MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఈ-కామర్స్‌ అమ్మేద్దాం స్మార్ట్‌గా!_e-commerce

e-commerce online sale
ఈ-కామర్స్‌ 
అమ్మేద్దాం స్మార్ట్‌గా!



మీరో గృహిణి...
పిల్లల్ని స్కూల్‌కి... భర్తని ఆఫీస్‌కి పంపేస్తారు...తర్వాత మీకు ఇష్టమైన వ్యాపకంలో మునిగిపోతారు... క్రాఫ్ట్‌లు తయారీనో... పెయింటింగ్స్‌... మరేదైనా చేస్తారు. తెలిసిన వారికి ఒకటో.. రెండో అమ్ముతారు... అంతేనా? ఇప్పుడున్న స్మార్ట్‌ ప్రపంచంలో మీ పరిధిని అక్కడితో సరిపెట్టుకోవాల్సిందేనా?
మీరో ఉద్యోగి...
ఉదయం 9 నుంచి 5 వరకూ ఉద్యోగం చేసి... మిగతా సమయంలో మీకున్న క్రియేటివ్‌ స్కిల్స్‌తో మరింత సంపాదించాలనుకుంటే? సంప్రదాయ పద్ధతుల్లో పబ్లిసిటీ చేస్తున్నారా?నెట్టింట్లోకి ప్రవేశం ఉండి లోకల్‌గానే పరిమితం అయితే ఎలా?
మీరో అంకుర సంస్థ నిర్వాహకులు...
సంస్థలకు సంబంధించిన వివరాలు.. అందిస్తున్న సర్వీసు.. ఇతర వివరాలతో కళాత్మకమైన స్టోర్‌ని క్రియేట్‌ చేయాలా? అందుకు పైసా ఖర్చుపెట్టక్కర్లేదు... వాడుతున్న స్మార్ట్‌ ఫోన్‌ తీయండి. క్షణాల్లో మీ కంటూ ఓ స్టోర్‌ని క్రియేట్‌ చేయండి! ఆన్‌లైన్‌లో అమ్మేయండి! అందుకో ప్రత్యేక సర్వీసు సిద్ధంగా ఉంది! అదే ‘షాప్‌మాటిక్‌’. ఉచితంగా వాడుకోవచ్చు...

