శివయ్య తోడుగా నవనందులు!
ప్రమథ గణాల్లో ముఖ్యుడు నందీశ్వరుడు. ఆయన పేరుమీదుగా వెలిసిన మహానంది ఆలయం తెలుగురాష్ట్రాల్లో సుప్రసిద్ధం. ఆ ఆలయానికి చుట్టుపక్కల మరో ఎనిమిది శివాలయాలున్నాయి. మహానందితో కలిపి నవనందులుగా పిలిచే ఈ ఆలయాలను ఒకేరోజు దర్శించుకోవడం మహాపుణ్యదాయకం.
విభూతి రాస్తే సంబరపడిపోయే వాడూ, చెంబెడు నీళ్లు పోస్తేనే వరాలిచ్చేసేవాడూ పరమశివుడు తప్ప మరే దేవుడూ మనకు కనిపించడు. మామూలు భక్తుల సంగతే అలా ఉంటే అత్యంత ప్రియమైన నందీశ్వరుడు ఆయన్ను అర్చించాడంటే దిగిరాకుండా ఉంటాడా. అలా పరమేశ్వరుడు నంది కోసం నేలకు దిగివచ్చిన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సమీపంలోని మహానంది. ఆ భక్తుడి పేరు మీదనే ఇక్కడ కామేశ్వరీ సమేతుడై మహానందీశ్వరుడిగా వెలిశాడు శివయ్య. ఆలయం చుట్టుపక్కల కొలువుదీరిన నవనంది క్షేత్రాల్లో ఇది విశిష్టమైనది. కార్తిక సోమవారం, పౌర్ణమి దినాల్లో ఈ నవనందుల దర్శనం సకలపాపనాశనంగా చెబుతారు.
ఇదీ కథ...
ఆలయ స్థలపురాణం ప్రకారం... పూర్వం శిలాదుడు అనే పరమశివభక్తుడైన మహర్షి ఉండేవాడు. ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందాడు. తనకు జగత్ప్రసిద్ధులూ, అపర శివభక్తులైన ఇద్దరు కుమారుల్ని ఇమ్మని కోరాడు మహర్షి. అలా ఆయనకు పర్వతుడు, మహానందుడు అనే కుమారులు జన్మించారు. పర్వతుడు ఈశ్వర తపస్సు చేసి, శ్రీశైల పర్వతంగా మారాడు. నంది స్వరూపుడైన మహానందుడు వేల సంవత్సరాలు శివుడికోసం తపస్సు చేసి, సాక్షాత్కారం పొంది ఆయన పాదాల ఎదురుగా స్థిరనివాసం ఉండే వరాన్నిమ్మని కోరుకున్నాడు. అలా మహానంది ఆలయంలో అమ్మవారితో కలిసి వెలిశాడు పరమేశ్వరుడు. తర్వాత, కలియుగంలో నంద్యాలను పరిపాలించిన నంద మహారాజుకు సంబంధించిన ఆలమందలోని ఒక ఆవు సాయంత్రం పాలు ఇచ్చేది కాదట. అది గమనించిన కాపరి పాలు ఏమవుతున్నాయా అని తెలుసుకునేందుకు ఆవును వెంబడించాడు. ఆ ఆవు ఒక పుట్టమీద నిలబడటం, పాలధార పుట్టలోకి పడటం గమనించి, ఈ విషయాన్ని రాజుకు చేరవేశాడు. తరువాతి రోజు ఆవును వెంబడించిన రాజు పుట్ట లోపలినుంచి వస్తున్న దివ్యతేజస్సు ఎవరిదో చూద్దామని ఆవు దగ్గరగా వెళ్లడంతో అది బెదిరి పరిగెట్టబోతూ పుట్టను తొక్కింది. తర్వాత ఆ తేజస్సు అదృశ్యమైందట. దీనికి చింతిస్తూ ఇంటిదారి పట్టిన రాజుకి ఆ రాత్రి కలలో శివుడు కనిపించి పుట్టలో ఉన్నది తానేననీ, అక్కడి శివలింగాన్ని బయటకు తీసి పూజించమనీ చెప్పాడు. ఈ లింగాన్ని ఉపాసించిన తన భక్తుడు నందీశ్వరుడి పేరుమీదుగా ఈ ప్రాంతం మహానందిగా విరాజిల్లుతుందనీ, ముల్లోకాల్లో ఖ్యాతిగాంచిన తీర్థాలన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయనీ పలికాడు. వివిధ సమయాల్లో తనను ప్రార్థించిన భక్తుల కోసం ఈ చుట్టుపక్కలేే మరో ఎనిమిది చోట్ల వెలిసినట్టు తెలిపి అక్కడా అర్చనలు ఏర్పాటు చేయమని ఆదేశించాడట. