ప్రపంచ తెలుగు భాషా సమ్మేళనం!
తెలంగాణ నేల.. సాహితీ పరిమళాల పూలమాల. ఇక్కడ తెలుగు భాషా.. సాహిత్యాలు వికసిస్తాయి.. పద పరిమళాలు గుబాళిస్తాయి. అందుకే తెలంగాణ నేల తెలుగు భాషా వికాసానికి.. స్వచ్ఛతకు అమ్మగారిల్లు లాంటిది. ఎన్నడో వేల యేండ్లనాడు.. మన సంస్కృతి పురుడు పోసుకున్ననాడు అక్షర కుసుమాల దివిటీల నడుమ పల్లెల్లో సాహిత్యపు కాంతిపుంజాలు ప్రసరించిన చరిత్ర తెలుగు భాషది. అలనాటి పంపన మహాకవి అల్లిన అపురూప పద్యాలు.. పాల్కురికి సోమనాథుడి అందమైన కావ్యాలు తెలుగు పదదీప్తితో దశదిశలా వ్యాప్తి చెంది తెలుగును ప్రజల అధికార భాషగా మార్చాయి. ఆ పద రూపాలే.. ఆ సాహితీ సౌరభాలే చారిత్రక జీవనాన్ని అక్షరబద్దం చేసిన శాసనాలై.. అందమైన అలంకారాలు ధరించి హృద్యమైన పద్య కావ్యాలై.. మన తెలుగు భాషను అన్ని సాహిత్య ప్రక్రియలకు ఆదిగా నిలిపాయి. ఇంతటి ఘనకీర్తిని ప్రపంచ నలుమూలలా చాటేందుకు తెలంగాణ యావత్తు డిసెంబర్ 15 నుంచి జరుపుకోనున్న ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ముఖచిత్ర కథనం.
-దాయి శ్రీశైలం, 8096677035
TeluguMahaSaba
ఎప్పుడు? : డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు.
ఎక్కడ? : హైదరాబాద్ వేదికగా
ఎలా? : సాహిత్య.. సంస్కృతీ.. కళా ప్రదర్శనల రూపంలో
ఎవరి ఆధ్వర్యంలో? :తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ సాహిత్య అకాడమీ.
ఎందుకు? : తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు.
సందర్భమేంటి? : తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకొని.
తీరొక్క అలంకారాలతో బోనాలు.. తీరొక్క పూలతో బతుకమ్మ పండుగను జరుపుకొనే తెలంగాణ గడ్డ ఇప్పుడు తీరొక్క అక్షరాలతో సాహితీ పండుగల జరుపుకోనున్నది. అనాదిగా వస్తున్న సాహిత్యపు వారసత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమవుతున్నది. ప్రాచీనమైన.. ప్రాభావితమైన మన తెలుగు ప్రపంచపు మనసుల్ని గెలిచేందుకు సన్నద్ధమయింది. స్వరాష్ట్ర సాధనలో.. మన గొంతుకను వినిపించడంలో దండలో దారంలా కీలకపాత్ర పోషించింది మన భాష. అలాంటి భాష గురించి గొప్పగా చెప్పుకోవడం.. మన జీవన విధానంలో ఆయువు పట్టులాంటి మాతృభాష వైభవాన్ని చాటుకోవడం కోసం సాహిత్యపు వాకిట్లోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి ప్రపంచ తెలుగు మహాసభలు.
ఆది తెలుగు :
తెలంగాణ నేలపై వికసించిన తెలుగే అసలు సిసలైన తెలుగు. ఇది ఆధారాలతో నిరూపితమైనది. తెలుగు ప్రాచీన హోదాకు కూడా ఆధారమై ఆది భాషగా నిలిచింది. ఆ తెలుగు భాషే.. తొలి అలంకార గ్రంథాన్ని సంతరించింది. ఎలుగెత్తి పాడుకునే ద్విపదనందించింది. స్వతంత్ర కావ్యం.. శతకం.. ద్విపద రామాయణం.. అచ్చ తెలుగు కావ్యం.. యక్షగానం.. సాంఘీక చరిత్రం అన్నింటికీ తొలిరూపు దిద్దింది. ఆధునిక ప్రక్రియలైన వచన కవిత.. కథ.. నవల అన్నింటిలో తనదైన జీవనాన్ని చిత్రించింది. కొలమానాలకందని సాహిత్య సంపదతో కొలువుదీరింది. తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ ప్రజల.. కవుల.. పండితుల పాత్ర విశిష్టమైనది.
