ప్రకృతి- పురుషుడు
PrakrutiPurusudu
మన శాస్త్రాల ప్రకారం ప్రకృతి, పురుషుడు శివపార్వతులే. వీరిద్దరిది విడదీయరాని బంధం. వాక్కు, అర్థము రెండు కలిసే ఉంటాయి. ఆ విధంగానే ఈ జగానికి ఆద్యులైన శివపార్వతులు కలిసి ఉంటారు. ఆది శంకరాచార్యులు దీనినే మరో రూపంలో ‘‘సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్ పరమం బ్రహ్మ ఇతి వేదాంత డిండిమ..’’ అని పేర్కొంటారు. శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివరూపమైతే, పీఠం పార్వతీదేవి. వాళ్లిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేకపోతే అది అయోమయానికి, అవ్యవస్థకి, అశివానికి దారితీస్తుంది. వీరిద్దరూ కలిసినప్పుడే కేళి జరుగుతుంది. ఈ కేళి జరిగే ప్రదేశానికి కైలాసమని పేరు. కైలాసమంటే ఎక్కడో ఉన్నది కాదు. ఈ జగమంతా కైలాసమే. ఇక్కడ జరిగేవి రెండు. ఒకటి లాస్యం. రెండోది తాండవం. ఈ లాస్య, తాండవాలు ఎక్కడ జరుగుతాయో అదే కైలాసం. అందుకే పురాణాలలో- పార్వతి పరమేశ్వరులను దర్శించటానికి వెళ్లినప్పుడు- వారు రతికేళిలో ఉన్నట్లు పేర్కొంటారు. దీని పరమార్థం- శివపార్వతుల సంగమం. అంటే ప్రకృతి పురుషుల సంగమం. ఈ కేళి జరుగుతున్నంత కాలం ఈ ప్రపంచం మంగళంగా ఉన్నట్లే. ఒక వేళ ఆగిపోతే- అమంగళానికి చిహ్నం. అది విపత్తుకు దారి తీస్తుంది. ఈ అమంగళం జరగకుండా.. జనన, మరణాల చక్రం కొనసాగాల్సిందే. అందుకే శంకరులు-
పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే.. అంటారు. ఈ సంసార భ్రమణ పరితాపం వదిలిపోవాలంటే- మరణ జననాల అసలు స్వరూపాన్ని గుర్తించాలి. ఈ జననమరణాల చక్రాన్ని ఛేదించగలిగిన వారు ప్రకృతి పురుషులు మాత్రమే. ఈ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మానవ జన్మ అర్థం, పరమార్థం మనకూ బోధపడుతుంది.
-చాగంటి కోటేశ్వరరావు శర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565