MohanPublications Print Books Online store clik Here Devullu.com

మధుమేహం_Diabetes


మధుమేహం_Diabetes

ఆమె మధుమేహం అంతా ప్రత్యేకం!
నేడు ప్రపంచ మధుమేహ దినం

మధుమేహం మామూలు సమస్య కాదు. జ్వరం, నొప్పుల మాదిరిగా ఏదో మందు వేసుకుంటే పోయేదీ కాదు. జీవితాంతం వెంటాడుతుంది. అయితే ఇది ఆడవాళ్లకు మరిన్ని చిక్కులనూ తెచ్చిపెడుతోంది. మగవారిలో కన్నా ఆడవారిలోనే మధుమేహం ఎక్కువగా కనబడుతుండటం.. మధుమేహ సంబంధ సమస్యలూ ఇంకాస్త త్వరగానూ, అదీ తీవ్రంగానూ ముంచుకొస్తుండటం కలవరపరుస్తోంది. అందుకే మహిళలను మధుమేహం బారినపడకుండా చూసుకోవటం, మధుమేహం వస్తే తగు చికిత్సలతో నియంత్రణలో ఉంచుకునేలా ప్రోత్సహించటం అత్యవసరమని ‘ప్రపంచ మధుమేహ దినం’ నినదిస్తోంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు మన హక్కనీ గట్టిగా నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో మహిళల్లో మధుమేహం తీరుతెన్నులపై సమగ్ర కథనం మీకోసం.



మధుమేహం ఎవరికి వచ్చినా ఇబ్బందే. పిల్లల ఆలనా పాలనా చూసుకునే మహిళలను ఇది మరిన్ని ఇబ్బందులకూ గురిచేస్తుంది. అంతర్జాతీయ మధుమేహ సంస్థ లెక్కల ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 19.9 కోట్ల మంది మహిళలు మధుమేహంతో బాధపడుతున్నారు. దీని మూలంగా ఏటా 21 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు యుక్తవయసులోనే ఉండటం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక గర్భధారణ సమయంలో తలెత్తే మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటీస్‌) మూలంగా తల్లికి, గర్భస్థ శిశువుకు బోలెడన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు. కాబట్టి మధుమేహ ముప్పు పొంచి ఉన్నవారికి, అలాగే మధుమేహంతో బాధపడుతున్నవారికి- అందరికీ సరైన అవగాహన కల్పించటం.. చికిత్సలు, మందులు సమానంగా, చవకగా అందుబాటులో ఉండేలా చూడటం తప్పనిసరి. ఆహార, వ్యాయామ నియమాలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ.. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ.. అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకుంటూ.. మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకునేలా ప్రోత్సహించటం ఎంతో అవసరం. ఇది మన ఇంటి నుంచే, మన కుటుంబం నుంచే ప్రారంభం కావాలి.

