తాపత్రయంతోనే తంటా!
రకరకాల సుఖాల గురించి తాపత్రయ పడిపోతూ లక్షల రూపాయలు ఖర్చుపెడుతూ వ్యాధుల పాలవుతున్న యువతరాన్ని కాపాడటానికి శ్రీకృష్ణపర మాత్ముడు
‘భగవద్గీత’లో(5:22) ‘ఒక శ్లోకం చెప్పాడు.
ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ యేవ తే
ఆద్యంత వంతః కౌంతేయ న తేషు రమతే బుధః
శరీరస్పర్శల వల్ల కలిగే భోగాలైతే ఎమున్నాయో అవి దుఃఖాలకు కారణం. ఆధునిక యుగం సంస్కరించ బడింది అని అంటున్నాం. కానీ ఈ రోజుల్లోనే అత్యాచారాలు పెరిగాయి. ఇంతకు ముందు ఇన్ని అరాచకాలు లేవు. స్పర్శ వల్ల కలిగే సుఖం ఎంత సమయం ఉంటుంది? స్త్రీని పురుషుడు ముట్టుకోవడం వల్ల గానీ, పురుషుణ్ణి స్త్రీ ముట్టుకోవడం వల్ల గానీ లభించే సౌఖ్యం, ఆనందం నిజంగా హృదయానికి పట్టేది ఎంత? ఇది ఆలోచించి చూస్తే ఈ సౌఖ్యాన్ని వెంటనే మానేస్తాం. శరీరాల ఒరిపిడి వల్ల కలిగే సుఖం కోసం సంసారాలు నాశనం, సామ్రాజ్యాలు నాశనం! అనేక రాజకీయాలు, పదవుల మధ్య యుద్ధాలు, చరిత్రలో కొన్ని భయంకర యుద్ధాలు ఈ సౌఖ్యం గురించే జరిగాయి. రావణాసరుడికి ఆ కాంక్ష లేకపోతే ఆ యుద్ధం ఎక్కడిది? సైంధవుడికి ఆ కాంక్ష లేకపోతే భారతంలో అన్ని ఘట్టాలుంటాయా? ఇవ్వాళ్టికీ ఎంత మంది లేరు అలాంటి వాళ్లు! టీవీల్లో, పత్రికల్లో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడవాళ్ల మనసుల్లో, మగవాళ్ల మనసుల్లో భయంకరమైన ఆలోచనలు ప్రవేశించినపుడు ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ ఆలోచనలే దుఃఖానికి మూలకారణం. అందుకే తిరుపతి వేంకటకవులు ‘ఒక నాటి సుఖం.. ఒక ఏటి దుఃఖం’ అన్నారు.
ఆనంద స్వరూపమైన సుఖాన్ని మనం పొందాలి అంటే ఆ సుఖానికి ఆది ఉండకూడదు, అంతం ఉండకూడదు. కానీ మనం పొందుతున్న, పొందామనుకుంటున్న, పొందాలనుకుంటున్న శారీరక సౌఖ్యాలకు మొదలు ఉంది, చివర ఉంది. అలా ఆది, అంతం ఉన్నదేదీ నిజమైన సుఖం కాదు! ఎందుకంటే అది అంతం కాగానే మళ్లీ కావాలని అనిపిస్తుంది. అది మళ్లీ దొరికే వరకు మధ్యలోనిని అంతా దుఃఖమే. సుఖం అనుభవించిన క్షణాలను లెక్కిస్తే అవి చాలా తక్కువ. కానీ ఆ సుఖం కోసం చేసిన ప్రయత్నం, పడిన బాధ, అనుభవించిన అవమానాలు, పడిన నిందలు, కోల్పోయిన డబ్బు, కోల్పోయిన పరువు, మనశ్శాంతి...ఇవన్నీ చాలా ఎక్కువ. అందుచేత కాస్త కావ్యాలు చదివిన వాడు, తత్త్వజ్ఞానం ఉన్న వాడెవడైనా ఇలాంటి శారీరక సౌఖ్యాల కోసం తాపత్రయపడడు. దానికే ధూర్జటి మహాకవి నిజాయితీగా తనకున్న లోపమేదో ఒప్పుకుని వద్దయ్యా! అన్నాడు.
