MohanPublications Print Books Online store clik Here Devullu.com

నాకూ పెళ్లాం కావాలి..! I want to get married

marrege

నాకూ పెళ్లాం కావాలి..!
అప్పట్లో..మందీమార్బలంతో అబ్బాయి తరఫువారు పెళ్లి చూపులకు వెళ్లేవారు. కాలుమీద కాలేసుకొని, అమ్మాయిని నఖశిఖ పర్యంతం చూసి.. యక్ష ప్రశ్నలేసి.. పిల్ల నచ్చినా... ‘కట్నం ఇంతిస్తేనే పెళ్లి’ అని భీష్మించేవారు!
కొంత కాలం తర్వాత..‘కట్నం వద్దులెండి.. ఘనంగా పెళ్లి జరిపించండి చాలు’ అని అన్నారు.మరికొంత కాలం తర్వాత‘కట్నకానుకలు ఇవ్వకున్నా పర్లేదు, పెళ్లి కూడా మేమే చేస్తాం. పిల్లనిస్తే చాలు’ అన్నారు.
ఇప్పుడు...‘అమ్మాయినివ్వండి.. పెళ్లి మాదే, ఖర్చులూ మావే. మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అంటున్నారు.
ఇక కన్యాశుల్కమేనా? నాలుగు రోజులు పోతే..మనందరి కళ్ల ముందే... వందేళ్లనాటి కన్యాశుల్కం మళ్లీ రావచ్చు. అంటూ మగపెళ్లివారు బెట్టు చేసే రోజులు పోయాయి.
పెళ్లివారమండీ.. మగ పెళ్లి వారమండీ..మా పాట్లు వినేది ఎవరండీ...ఉడికీ ఉడకని వడ్డనలూ... చాలీ చాలని కట్నాలు... పరుగులు తీసే పద్ధతులన్నీ చాలు చాలు ఇక మార్చాలి! సీమ చదువుల మా అబ్బాయికి లక్షల కట్నం ఏదండీ? ఘుమఘుమలాడే పన్నీరు అత్తరు వాసనలేవండీ...?! ఎదురు కట్నం ఇచ్చి మరీ ఇంటివాళ్లవుతున్న అబ్బాయిలు అమ్మాయిలు దొరక్క కులాంతర వివాహాలు రైతులు, పురోహితులకు
కల్యాణయోగం కనాకష్టం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ పెళ్లి కాని ప్రసాదులు 35 ఏళ్లు దాటినా సోలో బతుకులు కట్నం కోసం డిమాండ్లు.. లాంఛనాల కోసం అలగడాలు అన్నీ పోయి.. ‘ఆడపిల్ల తరఫువారు ఏమడిగినా ఇస్తాం.. పిల్లనిస్తే చాలు.. అదే పదివేలు’ అని అబ్బాయి తరఫువారు సర్దుకుపోతున్న కాలం వచ్చేసింది. వివాహ యోగం లేని వాళ్లయితే.. ‘పెళ్లెప్పుడవుతోంది బాబూ..’ అంటూ విషాద గీతికలో మునిగి తేలుతున్న రోజులివి!! వరుడికి ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఆరంకెల జీతం వచ్చే ఉద్యోగం ఉన్నా.. పెళ్లి విషయంలో చివరి మాట అమ్మాయిదే! ‘అబ్బాయికి నచ్చితే చాలా? మా అమ్మాయికి నచ్చొద్దూ’ అంటున్నారు ఆడపిల్ల తరఫువారు.
బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఎంత? న్యూక్లియర్‌ ఫ్యామిలీయేనా? వంటి వధువుల ప్రశ్నల జాబితా అబ్బాయి తరఫువారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మ్యాట్రిమోనీ సైట్‌లో బయోడేటా పెట్టగానే అమ్మాయికి వంద సంబంధాలు వస్తున్నాయి. వాటిలోంచి అమ్మాయి దిలాసాగా తనకు నచ్చిన అబ్బాయిని సెలక్ట్‌ చేసుకుంటోంది. అబ్బాయిలకు అస్సలు చాయిసే లేదు. పెళ్లి కుదిరితేనే గొప్ప! 35 ఏళ్లొచ్చినా పెళ్లిళ్లు కాని ముదురుబెండల కోసం కట్నకానుకలు అడగడం తల్లిదండ్రులు ఎప్పుడో మానేశారు.
