అగ్నిహోత్ర స్వరూపమే గోవు
గోష్టాష్టమి
కార్తిక మాసంలో ఎంతో ప్రశస్తమైనవి రెండు తిథులు. ఒకటి శుక్లపక్షంలో వచ్చే అష్టమి. రెండోది కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశి (నవంబరు 15వ తేదీ). అష్టమి నాడు జరిగే పండుగనుగోష్టాష్టమి అంటారు. ద్వాదశి నాడు జరిగే పండుగను గోవత్స పూజ అంటారు. ఈ రెండు రోజులూ గోవుకు పూజ తప్ప ఇక ఏ పూజ లేదు. శాస్త్రప్రకారం గోపూజ పశుపూజ కాదు. పరదేవతకు పూజచేయటమే. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి నుంచే అన్ని ప్రాణులూ వచ్చాయి.
కానీ, ఒక్క గోవు మాత్రం చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలోనిది కాదు. దీని వెనుక ఒక కథ ఉంది. ఒకానొక్కప్పుడు ప్రజాపతి వసువులందరిని పిలిచి- ‘‘ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా లేనటువంటి అద్భుతమైన ఒక ప్రాణిని సృజించండి’’ అని ఆజ్ఞాపించాడు. వసువులందరూ తమకు అంత గొప్ప ప్రాణిని సృష్టించే శక్తి లేదన్నారు. అప్పుడు ప్రజాపతి- ‘‘మీరు నూరు సంవత్సరాలు ఎడతెరపి లేకుండా హోమం చేయండి. అప్పుడు మీకు అపరిమితమైన శక్తి లభిస్తుంది. దానితో ఒక ప్రాణిని సృష్టించండి’’ అని సలహా ఇచ్చాడు.
అప్పుడా అష్టవసువులు నూరేళ్లు హోమం చేసి.. దాని ద్వారా వచ్చిన తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు. అందుకే ఆ గోవుకు విశేషమైన శక్తులున్నాయి. వేదం కూడా గోవును- ‘‘గౌరగ్నిహోత్రః’’ అని పేర్కొంది. అంటే అగ్నిహోత్ర స్వరూపమే ఆవు అని అర్థం. ప్రతి రోజు హోమం చేసి, యజ్ఞం చేసి, పూర్ణాహుతి చేస్తే ఎంత పుణ్యమొస్తుందో- గోపూజ వలన కూడా అంతే పుణ్యమొస్తుంది. అందుకే ద్వాదశి నాడు ఽధిమి సహిత గోపూజ తప్పకుండా చేయాలి. అంటే- దూడతో ఉన్న ఆవును ఎంపిక చేసుకొని దానికి మేత తినిపించి.. ఆ తర్వాత పూజ చేయాలి.
గోవును మన పూర్వీకులు ఎంతో ఆరాధించారు. అభిమానించారు. శృంగేరీ పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరభారతి స్వామి వారికి గోవులంటే ఎంతో ప్రీతి. స్వామి ఒక రోజు శారదాలయంలోకి పూజ చేయటానికి వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి గుడికి అడ్డంగా పడుక్కొంది. ఆయనతోపాటు వస్తున్న పీఠపరివారం పరిగెత్తుకొని వెళ్లి ఆవును లేపటానికి ప్రయత్నించారు. అప్పుడు స్వామి వారు- ‘‘శారద నా కోసం గుడి బయటకు వచ్చింది. అంతకన్నా అదృష్టం ఏముంది?‘‘ అని అక్కడే ఒక పీట వేసుకొని ఆ గోవుకు శారద నామాలతో పూజ చేసి గుడికి వెళ్లకుండా వెనక్కి తిరిగారు. గోవు అంత గొప్పది. - చాగంటి కోటేశ్వరరావు శర్మ
Gomata gurinchi emi teliyani maku eevidamga teliyachestunnanduku dhanyavadamulu
ReplyDelete