ఇంట్లో కూరగాయల నుంచి... వేసుకునే బట్టలు... ధరించే యాక్ససరీస్‌.... అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నాం. అందుకు అనువైన ఆన్‌లైన్‌ స్టోర్‌లకు లెక్కేలేదు. ఆకట్టుకునే ఫొటోలతో ఆన్‌లైన్‌ అంగళ్లు స్మార్ట్‌ ఫోన్‌లోకి వచ్చేసి తెగ వూరించేస్తుంటాయి. మరి, మీరు తయారు చేసే ఉత్పత్తుల్ని అంతే అదిరేలా గ్యాలరీ రూపంలో క్రియేట్‌ చేసి.. వివరాలు జత చేసి... ఆన్‌లైన్‌లో అధికారికంగా అమ్మకం చేపట్టాలంటే? ‘అబ్బో... చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతేనా... టెక్నాలజీపై బాగా పట్టుండాలి. మాకున్న మిడిమిడి పరిజ్ఞానంతో అవన్నీ ఎలా సాధ్యం..’ అనే వాళ్లే ఎక్కువ. అలాంటి వారి కోసం క్షణాల్లో ఉచితంగా స్టోర్‌ని క్రియేట్‌ చేసుకుని అమ్మకాలు చేపట్టేలా ‘షాప్‌మాటిక్‌’ ముందుకొచ్చింది. అదీ మీ చేతితో నిత్యం ఒదిగి ఉండే సెల్‌ఫోన్‌లోనే. మీకేమంత టెక్నాలజీ పరిజ్ఞానం కూడా అక్కర్లేదు. మీకు పరిమిత ‘ఆప్‌’ నాలెడ్జ్‌తోనే స్టోర్‌ని మీరే క్రియేట్‌ చేసుకోవచ్చు. మోజు తీరాక అమ్మేసే ‘సెకండ్స్‌’ మార్కెట్‌ కంటే ఒక మెట్టు పైకెక్కి... మీరు తయారు చేసే ఉత్పత్తులు, ఇతర సర్వీసులకు మీదైన ప్రొఫెషనల్‌ స్టోర్‌ని క్రియేట్‌ చేయడం అన్నమాట! అదెలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!
రెండు రకాలుగా..
షాప్‌మాటిక్‌ రెండు రకాల సర్వీసుల్ని అందిస్తోంది. ‘షాప్‌మాటిక్‌ గో’. ఉచితంగా సర్వీసుని వాడుకుని మొబైల్‌ ఫ్లాట్‌ఫామ్‌పైనే నిమిషాల్లో స్టోర్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. మీరు వాడుతున్న మొబైల్‌తోనో లేదంటే... సరాసరి ప్లేస్టోర్‌, ఐట్యూన్స్‌ నుంచి యూజర్లు ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత ఎకౌంట్‌ వివరాల్ని ఎంటర్‌ చేయాలి. మీరు దేశ వ్యాప్తంగా అమ్మకాలు చేపట్టేందుకు ‘ఇండియా’ సెలెక్ట్‌ చేసి వాడుతున్న జీమెయిల్‌ లేదా ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. వెబ్‌సైట్‌ మాదిరిగా ఓ ‘డొమైన్‌ నేమ్‌’ని పెట్టుకునే వీలుంది. ఆకట్టుకునే థీమ్స్‌తో ఆకట్టుకునేలా థీమ్స్‌ని అప్లై చేసి చూడొచ్చు. మీరేదైనా దుస్తులకు సంబంధించిన స్టోర్‌ని క్రియేట్‌ చేయాలనుకుంటే మోడల్స్‌తో కూడిన థీమ్స్‌ సెలెక్ట్‌ చేయవచ్చు. ఫ్యాషన్‌ యాక్ససరీస్‌, డెకర్‌, కిచెన్‌, హౌస్‌వేర్స్‌, బ్యూటీ, ఎడ్యుకేషన్‌, వెడ్డింగ్‌, ఈవెంట్స్‌, రియల్‌ ఎస్టేట్‌... ఇలా పలు రంగాలకు సంబంధించిన స్టోర్‌లకు అను„ ేౖన థీమ్స్‌ని క్షణాల్లో పొందొచ్చు. ఉదాహరణకు ఇంట్లో సొంతగా మీరు డిజైన్‌ చేసిన దుస్తులకు సంబంధించిన థీమ్స్‌ని కోసం ‘క్లాతింగ్‌’ విభాగం ఉంది. తగిన ‘టెంప్లెట్స్‌’ని సెలెక్ట్‌ చేసుకుని మార్పులు చేసి వాడుకోవచ్చు. ఆకట్టుకునేలా ‘కవర్‌ఇమేజ్‌’ని నచ్చింది అప్‌లోడ్‌ చేసి పెట్టుకోవచ్చు. ఇలా హోం పేజీని మొదలుకుని స్టోర్‌లోని అన్ని పేజీలను నచ్చినట్టుగా ఎడిట్‌ చేసి పెట్టుకోవచ్చు. ఆప్‌లో మీరు డిజైన్‌ చేసిన స్టోర్‌ని పీసీ, ట్యాబ్‌, ఫోన్‌లో ఎక్కడైనా ఆకట్టుకునే ‘లేఅవుట్‌’తో ఓపెన్‌ అవుతుంది.
ఫ్యాషన్‌ యాక్ససరీస్‌, డెకర్‌, కిచెన్‌, హౌస్‌వేర్స్‌, గ్రాసరీ, బ్యూటీ, ఎడ్యుకేషన్‌, వెడ్డింగ్‌, ఈవెంట్స్‌, రియల్‌ ఎస్టేట్‌... ఇలా పలు రంగాలకు సంబంధించిన స్టోర్‌లకు అనువైన థీమ్స్‌ని క్షణాల్లో పొందొచ్చు.
గ్యాలరీ తయారీ...
మీరు అభిరుచి మేరకు స్టోర్‌ని క్రియేట్‌ చేసుకున్నాక ఫోన్‌తో మీరు తయారు చేసిన ఉత్పత్తుల్ని ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. అందుకు ‘ప్రాడక్ట్స్‌’ మెనూ ఉంది. ‘యాడ్‌ ప్రాడక్‌’ ఆప్షన్‌తో కెమెరాతో తీసినవే కాకుండా అప్పటికే ఆల్బమ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఉన్నవాటిని సరాసరి గ్యాలరీలోకి అప్‌లోడ్‌ చేయవచ్చు. ఉత్పత్తి పేరు, ధర, ఇతర వివరాల్ని ఎంటర్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఇలా యాడ్‌ చేసిన ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌ అంగళ్లలో మాదిరిగా బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ‘యాడ్‌ కార్ట్‌’ ఆప్షన్‌తో కస్టమర్లు కార్ట్‌లోని ఉత్పత్తుల్ని యాడ్‌ చేసుకోవచ్చు. చెల్లింపు ప్రక్రియని సెట్‌ చేసేందుకు సెట్‌అప్‌ మెనూలోని ‘పేమెంట్స్‌’ విభాగంలోకి వెళ్లాలి. పలు రకాల మాధ్యమాలతో ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించిన వివరాల్ని ‘సర్వీసు అగ్రిమెంట్‌’తో సెట్‌ చేసుకోవాలి. అంతే... కస్టమర్లు డెబిట్‌, క్రెడిట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపు చేస్తారు. ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయవచ్చు. ఇతర దేశాల నుంచీ కూడా ఆర్డర్లు తీసుకుని ఆన్‌లైన్‌ లావాదేవీల్ని చేసేందుకు ‘పేపాల్‌’ ఎకౌంట్‌ని వాడుకోవచ్చు. ఇక ‘షిప్పింగ్‌’ సర్విసుల్ని సెట్‌అప్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘షిప్పింగ్‌’ విభాగం ఉంది.
పబ్లిసిటీ పని...
ఇక స్టోర్‌లోని ఉత్పత్తుల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ పబ్లిసిటీ చేయాలనుకుంటే? ‘సెర్చింజన్‌ ఆప్టిమైజేషన్‌’... లాంటి టెక్నికల్‌ ఫ్లాట్‌ఫామ్‌లతోపనే లేదు. స్టోర్‌ నుంచే సరాసరి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్స్‌ఆప్‌... లాంటి ఇతర సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై పంచుకుంటూ పబ్లిసిటీ కస్టమర్ల డేటాబేస్‌ని చేరొచ్చు. స్టోర్‌లోని ఉత్పత్తులకు సంబంధించిన వివరాల్ని లింక్‌ రూపంలో ఎక్కడైనా పంచుకునే వీలుంది. అంతేకాదు... అప్‌లోడ్‌ చేయాలనుకునే ఉత్పత్తుల ఫొటోలను ప్రత్యేక ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ టూల్‌తో ఆప్‌లోనే ఎడిట్‌ చేసుకునే వీలుంది. ఇక ‘షాప్‌మాటిక్‌ ప్రో’ ప్రీమియం వెర్షన్‌లో మరిన్ని అదనపు సౌకర్యాల్ని అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ అమ్మకాలకు సంబంధించిన పూర్తి స్థాయి వ్యవస్థని సెట్‌ చేసుకోవచ్చు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘షాప్‌బోట్‌’తో ఉత్పత్తుల ధరలు, ఇతర వివరాల్ని పోల్చి చూసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే, కస్టమర్లు సులువైన పద్ధతుల్లో స్టోర్‌ నిర్వాహకులతో మాట్లాడేందుకు వాట్స్‌ఆప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్లను ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌కి జత చేస్తున్నారు. సర్వీసుని వాడుకునేందుకు https://goshop matic.com లింక్‌ని చూడండి.
ఈ-కామర్స్‌ ఎడ్యుకేషన్‌ అనివార్యం

