మట్టి మేలు..తల పెట్టవోయ్!
మట్టిపాత్రల్లో తింటే మంచిదని అంటారు నిజమేనా?
రాగిపాత్రల్లో మంచినీళ్లు తాగడం.... ఇనుప మూకిట్లో వండుకోవడం వల్ల ప్రయోజనాలు వాస్తవమేనా..
అల్యూమినియం ఆహారంలో కలిస్తే అనారోగ్యకారకమా?
మరి నూనె పీల్చుకోని నాన్‌స్టిక్ పాత్రల మాటేంటి?...
పెరుగుతున్న ఆరోగ్యస్పృహలో భాగంగా... ఏం తింటున్నాం అనేదాంతోపాటు ఎందులో తింటున్నాం అనే ఆలోచన కూడా అందరిలో పెరుగుతోంది. మట్టిపాత్రల జమాన పోయి వంటని వేగవంతం చేసే కుక్కర్ల వాడకంలోకి ఎప్పుడో వచ్చాం. అడుగంటని నాన్‌స్టిక్ పాత్రలు... సర్జికల్ మెటల్స్‌తో చేసిన వంట పాత్రల ట్రెండ్ మనకు తెలిసిందే. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో మట్టిపాత్రల్లో వండి తింటే మంచివనే ప్రచారం ఊపందుకుంది.
గట్టి శరీరానికి మట్టి...
మట్టిపాత్రల్లో చేసిన వంటకం ఆరోగ్యానికి మంచిదే. అందులో సందేహం లేదు. ఆయుర్వేదం ప్రకారం... మట్టిపాత్రలో వంటకం పోషకాలని కోల్పోకుండా చేస్తుంది. అలాగే పదార్థాల సహజసిద్ధ సువాసనలని కోల్పోకుండా చేయడంలోను, నాణ్యత తగ్గకుండా చేయడంలోను ముందుంటుంది. ముఖ్యంగా మట్టిపాత్రలకుండే సన్నని రంధ్రాలు(పోరస్).. వంటకంలోని ప్రతి అణువుకి వేడిని, తేమని, మట్టి పరిమళాన్ని అందిస్తాయి. పాత్ర, పదార్థాలు నెమ్మదిగా వేడెక్కి మాడిపోకుండా ఉంటాయి. దాంతో ఒక రకమైన ప్రత్యేకమైన రుచి వస్తుంది. శాకాహారం, మాంసాహారం రెండింటికి ఈ మట్టిపాత్రలు మంచివే. మాంసాహారం వండినప్పుడు ప్రొటీన్లు పూర్తిగా విచ్ఛిన్నమై కూరల రుచి మరింత పెరుగుతుంది. సాధారణంగా మట్టికి క్షార స్వభావం ఉంటుంది కాబట్టి... పుల్లని పదార్థాలు వండినప్పుడు వాటితో చర్యపొంది పీహెచ్ స్థాయిలు సమంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ క్రమంలో శరీరానికి క్యాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ఇనుము, సల్ఫర్ వంటి పోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలకి తగినంత తేమ అందడం వల్ల అధికంగా నూనె, కొవ్వులని వాడాల్సిన అవసరం ఉండదు. మట్టిముంతల్లో తోడుపెట్టిన పెరుగు రుచి చాలా బాగుంటుంది. చేపలు వంటి ఘాటైన వాసన ఉండే పదార్థాలు మట్టిపాత్రల్లో వండితే రుచి, సువాసన రెండూ ఉంటాయి. అయితే పెద్దమొత్తంలో వంటలు వండేటప్పుడు మట్టిపాత్రలని ఉపయోగించలేం. ఉపయోగించినా శుభ్రత పెద్ద సమస్య.
జాగ్రత్తలు: రంగు పూయని మెరుపులేని మట్టి పాత్రలు వంటకానికి మంచివి. ఒకవేళ రంగు పూసినట్టుగా అనుమానం ఉంటే అరగంట ముందుగా నీళ్లలో నానబెట్టి రంగుపోయిన తర్వాత అప్పుడు వాడుకుంటే మంచిది.
ఇనుములాంటి శరీరానికి...
ఇవి జీవితకాలం మన్నుతాయి. వాడకానికి మంచివి. కానీ వీటితో వచ్చిన ఇబ్బందల్లా ... బరువు. శుభ్రం చేయడం కష్టం. త్వరగా తుప్పుపడతాయి. ఈ ఇబ్బందులు తప్పించి.. ఇనుము బాండీల్లో వంట మంచిదే. ఇనుముతో చేసిన పాత్రల్లో వండినప్పుడు ఇనుము వంటకాల్లో చేరి ఐరన్ లోపం రాకుండా ఉంటుందని క్లెమ్‌సన్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువు, తుప్పు వంటి సమస్యలు రాకుండా ఆధునిక పద్ధతుల్లో ఎనామిల్, సెరామిక్ పూతలు పూసి ఈ పాత్రలని డిజైన్ చేస్తున్నారు. వీలైతే మన వంటింట్లోకి వీటికి స్థానం కల్పించుకోవడం మంచిది. ఇనుము పాత్రల్లో వంటకం పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిలని కూడా పెంచుతుంది.