15 ఏళ్ల లోపు..
మధుమేహానికి వయసుతో పనిలేదు. పిల్లల్లోనూ రావొచ్చు. ఇలా చిన్నవయసులో వచ్చే మధుమేహం (టైప్‌ 1) అబ్బాయిల కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువ. మధుమేహ బాధిత పిల్లల్లో మూడింట రెండొంతుల మంది అమ్మాయిలే! ఇది వీరిలో ఇంకాస్త ముందుగానూ దాడిచేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోందనేది కచ్చితంగా తెలియదు గానీ ఈస్ట్రోజెన్‌ హార్మోన్లు కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి, నియంత్రణకు తోడ్పడే ఈస్ట్రోజెన్‌ స్థాయులు నిర్ణీత మోతాదుల కన్నా తగ్గినా, పెరిగినా మధుమేహానికి దారితీయొచ్చు. దీని స్థాయులు అస్తవ్యస్తం కావటం ఆటోఇమ్యూన్‌కు.. అంటే రోగనిరోధకవ్యవస్థ పొరపాటున క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలపై దాడి చేసేలా పురికొల్పుతున్నట్టు, ఇది మధుమేహానికి దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఇన్సులిన్‌ నిరోధకతతో మధుమేహానికి దారితీసే వూబకాయం, యాంటీబాడీలు కూడా అమ్మాయిల్లోనే ఎక్కువగా కనబడుతున్నాయి. చిన్నవయసు మధుమేహం చాలావరకూ హఠాత్తుగానే బయటపడుతుంటుంది. పిల్లలు ఉన్నట్టుండి శ్వాసకోశ, జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడటం.. వీటి మూలంగా పదిహేను రోజుల్లోనే బరువు బాగా (2 కిలోల కన్నా ఎక్కువగా) తగ్గిపోవటం, తీవ్రంగా నీరసించి పోవటం వంటివి కనబడుతుంటాయి. కొందరు కోమాలోకీ వెళ్లిపోవచ్చు. రక్తపరీక్ష చేస్తే రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా కనబడతాయి. ఇలాంటివారికి ఇన్సులిన్‌ ఇవ్వటం తప్పించి మరో మార్గం లేదు. అయితే దాదాపు 30% మందిలో మధుమేహం నెమ్మదిగా (పీడియాట్రిక్‌ టైప్‌2 డయాబెటీస్‌) బయటపడుతుంటుంది. వీరికి గ్యాడ్‌ యాంటీబాడీ, సిపెప్టైడ్‌ పరీక్షలు చేసి.. ఇన్సులిన్‌ ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. పుట్టిన తర్వాత తొలి సంవత్సరంలో తరచుగా ముక్కు, చెవి, గొంతు, వూపిరితిత్తులు, అన్నవాహిక, జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డవారికి అవయవాల ఎదుగుదల దెబ్బతినటం కూడా మధుమేహానికి దారితీయొచ్చు.

15-25 ఏళ్లలో..
ఇది చాలా కీలకమైన దశ. శారీరకంగా, మానసికంగా పరిపక్వత సాధించే సమయం. ఈ వయసులోనూ మధుమేహం, వూబకాయం ఆడవాళ్లలోనే ఎక్కువగా చూస్తుంటాం. అయినా కూడా చాలామందికి ఈ విషయమే తెలియటం లేదు. రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉన్నా పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల చాలామందిలో ఇతరత్రా జబ్బుల కోసం రక్త పరీక్షల వంటివి చేయించుకున్నప్పుడు యాదృచ్ఛికంగానే సమస్య బయటపడుతోంది. దీన్ని సకాలంలో గుర్తించకపోతే లోలోపల అనర్థం జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి మధుమేహం ముప్పు ఎక్కువగా గలవారు అప్పుడప్పుడు రక్తంలో గ్లూకోజు స్థాయులను పరీక్షించుకోవటం మంచిది. వూబకాయులకు, కుటుంబంలో లేదా రక్త సంబంధికుల్లో ఎవరైనా మధుమేహులు గలవారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే పుట్టిన సమయంలో అధికబరువు (3.5 కిలోల కన్నా ఎక్కువ) గలవారికీ మున్ముందు.. అంటే 15 ఏళ్ల తర్వాత మధుమేహం వచ్చే అవకాశముంది. పుట్టినపుడు తక్కువ బరువు (2.5 కిలోలు) గలవారికి కూడా దీని ముప్పు ఎక్కువే. గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి తగినన్ని పోషకాలు ముఖ్యంగా.. ఫోలిక్‌యాసిడ్‌ అందకపోతే పిండం సరిగా అభివృద్ధి చెందదు. దీంతో తక్కువ బరువుతో పిల్లలు పుడుతుంటారు. ఇలాంటివారికి పెద్దయ్యాక మధుమేహం, గుండెజబ్బుల వంటి వూబకాయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశమూ పెరుగుతుంది.