ఏమైంది మరి? :
సమైక్య పాలనలో వారి ఆధిపత్యంతో మన తెలుగును తొక్కేశారు. వాళ్లు సృష్టించిందే తెలుగు భాషయింది. ఆది కవులు.. ఆది కావ్యాలు వాళ్లు రాసినవే అయ్యాయి. పాఠ్య పుస్తకాల్లోనూ.. ప్రామాణిక గ్రంథాల్లోనూ వాళ్లు చెప్పినవే ఉండడం వల్ల మనం అదే అచ్చమైన తెలుగు అనుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో పురుడు పోసుకున్న తెలుగుపై అధ్యయనం జరుగలేదు. ఆ కారణంగా తెలంగాణ సారస్వత ప్రముఖుల సేవలు గుర్తింపునకు నోచుకోలేదు. ఆఖరికి సినిమాల్లో కూడా వాళ్ల భాషనే రుద్దడం వల్ల మనది రచనకు.. ప్రచురణకు నోచుకోలేదు. పైగా మరుగున పడినట్లయింది.
ఇప్పుడేం చేయాలి? :
నేటి ప్రపంచీకరణ యుగంలో స్థానిక భాషా.. సంస్కృతులకు ప్రమాదం పొంచి ఉన్నదనేది నగ్న సత్యం. ఈ సందర్భంలో భాషా సంస్కృతులకు సంబంధించిన సైద్ధాంతిక అవగాహన.. వాటి అభివృద్ధికి సోపానాలు రచించడం అత్యంత అవసరం. తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించడం వల్ల తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణవారి మహత్తర కృషిని ప్రపంచానికి చాటి చెప్పినట్లు అవుతుంది. తెలంగాణ సాహిత్య వైభవాన్ని.. మహాకవుల విశేష ప్రతిభను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లినట్లవుతుంది. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
మహా సభల ఆవశ్యకత :
తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యాభివృద్ధికి తీవ్రమైన కృషి జరిగింది. తెలంగాణలోనే తెలుగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. అయితే ఇది చరిత్ర పుటల్లో సరిగ్గా నమోదు కాలేదు. తెలుగుభాషా సాహిత్యవేత్తల కృషి ఆనాడు విస్మరణ గురైంది. ఇది కావాలనే చేశారు. కనుక ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఉన్న తెలుగు భాషా సాహితీవేత్తలను ఆహ్వానించి.. మరోసారి తెలుగుభాషా సాహిత్యాల గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాల్సిన ఆవశ్యకత.. అనివార్యత ఏర్పడ్డాయి అని అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి. వందలాది సంవత్సరాలుగా తెలుగుభాషను కొందరి ఆసక్తిలాగా.. కొందరి సొత్తుగా భావించారు. తెలంగాణ ఉద్యమం వల్ల మన చరిత్రను మనం తవ్వుకునే అవకాశం కలిగింది. ఈ సోయిలోంచే నన్నయ ఆది కవి ఎలా అవుతాడు? అంతకుముందు ఎవరు లేరా? అనే ప్రశ్న మొదలైంది. ప్రశ్నలోంచి అన్వేషణకు బీజం పడింది. అలా పంపన ప్రస్తావన వచ్చింది. కురిక్యాల శాసనం ప్రస్తావన వచ్చింది. ధూళికట్ట శాసనం గుర్తుకు వచ్చింది. ఇదంతా ప్రపంచానికి చాటిచెప్పాలి కదా. అందుకే ప్రపంచ తెలుగు మహాసభలు అని అన్నారు తెలంగాణ భాషా-సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ.
ప్రపంచానికి చాటితే? :
తెలంగాణలో వికసించిన తెలుగు సాహిత్యాల కీర్తిని ఘనంగా చాటినట్లవుతుంది. తెలంగాణ భాషలోని.. నుడికారంలోని సౌకర్యం.. సాహిత్య ప్రముఖల విశేష కృషి.. వివిధ ప్రక్రియల్లో జాలువారిన తెలంగాణ సాహిత్య వైభవం సాక్షాత్కరించినట్లవుతుంది. కొత్తతరానికి భాషా సాహిత్యాల ప్రాముఖ్యతను అర్థం చేసుకునే అవకాశాలు కల్పించొచ్చు. తెలంగాణ ప్రజల్లో తమ వారసత్వం పట్ల ఒక గౌరవాన్ని పెంచవచ్చు. సమాజపు సంస్కారాన్ని తెలుపవచ్చు అని తెలంగాణ సీఎంఓ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మనకూ ఓ పంపన ఉన్నాడు. మల్లినాదసూరి ఉన్నాడు. కుప్పాంబిక ఉన్నది. అక్కమాదేవి ఉన్నది. పాల్కూరికి సోమన ఉన్నాడు అనేది ఉద్యమకాలంలో ఎలా చెప్పుకున్నామో.. అదంతా ఇప్పుడు లోకమంతా చెప్పినట్లవుతుంది. తెలుగు భాషా సారస్వతం.. సాహిత్యం.. కథల అభివృద్ధిలో వికాసంలో తెలంగాణ ప్రాంతంలో వికసించిన కవులు.. రచయితలు.. సాహితీవేత్తల కృషిని కొనియాడినట్లవుతుంది అని తెలిపారు మామిడి హరికృష్ణ.
