MohanPublications Print Books Online store clik Here Devullu.com

Childrens day

childrensday 14thnovember


పెద్దలకు చద్దిమూటలు
children's day 14th november

మీరే లోకపు భాగ్య విధాతలు
మీ హాసంలో మెరుగులు తీరును
వచ్చేనాళ్ల విభాప్రభాతములు...
అని తన శైశవ గీతి కవితలో అన్నాడు మహాకవి శ్రీశ్రీ.

భావి ప్రపంచానికి నిజమైన భాగ్య విధాతలు పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ ఎరుగని బాలలే! ప్రతితరం అప్పటికో, అంతకుముందో, అంతకు చాలా చాలా ముందో.. బాల్యం అన్న ఒక దశను ఆస్వాదిస్తూనో, దాటుకొని వచ్చో ఉంటుంది. మహానుభావులంతా పెద్దవాళ్లవ్వక ముందు చిన్న పిల్లలే!

‘పెద్దల మాట చద్ది మూట’ అంటారు. ఆ పెద్దలంతా ‘చిన్న పిల్లలు’ అన్న ఒక ఆలోచనను దాటుకొని వచ్చినవారే! ఆ పెద్దలు తాము దాటొచ్చిన బాల్యానికి చెప్పే మాటలన్నీ మంచి వైపుకు తీసుకెళ్లేవే!! అందుకే ఆ మాటలు చద్ది మూటలయ్యాయి. ప్రపంచాన్ని మార్పు వైపుకు అడుగులు వేయించిన కొందరు మార్గదర్శకులు బాల్యం గురించి, పిల్లల ఆలోచనల గురించి చెప్పిన కొన్ని గొప్ప మాటలను బాలల దినోత్సవం (నవంబర్‌ 14) సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ పెద్దలకు చెబుతోన్న మాటలు. పెద్దలకు పెద్దలే అందిస్తోన్న చద్దిమూటలు. ఈ చద్ది మూటలను మీ పిల్లలకు తినిపించండి. అలాగే వాళ్ల కోసమే ప్రత్యేకమైన రోజు కోసం మిఠాయిలు కూడా అందిస్తున్నాం. అవీ తినిపించండి. పిల్లలు నవ్వితే సమాజమనే పువ్వు అందంగా పూస్తుంది. మంచి మాటలతో ఆ నవ్వులను అలాగే పూయిద్దాం...

♦ పసిపిల్లలు పూలతోటలోని మొగ్గల్లాంటి వాళ్లు. వాళ్లను ప్రేమగా సాకాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వారే భావి భారత భాగ్యవిధాతలు.
– జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత తొలి ప్రధాని

♦ చిన్నపిల్లల ద్వారానే మనం ప్రేమ సూత్రాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం.
మహాత్మాగాంధీ, భారత జాతిపిత

♦ మీ పిల్లలు తెలివైన వాళ్లుగా ఎదగాలనుకుంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలను చదివి వినిపించండి. వాళ్లు మరింత తెలివైన వాళ్లుగా ఎదగాలనుకుంటే, అలాంటి మరిన్ని కథలను చదివి వినిపించండి.
అల్బర్ట్‌ ఐన్‌స్టీన్, భౌతిక శాస్త్రంలో నోబెల్‌’ గ్రహీత

♦ మీరు పిల్లలకు ఏమైనా బోధించగలమనుకుంటున్నారా? ఏమీ బోధించలేరు. పిల్లలు తమంతట తామే అన్నీ నేర్చుకుంటారు. మీరు చేయాల్సిందల్లా నేర్చుకునే ప్రక్రియలో పిల్లలకు ఎదురయ్యే అవరోధాలను తొలగించడమే. అదే మీ బాధ్యత.
స్వామీ వివేకానంద, ఆధ్యాత్మిక గురువు

♦ పిల్లలే ప్రపంచంలోని అత్యంత విలువైన వనరులు. బంగారు భవితకు వారే మేలిమి ఆశలు.
జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు

♦ దేవుడెక్కడ ఉంటాడని పాశ్చాత్య దేశాల పిల్లలను అడిగితే వాళ్లు ఆకాశం వైపు చూపిస్తారు. అదే ప్రశ్న భారతదేశంలోని పిల్లలను అడిగితే వాళ్లు తమవైపే చూపిస్తారు.
మదర్‌ థెరిసా, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత

♦ ఏడ్వలేని వివేకం నుంచి, నవ్వలేని తత్వజ్ఞానం నుంచి, చిన్నారుల ముందు మోకరిల్లలేని ఘనత నుంచి నన్ను దూరంగా ఉంచండి.
ఖలీల్‌ జిబ్రాన్, లెబనీస్‌–అమెరికన్‌ రచయిత, తత్వవేత్త

♦ పిల్లలకు బోధించడానికి నాకో నాలుగేళ్ల సమయం ఇవ్వండి. నేను వాళ్లలో నాటిన విత్తు పెకలించడానికి వీల్లేనంతగా ఎదుగుతుంది.
వ్లాదిమిర్‌ లెనిన్, సోవియట్‌ రష్యా తొలి అధ్యక్షుడు

♦ మీ సొంత జ్ఞానంతో మీ పిల్లలకు పరిమితులు విధించకండి.
రవీంద్రనాథ్‌ టాగోర్, విశ్వకవి, ‘నోబెల్‌’ గ్రహీత

♦ మీరెప్పుడూ చదవని పుస్తకాన్ని మీ పిల్లలకు ఇవ్వకండి. దీన్ని నియమంగా పాటించండి.
– జార్జ్‌ బెర్నార్డ్‌ షా, సుప్రసిద్ధ ఐరిష్‌ రచయిత

