MohanPublications Print Books Online store clik Here Devullu.com

గీతాజయంతి_GeethaJayanti

మార్గశుద్ధ ఏకాదశి, 
గీతాజయంతి....


ఈ ఏకాదశిని ‘మోక్షద’ ఏకాదశి అని పిలుస్తున్నాము. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది.

ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఇది గీతాజయంతి. ‘మోక్షద’ ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది.


వైఖానసుడు అన్నరాజు తన తండ్రి ‘నరమం’లో బాధలను పొందుతున్నట్లు కల గంటాడు. రుషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట.

ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన – విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి.

ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి. ద్వాదశినాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణచేయాలి.

ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని!
భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత!! అని మంత్రము ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.కర్మయోగం గీతాసారం
మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, సంశయంలో మునిగినప్పుడు, ఘర్షణ పడుతున్నప్పుడు, నైరాశ్యంలోకి వెళ్లినప్పుడు... ఇలా వెళ్లు - అని దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తుల్నే మనం గురువులుగా పిలుస్తాం. అచ్చంగా ఇలాంటి లక్షణాలన్నీ భగవద్గీతలోనూ ఉన్నాయి. విషయమేదైనా సందర్భమేదైనా ఒక సమస్యకు ఆత్మసంతృప్తి కలిగేలా చక్కటి పరిష్కారమివ్వగల సత్తా ఈ గ్రంథానికి ఉంది. అందుకే ఏ ఒక్క మనిషికో బృందానికో కాదు ఒక జాతికే దిశానిర్దేశం చేయగల మహోన్నత గ్రంథంగా శోభిల్లుతోంది. (నవంబరు 30 గీతా జయంతి)

భారతం ఓ అద్భుత ఇతిహాసం. అందులోని పాత్రలూ ఒకదానికొకటి సరితూచలేనంత మహోన్నతమైనవి. బుద్ధిపరంగా, బలం పరంగా, జ్ఞానం పరంగా ఎందరో ధీరులు ఇందులో మనకు తారసపడతారు. అయితే వారిలోని గుణదోష భేదాల కారణంగా కొందరు కౌరవుల పక్షానా మరికొందరు పాండవుల పక్షానా నిలబడ్డారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఆ కావ్యంలోని అద్భుత ఘట్టం. ఒక పక్క పాండవులూ, మరో పక్క కౌరవులూ... అక్షౌహిణుల కొద్దీ సైన్యం... గుర్రపుడెక్కల చప్పుళ్లూ... మదగజాల ఘీంకారాల మధ్య గంభీరవాతావరణం అది. అవతలి పక్క తనకు గురువులూ, మిత్రులూ, మేనమామలూ, మనవలనూ చూసిన అర్జునుడి మనసు వాళ్లతో యుద్ధం చేయడానికి అంగీకరించదు. తనను చంపడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిసినా సరే, అంతమందినీ ఎదుర్కొనగల సమర్థుడైనా సరే... పాశాన్ని వీడలేకపోతాడు. అందుకే,
న కాంక్షే విజయం కృష్ణ 
న చ రాజ్యం సుఖాని చ 
కిం నో రాజ్యేన గోవిన్ద 
కిం భోగైర్జీవితేన వా... అంటాడు.
కృష్ణా... ఆ యుద్ధంలో కలిగే విజయం కానీ, రాజ్యం కానీ, దాని ద్వారా వచ్చే సుఖాల పట్ల కానీ నాకు కోరికలేదు... అలాంటి రాజ్యం, ఆ భోగ జీవితం ఎందుకు... అనేది ఆ సమయంలో అర్జునుడి మాట. రక్త సంబంధీకులను చంపడమెలా అన్నది పార్థుడి ధర్మసంకటం. ఆ సందర్భంలో యుద్ధం చేయవలసిన ఆవశ్యకతను ధర్మబద్ధంగా చెబుతాడు శ్రీకృష్ణుడు. ఇందులో అర్జునుడికి వచ్చిన అనేకానేక అనుమానాలూ, దానికి శ్రీకృష్ణుడు చెప్పిన వివరణలూ మనం నిత్యజీవితంలో అనుసరించదగ్గ ధర్మబద్ధమైన మార్గాన్ని బోధించేవిగా ఉంటాయి. ఒక్కో సంకటం ఏర్పడ్డప్పుడు దానికి పరిష్కారాలు వెతుక్కునేందుకు దోహదపడతాయి.