భాషా పరిరక్షణ చర్యలేంటి? :
తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది. ఈ వేదిక ద్వారా తెలుగు భాషను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాల్సి ఉంటుంది. తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఉర్దూ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంటుంది. ఈమేరకు ప్రాథమిక.. మాధ్యమిక.. ఉన్నత.. ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుల సిలబస్ రూపకల్పన చేయనున్నారు. ఇంతకుముందులా కాకుండా సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌నే పాఠ్యాంశాలుగా బోధించాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థలు బోర్డులను కచ్చితంగా తెలుగులోనే రాయాల్సి ఉంటుంది.
ఏమేం కావాలి? :
ప్రపంచ నలుమూలల నుంచి పలువురు భాషావేత్తలు, సాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ మహాసభలు ఈ వైపున చర్చ జరుపడంతో పాటు ఒక స్పష్టమైన భాషా విధానానికి నాంది పలుకాలి. ప్రజలు సాంఘికంగా, రాజకీయంగా, నైతికంగా, సాంస్కృతికంగా ఎంతో చైతన్యం కావాల్సి ఉన్న నేటి తరుణంలో భావ ప్రసారానికి, భావ చైతన్యానికీ భాషే వాహిక అన్న వాస్తవాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి.
ప్రధాన అంశాలేవి? :
ఉదయం సాహిత్య గోష్టులు ఉంటాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ.. గోండు నృత్యాలు.. కోలాటం.. పేరిణిలాంటి నాట్యాలు.. కలుపుపాట.. నాటుపాట.. బతుకమ్మ పాటలు.. వినోద ప్రక్రియలు.. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తానీషా-రామదాసు సంబంధం.. రామదాసు కీర్తనలు.. తందనాన రామాయణం.. శారదాకారులు.. హరికథా ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శిస్తారు. పద్యగానం.. సినీ పాటల విభావరి నిర్వహిస్తారు. చుక్క పొడుపు నుంచి పొద్దుగూకే వరకు గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు.. కోత పాటలు.. దుక్కి పాటలు.. జానపద గేయాలు లాంటి అంశాలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి. ఆదివాసీ.. గిరిజన.. శాస్త్రీయ.. జానపద నృత్యాలూ ప్రదర్శిస్తారు. దేశ.. విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు.. భాషా పండితులు.. అవధానులు.. కవులు.. కళాకారులు.. రచయితలను ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నారు.
ఏమేం చేస్తారు? :
తెలుగు భాషాభివృద్ధికి.. తెలుగు భాష వైభవానికి తెలంగాణ ప్రాంతంలో జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్టులు నిర్వహిస్తారు. తెలంగాణలో వర్ధిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపేవిధంగా అవధానాలు నిర్వహిస్తారు. గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేస్తారు. వీటితోపాటు తెలుగుభాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు అనగా కవి సమ్మేళనాలు.. మహిళా కవి సమ్మేళనాలు.. అవధానాలు. వంటివి ఈ మహాసభల్లో ఉంటాయి.
సన్నాహకాలు :
దేశ.. విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి.. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అమెరికా.. యూరప్.. గల్ఫ్ దేశాలతో పాటు మారిషస్.. సింగపూర్.. మలేషియా లాంటి దేశాల్లోని తెలుగువారి కోసం కూడా ఈ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ నలుమూలల్లో మనవాళ్లు నివసించే ప్రాంతాల్లో.. ముఖ్య పట్టణాల్లో ఈ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ.. జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నారు.