మోతుబరి రైతుకు, పురోహితులకు మరిన్ని ఇక్కట్లు!
రైతు అందరికీ అన్నం పెడతాడు. కానీ ఆ రైతుకి ఇంట్లో అన్నం పెట్టే ఇల్లాలు దొరకడంలేదు. సాగుభూములు, కోట్ల ఆస్తులు ఉన్నా.. రైతుబిడ్డలను ఈ కాలం అమ్మాయిలు దూరం పెడుతున్నారు. మంచి ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకుంటే సిటీలో సుఖపడవచ్చని భావిస్తున్నారు. దీంతో 35-40 ఏళ్లు వచ్చినా రైతుబిడ్డలకు పెళ్లిళ్లు కావడం లేదు. ఊళ్లో అందరికీ పెళ్లిళ్లు చేయించే పురోహితులదీ ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకోవడానికి ఆ వర్గానికి చెందిన వధువులు ముందుకు రావడం లేదు. నిజానికి పురోహితులు ఉద్యోగులతో పోటీపడి సంపాదిస్తున్నారు. బైకులు, ఐ ఫోనులు, ల్యాప్‌టాప్‌లు, విదేశీయానాలతో మోడ్రన్‌గా మారుతున్నారు. అయినా పురోహితుల్ని పెళ్లి చేసుకునేందుకు వధువులు ససేమిరా అంటున్నారు. కరీంనగర్‌కు చెందిన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వరుడు ఓ అనాథను పెళ్లాడాడు. బీదర్‌లాంటి ప్రాంతాల్లో బ్రాహ్మణ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం మరీ కష్టమైపోతోంది. దీంతో ఎంపిక చేసిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లిచేసుకోవచ్చంటూ అక్కడి బ్రాహ్మణ సంఘాలు అంతర్గంతంగా తీర్మానించేసినట్టుగా తెలుస్తోంది! నాటకాలు, సినీ రంగాల్లోని అబ్బాయిలకూ వెడ్డింగ్‌ బెల్స్‌ మోగడం లేదు.
లకారం ఉంటేనే లక్షణమైన అమ్మాయి
తెలుగులో ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థను నెలకు సగటున 500మంది సంప్రదిస్తూవుంటారు. వారిలో కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ కులాలకు చెందినవారే ఎక్కువమంది. ఒక్కో అబ్బాయికి పెళ్లి కుదరడానికి కనీసం ఏడాది కాలం పడుతోందంటున్నారు నిర్వాహకులు. అమ్మాయి తల్లిదండ్రులు రూ.లక్ష వేతనం ఉన్న పెళ్లికొడుకులనే మొదట చూస్తున్నారు. నెలకు రూ.50వేల కంటే తక్కువ జీతం ఉంటే పెళ్లి చేయలేమని మ్యాట్రిమోనీ నిర్వాహకులే తేల్చిచెప్పేస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో అమ్మాయికి 110శాతం డిమాండ్‌ ఉంటే అబ్బాయికి 60ు డిమాండ్‌ ఉందని అంచనా. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న ఊరిలో 35 ఏళ్లు దాటిన పెళ్లికాని ప్రసాదులు 130 మందికిపైగా ఉండటం తాజా పరిస్థితికి నిదర్శనం!
హిస్టరీ రిపీట్స్‌
‘పెళ్లికాని ప్రసాదుల’ కష్టాలను చూస్తుంటే.. 120 ఏళ్లనాటి కన్యాశుల్కం రోజులు గుర్తుకువస్తున్నాయి. ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రంలో అమ్మాయిలు దొరక్క..తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి.. ఎదురు కట్నం ఇచ్చి మరీ వధువులను తెచ్చుకునేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడవే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పెళ్లిళ్ల పేరయ్యలు! తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువ. కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయడం భారం అనుకుని అప్పట్లో అమ్మాయిని కనేందుకు వెనుకాడేవారు. దీంతో ఆడపిల్లల సంఖ్య మరీ తగ్గిపోయింది. అనంతపురం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. తరతరాల లింగ వివక్ష కారణంగా ఆడపిల్లలు దొరక్క.. అనంతలో ఎక్కడ చూసినా పెళ్లికాని ప్రసాదులే కనిపిస్తున్నారు. కాలక్రమంలో ఆడపిల్ల భారం అనుకునే రోజులు పోయి ‘కంటే అమ్మాయినే కనాలి’ అనుకునే రోజులు వచ్చాయి. అమ్మాయిలు బుద్ధిగా చదువుకుని 22 ఏళ్లకే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఆకర్షణీయమైన జీతం అందుకుంటున్న అమ్మాయిలకు కోరుకున్న వరుడు దొరుకుతున్నాడు. తూర్పుగోదావరిజిల్లాలోని కొన్ని సామాజిక వర్గాల్లో ఎదురుకట్నం ఇస్తామన్నా ఆడపిల్లలు కనిపించడంలేదు.