జాగ్రత్తలు: ప్రతిరోజూ వాడకం కంటే.. వారంలో మూడుసార్లు వండితే చాలు. పుల్లని రుచి ఉండే కూరలు వండేటప్పుడు అవి ఇనుముతో చర్యపొంది వాటి రుచి మారడానికి ఆస్కారం ఉంటుంది. వాడిన తర్వాత గాఢత లేని సబ్బునీటితో కడిగి ఎండబెట్టి... కొద్దిగా వంటనూనె రాసి ఉంచితే తుప్పు పట్టకుండా ఉంటాయి. రాగి పాత్రల్లో నిల్వ చేసినట్టుగా ఇనుము పాత్రల్లో నీటిని నిల్వ ఉంచకూడదు. రుచిని, స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. వండిన తర్వాత కూడా స్టీల్, గ్లాసు పాత్రల్లోకి వంటకాలని మార్చుకోవాలి.
టమాటా సాస్ వేసి చేసే వంటకాలని అల్యూమినియం పాత్రల్లో వండితే ఆ లోహం శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.
స్టీల్ మంచిదే....
తళతళా మెరిసే స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వంటకానికి సౌకర్యంగా ఉండటంతోపాటూ... శుభ్రం చేసుకోవడం తేలిక. వీటితో హాని కూడా తక్కువే. స్టీల్.. విభిన్న లోహాల సమ్మేళనం. ఇందులో పదిశాతం నికెల్ ఉంటే.. 18శాతం క్రోమియం ఉంటుంది. నికెల్ పాత్రలని మెరిసేటట్టు చేస్తే, క్రోమియం పాత్రలకు తుప్పు పట్టకుండా చేస్తుంది. సాధారణంగా అల్యుమినియం లేదా రాగి పాత్రలపై ఈ పూత పూస్తారు. ఇలా చేయడం వల్ల పాత్రలని వేడిచేయడం తేలిక. స్టీల్ పాత్రల్లో వండిన పదార్థాలకు ఎటువంటి హాని ఉండదు. ఏరకం వంటకాలైనా ఈ పాత్రల్లో వండుకోవచ్చు. ఈ పాత్రలు పదార్థాల రంగు, రుచిని పెద్దగా ప్రభావితం చేయవు.
జాగ్రత్తలు: చాలా అరుదుగా మాత్రమే నికెల్ వంట పదార్థాల్లో కలవడానికి ఆస్కారం ఉంది. అలా జరిగితే నికెల్ అలెర్జీ రావొచ్చు. కానీ ఈ పరిస్థితి అరుదే.
నూనె తక్కువ పడుతుంది...
టైటానియం గురించి మనం ఎక్కువగా విని ఉండం. ఈ లోహాన్ని శస్త్రచికిత్సల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వైద్య పరికరాల తయారీలో, దంతాలకు వేసే క్లిప్పుల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. పెద్దగా బరువు ఉండదు... దృఢంగా ఉంటుంది. ఈ సుగుణాల వల్లే ఈ లోహాన్ని వంటింటి పాత్రల తయారీలో ఉపయోగిస్తున్నారు. టైటానియంకు పదార్థాలు అంటుకోవు. దాంతో నూనె వాడకం తగ్గుతుంది. పోషకాలు, వంటకాల సహజసిద్ధ పరిమళం కోల్పోకుండా వండుకోవచ్చు. అల్యూమినియం పాత్రలపై టైటానియంని పైపూతగా వేసి ఈ పరికరాలని తయారుచేస్తుంటారు. అల్యూమినియం పదార్థాల్లోకి పోకుండా ఈ టైటానియం అడ్డుకుంటుంది. వీటిని శుభ్రం చేయడం తేలిక.
వంటకి.. నీళ్ల నిల్వకి
మన శరీరానికి కావాల్సిన అత్యవసర పోషకాల్లో రాగి(కాపర్) కూడా ఒకటి. కానీ తక్కిన లోహాలతో పోలిస్తే రాగి పాత్రల్లో వంటకం క్లిష్టమైన అంశమే అంటున్నాయి పరిశోధనలు. కారణం... మనకి రోజుకి 900మిల్లీగ్రాముల రాగి అవసరం అవుతుంది. దానికి పదిరెట్ల ఎక్కువగా అందినా మన శరీరం తట్టుకోగలుగుతుంది. నేరుగా వంటల కోసం వాడటం కన్నా... నీళ్లు నిల్వ చేసుకోవడం ఉత్తమం. వంటలు చేసినా శుభ్రత చాలా ముఖ్యం.
అల్యూమినియం తగ్గించాల్సిందే..
వంటల్లో అల్యూమినియం పాత్రలని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ గడిచిన ఐదేళ్లలో వెలువడిన అధ్యయనాల అల్యూమినియం పాత్రల వాడకాన్ని తగ్గించమని చెబుతున్నాయి. కారణం.. శరీరంలోకి చేరిన అల్యూమినియం తెచ్చే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. మన శరీరానికి హాని చేసే లోహాల జాబితా చేస్తే అందులో అల్యూమినియం ముందు ఉంటుంది.
- డాక్టర్ జానకీశ్రీనాథ్, పోషకాహార నిపుణులు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565