25-65 ఏళ్లలో
జీవితంలో కుదురుకోవటం, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలను నెరవేర్చటం వంటి కీలకమైన ఘట్టాలన్నింటికీ ఇదే వేదిక. ఒకప్పుడు 25 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లోనే మధుమేహం ఎక్కువని అనుకునేవారు. ఇప్పుడీ పరిస్థితి మారిపోతోంది. మగవారిలోనూ, ఆడవారిలోనూ ఇది సమాన స్థాయికి చేరుకుంటోంది. విదేశాల్లోని భారతీయుల్లోనైతే ఆడవారిలోనే మరింత ఎక్కువగా మధుమేహం కనబడుతోంది కూడా. దీనికి అధికబరువు, వూబకాయమే కారణమని భావిస్తున్నారు. మనదేశంలో మహిళలు కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయి తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. ఏదైనా సమస్య వచ్చినా తోసేసుకొని తిరుగుతుంటారు. దీంతో మధుమేహం ఉన్నా చాలామందిలో బయటపడటం లేదు. కొన్ని కుటుంబాల్లో మహిళలను చిన్నచూపు చూస్తుండటమూ దీనికి దోహదం చేస్తోంది. చాలామందిలో మూత్రమార్గ, మూత్రకోశ, చిగుళ్ల, జననాంగ ఇన్‌ఫెక్షన్ల రూపంలోనే మధుమేహం బయటపడుతోంది. కాబట్టి తరచుగా మూత్రమార్గ, జననాంగ, చర్మ ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండటం.. నెలకు 2 కిలోలకు పైగా బరువు తగ్గుతుండటం వంటివి గమనిస్తే రక్తంలో గ్లూకోజు స్థాయులను పరీక్షించుకోవటం మంచిది.

65 ఏళ్లు దాటాక
మనవలు, మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన ఈ వయసులో మధుమేహం ఎంతోమందిని కుంగదీస్తోంది. వూరట కలిగించే విషయం ఏంటంటే- 64 ఏళ్లు దాటిన తర్వాత మధుమేహం బయటపడటమనేది మగవారిలో కన్నా ఆడవారిలో తక్కువ. వృద్ధుల్లో ఆడవారిలో, మగవారిలో మధుమేహ సంబంధ సమస్యలు సమానంగానే కనబడుతున్నప్పటికీ పక్షవాతం వంటివి మరింత ఎక్కువగా దాడిచేస్తున్నాయి. కొందరికి మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల వంటివి రక్తంలోకి చేరుకొని సెప్టిసీమియాకూ దారితీయొచ్చు. ఇది ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. ఎముకలు గుల్లబారే (ఆస్టియోపోరోసిస్‌) ముప్పూ పెరుగుతోంది. దీంతో చిన్నపాటి దెబ్బలకే ఎముకలు, తుంటి విరగటం.. వీటి మూలంగా మంచాన పడి కోలుకోలేకపోవటమూ ఆడవారిలోనే ఎక్కువగా కనబడుతోంది.




* 2040 వరకు ప్రపంచవ్యాప్తంగా మధుమేహ మహిళల సంఖ్య 31.3 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
* మహిళల మరణాలకు దోహదం చేస్తున్న ప్రధాన కారకాల్లో 9వ స్థానం మధుమేహానిదే.




జీవనశైలి మార్పులతో టైప్‌ 2 మధుమేహం కేసులను 70% వరకూ నివారించుకోవచ్చు.




మధుమేహంతో బాధపడే మహిళలకు గుండెజబ్బు వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ.


నోరు, జననాంగ శుభ్రత కీలకం

మధుమేహం విషయంలో ఆహార, వ్యాయామ నియమాలే కాదు.. పరిశుభ్రత కూడా కీలకమే. నోరు, జననాంగ శుభ్రతను పాటించటం చాలా ముఖ్యం. ఎందుకంటే చిగుళ్లు, జననాంగ ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవటం మధుమేహ నివారణకు తోడ్పడుతుందనే భావన ఇప్పుడు బలపడుతోంది. అందువల్ల మూత్రమార్గ, జననాంగ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉండే ఆడవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇది మధుమేహ నివారణకే కాదు, రక్తంలో గ్లూకోజు నియంత్రణకూ తోడ్పడుతుంది. మందులు వేసుకోవటం.. ఆహార, వ్యాయామ నియమాలను పాటించటంతో పాటు నోరు, జననాంగ శుభ్రతను పాటిస్తే గ్లూకోజు స్థాయులు మరింత బాగా నియంత్రణలో ఉంటాయి. ఫలితంగా మందుల మోతాదులనూ తగ్గించుకునే అవకాశముంది.


