కొంగు బంగారం... మత్స్యద్రి
special temple on mathayadri
మత్స్యఅవతారంలో విష్ణుమూర్తి
కొలనులో నామాల చేపలు
4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మత్మ్యాద్రి ఆలయం (వేములకొండ గుట్ట) భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నాలుగు కొండల మధ్యనున్న గుట్ట మీద బండరాయిపై స్వయంభూగా వెలిశాడు లక్ష్మీనరసింహస్వామి. మత్సా్వవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుండడంతో మత్స్యగిరి ఆలయంగా పేరొందింది. కొలిచిన వారికి కొండంత అండగా, భక్తుల కొంగు బంగారంగా పేరొందిన ఆలయ బ్రహ్మోత్సవాలు గత నెల 30న ఆరంభమైనాయి. ఈ నెల 4వ తేదీ వరకు జరుగుతాయి.
క్షేత్ర ప్రాశస్త్యం
వలిగొండ మండల కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది మత్సా్యద్రి ఆలయం. మొదట్లో ఆలయాన్ని వేములకొండ గుట్టగా పిలిచేవారు. మత్స్యగిరిగుట్ట సమీపంలోని పొట్టిగుట్టపై చూస్తే స్వామి వారు వెలిసిన గుట్ట చేప రూపంలో దర్శనం ఇవ్వడం, గుట్ట మీదకు వెళ్తుంటే సగ భాగం వద్ద శిలద్వారానికి చేప శిల్పం చెక్కి ఉండడంతో మత్స్యగిరిగుట్టకు ఆ పేరొచ్చింది. కాగా నామాలగుండం, విష్ణుగుండం, మాలగుండం పేర్లు కలిగిన మూడు గుండాల కలయికతో కొలను ఏర్పడింది. కొలనులో నీరు ఏ కాలంలోనైనా అదే స్థాయిలో ఉండటం, కొలనులోని చేపలన్నీ ఒకే పరిమాణంలో ఉండటం, గర్భగుడి ముందుండే కొలనులోని చేపలు నామాలు కలిగి ఉండడం ఆలయ ప్రత్యేకత. స్వామివారు మత్స్య రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ఖ్యాతికెక్కింది.
మహిమాన్వితమైన తీర్థజలం
స్వామి వారి ఆలయం ముందున్న కొలనులోని నీటిని పంట చేలలో చల్లుకుంటే పంటలను ఆశిస్తున్న చీడపీడలు దూరమై దిగుబడి పెరుగుతుందని నమ్మకం. వ్యాపార సంస్థలలో ఆ నీటిని చల్లితే వ్యాపారాలు అభివృద్ధిలో నడుస్తాయని ప్రతీతి. అందుకే భక్తులు కొలనులోని నీటిని తీసుకెళ్తారు. ఇక అనారోగ్యం పాలైన వారు స్వామివారి ఆలయ సన్నిధిలో నిద్ర చేస్తే స్వామివారు కలలోకి వచ్చి ఆయా రుగ్మతలను నయం చేస్తారని నమ్మకం. దీంతో భక్తులు గుట్టపై నిద్ర చేస్తారు.
గుట్టపైకి మూడు ఘాట్ రోడ్లు
స్వామివారిని దర్శించుకోవడానికి గుట్టపైకి అప్పట్లో నడిచి వెళ్లేవారు. వేములకొండకు చెందిన ఒక భక్తుడు సొంత నిధులతో గుట్ట మీదికి తారు రోడ్డు, సీసీ రోడ్డు వేయించాడు. వలిగొండ, మోత్కూరు రోడ్డులో ఆరూరు పరిధిలో వెంచర్ చేసిన సంస్థ గుట్టపైకి వెళ్లడానికి మరో ఘాట్‌రోడ్డు నిర్మించింది. రెండు వైపులా ఘాట్‌రోడ్లు ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే భక్తులు ఘాట్ రోడ్డు మార్గం వైపు నుంచే రాకపోకలు సాగిస్తుండడంతో మెట్ల మార్గం వైపు ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ వ్యాపారులతోపాటు మరికొందరు దాతల సహకారంతో మెట్ల మార్గం పక్కనుంచి మరో ఘాట్‌రోడ్ నిర్మించారు. ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయు స్వామి కావడంతో స్వామి వారి దర్శనానంతరం భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు.
ఇతర దర్శనీయ స్థలాలు
వలిగొండ పట్టణంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే ఆలయంలో కొలువైన ఇష్టకామేశ్వరస్వామి త్రిశక్తి ఆలయం ఉంది. ఈ ఆలయ సముదాయంలో 9 ఆలయాలు ఉన్నాయి. సంగెం వద్ద భీమలింగం కత్వ వద్ద భారీ శివలింగం ఉంటుంది. దీనిని భీముడు ప్రతిష్టించడంతో భీమలింగంగా పేరొందిందని ప్రతీతి. అలాగే సుంకిశాలలో యాదాద్రి దత్తత ఆలయమైన శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయం ఉంది.
– వాసా శ్రీధర్, సాక్షి, వలిగొండ
నైవేద్యం ఆరగించడానికి వస్తున్న చేప
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565