దీంతో కులాంతర వివాహాలకు కూడా అంగీకరిస్తున్నారు. ఎదురు కట్నం ఇచ్చి మరీ ఇంటికి కోడలిని తెచ్చుకుంటున్నారు. ఎంతకూ పెళ్లిళ్లు కాకపోవడంతో కోస్తాలో అగ్రవర్ణాలలోని కొన్ని వర్గాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. ఆ జిల్లాల అమ్మాయిల కోర్కెల జాబితా అంతగా వుండదు కాబట్టి ఏదోలా వారిని ఒప్పించి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. కులగోత్రాల విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా పెళ్లికి ఓకే చెబుతున్నారు. హర్యానా రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కేరళతోపాటు ఇతర రాష్ట్రాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం నేటికీ జరుగుతున్నది. ఈ ట్రెండ్‌ త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చినా ఆశ్చర్యం లేదేమో!
ఎందుకీ పరిస్థితి?
ఏపీలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 996మంది స్ర్తీలు ఉన్నారు. అయితే ప్రతి వెయ్యిమంది బాలురకు 944మంది బాలికలే ఉండటం ఆందోళన కల్గిస్తోంది. యువతీయువకుల నిష్పత్తిలో తేడా కూడా గణనీయంగా ఉంది. ప్రతి వెయ్యిమంది యువకులకు దాదాపు 970మంది యువతులే ఉన్నారని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఫలితంగా చాలా సామాజిక వర్గాల్లో పెళ్లీడు అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. ఎదురుకట్నాలు ఇచ్చినా వధువులు దొరకని పరిస్థితి వచ్చింది. కట్న ప్రసక్తిలేని కల్యాణాలను అంతా ఆహ్వానించాల్సిందే! అమ్మాయిలకు తమ అభిరుచులకు తగ్గట్టు వరుడిని ఎన్నుకునే స్వేచ్ఛ వర్థిల్లవలసిందే! కానీ దేశవ్యాప్తంగా స్త్రీ పురుష నిష్పత్తిలో తేడా ఆందోళనకల్గిస్తోంది.
అమ్మాయిలదే చాయిస్‌
కట్నకానుకలు తగ్గాయి. అమ్మాయిల అభిరుచులు మారాయి. వారి ఇష్టానికే తల్లిదండ్రులు కూడా ఓటేస్తున్నారు. ఆడపిల్లలు 22 ఏళ్లకే మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. తమకంటే బాగా చదువుకుని, ఆర్థికంగా స్థిరపడిన అబ్బాయిలే కావాలని కోరుతున్నారు. దీంతో కట్నాలు, కానుకల గురించి పట్టుపట్టే చాన్స్‌ అబ్బాయిలకు లేదు. విశాలంగా ఆలోచించే అబ్బాయిలకు ఇబ్బంది లేదు. కానీ కోరికల జాబితా పెద్దదిగా ఉన్న అబ్బాయిలకు పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి.
- శ్రీమతి వనజారావు, వనజారావు క్విక్‌ మ్యారేజ్‌బ్యూరో అధినేత
గట్టి మేళానికి బోలెడు కండీషన్స్‌
కాబోయే భర్త తల్లిదండ్రులకు దూరంగా నగరాల్లో ఉద్యోగం చేస్తూ వుండాలి.
గ్రామాలను అంటిపెట్టుకుని ఉండే వరుడు వద్దు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సెటిలై ఉండాలి
ఎన్ని ఆస్తులున్నా వ్యాపారం చేసే వరుడి కంటే ఉద్యోగం చేసే వరుడే కావాలి
తన కంటే మంచి చదువు, కనీసం ఆరు అంకెల జీతం సంపాదిస్తూ ఉండాలి.
ఎంత ఆస్తి వున్నా వ్యవసాయం చేసే వరుడు వద్దే వద్దు.
