భక్తుడే భగవంతుడు
అయ్యప్ప దీక్ష... అపూర్వం. రాగద్వేషాలూ..
పేద గొప్ప తేడాలూ లేని ఆధ్యాత్మిక
జగత్తులో భక్తుడూ అయ్యప్పే... భగవంతుడూ అయ్యప్పే! కార్తికం...శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోనే హరిహర సుతుడు అయ్యప్ప నామం ప్రతిధ్వనిస్తుంటుంది.
కార్తికం రాగానే తెలుగు నేలపై ఆధ్యాత్మిక భావం అంతటా వ్యాపిస్తుంది. వేకువ జామునే చన్నీటి స్నానం... నుదుట గంధం.. విభూతి... నల్లని వస్త్రాలు ధరించి స్వాములు పఠించే శరణుఘోష మిన్నంటుతుంది. సర్వసంగ పరిత్యాగులై, శరీరాన్ని, మనసును పరిశుద్ధం చేస్తుంది నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష. ఈ దీక్ష స్వీకరించగానే ఒక పవిత్ర స్పృహ మనసులోకి ప్రవేశిస్తుంది. వికృత పద్ధతులు, పాశవిక స్థితులు దూరమై, ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు అడుగులు కదుపుతాం. ఆత్మవికాసాన్ని పెంచుకోగలుగుతాం. భౌతికమైన ఎదుగుదలను కట్టడి చేసి, ఎదుటివారిని అయ్యప్పగానే పలుకరిస్తూ పవిత్రంగా మానసిక పరిణతిని పెంపొందించుకోవడానికి దీక్ష నియమాలు దోహదపడతాయి. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతి క్షణం మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాం.
అమోఘం... అద్భుతం...
మాల కంఠంలో ఉన్నంత వరకూ ఏకాగ్ర బుద్ధి ఉండాలి. లేకుంటే దైవ బంధాన్ని మనకు మనం దూరం చేసుకున్నవారమవుతాం. మనలోని పరిమిత బుద్ధులకు స్వస్తి చెప్పుకుని ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో అంతవరకే మాట, అడుగు కదపాలి. దీక్షా నియమాలను పొల్లు పోకుండా ఆచరణలో పెడితే జ్యోతి స్వరూపుడి లీలలు మన జీవితాన్ని పావనం చేస్తాయి.మంత్రతంత్రాలు, జపతపాలు, యజ్ఞయాగాదుల ఫలం ఈ శరణుఘోషలో ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
నియమాల్లో జీవిత పరమార్థం...
ప్రభాతవేళ ఏ ఇంట, ఏ నోట ప్రార్థనా చైతన్యం వెల్లివిరుస్తుందో వారి కోర్కెలను గోమాత గగన వీధుల్లో నుంచి విని వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలకు చేరవేస్తుందనేది వేద రుషుల మాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భక్తుల కోర్కెల్లో ఉన్న నిస్వార్థాన్ని గమనించి కరుణా కటాక్షాలను కురిపిస్తారు. పంచభూతాలూ అనుగ్రహిస్తాయని శాస్త్రం చెబుతోంది.
అయ్యప్ప దీక్షలోని ఒక్కో నియమం ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తడానికే కాదు... సామాజిక చైతన్యం, మనిషిని మనిషిగా గుర్తించడం, క్రమశిక్షణ, శారీక దృఢత్వం వంటి ఎన్నో అంశాలను మనకు బోధిస్తుంది.
స్వామి పూజల్లో భక్తులు సామూహికంగా భజనలు చేయడం.... ఎదుటి వారిని అయ్యప్పా అని సంబోధించడం... ధనవంతుడు- పేదవాడన్న తేడా లేకుండా సహపంక్తి భోజనాలు చేయడం... ఇలాంటివెన్నో మానవ సంబంధాలను ఎలుగెత్తి చాటే నియమాలెన్నో అయ్యప్ప దీక్షలో నిక్షిప్తమై ఉన్నాయి.
దీక్ష ఎందుకంటే..
దీక్ష అంటే ఒక నియమాన్ని వహించడం. దీక్ష అనే పదానికి పట్టుదల అనే మరో అర్థం కూడా ఉంది. ఒక ఆచార నియమాన్ని పాటించాలని సంకల్పించడం, దాన్ని పట్టుదలగా కొనసాగించడం దీక్ష అని చెప్పుకోవచ్చు. ఇలాంటి దీక్షల్లో కఠినమైనది అయ్యప్ప స్వామి మాలధారణ అని భక్తులు చెబుతారు. కఠినం అనడం కన్నా అత్యంత నిష్ఠగా పాటించాల్సిన దీక్ష అనడం సబబేమో! ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకొని, దైహికంగా, మానసికంగా మండలం పాటు నిష్ఠాపూరితమైన జీవనాన్ని నిరాడంబరంగా గడపడం ఈ దీక్షలోని ప్రధానమైన అంశం. దీనివల్ల భౌతికమైన క్రమశిక్షణతోపాటు మానసికమైన నిబద్ధత ఏర్పడుతుందనీ, అది ఆదర్శప్రాయమైన జీవనానికి మార్గదర్శకమవుతుందనీ పెద్దల మాట.
కార్తీక మాసం నుంచి ప్రారంభమయ్యే అయ్యప్ప దీక్షలు మార్గశిర, పుష్య మాసాలలో కొనసాగుతాయి. తెల్లవారుజామునే లేవడం, చన్నీటి స్నానాలు, నేలమీద నిద్రించడం తదితర నియమాలను శీతకాలంలో పాటించాలని నిర్దేశించడం వెనుక ఉద్దేశం శారీరకమైన క్రమశిక్షణను అలవరచడం. రోజులో అధిక సమయం పూజలు, భజనల్లో నిమగ్నమవడం, కులమతాలకు అతీతంగా వ్యవహరించడం, నిరంతర భగవధ్ధ్యానం, ఘర్షణల జోలికి పోకుండా శాంతియుతంగా గడపడం లాంటివి మానసికమైన క్రమశిక్షణకు దోహదపడతాయి.
దీక్షాకాలంలో ఈ నియమాలను ఎందుకు పాటిస్తారు? అవి మంచివీ, ఆదర్శప్రాయమైనవీ అనే కదా! మరి దీక్ష ముగిసిన తరువాత కూడా ప్రలోభాలకూ, అరిషడ్వర్గాలకూ లోనుకాకుండా వాటిని అనుసరిస్తే జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది? ఆ ఆలోచన కలిగించడానికే పూర్వులు ఈ దీక్షలను నిర్దేశించారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565