గీతోపనిషత్తు 
నిజానికి గీత మహాభారత ఇతిహాసంలో ఉంది. కానీ దాన్ని గీతోపనిషత్తుగా పిలుస్తారు. ఇతిహాసాన్ని ఎవరమైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు, అవి అలా చదువుకున్నా అర్థమవుతాయి. కానీ, ఉపనిషత్తులు ఎవరికి వారు చదువుకోలేరు. వాటిని అర్థం చేసుకునేందుకు గురువు సహాయం తీసుకోవాల్సిందే. గురువు అందులోని విషయాల్ని తాను అర్థం చేసుకుని, ఆచరించి ఆయా విషయాలకు ఉదాహరణలను జోడిస్తూ శిష్యుడికి అర్థమయ్యేలా బోధిస్తాడు. అలాంటి విషయాలు ఆచరణీయాలుగా మారతాయి. గీతను చెప్పడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువుగా మారాడు. ఆయన చెప్పిన ఆ వాక్యాలను ఎందరో మహనీయులూ, గురువులూ పారాయణం చేశారు. అందులోనే అద్వైతాన్నీ, ద్వైతాన్నీ, విశిష్టాద్వైతాన్నీ దర్శించుకున్నారు. శంకారాచార్యుల వారు భజగోవిందంలో గీత గొప్పదనాన్ని చెబుతారు. భగవద్గీతలోని ఒక్కశ్లోక భావాన్ని అర్థం చేసుకుని దాన్ని మననం చేసుకుంటూ, ఆచరణలో పెడుతూ జీవిస్తే చాలు... అటువంటి వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. మరణ సమయంలో ఆ జీవికి యమదూతలతో చర్చే అవసరం ఉండదు అంటారు శంకరులు. ఎంతటి మహత్తర గ్రంథం కాకపోతే ఏక శ్లోకం ప్రాణికోటికి ఉత్కృష్టమైన మోక్షమార్గాన్ని చూపగలదు! అలాగని గీతాచార్యులు సాధారణ మానవులకు అర్థం కాని భాషలో, రుషితుల్యులకు మాత్రమే సాధ్యమయ్యే కర్మలు చేయమంటూ నీతివాక్యాల్ని వల్లించడు. అరటిపండు వలిచి పెట్టినట్టు చేయాల్సిన పనిని కళ్లకు కడతారు. ఎంతో లోతైన సముద్రం మీదా గాలిబుడగలా తేలుతూ ప్రయాణం చేయడమెలాగో విశదీకరిస్తాడు. పనిచేయమంటాడు...ఎంతలా అంటే... మనకు మనమే యజమానులం అన్నట్టూ... ఆ పని చేయడంలో అంతకు మించిన నిష్ణాతులెవ్వరూ ప్రపంచంలో లేరు అన్నట్టూ. అయితే, ఫలితాన్ని మాత్రం తనకే వదిలేయమంటాడు.
కర్మణ్యే వాధికారస్తే 
మాఫలేషు కదాచన 
మాకర్మఫలహేతుర్భూః 
మాతే సంగోస్త్వకర్మణి
కర్మ చేయడానికే నీకు అర్హత ఉంది. కానీ, ఆ కర్మ ఫలం మీద నీకు ఎలాంటి అధికారమూ లేదు. కర్మలకు నువ్వే హేతువువని ఎప్పుడూ భావించకు. ధర్మాన్ని నిర్వహించడం పట్ల ఎప్పుడూ అనాసక్తుడవుగా ఉండకు... అని దీని అర్థం. మనిషికి మనశ్శాంతిని కలిగించే గొప్ప శ్లోకం ఇది. తనకు సంక్రమించిన పనిపట్ల ప్రేమతో తప్ప దాని మీద ఆశతో చేసే పని మనిషిని స్థితప్రజ్ఞుడిగా ఉండనీయదు మరి! ఆ సంతోషానికీ దుఃఖానికీ దూరంగా భగవంతుడి యందు మనసుని లగ్నం చేసి జ్ఞానంతో జీవితాన్ని గడపమని గీతాచార్యులు అర్జునుడి పేరిట మానవాళికి బోధించింది ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే!


