రామానుజుడు దినదిన ప్రవర్థమానమవు తున్నాడు. చిన్ననాడే ఆ చిన్నవాడికి పెద్ద విషయాలు అంతుపడుతున్నాయి. ఎవరైనా వేదాంత విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ బాలుడు కనులతోనే వింటాడట. పాలసంగతేమో గాని, గాలి అంటే చాలా ఇష్టం. గాలి సోకితే చాలు ఏడుపు రాదు. వాయుభక్షకుడా? ఇవన్నీ సర్పలక్షణాలు కదా అని తల్లిదండ్రులు ఆలోచించే వారు. అన్నప్రాశన నాడు రామానుజుడు బంగారం పట్టుకుంటాడా లేక పుస్తకం తాకుతాడా అని అందరూ చూస్తూ ఉంటే, బాలుడు గబగబా పాకుతూ వెళ్లి కేశవసోమయాజి తిరువారాధన మందిరానికి చేరుకుని అక్కడ నారాయణ విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నాడట.
ఓనమాలు
అక్షరాభ్యాసం నాడు, తండ్రి ఓం నమః అని రాసి దిద్దమంటే అదేమిటని దాని అర్థమేమిటని అడిగాడట. అర్థం చెప్పేదాకా దిద్దలేదు. అర్థం చెప్పిన తరువాత తానే స్వతంత్రంగా ఓం నమః అని రాసి చదివేసరికి కేశవసోమయాజి ఆశ్చర్యపోయాడు. విన్నది విన్నట్టు చెప్పగలవాడు, ఒక సారి బోధిస్తే మళ్లీ చెప్పనవసరం లేని వాడు ఇతడు ఏక సంథాగ్రాహి అని గమనించాడు. రామానుజుని సమక్షంలో వేదాంత చర్చలు చేస్తే చాలు ఆ మాటలు ఆ విధంగానే చెప్పి తండ్రిని అదేమిటని అడిగేవాడట. ఒక్కరోజులో అక్షరాలు, మరోరోజున గుణింతము, ఆ తరువాత రోజు వర్ణక్రమము, మరునాడు పేర్లు వ్రాయడం, బాలశిక్ష అత్యంతవేగంగా ముగిసింది. రెండో మారు చెబితే ఎందుకు చెప్పిందే మరలా చెబుతారు అని అడిగేవాడట. పుట్టగానే పరిమళించిన నిగమ సుమము రామానుజుడు. బాలుడు పెరుగుతున్నాడు. ఆజానుబాహువవుతున్నాడు. మహాపురుష లక్షణాలు పొడగడుతున్నాయి.
యుక్తవయసులో రామానుజునికి ఉపనయన సంస్కారం చేసినారు. వేదవిద్య ప్రారంభించారు. మూలము, క్రమము, జట, ఘన పాఠములు బోధిస్తున్నారు, అతను శరవేగంగా గ్రహిస్తున్నాడు. అప్పటినుండి త్రికాల సంధ్యావందనములు తప్పడం లేదు. సంస్కృత తమిళ భాషలను శరవేగంగా నేర్చుకుంటున్నాడు.
తండ్రి చదివే మంత్రాలు, స్తోత్రాలు వెంట వెంట చెప్పగలుగుతున్నాడు. నాలాయిర పాశురాల పఠనం కూడా మొదలైంది. అదేమిటి, దీని అర్థమేమిటి, ఇలానే ఎందుకు అంటారు వంటి ప్రశ్నలతో తండ్రిని ముంచెత్తుతున్నాడు. గోదాదేవి తిరుప్పావు పాశురాలు ఒక్కసారి తల్లి పాడితే చాలు తనయుడికి కంఠతా వస్తున్నది. ఎన్ని పాశురాలు చదివినా రామానుజుడికి ఎందుకో గోదాదేవి రచించి గానంచేసిన తిరుప్పావై పాశురాలంటే ప్రీతి. ఓ వైపు వేద, వేదాంత, వేదాంగ రహస్యాలను బోధించగల గురువు గురించి తండ్రి వెదుకుతూనే పదహారేళ్ల కౌమార యవ్వన ప్రాయాలలోకి అడుగుపెడుతున్న రామానుజుడికి వివాహం చేయాలని సంకల్పించారు తండ్రి.