♦ పిల్లలను మంచిగా మలచడానికి ఉత్తమమార్గం వాళ్లను సంతోషపెట్టడమే.
ఆస్కార్‌ వైల్డ్, సుప్రసిద్ధ ఐరిష్‌ కవి, రచయిత

♦బలప్రయోగంతోనో, కరకుదనంతోనో పిల్లలకు చదువు నేర్పకండి. వాళ్ల మనసులకు ఆసక్తి రేకెత్తించే విషయాలను తెలుసుకునేలా వాళ్లను ప్రోత్సహించండి.
– ప్లాటో, గ్రీకు తత్వవేత్త

♦ మనం మన వర్తమానాన్ని త్యాగం చేసినట్లయితే, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
– అబ్దుల్‌ కలాం, భారత మాజీ రాష్ట్రపతి

♦ పిల్లలు వాళ్ల తొలినాటి లక్షణాలతోనే పెరిగినట్లయితే, ప్రపంచంలో అంతా మేధావులే ఉండేవాళ్లు.
గోథే, జర్మన్‌ రచయిత, రాజనీతిజ్ఞుడు

♦ పిల్లలందరూ కళాకారులే. ఎదిగిన తర్వాత కూడా కళాకారులుగా ఎలా కొనసాగాలన్నదే సమస్య.
పాబ్లో పికాసో, సుప్రసిద్ధ స్పానిష్‌ చిత్రకారుడు

♦ పిల్లలకు అనుకరించే స్వభావం సహజంగానే ఉంటుంది. వాళ్లకు మంచి ప్రవర్తనను నేర్పాలని ఎంతగా ప్రయత్నించినా, వాళ్లు తమ తల్లిదండ్రులను అనుకరించడం మానుకోరు.
–మార్క్‌ ట్వైన్, సుప్రసిద్ధ అమెరికన్‌ రచయిత

♦ పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించే వ్యక్తులే పిల్లలు. మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది.
అబ్రహాం లింకన్, అమెరికా మాజీ అధ్యక్షుడు

♦ మనం స్వర్గాన్ని అందిపుచ్చుకోగల అరచేతులే చిన్నారులు.
హెన్నీ వార్డ్‌ బీచర్, అమెరికన్‌ సంఘ సంస్కర్త

♦ పిల్లలు నిరంతరం మీ దృష్టిని ఆకర్షించాలని కోరుకోరు. వారికి కావలసిందల్లా ప్రేమ మాత్రమే.
సిగ్మండ్‌ ఫ్రాయిడ్, ఆస్ట్రియన్‌ నాడీ వైద్యుడు, మనస్తత్వ నిపుణుడు

♦ పిల్లలను ఎలా చూసుకుంటున్నదనే దానిపైనే ఒక సమాజం అసలు స్వభావం అవగతమవుతుంది.
నెల్సన్‌ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు

♦ పిల్లలకు ఎలా ఆలోచించాలో నేర్పించాలి గాని, ఏది ఆలోచించాలో కాదు
– సిడ్నీ సుగర్‌మ్యాన్, అమెరికన్‌ న్యాయమూర్తి

♦ అఖండ పాండిత్యం కంటే కాస్తంత ఇంగితజ్ఞానం గొప్పది. అదే మనం పిల్లలకు నేర్పాల్సింది.
విష్ణుశర్మ, ‘పంచతంత్ర’ రచయిత

♦ పిల్లలకు ఏ మేలు చేసినా అది మొత్తం సమాజానికి చేసినట్లే.
– గౌతమ బుద్ధుడు

♦ పిల్లల్లో సహజంగా ఉండే జిజ్ఞాసను రేకెత్తించడమే బాలల విద్యావిధానానికి ఉండవలసిన ఏకైక లక్ష్యం.
మారియా మాంటిసోరి, ఇటాలియన్‌ వైద్యురాలు, విద్యావేత్త

♦ ఏదో ఒకటి నింపేయడానికి పిల్లలేమీ ఖాళీ కుండలు కాదు. జ్ఞానంతో వెలిగించాల్సిన దీపాలు వారు.
చిన్మయానంద సరస్వతి, ఆధ్యాత్మికవేత్త

♦ పిల్లల విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సినవి మూడే నియమాలు– వాళ్లను ప్రేమించండి, వాళ్లకు పరిమితులు చెప్పండి, వాళ్ల మానాన వాళ్లను ఎదగనివ్వండి.
ఎలేన్‌ ఎమ్‌ వార్డ్, అమెరికన్‌ రచయిత్రి

♦ ఏ సమూహానికైనా పసిపిల్లలకు పాలు సమకూర్చడం కంటే గొప్ప పెట్టుబడి మరొకటి ఉండదు
విన్‌స్టన్‌ చర్చిల్, బ్రిటన్‌ మాజీ ప్రధాని

♦ పిల్లల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఎంత సహనం ఉందో వాళ్ల సమక్షంలో తేలిపోతుంది.
ఫ్రాంక్లిన్‌ పీ జోన్స్, అమెరికన్‌ హాస్యరచయిత

♦ ఈ ప్రపంచానికి పిల్లలు ఇచ్చే చక్కని సందేశం ఒక్కటే: సహజంగా, నిజాయతీగా, స్వాభావికంగా జీవించండి.
– మెహ్మెట్‌ మ్యూరట్‌ ఇల్డాన్, టర్కిష్‌ రచయి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list