MohanPublications Print Books Online store clik Here Devullu.com

IMAGE Tower for animation, gaming_హైదరాబాద్ ఇమేజ్ టవర్

IMAGETower animation,  gaming హైదరాబాద్  ఇమేజ్ టవర్
హైదరాబాద్ 

ఇమేజ్ టవర్

-రాజధానికి మకుటంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
-టీ ఆకారంలో టవర్.. టీ ఫర్ టెక్నాలజీ, టీ ఫర్ తెలంగాణ
-యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ రంగానికి ప్రాధాన్యం
-2020 నాటికి పూర్తి.. డిగ్రీ, ఐటీఐ, పాఠశాలల్లో యానిమేషన్ కోర్సులు
-ఇమేజ్ టవర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
#ImageTower:రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడికి వచ్చే విధంగా అత్యద్భుతంగా ఇమేజ్ టవర్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 430 ఏండ్ల క్రితం హైదరాబాద్ నగరానికి ఖులీ కుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మిస్తే.. ఈ తరానికి ఇమేజ్ టవర్ ఐకాన్‌గా నిలిచిపోతుందని అన్నారు. ట్విట్టర్‌లో ఇమేజ్ టవర్ నమునాలకు బ్రహ్మండమైన స్పందన లభించిందని, ఇప్పుడు యావత్‌దేశం హైదరాబాద్ వైపే చూస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాయదుర్గంలోనిర్మించనున్న ఇమేజ్ టవర్‌కు మంత్రి కే తారకరామారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.945 కోట్ల అంచనా వ్యయంతో 2020 నాటికి 16లక్షల చదరపు అడుగుల్లో ఇమేజ్ టవర్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ టవర్ టీ ఆకారంలో నిర్మాణమవుతున్నది. టీ ఫర్ తెలంగాణ, టీ ఫర్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఈ నిర్మాణంతో ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రంగంగా యానిమేషన్ , వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ పరిశ్రమకు హైదరాబాద్ చిరునామా కానున్నదని వివరించారు.
ఈ రంగం 2016 ఆర్థిక సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా 243బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారం చేసిందని చెప్పారు. భారతదేశంలో కేపీఎంజీ-ఫిక్కీ అధ్యయనం ప్రకారం దీని మార్కెట్ 1.39బిలియన్ డాలర్ల మేర ఉన్నదని వివరించారు. 2021 నాటికి దీని విలువ 3.12బిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పారు. ఈ రంగంలోని పరిశ్రమలు తమ సొంతంగా టీవీ సీరియళ్లను రూపొందిస్తున్నాయని, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లకు అవసరమైన యానిమేషన్‌లను తయారు చేస్తున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో వీఎఫ్‌ఎక్స్, టుడీ, త్రీడీ యానిమేషన్, గేమింగ్ రంగంలో దాదాపు వంద కంపెనీలు 30వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR
హైదరాబాద్ నుంచి అమెరికాకు దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన కంటెంట్‌ను అభివృద్ధిచేసి పంపిస్తున్నామని చెప్పారు. సినిమారంగంలో విశేష ఆదరణ పొందిన బాహుబలి, అరుంధతి, లైఫ్ ఆఫ్ పై, మగధీర, ఈగ లాంటి సినిమాలకు యానిమేషన్‌ను హైదరాబాద్ కంపెనీలు తయారుచేసి ఇక్కడి సత్తాను చాటాయని తెలిపారు. ఇంగ్లిష్ సినిమాల్లోనూ అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలకు అవసరమైన వీఎఫ్‌ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) ఇక్కడే తయారయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని పేర్కొన్నారు. భారతీయ యానిమేషన్, గేమింగ్ పరిశ్రమ ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ పాలసీని తీసుకొచ్చిందని, దీనిద్వారా ఈ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఈ రంగంలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక కంపెనీలను ఇక్కడ స్థాపించేలా చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. హైదరాబాద్‌లో ఫిల్మ్‌స్టూడియోను ఏర్పాటు చేయడానికి డిసెంబర్ 16న ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఇమేజ్ టవర్‌లో గ్రీన్‌మ్యాట్ స్టూడియోలు, కలర్‌కోడింగ్, డీఐ స్టూడియోలు, డేటా సెంటర్, హెచ్‌డీ బ్యాండ్‌విడ్త్ తదితర సదుపాయాలు ఉంటాయని వివరించారు. ఇమేజ్ టవర్ ఈ రంగానికి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇమేజ్ టవర్ పూర్తయితే ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ రంగానికి సంబంధించిన అన్ని సేవలు ఒకే దగ్గర దొరికే ప్రాంతంగా హైదరాబాద్ గుర్తింపు పొందుతుందని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో ఏవీజీసీ ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రాథమిక అవగాహన కోర్సును ఐటీఐలో, స్కూల్ స్థాయిలో ఏవీజీసీ మాడ్యూల్స్‌ను ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఈ రంగానికి అవసరమైన మానవవనరులను స్థానికంగానే సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఇమేజ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను గేమింగ్, యానిమేషన్ కంపెనీల కోసం 27వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశామని, పది కంపెనీలు ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలో అంతర్జాతీయంగా పేరున్న యూనివర్సిటీలను హైదరాబాద్‌లో వాటి క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గేమింగ్, యానిమేషన్ పరిశ్రమను ప్రోత్సహించడానికి స్టాంపు డ్యూటీ రీయింబర్స్‌మెంట్, లీజు రెంటల్ సబ్సిడీ, ప్రొడక్షన్ కాస్ట్ రీయింబర్స్‌మెంట్, వినోదం పన్ను రాయితీ, మార్కెటింగ్ సౌకర్యం కోసం ఎగ్జిబిషన్‌లపై సబ్సిడీలను అందిస్తున్నామని, పెట్టుబడులు పెట్టే భారీ పరిశ్రమలకు ఎక్కువగా రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ షేక్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ మంత్రి స్పందన..
మంత్రి కేటీఆర్ ఇమేజ్ టవర్ నమునా చిత్రాలను ట్విట్టర్‌లో చూసిన మధ్యప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి యశోధర రాజే స్పందించారు. ఒక చిత్రం వేయి పదాలను నిర్వచిస్తున్నదని వ్యాఖ్యానించారు. దీని నిర్మాణాన్ని అభినందిస్తూ.. నిర్మించడానికి ఎంత సమయం పడుతుందంటూ మంత్రి కేటీఆర్‌ను ఆమె ప్రశ్నించారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list