. జలజల దుమికే జలపాతం అవ్వొచ్చు. ప్రవాహ తీవ్రతున్న నది.. ఆకాశహర్మ్యం.. జూలో క్రూరమృగాలు.. ముప్పు పక్కనే మురిపెంగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. కించిత్తు ఏమరపాటుకు చేజేతులా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 164 మంది చనిపోగా.. ఒక్క భారత్‌లోనే 107 మంది మృత్యువాత పడ్డారు. ఈ సెల్ఫీ మరణాలకు కిల్ఫీ అన్న పేరు పెట్టారు అధ్యయనకారులు. అకారణంగా బలవుతున్న వాళ్లలో పాతికేళ్లలోపు అబ్బాయిలు, అమ్మాయిలే ఎక్కువ. అందులోను మూడోవంతు మగపిల్లలు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి రానురాను స్మార్ట్‌ఫోన్ల ముందు కెమెరా సాంకేతిక నాణ్యత పెరగడం.. ఫోన్ల ధరలు తగ్గడం.. సోషల్‌మీడియా విస్తరిస్తుండటంతో సెల్ఫీల మానియాకు ఆకర్షితులు అవుతున్నారు.

కొందరు యువతీ యువకుల్లో క్రేజీ బిహేవియర్‌ (వెర్రితనం) పెరుగుతోంది. ఇది దుందుడుకుతనాన్ని ప్రేరేపిస్తోంది. అన్నిటికీ తొందరపాటే. ఎక్కడ నచ్చితే అక్కడ టక్కున సెల్ఫీ తీసుకోవడం ఒక వ్యసనంగా మారుతోంది. రోడ్డు చివర్న నిల్చుని కింద లోయ ఉందన్న సంగతి తెలియక కాదు. తెలిసే సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎందుకంటే.. ఎవ్వరూ సాహసించని చోట ఫొటో తీసుకుంటేనే క్రేజీ అనే దూకుడు మనస్తత్వం అంత పని చేయిస్తోంది. అది వూరికే ఉండనీయదు. ఆ స్వభావమున్న వాళ్లకు స్వీయనియంత్రణ ఉండదు. విచక్షణ తక్కువ. ఆలోచనకంటే ఆత్రం పరిగెత్తిస్తుంది. ఆ క్షణానికి అనుకున్నది చేస్తారు.
- డా.ఎస్‌.భాస్కర్‌నాయుడు, మానసిక నిపుణులు, హైదరాబాద్‌


గూగుల్‌ కృత్రిమ మేథ లేబుల్డ్‌ ప్రకారం ‘సెల్ఫీ’ అన్న పదంతో అప్‌లోడ్‌ అయిన ఫొటోలు 240 కోట్లు. ఇది రెండేళ్ల కిందటి మాట. ఇప్పుడా సంఖ్య పెద్దదే అయ్యుంటుంది. 2014 లెక్కల ప్రకారం - ఫేస్‌బుక్‌లో అయితే వారానికి 3.65 లక్షలు, ట్విటర్‌లో 1.50 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 25 కోట్ల సెల్ఫీలు పోస్టు అవుతున్నాయంటే.. ఆ క్రేజ్‌ను అంకెల్లో కొలవలేం. కొన్నిచోట్ల అయితే డ్రోన్ల ద్వారా తీస్తున్నారు. చైనా సాంకేతిక సంస్థ డిజిటల్‌బ్యూటీ యాప్‌ ‘మితు’ సెల్ఫీల క్రేజ్‌తోనే.. 45 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో అతి పెద్ద టెక్‌ ఐపివొగా అవతరించింది. గత ఏడాది మన దేశంలోనూ గూగుల్‌ప్లేలో ముందువరుసలో నిలవడం విశేషం. సెల్ఫీలకు ఎంత ప్రభావితం అవుతున్నారో చెబుతుందీ యాప్‌. మెట్రో నగరాల్లోని మానసిక నిపుణుల వద్దకు రోజుకు నాలుగైదు సెల్ఫిసైడ్‌ (సెల్ఫీ అడిక్షన్‌) కేసులు వస్తున్నాయి. ఇదొక మానసిక రుగ్మతలా పాకుతోంది. ప్రాణాలకు ముప్పున్న చోట సెల్ఫీలు తీసుకోవడాన్ని డెవిల్‌ ఛాలెంజ్‌గా చెప్పుకుంటోంది యువత. అందుకే సముద్రాలు, నదులు, ఉద్ధృతమైన నీటిప్రవాహం, జలపాతాలు, రైళ్లు, ఎత్తయిన భవనాలు, పర్వతాలు..చెరువులు, కాలువలు కిల్ఫీ జోన్‌లుగా మారుతున్నాయి. మనదేశంలో అత్యధిక సెల్పీ ´మరణాలన్నిటికీ ఇవే కేంద్రాలు. ప్రమాదకర ప్రదేశాల్లో నిషేధిత ఆంక్షలు లేకపోవడం, అప్రమత్తం చేసే సూచనలు కొరవడటం.. వంటివే ప్రధాన కారణం. రైలుకు ఎదురెళ్లి.. కొండల అంచున నిల్చుని.. పులులు, సింహాల పక్కన కూర్చుని.. సెల్ఫీ దిగడం సాహసం కాదు. అది కన్నవాళ్లకు కడుపుకోతను మిగిలిస్తుంది. మీ ‘ఆఖరిచిత్రం’తో జీవితానికి అర్థమే లేకుండా పోతుంది..!

ఇవే కిల్ఫీ జోన్‌లు..



పులులు, సింహాలు, ఏనుగులతో సెల్ఫీ దిగాలనుకోవద్దు. అవి హఠాత్తుగా దాడి చేస్తే అంతే సంగతులు.



వస్తున్న రైలుకు ఎదురెళ్లి సెల్పీ దిగడం ప్రాణాలను ¶¾పణంగా పెట్టడమే! రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు బోగీ తలుపు వద్ద నిల్చుని ఫొటో తీసుకున్నా ప్రమాదకరమే.



మారణాయుధాలతో ఫోజు పెట్టి సెల్ఫీ తీసుకోవద్దు. ఇలాగే తుపాకిని కణతకు గురిపెట్టి సెల్ఫీ తీసుకుంటుండగా.. రష్యాలో ఓ కుర్రాడు తనను తాను పేల్చుకుని చనిపోయాడు.



ఇంటిపైకప్పు మీద నిల్చుని సెల్ఫీలకు ఫోజులు ఇవ్వొద్దు. ఆ పక్కన విద్యుత్‌ తీగలు ఉన్నాయేమో జాగ్రత్త పడండి. వైర్లకు తగిలితే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.



సముద్రాలు, నదులు, ప్రాజెక్టులలో పడవలు, తెప్పల మీద వెళుతున్నప్పుడు సెల్ఫీలు యమ డేంజర్‌. ఫొటో దిగే హడావిడిలో అందరూ ఒకవైపునకు ఒరిగితే.. బ్యాలెన్స్‌ తప్పి.. పడవ నీళ్లలో మునిగిపోవచ్చు.



విద్యుత్‌ స్తంభాలు, ఎత్తయిన భవనాల మీద నిల్చుని ఫొటోలు తీసుకోవడం ప్రాణాంతకం.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list