తంజమాంబా రామానుజుల వివాహం
తల్లిదండ్రులు చూచి నిర్ణయించిన కన్య తంజమాంబ (రక్షమాంబ)తో వివాహానికి రామానుజుడు అంగీకరించడం జరిగిపోయింది. శాస్తోక్త్రంగా వైభవంగా వివాహం జరిపించారు. వివాహానంతరజీవనం సాగుతున్నదశలో, తండ్రి ఆసూరి కేశవుని ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. మధ్యమధ్య తీవ్రంగా అస్వస్థుడవుతున్నాడు. రామానుజుడు ఆందోళన చెందుతున్నాడు. తల్లి కాంతిమతి దివారాత్రములు భర్తవెంట ఉండి పరిచర్యలు చేస్తున్నది. కేశవసూరి ఔషధం తీసుకొనడానికి అంగీకరించడు. ఆరాధన తరువాత తీర్థమే ఆయనకు ఔషధం.
ఒకనాడు స్వప్నంలో అతనికి శఠగోపముని (నమ్మాళ్వార్) కనిపించి నీ కుమారుడు మహాజ్ఞాని, జ్ఞానంతో భవబంధాలను పటాపంచలు చేసే బంధముక్తుడిని చేసే మహాయోగి. నీవు నిశ్చింతగా ఉండవచ్చునని ఉపదేశిస్తాడు. మరునాడు రామానుజుని పిలిచి, చెంత కూర్చుండబెట్టి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించాడు. ‘‘తెల్లవారుజాము స్వప్నములు సత్యములే నాయనా, నీవే ఆచార్యుడవు. నీ పాదాలే నాకు శరణు నాయనా..’’ అన్నారు.‘‘తండ్రీ ఏమిటీ వింత. మీరు నా పాదాలను కోరడమా? మీరు నాకు గురువులు, ఆచార్యులు, జనకులు. ఇది విపరీత చర్య తండ్రీ..’’ అని రామానుజుడు వేడుకున్నారు. నీ వలన నాకు పరమపదయోగము ప్రాప్తమవుతున్నది. అదిగో అదే విరజానది, అదే వైకుంఠం... నారాయణా నీ చరణాలే శరణు, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, రామానుజ చరణౌ శరణం ప్రపద్యే.. ’’ అంటున్నట్టు పెదాలు కదులుతున్నాయి. అదిగో పరవాసుదేవుడు... పీతాంబరధారి, అంతర్యామి, అంటూ... కన్నుమూశారాయన.
కన్నీరు తుడిచిన కన్నతల్లి
రామానుజుడు హతాశుడైనాడు. చాలాకాలం విషాదంలో మునిగిపోయినాడు. తండ్రివియోగంతో ఆయననే తలచుకుంటూ దుఃఖిస్తున్న కొడుకును చూసి తల్లి కాంతిమతి అతనికి ధైర్యం చెప్పడం అవసరం అని నిశ్చయించుకుంది. కొడుకును చేరబిలిచి ‘‘నాయనా ఎవరిని తలచుకుని ఏడుస్తున్నావు. ‘జాతస్యహి ధృవో మృత్యుః «ధృవం జన్మ మృతస్యచః’ అని వినలేదా? నీ తండ్రి దేహం గురించా బాధ? ‘‘అంతవంత ఇమే దేహాః’’ (దేహం శాశ్వతం కాదు) శిధిలమై నిర్జీవమైన ఆ దేహాన్ని నీవే కదా చితి ముట్టించి ముగించినావు. పోనీ నాన్నగారి ఆత్మగురించి బాధపడుతున్నావా? అది శరీరబంధమునుంచి విముక్తమయి హరిని చేరినదని నమ్ముతున్నావా లేదా? నమ్మితే ఇంక దేనికి బాధ. అనిత్యమైన దేహమును విడిచి ముక్తుడై పరమపదము చేరిన నీ పితృదేవుల గురించి ఎందుకు నాయనా తపిస్తున్నావు, అని జ్ఞాన బోధ చేసిన మాతృమూర్తిని చూసి అవును నిజమే నేనెందుకు ఏడుస్తున్నాను? అనుకున్నాడు. తల్లిమాటలలో రామానుజునికి కనిపించని గురువు వినిపించినాడు. తల్లిదండ్రులే కదా తొలిగురువులు. శాస్త్రం చెప్పగల గురువులకోసం కంచికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు రామానుజుడు, తల్లి ఆనందంగా అనుమతించింది.