‘కాయల్గాచె వధూ నఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్
రాయన్ రాపడే రొమ్ము, మన్మథవిహారక్లేశ విభ్రాంతిచే
బ్రాయంబాయెను, బట్టగట్టె దల, చెప్పన్ రోత సంసారమే
చేయంజాల విరక్తు జేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా!’
‘అనేక రకాల స్త్రీ భోగాలతో శరీరమంతా కాయలు కాసిందయ్యా! అది కాదని ఇది, ఇది కాదని అది అనుభవించి నాకు విసుగొచ్చేసిందయ్యా! వయస్సు కూడా అయిపోయింది. ఇప్పుడెందుకు ఈ స్త్రీ వాంఛలు’ అని నిజాయతీగా ఒప్పుకున్నాడు. మానవుడి యవ్వనం అంతా దీనికే సరిపోయింది. వృద్ధాప్యంలోకి వచ్చాక చేసిన పాపాలన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు శివరాత్రినాడు దీపం పెట్టాలని, ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠద్వారం గుండా దర్శనం చేసుకోవాలని చూస్తాడు. అలా చేస్తే పాపాలన్నీ ప్రాయశ్చితం అవుతాయని అనుకుంటాడు. కానీ అది తప్పు. మన సత్‌ప్రవర్తన, మన ధర్మమే మనల్ని కాపాడుతుంది. అంతే తప్ప దీపాలు పెడితే పాపాలు పోతాయనుకోవడం పొరపాటు. స్నానాల వల్ల, దీపాల వల్ల ఏదీ పోదు! చేసిన కర్మ అనుభవించి తీరాల్సిందే. అది ఈ లోకంలోనైనా, పైలోకంలోనైనా, వచ్చే జన్మలోనైనా తప్పదు. అందుకే మన ధూర్జటి పద్యాన్ని, భగవద్గీత శ్లోకాన్ని జోడించుకుని అటువంటి దుర్వసనాల జోలికి వెళ్లకుండా ఉందాం!
మన తమ్ముడో, అన్నో కామవాంఛలకు లొంగిపోయి ఆస్తులు నాశనం చేసేస్తుంటే, కుటుంబ పరువు నాశనం చేసేస్తుంటే వారిని సమర్థించాలా? వద్దా? అప్పుడు అది వ్యక్తిగతం అయితే వేరు. సమాజగతం అయితే వేరు. అలాంటప్పుడు తమ్ముళ్లు, తోబుట్టువులు అయిన వాళ్లు ఉపాయంతో ఏం చేయాలో భాస్కర శతకంలో ఇలా చెబుతారు.
‘‘కట్టడదప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము, దౌర్మ దాంధ్యమున్
దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా
పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!
కుటుంబ రక్షణ కోసం ఒకణ్ణి వెలేసినా తప్పు లేదు. గ్రామంలో ఒక కుటుంబం వల్ల అపకారం జరుగుతుంటే ఆ గ్రామం ఆ కుటుంబాన్ని వెలేయమని శాస్త్రంలో చెప్పారు. ‘మా అన్నయ్య కదా! నాకు తప్పదు. మా ఆవిడ కదా! నాకు తప్పదు. నా కొడుకు కదా! ఏం చేస్తాను’ అంటే కుదరదు. రావణాసురుడు దుర్మార్గుడైతే విభీషణుడు వదిలేశాడు. రాముణ్ణి ఆశ్రయించాడు. విభీషణునికి రాముడు ఆశ్రయమిచ్చి ధర్మాన్ని గెలిపించాడు.
డా. గరికిపాటి నరసింహారావు
http://granthanidhi.blogspot.in/2017/11/Garikapati.html
ReplyDelete