సులభమైన ఇంటర్ఫేస్‌తో ఆప్‌ రూపంలో మేం అందిస్తున్న ‘షాప్‌మాటిక్‌ గో’ భిన్నమైన సర్వీసు. ఉచిత, ప్రీమియం వెర్షన్లకు ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైనే షాప్‌మాటిక్‌ని వాడుతున్నారు. ఉచిత డొమైన్‌పేర్లతో పాటు ఆకట్టుకునే టెంప్లెట్‌ డిజైన్లతో ఈ-కామర్స్‌ స్టోర్‌ని క్రియేట్‌ చేసుకునేలా వెసులుబాటు కల్పించాం. వినియోగదారులకు పెద్దగా టెక్నికల్‌ నాలెడ్జ్‌ లేకపోయినా మా టెక్నికల్‌ టీమ్‌ సపోర్ట్‌తో ఆన్‌లైన్‌వ్యాపారాన్ని సులభం చేసుకోవచ్చు. కాలింగ్‌, మెయిలింగ్‌, స్క్రీన్‌ షేరింగ్‌... మార్గాలతో మా టెక్నికల్‌ బృందం సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మా టీమ్‌ ‘ఈ-కామర్స్‌ ఎడ్యుకేషన్‌’ అందిస్తారు. సింగ్‌పూర్‌, హాంగ్‌కాంగ్‌ లాంటి దేశాల్లో యూజర్లు ఈ-కామర్స్‌పై అవగాహన ఎక్కువ. దీంతో వారు చిటికెలో సర్వీసుని వాడుకుని నెట్టింట్లో వ్యాపారం సాగిస్తారు. భారత్‌లోనూ ఆన్‌లైన్‌ అమ్మకాలపై బిజినెస్‌ నిర్వాహకులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్పత్తి ఏదైనా ఎల్లలు చెరిపేస్తూ కొనుగోలు దారుడికి ఉత్తమమైన సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేయాలి.
- అనురాగ్‌ ఆవుల, షాప్‌మాటిక్‌ సీఈవో

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list