గురువు కోసం అన్వేషణ
వేదాంత విద్య నేర్చుకుందామని అనుకుంటున్నాడే కాని నాలుగు కాసులు సంపాదించి సంసారాన్ని నడపాలన్న ఆలోచనే లేదు. ఈయన అసలు నాతో కాపురం చేస్తాడా అని తంజమ్మ అనుమానించసాగింది. వేదాంతపు వెర్రి తలకెక్కితే ఇక సంసారం మీద వ్యామోహం ఏముంటుందన్నది ఆమె ప్రశ్న. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణ త్రయములపై వ్యామోహం వదులుకోవాలని వేదాలు బోధిస్తున్నాయి. ఇక నా సంసారం ఎటుపోతుందో, ఏమవుతుందో. ఆ ఆలోచనతో ఆమె చేసే పనులలో రామానుజునికి ఏదో లోపం కనిపిస్తూనే ఉంది. భర్త కంచికి వెళ్లి వేదాంత జ్ఞానార్జన ఆరంభిస్తే దారేషణ తగ్గిపోవడం తప్పదని ఆమెకు అనిపిస్తున్నది. నాకు ప్రపంచంపై విరక్తి రావడం లేదు. ఆయన అడుగులు వైరాగ్యంవైపు పడుతున్నాయి. ‘‘భగవంతుడిని ధ్యానించడానికి వేదాంత శాస్త్ర అధ్యయనం అవసరమా, వేదాలు నేర్వని మానవులకు భగవంతుడు పట్టుబడడా? అట్లా అయితే నావంటి వారి గతేమిటి?’’ భార్య ప్రశ్నించింది.
‘‘పరమాత్ముడిని చేరడానికి వేదాంత విద్యతో పనే లేదు. స్వామి కల్యాణ గుణానుభవము చాలు. సులభమైన తరుణోపాయాలు చాలా ఉన్నాయి’’ అన్నారు రామానుజులు.‘‘అయితే మీరెందుకు సులభోపాయాలు వదిలి కఠినమైన వేదాంత విద్యాభ్యాసానికి ఎందుకు కష్టపడాలనుకుంటున్నారు.’’ తంజమ్మ అడిగింది.‘‘ఈ సమాజంలో వేదాలను వ్యతిరేకించే దుర్మతములు ప్రబలుతున్నాయి. వీరికి సరైన సమాధానం చెప్పడానికి నేను ఎంతో నేర్చుకోవలసి ఉంది. వీరిని వాదాల్లో ఓడించకపోతే వారన్నదే నిజమని జనం భ్రమించే ప్రమాదం ఉంది. కనుక కొన్ని సంవత్సరాలు నేను వేదాంత రహస్యాలను అధ్యయనం చేయవలసి ఉంది. కంచిలో యాదవప్రకాశులనే పండిత ప్రకాండులున్నారు. వారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను’’ అని రామానుజులు వివరించారు.
