MohanPublications Print Books Online store clik Here Devullu.com

నటరాజస్వామి ఆనందతాండవ క్షేత్రం చిదంబరం_ChidambaramNatarajSwamy

నటరాజస్వామి ఆనందతాండవ క్షేత్రం  చిదంబరం_ChidambaramNatarajSwamy
నటరాజస్వామి
ఆనందతాండవ క్షేత్రం 
చిదంబరం

పరమశివుడు నటరాజస్వామిగా ఆనంద తాండవం చేసిన మహాపుణ్యక్షేత్రం చిదంబరం. తమిళనాడులోని చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా యుగయుగాల నుంచి ప్రసిద్ధిపొందింది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. 50 ఎకరాలుగా పైగా ఉన్న సువిశాల స్థలంలో విస్తరించివున్న ఈ క్షేత్రంలో శివ, కేశవ మందిరాలు ఉండటం విశేషం. వైష్ణవులకు శ్రీరంగం ఎంత పవిత్రమో.. శైవులకు చిదంబరం అంత పవిత్రమైన మహాక్షేత్రమని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. పంచభూత ఆలయాల్లోని శ్రీకాళహస్తి, కంచి, చిదంబరం ఒకే అక్షాంశంపై నిర్మితమై ఉండటం విశేషం.

నటరాజస్వామి..
ఇక్కడ ఈశ్వరుడు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. నాట్యభంగిమలో ఉన్న స్వామి పాదం కింద అజ్ఞానం రాక్షసుడి రూపంలో ఉంటుంది.చేతిలో నిప్పు దుష్టశక్తులను నాశనం చేస్తుందని అర్థం. అలాగే మరో హస్తం సర్వజగత్తును పరిరక్షించేవాడని సూచిస్తుంది. ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుంది. పరమశివుడు చిద్విలాస నాట్యాన్ని వీక్షించాలని ఆదిశేషువు ఆశిస్తాడు. అంత మహావిష్ణువు యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి భూమిపైకి పొమ్మని ఆజ్ఞాపించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

స్థల పురాణం
‘చిత్‌’ అంటే మనస్సు. అంబరం అంటే ఆకాశం అని అర్థం. ఎన్నో యుగాలకు ముందు పరమేశ్వరుడు ఇక్కడి తిలై వనాల్లో విహరించేవాడు. శివుడు భిక్షువు రూపంలో తిరుగుతుంటే మోహిని అవతారంలోని విష్ణుమూర్తి ఆయనను అనుసరిస్తాడు. పార్వతీనాథుని ప్రకాశవంతమైన తేజస్సుకు మునుల సతీమణులు ఆశ్చర్యానికి లోనవుతారు. దీంతో ఆగ్రహించిన మునులు సర్పాలను వదులుతారు. లయకారకుడైన శివుడు వాటిని మెడకు, నడుముకు కట్టుకుంటాడు. ఈ సంఘటనతో మరింత ఆగ్రహించిన మునులు ఒక రాక్షసుడిని పంపుతారు. శివుడు ఆ రాక్షసుడి వీపు మీద కాలు మోపి కదలకుండా చేస్తాడు. అనంతరం ఆనందతాండవం చేస్తాడు. దీంతో భగవంతుని నిజ స్వరూపాన్ని గ్రహించిన మునులు ఆయనను శరణు వేడుకుంటారు.

చిదంబర రహస్యమంటే..
ఈ క్షేత్రంలో స్వామి విగ్రహ, ఆకార రహిత ఆకాశ, స్ఫటిక లింగ రూపాల్లో ఉంటారు. అయితే, విగ్రహాన్ని మాత్రమే చూడగలం గానీ ఇతర రూపాలను చూడలేము. చిత్‌సభానాయక మండపంలోని స్వామివారు ఆకాశ రూపంలో కంటికి కనిపించకుండా ఉంటారు. పురోహితులు మందిరంలోని తెరను తొలగించి హారతిని ఇస్తారు. భగవంతుడు ఆదియును అంతమును లేనివాడు అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఉండబోదు. మన అజ్ఞానాన్ని తొలగించుకొని భగవంతున్ని సన్నిధిని వీక్షించడంతో దివ్యానుభూతి కలుగుతుంది.

గోవిందరాజస్వామి సన్నిధి
ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోవిందరాజస్వామి మందిరం ఉంది. శివ,కేశవ మందిరాలు ఒకే ప్రాంగణంలో ఉండటం అరుదైన విశేషం. హరి, హరులకు ఎలాంటి భేదాలు లేవని ఈ క్షేత్రం నిరూపిస్తోంది. 108 దివ్యదేశాల్లో ఒకటిగా గోవిందరాజస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. కులశేఖర ఆళ్వారు తన రచనల్లో ఈ ఆలయాన్ని ప్రస్తావించారు.

మానవదేహానికి ప్రతీక..
ఆలయం మానవ దేహానికి ప్రతీకగా ఉంటుందని పెద్దలు చెబుతారు. నమఃశివాయ మంత్రంలో 21,600 బంగారు పలకలను వినియోగించారు. ఒక మనిషి ప్రతిరోజూ తీసుకునే శ్వాస ప్రక్రియతో ఈ సంఖ్య సరిపోతుంది. అలాగే చిత్‌సభ (పొన్నాంబళం)లో 72 వేల మేకులు వాడారు. ఇది మన దేహంలోని నరాల సంఖ్య అని చెప్పవచ్చు. ఇలా అనేక విశేషాల సమాహారంతో కూడిన చిదంబర క్షేత్ర సందర్శన మనకు మంచి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.
ఎలా చేరుకోవాలంటే.. 

* తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చిదంబరం ఉంది.
* చెన్నై ఎగ్మూర్‌- తంజావూర్‌ రైలు మార్గంలో చిదంబరం చేరుకోవచ్చు.
* పుదుచ్చేరి విమానాశ్రయంలో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా చిదంబరం వెళ్లొచ్చు.
* దేశంలోని పలు నగరాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రానికి చేరుకునే సదుపాయముంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list