వివాహం అంటే- ప్రకృతి, పురుషుడి సంగమం. ఆ వివాహమే ఆదర్శ దాంపత్యానికి మూలం. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారి అర్ధనారీశ్వర తత్వం లోకమంతటికీ అనుసరణీయం. ప్రకృతిలో పరతత్వం ఉంది. అదే రీతిలో ఆ కల్యాణ దంపతుల జీవన ప్రభ అంతటా ప్రసరించింది. పురుష ప్రయత్నానికి స్త్రీశక్తి జోడు కావాలన్న దివ్యోపదేశాన్ని ప్రపంచానికి అందజేసింది.
స్త్రీపురుష సంగమమే సంసార సాగరం. దాన్ని దాటడానికి వారు పరతత్వం అనే నావ సహాయాన్ని పొందాలి. లోకంలో ఏ జీవీ ఒంటరిగా బతకలేదు. ఏకాకిగా మనుగడ సాగించలేదు. తనకు తోడు కావాలని, ఓ నీడపట్టున ఉండాలని ప్రతి ప్రాణీ కోరుకుంటుంది. ముఖ్యంగా మనిషికి తోడు, నీడ అత్యవసరాలు. అవి లేకుంటే ‘ఈ జీవితం ఇక అనవసరం’ అనిపించే స్థితి వస్తుంది. అందుకే ‘మానవుడు సంఘజీవి’ అంటారు.
నాటి మానవుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూశాడు. ‘అ’ అనే శబ్దాన్ని తన నోట పలికించాడు. ఆ ఫలితాన్ని గమనించి ‘ఉ’ అంటూ తల వూపాడు. అప్పటికీ అతడికి సృష్టిమూలం అంతుపట్టలేదు. ‘మ్’ అంటూ, తెరచిన నోటిని వెంటనే మూసుకున్నాడు. అప్పుడు వెలువడిన అకార ఉకార మకార శబ్దతరంగాలే ఓంకార రూప సాగరమయ్యాయి. అద్భుత శక్తి ఈ జగత్ చక్రానికి మూలకారణం అనే ఆలోచన మనిషిలో అంకురించింది. ఆ శక్తికి లోబడి జీవించాలని అనిపించింది.
మనిషి ఎంతో ఎత్తుకు ఎదగగల అవకాశాన్ని దివ్యశక్తి అనుగ్రహించింది. అతడి ప్రయత్నానికి దైవానుగ్రహం దోహదపడింది. అతణ్ని అదే ముందుకు నడిపించింది. ఏకత్వంలో అనేకత్వం, అనేకంలో ఏకత్వం చూడగల శక్తి మానవుడికి పెరిగింది. అందువల్ల అతడు ఆధ్యాత్మిక శిఖరం అధిరోహించగల శక్తిసంపన్నుడయ్యాడు.
వియోగం వల్ల విషాదం తప్పదు. విభజన కారణంగా, భక్తి విరక్తి వైపు మొగ్గు చూపక మానదు. విషాదంలో మునిగిన అర్జునుడికి భగవానుడు అండగా నిలిచాడు. పద్దెనిమిది యోగాల్నీ ప్రవచించి, ఆ నరుడి ద్వారా నరజాతి సమస్తానికీ మార్గదర్శనం చేయించాడు. ఎవరి యోగ్యతకు తగిన యోగ మార్గాన్ని వారు ఆశ్రయించే వెసులుబాటు అనుగ్రహించాడు. జ్ఞానులు, భక్తులు, ఇతర కర్మజీవులు వారి వారి దారుల్లో దివ్యత్వంతో సాగడమే- భగవానుడి కోరిక. కర్మ ద్వారా క్రమ ముక్తి పొందగల అవకాశం కర్మయోగులకు దండిగా ఉంది. అందుకే గీతోపదేశానికి ‘యోగ ప్రస్థానం’ అనే పేరు సార్థక నామధేయంగా మారింది.
వియోగం వల్ల విషాదం, విభజన వల్ల విభక్తి కలుగుతాయి. అప్పుడు నరుడు ఏం చేయాలో, చేయకూడదో కృష్ణపరమాత్మ స్పష్టపరిచాడు. చిరునవ్వును గుర్తుచేసుకోవాలని అర్జునుడికి బోధించాడు. అన్నింటినీ సోదాహరణంగా ప్రదర్శించాడు. గీతలో రెండో అధ్యాయం- సాంఖ్య యోగం. ఆకలి గలవాడికి అన్నం పెట్టాలి గాని, దాని గురించి అతడికి వర్ణించడం వల్ల ప్రయోజనం లేదు. అలా గీతాచార్యుడు అనడంలో కర్మయోగ ప్రస్తావన మెండుగా కనిపిస్తుంది. మూడోది కర్మయోగం. నాలుగోది జ్ఞాన, కర్మ, సన్యాస యోగం. జ్ఞానానికి, సన్యాసానికి సేతుబంధం కర్మ. దాని గురించి మొదటి శ్లోకం వివరిస్తుంది. కర్మల్ని వీడటం అంత తేలిక కాదు. మానవుడు కర్తృత్వ భావన వదలాలి. అందుకే ఆరో శ్లోకం ‘యోగ యుక్తో మునీ బ్రహ్మ’ అంటూ వంతపాడటం మరో విశేషం. ఆరోది ఆత్మ సంయమన అధ్యాయం. కర్మఫలం ఆశించకుండా కర్తవ్యం ఆచరించాలని అది చెబుతుంది.
ఆ ఆరు అధ్యాయాల విపులీకరణలే మిగతా పన్నెండు అధ్యాయాల్నీ అద్దంలో చూపుతున్నాయి. ఏ పని చేయడానికైనా ముందు దైవారాధన అనూచానంగా వస్తున్న ఆచారం. ఫలితాన్ని స్వామికి సమర్పించాలి. అనంతరం చేయాల్సిన పనిని మనసా వాచా కర్మణా సాంగోపాంగంగా చేయాలని చెప్పడమే కర్మయోగ ప్రస్థానం! దైవానుగ్రహం వల్ల మనిషి ఆలోచన సరైన దోవలో సాగుతుంది. పని నుంచి తగినంత ఫలితమిస్తుంది. అలాంటి కర్మజీవికి ఆ దైవమే తోడు, నీడ! - ఉప్పు రాఘవేంద్రరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565