‘‘ఈ మతాలేమిటి దుర్మతాలేమిటి?’’ అని అమాయకంగా అడిగింది తంజమ్మ.మతాలంటే అభిప్రాయాలు. జగత్తుకు కారణం ఏమిటి అనే ప్రశ్నకు పరిపరివిధాలుగా సమాధానాలు చెబుతున్నారు. కొందరు వేదాల్లో సమాధానం ఉందని నమ్ముతున్నారు. కొందరు అంగీకరించడం లేదు. చార్వాకము, జైనము, సౌత్రాంతికము, వైభాషికము, యోగాచారము, మాధ్యమికము అనే ఆరు వేదబాహ్యమతములు. వీరిలో చార్వాకము నాస్తిక మతం. వీరికి ప్రత్యక్షమే ప్రమాణము. కనిపించే భూమి, అగ్ని, నీరు, వాయువులనే వీరు ఉన్నట్టు నమ్ముతారు. ఇంతకు మించి ఏదీ లేదంటారు. శరీరమెంత ఉంటుందో ఆత్మ అంత ఉంటుందని జైన సిద్ధాంతం. జగత్తు కర్యాకారణ రూపంలో నిత్యానిత్యంగా ఉంటుంది.
ఏనుగుకు ఏనుగంత ఆత్మ ఉంటుందంటారు. వైభాషికుడు, సౌత్రాంతికుడు, యోగాచారుడు, మాధ్యమికుడు .. వీరు బౌద్ధమతస్తులు.వీరు ఆత్మను అంగీకరించరు. జగత్తు పరమాణు సంఘటితమై ఉంటుందని దీనియందు క్షణిక బుధ్ధియే మోక్షమని అంటారు. ఇంకా కొద్ది విభేదాలతో మరికొన్ని మతాలు ఉన్నాయి. సన్మతమేమిటో చెప్పవలసిన బాధ్యత మనపై ఉన్నది. యాదవ ప్రకాశుల వారు అద్వైత మతస్తులని అంటున్నారు. అదేమిటో వారిని ఆశ్రయించి వారి బోధలు వింటే తప్ప తెలియదు. అందుకే కంచికి వెళ్లాలని ఆలోచిస్తున్నాను. (సత్కథాకాలక్షేపము పేరుతో పరమపదవాసులు కవిరత్న గుదిమెళ్ల రామానుజాచార్యస్వామి వారు (నడిగడ్డపాలెం) రచించిన భగవద్రామానుజుల చరిత్ర అనే పుస్తకంలో వివరమైన వ్యాఖ్యానం ఉంది. రామానుజుని బాల్య యవ్వన వివాహ జీవనం గురించి చాలా వివరంగా ఆ పుస్తకంలో ఉంది. కొన్ని సంఘటనలు అంశాలు ఈ అద్భుతపుస్తకం ఆధారంగా రూపొందినవి)
ఇక రామానుజుని వేదాంత శాస్త్ర జిజ్ఞాసను ఆపడం ఎవరితరమూ కాదని తంజమ్మ మనసులో నిశ్చయించుకున్నది. తత్వవిషయంలో నిమగ్నమై ఉన్న రామానుజుడికి నేనవసరమే లేదు. ఈయన మహాపురుషుడు. వీరు సాధించవలసిన విజయములు వేరే ఉన్నవి. ఇల్లు సంసారములకు మించిన బాధ్యతలు వీరు తలకెత్తుకొనుచున్నారు. నేను అల్పురాలిని, నాజ్ఞానం ఏమాత్రం సరిపోదు. నేను స్వార్థ చింతన గలదానిని. వారేమో పరార్థ చింతన పరమార్థ చింతన మరమాత్మ చింతనలో మునిగిపోతున్నారు. వారు అద్భుతమైన వెలుగువైపు సాగుతున్నారు. నాది సాధారణ జీవన విధానం. వారితో పొసగడం సాధ్యమో కాదో. కాదు కాదు సాధ్యం కాదు. అని ఆలోచిస్తున్న తంజమ్మను బుట్ట ఇమ్మని అడుగుతున్నాడు రామానుజుడు. ఆమెకు వినిపించడం లేదు. కంచికి కదులతున్న భర్త తన పరధ్యానాన్ని గమనించి, తానే బుట్టను తీసుకున్నాడు. తంజమ్మ కథ కంచికి చేరుతున్నట్టనిపించింది.