గర్భిణి మధుమేహం



మహిళల మధుమేహం విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గర్భిణి మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటీస్‌) గురించి. ఇది కేవలం గర్భధారణ సమయంలోనే కనబడుతుంది. కాన్పు అయ్యి.. మాయ బయటపడిన మరుక్షణంలోనే పూర్తిగా తగ్గిపోతుంది. మామూలుగా రక్తంలో గ్లూకోజు స్థాయులు పరగడుపున 125 కన్నా ఎక్కువ, భోజనం చేశాక 200 కన్నా ఎక్కువుంటే మధుమేహంగా పరిగణిస్తారు. కానీ గర్భిణుల్లో మాత్రం అంతకన్నా తక్కువే ఉండాలి. వీరిలో గ్లూకోజు స్థాయులు పరగడుపున 90 కన్నా ఎక్కువ, భోజనం చేశాక 140 కన్నా ఎక్కువుంటే గర్భిణి మధుమేహం ఉన్నట్టే. దీంతో ముప్పేంటంటే ఇది తల్లికి సమస్యలు తెచ్చిపెట్టటమే కాదు.. నిర్లక్ష్యం చేస్తే పిండం ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుంది. సాధారణంగా తొలి 7 వారాల్లోనే పిండం అవయవాలన్నీ తయారైపోతాయి (ఆర్గనో జెనెసిస్‌). చాలామందిలో 4 వారాల తర్వాత గర్భ నిర్ధరణ అవుతుంటుంది. ఒకవేళ అప్పటికే గర్భిణికి మధుమేహం మొదలైందనుకోండి. పిండం అవయవాల తయారీ సరిగా పూర్తికాదు. గర్భిణికి గ్లూకోజు స్థాయులు ఎక్కువుంటే పిండంలోనూ గ్లూకోజు స్థాయులు పెరుగుతాయి. దీంతో పిండంలోని క్లోమం గ్లూకోజు స్థాయులకు అనుగుణంగా ఇన్సులిన్‌ ఎక్కువగా ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తుంది. ఇన్సులిన్‌ స్థాయులు పెరిగితే శరీరంలోని కణాల సైజూ పెరుగుతుంది, అవయాలు పెద్దగా అవుతాయి. పిండం మరీ పెద్దగా అయితే కాన్పు కష్టమవుతుంది. ఇక 3-6 నెలల్లోనే పిండం బాగా పెద్దగా అయితే ఆ బరువును తట్టుకోలేక పిండం ఆయాసానికి గురవుతుంది. దీంతో కొన్ని అవయవాలు సరిగా ఎదగకపోవటం, పిండం లోపలే మరణించటం వంటి ముప్పులు పెరుగుతాయి. గర్భిణికి గ్లూకోజు నియంత్రణలో ఉంటే పిండంలోనూ గ్లూకోజు స్థాయులు తగ్గుతాయి. కాబట్టి గర్భిణి మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయరాదు. విధిగా గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహార, వ్యాయామ నియమాలతో రెండు, మూడు వారాలైనా ఫలితం కనబడకపోతే ఇన్సులిన్‌ ఆరంభించాల్సి ఉంటుంది. మాత్రలతో రక్తంలో గ్లూకోజు నియంత్రణలోకి రావొచ్చు గానీ మార్గదర్శకాల ప్రకారమైతే గర్భిణి మధుమేహానికి ఇన్సులిన్‌ ఇవ్వటమే ఉత్తమం.
* గర్భిణి మధుమేహం తెచ్చిపెట్టే మరో సమస్య గర్భవాతం (ప్రిఎక్లాంప్సియా). మమూలుగానే మధుమేహుల్లో రక్తపోటు ఎక్కువ. గర్భిణి మధుమేహుల్లో ఇది మరింత ఎక్కువగానూ ఉంటుంది. గర్భిణులను ఎక్కువగా పొట్టనపెట్టుకుంటున్న సమస్యల్లో గర్భవాతం రెండో స్థానంలో ఉండటం.. తరచుగా గర్భిణి మధుమేహం, గర్భవాతం రెండూ కలిసే కనబడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల గర్భిణి మధుమేహులు గ్లూకోజుతో పాటు రక్తపోటును కూడా కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం చాలా ముఖ్యం.
* ప్రస్తుతం చాలామంది గర్భ నిర్ధరణ జరిగిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో మధుమేహం ముందే బయటపడుతోంది. అయితే ఒక్క గ్లూకోజు మాత్రమే కాదు.. ఐరన్‌, థైరాయిడ్‌ స్థాయులతో పాటు మూత్రంలో అల్బుమిన్‌, రక్తపోటును కూడా విధిగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. రక్తహీనతతో మధుమేహం రావొచ్చు, మధుమేహంతో రక్తహీనత తలెత్తొచ్చు. థైరాయిడ్‌ సమస్యతో మధుమేహం, గర్భవాతం రావొచ్చు. అందువల్ల గర్భిణి మధుమేహం ఉంటే గ్లూకోజు స్థాయులను నియంత్రణలో ఉంచుకోవటంతో పాటు మిగతా సమస్యలకూ చికిత్స తీసుకోవాలి.


