జత కలిసె జత కలిసె
ప్రేమికులకీ నవ దంపతులకీ మరో లోకం ఉండదు. ప్రపంచం మొత్తం తామిద్దరే ఉన్నట్లుగా ఉంటారు. అందుకే ఒక్క నిమిషం కూడా వదలకుండా అంటిపెట్టుకునే ఉంటారు. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ అనుకుంటూ పరవశించిపోతుంటారు. కొందరయితే మరీనూ. ఏ పనయినా కలిసే చేయాలనీ ఎక్కడికయినా కలిసే వెళ్లాలనీ అనుకుంటారు. ఇద్దరిదీ ఒకటే మాట, ఒకటే బాట అన్నది పదిమందికీ తెలియాలనీ అనుకుంటారు. అందుకోసం ఒకే రంగు దుస్తుల్ని వేసుకోవడం, వీలయితే రంగుతోబాటు ఒకటే డిజైన్ ఉన్న వాటిని ఎంపికచేసుకోవడం చేస్తారు. ఇటీవల ఆ బాధ లేకుండా ఇద్దరి కోసం అనేకమంది డిజైనర్లు కపుల్ మ్యాచింగ్ పేరుతో ప్రత్యేకంగా దుస్తుల్నీ డిజైన్ చేస్తున్నారు. అయితే అవన్నీ పెళ్లీ పేరంటాలకో లేదా క్యాజువల్ వేర్‌గానో ధరించేందుకో అన్నట్లు ఉంటున్నాయి. అందుకే. ఇప్పుడు కొత్తగా గుడికి వెళ్లేందుకో లేదూ ఇంట్లోనే వ్రతాలూ పూజలూ చేసుకునేందుకు కూడా పూజా జోడీ పేరుతో మ్యాచింగ్ దుస్తుల్ని డిజైన్ చేస్తున్నారు. నిజానికి సంప్రదాయ లంగాఓణీ, గాగ్రాచోళీ, చీర, పంచె, శాలువాల రూపంలో ఉండే ఈ రకమైన పూజా జోడీల్ని ధరించడం శ్వేతాంబర జైనుల సంప్రదాయం. మామూలుగానే జైనులు పూజలకోసం ప్రత్యేక దుస్తుల్ని ధరిస్తుంటారు. భార్యాభర్తలిరువురూ కలిసి ప్రార్థించేటప్పుడు ఒకే రంగు ఉన్నవాటిని ఎక్కువగా ధరించేవారు. దాంతో వాళ్లకోసం ప్రత్యేకంగా ఈ జోడీ దుస్తుల్ని రూపొందించడం ప్రారంభించారు. పైగా వీటిని ఖాదీ కాటన్, ఖాదీ సిల్కు, మట్కా సిల్కు, ఫాన్సీ... ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్కుల్లోనూ, ఆకర్షణీయమైన రంగుల్లోనూ, మెషీన్, చేతి ఎంబ్రాయిడరీలతోనూ రూపొందించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. దాంతో జైనులతోబాటు ఉత్తర, దక్షిణ భారతం అన్న తేడా లేకుండా అనేకమంది వీటి పట్ల ఆసక్తి ప్రదర్శించసాగారు. అది చూసి మిగిలిన వాళ్లు కూడా ఈ పూజాజోడీల్ని ప్రత్యేకంగా తయారుచేస్తూ దంపతుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచన, సృజన ఉండాలే కానీ మనదైన శైలిలో పోచంపల్లి, కలంకారీ, ఉప్పాడ, వెంకటగిరి... వంటి చేనేతలతోనూ ఈ పూజాజోడీల్ని డిజైన్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం... ప్రయత్నించండి..!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565