భగవద్గీత మహాత్మ్యం

మార్గశిర శుద్ధ ఏకాదశి - శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకొని సకల మానవాళికి ‘గీత’ బోధించిన రోజు. ఎవరైనా సరే, తాము అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే అదృష్టమనీ, అన్నింటిలోనూ అపజయాలు ఎదురవుతుంటే తలరాత బాగోలేదని అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నైజం. అయితే మన తలరాత ఎక్కడో లేదు, ‘గీత’లోనే ఉంది. అదే భగవద్గీత. అది తెలుసుకుంటే ఎవరూ ఏ ఆందోళనకూ గురికావలసిన అవసరం ఉండదు.

గీత అంధకారంలో ఉన్నప్పుడు ఒక వెలుగురేఖ కోసం వెతుకుతాం. దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఒడ్డుకు చేర్చగల ఒక అమృతహస్తం కోసం ఎదురుచూస్తాం. సరిగ్గా అలాంటి సమయంలోనే భగవద్గీత అవసరం అవుతుంది. గీతలో.. నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు. గీతాశ్రవణ పఠనలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను అని శ్రీమహావిష్ణువు అర్జునునితో చెప్తున్న దానిని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. ఒక్కమాటలో... భగవద్గీత... మనందరికీ బతుకుబాట.

ఉపనిషత్తుల సారాంశం: సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. ఉపనిషత్తులంటే సర్వకాల సర్వజనులకు వర్తించేవి అని అర్థం. మనిషికి కలిగే ఎటువంటి సందేహానికైనా వాటిలో సమాధానం లభిస్తుంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధసమయంలో పార్థుడికి కలిగిన రకరకాల సందేహాలను తీర్చేందుకు బోధించిన గీత సాక్షాత్తూ భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతకు 18 అధ్యాయాలున్నట్లే 18 పేర్లున్నాయి. అవి 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12. చిదానంద 13. భవఘ్ని 14. భయనాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞానమంజరి.

ఏం చదువుకున్న తర్వాత ఇంకా చదవడానికి మిగిలే ఉంటుందో - అది విజ్ఞానం! ఏం తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో - అది ఆధ్యాత్మ జ్ఞానం!

ఆధ్యాత్మ జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ స్వార్థాన్నే ప్రేరేపిస్తాయి. మనదేశం ఈ స్వార్థంలోనే కొట్టుకుపోవడానికి కారణం - ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో ఆధ్యాత్మ జ్ఞాన బోధన లేకపోవడమే!

ఈ జ్ఞానం అవసరాన్ని గుర్తించడం వల్లే, న్యూజెర్సీ (యూఎస్‌ఏ)లోని ‘సెటన్ హాల్ యూనివర్సిటీ’ లో చేరే ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా భగవద్గీత చదవాలనే నిబంధన పెడుతూ, ఈ కోర్సుకు ‘ద జర్నీ ఆఫ్ ట్రాన్స్‌ఫామేషన్’ అని పేరుపెట్టారు. మరి ‘గీత’ పుట్టిన భారతదేశంలో మాత్రం ‘సెక్యులర్’ పేరుతో దీన్ని దగ్గరికే రానివ్వకపోవడం దురదృష్టకరం. పక్కింట్లో ‘గీత’ వినిపిస్తుంటే ఎవరో టపా కట్టేసుంటారనే స్థితి నుంచి, ‘తెల్లారింది... పక్కింటివాళ్లు లేచి పనులు చేసుకుంటున్నారు’ అనే స్థితికి సంకేతంగా ఒక ఉద్యమ స్థాయిలో గీతా ప్రచారం జరగవలసి ఉంది!

అందుకే గీత నేర్చుకుందాం. రాత మార్చుకుందాం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం. భగవద్గీత... ఉత్తమ జీవన విధాన మార్గం! మానవులకు ఆశాదీపం! సాధకులకు కల్పవృక్షం!

మనలోని కోరికలను, బాధలను నశింప చేయడానికి, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగానూ, ఔషధ గుళికగానూ వాడుకోవచ్చు. కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవద్గీతను పఠించాలి లేదా వినాలి.

నిత్యం ఇంద్రియాల ద్వారా తెలిసీ తెలియక చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల నశించిపోతాయని గీతా మాహాత్మ్యం తెలుపుతోంది. గీతామకరందాన్ని సేవించడమేకాదు, అందులోని మంచిని ఆచరిద్దాం. కష్టాల కడలినుంచి సుఖాల తీరానికి చేరుదాం. ఈ గీతాజయంతి నాడైనా కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం.

భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు.

భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

No comments:

Post a comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list