సమస్యల ముప్పూ ఎక్కువే!



మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండెజబ్బు, కిడ్నీలు, కంటిచూపు దెబ్బతినటం, నాడులు క్షీణించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవి ఆడవారిలో మరింత త్వరగానూ, తీవ్రంగానూ కనబడుతున్నాయి. గుండెజబ్బు, అధిక రక్తపోటు, క్యాన్సర్లు, అల్జీమర్స్‌, కొవ్వుల స్థాయులు పెరగటం, ఎముకలు గుల్లబారటం, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటివి మధుమేహ మహిళల్లోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటికి ఈస్ట్రోజెన్‌తో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నప్పటికీ.. ఈస్ట్రోజెన్‌ ఎక్కువుంటే మంచిదా? తక్కువుంటే మంచిదా? అన్నది ఇంకా నిర్ధరణ కాలేదు.
* మధుమేహులు బరువు పెరగటం వల్ల గొంతులోని కండరాలూ పెద్దగా అవ్వొచ్చు. నిద్రపోతున్నప్పుడు ఇవి కిందికి జారి శ్వాసకు అడ్డుపడొచ్చు. దీంతో హఠాత్తుగా కాసేపు శ్వాస ఆగిపోయి (స్లీప్‌ అప్నియా) మెలకువ రావొచ్చు. స్లీప్‌ అప్నియా మూలంగా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గుతాయి. తరచుగా మధ్యమధ్యలో మెలకువ వచ్చేస్తుంటుంది. దీంతో ఇన్సులిన్‌ సామర్థ్యాన్ని తగ్గించే అడ్రినలిన్‌ వంటి హార్మోన్ల స్థాయులు పెరిగి మధుమేహానికి దారితీయొచ్చు.
* కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు.. గాజు పెంకులపై నడిచినట్టు, పాదాలు తేలిపోతున్నట్టు అనిపించటం.. స్పర్శ సరిగా లేకపోవటం, మొద్దుబారటం వంటి సమస్యలూ మహిళల్లోనే ఎక్కువ. మగవారిలో ఇవి మధుమేహం వచ్చాక పదేళ్ల తర్వాత కనబడితే ఆడవారిలో ఐదేళ్లకే మొదలవుతుండటం గమనార్హం. ఇలాంటివారికి బి12, బి6, బి10 విటమిన్లు ఎంతో మేలు చేస్తాయి. గ్లూకోజు స్థాయులను తగ్గించే మెట్‌ఫార్మిన్‌ మాత్రలతోనూ బి విటమిన్లు లోపించే అవకాశముంది కాబట్టి వీటిని విధిగా తీసుకోవాల్సి ఉంటుంది.







No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list