కాలినడకతో కంచికి బయలుదేరిన రామానుజుని వాకిట నిలబడి కాంతిమతి, తంజమ్మ సాగనంపుతున్నారు. గూడబుట్ట ఇంత బరువుగా ఉందేమని అడిగాడు రామానుజుడు. భూభారాన్ని మోయడానికి సిధ్ధంగా ఉన్న మీకు ఇదొక బరువా అని చమత్కరించింది తంజమ్మ. నేను భూభారం మోయడమేమిటి తంజా అన్నాడు రామానుజుడు. సంసారబంధాలు వదులుకొని జనులను ఉద్ధరించే భారం మోయడానికే కదా తమరి ప్రయాణం అందామె. ఓహో అదా నీ అభిప్రాయం అని నవ్వుకున్నారు. మీరేమనుకున్నారు మరి? నీమనసులో ఉన్న బరువంతా బుట్టలోకి నెట్టావేమోననుకున్నాను. ఓచూపు చూసిందామె. రామానుజుడు గంభీరంగా అడుగులు వేస్తూ కంచివైపు నడుస్తుంటే తల్లి అతనిలో ఆదిశేషుని జాడను గమనించింది. పుణ్యపురుషుడొకడు కదిలి వెళుతున్నట్టు కనిపిస్తున్నది. తంజమ్మ మనోహరుడైన భర్త గమన సౌందర్యాన్ని చూస్తూ ఉంటే తన అదృష్టరేఖ తరలిపోయినట్టు అనిపిస్తున్నది. కొంగు చాటున ముఖం, కన్నీటి తెరల చాటున చూపులు...అంతా అస్పష్టంగా ఉంది. ఈ ప్రయాణం ఎటు?
రామానుజుడెవరు?
జననం శ్రీపెరుంబుదూర్: జీవనకాలం (1017–1137): నాథముని, యామునా చార్యుల తరువాత శ్రీవైష్ణవ విశిష్ఠాద్వైతాన్ని ప్రసిద్ధం చేసిన సిద్ధాంత కర్త, భక్తి ఉద్యమకారుడు, బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం – శ్రీ భాష్యం, భగవద్గీతాభాష్యం, వేదాంత సంగ్రహ అనేవి ప్రధాన ప్రామాణిక సైద్ధాంతిక గ్రంథాలు, శరణాతి, శ్రీరంగ, శ్రీ వైకుంఠ గద్యాలు (గద్యత్రయం), నిత్య గ్రంథం రచన. రామానుజుని రచనల పైన హారోల్డ్ కోవార్డ్, థామస్ అక్వినాస్, ఎ బి వాన్ బ్యూటెనెన్ పరిశోధనలు జరిపి ఇవి చాలా ప్రభావం కలిగించిన గ్రం«థాలని తమ పరిశోధనా సైద్ధాంతిక గ్రం«థాలలో నిరూపించారు. మహ్మదీయ రాజుల దాడులలో ధ్వంసమైన అనేక ఆలయాలను పునరుద్ధరించి, ఆ మత పాలకులతో వాదం జరిపి వారు ఎత్తుకుపోయిన విగ్రహాలను తిరిగి సాధించి ఆలయాల్లో నెలకొల్పిన ధీరుడు. ఆలయాలలో అన్నికులాలవారికి ప్రవేశం జరిపించి, అందరికోసం చెరువులు తవ్వించి, విజ్ఞానం మంత్రోపదేశం అందరూ పొందాలనే సర్వసమతా సూత్రాన్ని బోధించి పాటించిన జగద్గురువు రామానుజులు. 120 సంవత్సరాలు జీవించిన రామానుజుని తిరుమేని (శరీరం) కూర్చున్న భంగిమలో శ్రీరంగనాథుని ఆలయ సముదాయంలో 880 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ చెక్కుచెదరకుండా పూజలందుకుంటున్నది. ఈ ఫొటోలోనిదే ఆ విగ్రహం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565