సివిల్‌, మెకానికల్‌ ఉద్యోగాల కంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైతేనే బెటర్‌
ఉద్యోగులతో పోటీ పడి సంపాదిస్తున్నా పురోహితుల్ని వధువులు వద్దంటున్నారు.
అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉండలేమని అమ్మాయిలు ముందుగానే చెప్పేస్తున్నారు.
వాట్సా ప్‌లో చూసి.. ఫేస్‌బుక్ చదివి..
పెళ్లి చూపులకు వెళ్లడం..పెళ్లికూతురును ప్రశ్నలు అడగడం..అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు ఆరా తీయడం.. ఇలా పెళ్లినాటి ముచ్చట్లన్నీ ఇకపై పుస్తకాల్లో చదువుకోవాలి. ఇప్పుడు వధూవరులు వాట్సా్‌పలో చూసుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. వాట్సా్‌పలో ఫొటోలు షేర్‌ చేయడం..ఫే్‌సబుక్‌, ట్విటర్‌లో మనస్తత్వాలను అర్థం చేసుకోవడం ఇప్పుడు ట్రె ండ్‌గా మారింది. ఇప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు కూడా స్మార్ట్‌ అయిపోయారు. సోషల్‌ మీడియా ద్వారానే సంబంధాలు కుదిర్చేస్తున్నారు.
బెటర్‌ హాఫ్‌ కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
లైఫ్‌ పార్ట్‌నర్‌ ఎలా ఉండాలి? తనకు ఎలాంటి అమ్మాయి కరెక్ట్‌? ఇలా నేటి యువత అన్నీ జాగ్రత్తగా విశ్లేషించుకుంటున్నారు. బెటర్‌హాఫ్‌ కోసం మ్యారేజ్‌ బ్యూరోలు, షాదీ సైట్లలో సెర్చ్‌ చేస్తున్నా చాలామందికి నిరాశే మిగులుతోంది. వాళ్లకోసం ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అందివచ్చింది. అర్హతలు, అభిరుచులకు సరిపోయే వధూవరులను స్ర్కీన్‌మీద కూర్చోబెడుతుంది. వారు చేయాల్సిందల్లా వివరాలను, అభిరుచులను నమోదుచేసి భారీ ఫీజు చెల్లించుకోవడమే! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాన్సెప్ట్‌ ఎంత హాట్‌ అంటే..ఈ ప్రాజెక్టుతో ముందుకు వచ్చిన భారతీయ స్టార్ట్‌పకు ఇటీవల 1200 కోట్ల ఫండింగ్‌ లభించింది.
కట్నాలు తగ్గాయి..
వైశ్యుల్లో కట్నాలు చాలావరకు తగ్గిపోయా యి. ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాలోనూ ఒకటిరెండు శాతం కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. గరిష్ఠంగా 28 ఏళ్లకు పెళ్లిళ్లు అవుతున్నాయి.
- వెగుళ్లపల్లి కుమార్‌,
వైశ్య సంఘం నాయకుడు
20 ఎకరాలున్నా పెళ్లి కావడం లేదు
క్షత్రియుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వయసులోనేకాదు చదువులోనూ చాలా వ్యత్యాసం ఏర్పడింది. 1970 నుంచి 1990 మధ్య పుట్టిన అబ్బాయిల్లో చాలామంది పెద్ద చదువులు చదవలేదు. ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు తమకంటే తక్కువ చదివిన రాజులను చేసుకోలేమంటున్నారు. 20 ఎకరాలున్నా అబ్బాయిలకు పెళ్లికాని పరిస్థితి మాలో ఉంది.
- సరివళ్ల రామలింగరాజు,
క్షత్రియ సేవా సమితి సలహాదారు
అమ్మాయిలు కాంప్రమైజ్‌ కావడం లేదు
బ్రాహ్మణుల్లో 100మంది అబ్బాయిలకు 60 నుంచి 70మంది అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిల కుటుంబసభ్యులు చాలా విషయాల్లో సర్దుకుపోతున్నా పెళ్లి చేయడం కష్టంగా మారుతోంది. అమ్మాయిలు కాంప్రమైజ్‌ కావడం లేదు. దీంతో పురోహితులకు ఆదాయం పెరిగినా సంబంధాలు రావడం లేదు. అమ్మాయిలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. మా అబ్బాయిలేమో పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోతున్నారు.
- డొక్కా నాగబాబు, బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list