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఈ ఆలయ విశేషాలు దర్శనమిస్తాయి. మహానందిలోని శివలింగాన్ని ఆవు తొక్కినదానికి గుర్తుగా శివలింగం మీద గిట్టల అచ్చులు కనిపిస్తాయి. అందుకే ఇక్కడి శివుడ్ని గోపాదలింగేశ్వరుడిగానూ పిలుస్తారు. మహానందిలో రుద్ర, విష్ణు, బ్రహ్మ గుండాలుగా పిలిచే మూడు పుష్కరిణులు ఉంటాయి. గుడి అడుగుభాగం నుంచి నిరంతరం నీరు వీటిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గుండాల నుంచి పారే నీరు చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల ఎకరాల్లోని పంటలకు సాగునీరుగా ఉపయోగపడుతోంది. ఇక్కడి నీరు స్ఫటికమంత స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. గుండాల అడుగుభాగాన్నీ అందులోని చేపల్నీ కూడా భక్తులు స్పష్టంగా చూడొచ్చు. ఇందులోని నీరు చలికాలంలో వెచ్చగానూ, ఎండాకాలంలో చల్లగానూ ఉంటుంది. కరవొచ్చినా, వరదలొచ్చినా ఈ పుష్కరిణుల్లోని నీటి మట్టంలో హెచ్చుతగ్గులుండకపోవడం మరో విశేషం. వీటిలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలూ నశించి, ఆరోగ్యం సంప్రాప్తిస్తుందన్నది పురాణోక్తి.
క్షేత్ర ప్రదక్షిణ
మహానంది క్షేత్రానికి చుట్టూ 16 కిలోమీటర్ల దూరంలో నవనందులు వెలిశాయి. ఈ ఒక్క క్షేత్రంలోనే వినాయకనంది, గరుడనంది ఆలయాలు కొలువుదీరాయి. నంద్యాలపట్టణంలో ప్రథమనంది, నాగనంది, సోమనంది ఆలయాలూ, బండిఆత్మకూరు మండలంలోని కడమలకాల్వలో శివనంది, నల్లమల అడవిలో విష్ణునంది గుళ్లున్నాయి. మహానందికి 8 కిలోమీటర్ల దూరంలోని తమడపల్లె గ్రామానికి దగ్గర్లో సూర్యనంది క్షేత్రం ఉంది. ఉదయపు వేళ ఇక్కడి శివలింగం మీద సూర్యుడి కిరణాలు పడతాయి. ఈ ఆలయాల పేర్ల వెనుక ఆయాచోట్ల శివుడి కోసం తపస్సు చేసిన వాళ్ల కథలున్నాయి. అంటే నాగనందిలో నాగేశ్వరుడూ, సోమనందిలో చంద్రుడూ.. ఇలా శివుడికోసం తపస్సు చేసిన భక్తుల పేర్లమీదుగానే ఈ ఆలయాలు ప్రసిద్ధిపొందాయి. ఈ క్షేత్రాలను దర్శిస్తే భూ ప్రదక్షిణ ఫలితం దక్కుతుందన్నది పురాణోక్తి. కార్తికమాసంలోని సోమవారం, పౌర్ణమి రోజుల్లో భక్తులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు కాలినడకన నవనందీశ్వరులనూ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. అలా వెళ్లే వారు నంద్యాలలోని భ్రమరాంబామల్లికార్జునస్వామి ఆలయంలోని సాక్షిగణపతిని దర్శించుకొని ఈ యాత్రను ప్రారంభిస్తారు.
నంద్యాల నుంచి 19కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి మహానందికి చేరొచ్చు. గుంటూరు-గుంతకల్లు మార్గంలోని గాజులపల్లె రైల్వేస్టేషన్‌లో దిగితే క్షేత్రానికి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది. - గద్వాల రామకృష్ణుడు, మహానంది, న్యూస్‌టుడే
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565