ఎవరి ఆధ్వర్యంలో? :
తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుండగా.. అధికార భాషా సంఘం.. సాంస్కృతిక శాఖ.. తెలుగు విశ్వ విద్యాలయం.. గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలక భూమిక నిర్వహిస్తున్నాయి. మహాసభలకు వేదికైన హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నగర ప్రధాన కూడళ్లలో కటౌట్లు.. ఆహ్వాన ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్య అతిథులెవరు? :
తెలంగాణ సాహితీ సౌరభాన్ని ప్రపంచానికి తెలిపేలా నిర్వహిస్తున్న ఈ మహాసభల ప్రారంభ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. అదేవిధంగా ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం తెలంగాణ సాహిత్య అకాడమీతో పాటు సంగీత.. నాటక అకాడమీ.. లలిత కళా అకాడమీ.. జానపద అకాడమీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది.
హాజరైనవారికేం చూపిస్తారు? :
మహాసభలకు వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. అతిథులకు తెలంగాణను పరిచయం చేయడం కోసం తెలంగాణ దర్శిని పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేస్తారు. తెలంగాణ జీవన చిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరించే కళారూపాలు ప్రదర్శిస్తారు.
సాహితీవేత్తల కృషి :
తెలంగాణకు సాహిత్యం లేదని మభ్యపెట్టి ఇన్నాళ్లు మనల్ని మోసం చేశారు. కానీ ఎవరిది అసలైన తెలుగో ప్రాచీన హోదా కేసు విషయంలోనే స్పష్టమైంది. మన పంపన.. పాల్కూరికి సోమనాథులు రాసిన ఎన్నో అపురూప కావ్యాలు.. పద్యాలు శాసనాలుగా ఆధారాలతో ఉన్నాయి. ప్రజల భాషగా ఆనాడూ.. ఈనాడు మన తెలుగు కొనసాగుతున్నది. అచ్చ తెలుగు పదాలకు మన సాహితీకారులు పెద్దన్నల్లాంటివారు. వారిఖ్యాతిని చాటిచెప్తూనే భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునర్విర్వచనం.. పునర్నిర్మాణం.. పునరుజ్జీవనం.. పునర్‌శోధనలపై దృష్టిసాధించాల్సిన ఆవశ్యకత ఉన్నదని మహాసభల ద్వారా తెలియజేస్తాం.
-మామిడి హరికృష్ణ, భాషా-సాంస్కృతికశాఖ డైరెక్టర్
ప్రజల భాషా పరిమళాలు :
తెలంగాణ సాహితీ వికాసాలను పునర్ పరిచయం చేసి వారి కీర్తిని ఘనంగా చాటాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఈ సభల నిర్వహణకు ఆదేశించారు. పసితనం నుంచే పద్యాలను ప్రేమించినవాడు ఆయన. రాజకీయోప్యాసానికి సాహిత్య పరిమళం అద్దిన గొప్పవ్యక్తి సీఎం. భాషా సాహిత్యాల పట్ల ప్రకటిస్తున్న గొప్ప గౌరవంగా వీటిని చూడొచ్చు. తెలుగు భాష పరిణామం.. ఆధునిక అవసరాలకు తగిన విధంగా తెలుగు భాషాభివృద్ధి మొదలైనవాటి గురించి చర్చలు జరుగుతాయి. తెలంగాణ సాహిత్య వైభవం సభల్లో సాక్షాత్కరిస్తుంది. ప్రజల భాషా పరిమళాలు వెదజల్లబడుతాయి.
-దేశపతి శ్రీనివాస్, సీఎంఓ ఓఎస్డీ
సాహిత్యపు గొప్పదనం :
తెలంగాణలో జరిగిన భాషా సాహిత్యాల గొప్పదనం చాటడమే ఉద్దేశంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిద్దామని ప్రభుత్వం.. సీఎం నిర్ణయం తీసుకొని మాకు వాటి బాధ్యతలు అప్పగించారు. సాహిత్య సదస్సులు.. మౌఖిక సాహిత్యం.. చర్చా గోష్టులు ఉంటాయి. దేశ విదేశాల నుంచి వందలాది మంది సాహిత్యాభిలాషులు వస్తున్నారు. వారందరికీ మన తెలగు భాష గొప్పదనమేంటో చూపిద్దాం.
-నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు
వేదికలు ఏవేవి? :
-హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక.
-రవీంద్రభారతి.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం..
-తెలుగు యూనివర్సిటీ లలిత కళాతోరణం నిజాం కాలేజీ గ్రౌండ్స్ వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కో వేదికన ఒక్కో రకమైన కార్యక్రమం ఉంటుంది. జానపద కళా ప్రదర్శనలు.. శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు.. నాటకాలు.. నాట్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565