MohanPublications Print Books Online store clik Here Devullu.com

యాదాద్రి కల్యాణం_YadadriKalyanam


 యాదాద్రి కల్యాణం YadadriKalyanam Yadagirigutta Yadadri YadagiriNarasimhaswamy TelanganaTirupathi BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Antaryami Eenadu EenaduAntaryami


యాదాద్రి కల్యాణం

మానవ కల్యాణాలు కుటుంబాలకే పరిమితాలు. దేవతల కల్యాణాలు జగత్కల్యాణ కారకాలు. మహావిష్ణువు దివ్యావతారాల్లో నృసింహావతారం విలక్షణమైంది. నర శరీరంతో, సింహ ముఖంతో దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు స్తంభం నుంచి ఆవిర్భవించిన మూర్తి నరసింహుడు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ‘యాదాద్రి’పై అవతరించిన నృసింహస్వామి చరిత్ర పుణ్యప్రదం. ఈ స్వామికి ఏటా జరిగే కల్యాణం విశ్వకల్యాణ కారకం.

పూర్వం విభాండక మహర్షికి రుష్యశృంగుడు అనే కుమారుడు కలిగాడు. ఆయన కొడుకు యాదమహర్షి అకుంఠిత నృసింహ భక్తుడు. ఆ మహర్షికి నృసింహస్వామిని చూడాలనే కోరిక పుట్టింది. ఒక గుట్టపై కూర్చొని కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి స్వామి ఉగ్రరూపంతో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మహర్షి- ‘స్వామీ! నీవు ఇంతటి ఉగ్రరూపంలో ఉంటే నాకు భీతి కలుగుతోంది. నన్ను అనుగ్రహించి శాంతమూర్తివై కనిపించు’ అని కోరాడు. మహర్షి కోరికను మన్నించిన స్వామి ప్రశాంత రూపంతో ఎదుట నిలిచి, ఏదైనా కోరుకొమ్మన్నాడు. అప్పుడు ఆయన ‘ఇదే శాంతస్వరూపంతో ఈ గుట్టపై అర్చామూర్తిగా కొలువై ఉండు’ అని ప్రార్థించాడు.

స్వామి అనుగ్రహించి, ఆ గుట్టపైనే లక్ష్మీసమేతుడై ప్రశాంతమూర్తిగా కొలువుతీరాడు. అదే యాదగిరి గుట్టగా, యాదాద్రిగా ప్రసిద్ధమైంది. భక్తుల కొంగుబంగారంగా మారింది. యాదమహర్షికి ఇంకా స్వామిని చూడాలన్న కోరిక తీరలేదు. మళ్లీ తపస్సు ఆచరించాడు. ఆ దృఢదీక్షకు స్వామి మరెంతో మెచ్చాడు. అయిదు రూపాలతో గుట్టపై కొలువుతీరాడని భక్తులు విశ్వసిస్తారు. ఆ రూపాలే జ్వాల, యోగ, ఆనంద, గండభేరుండ, లక్ష్మీనరసింహ మూర్తులుగా దర్శనమిస్తున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి ‘పంచ నారసింహక్షేత్రం’ అనే ప్రసిద్ధి కలిగింది. యాదమహర్షి పేరుతో ఇది ‘యాదాద్రి’గా పేరుపొందింది.

నృసింహుడి ఉగ్రరూపం దుష్టుల పాలిట సింహస్వప్నం. హిరణ్యకశిపుడి పట్ల ఆ రూపం ఎంతటి తీవ్రత సృష్టించిందో లోకానికి విదితమే. స్వామికి అంతటి ఉగ్రత చెడుపైన మాత్రమే! అంత ఉగ్రరూపమూ ప్రహ్లాదుడి వంటి సజ్జనుణ్ని చూసి ప్రసన్నమైంది. వాత్సల్యంతో లాలించింది. క్షేమాన్ని అందించి పాలించింది. దివ్యత్వం అంటే ఇదే!

చెడుపై ఉగ్రత్వం, సాధుత్వంపై శాంతత్వం దేవతల లక్షణం. మహా అవతారమూర్తి అయిన నృసింహుడి విషయంలో ఇక చెప్పేదేముంది? ఆయన సాధువులకు తండ్రి వంటివాడు. దుష్టులకు శత్రువు వంటివాడు. మానసిక బలహీనత, ఆత్మన్యూనత వల్ల కలిగే భయాల్ని స్వామి రూపుమాపుతాడని, గొప్ప శక్తిని ప్రసాదిస్తాడని పలువురి ప్రగాఢ నమ్మకం. అశాంతిని పోగొడతాడనే దృఢవిశ్వాసం నృసింహుడిపై అపార భక్తిప్రపత్తులకు నెలవవుతోంది. హృదయంలో ఆనందాన్ని పెంపొందించే స్వామినే ప్రజలు కొలుస్తారు. ఆయనే- యాదాద్రి లక్ష్మీనరసింహుడు.

స్వామికి ఏటా యాదాద్రిపై లక్ష్మీదేవితో కల్యాణం జరుగుతుంది. ఉత్సవమూర్తులైన లక్ష్మీనరసింహులకు కల్యాణవేదికపై వేదోక్తంగా, అంగరంగవైభవంగా మహోత్సవం నిర్వహిస్తారు. ఆలయ ప్రధానార్చకులు, ఆగమశాస్త్ర పండితులు, వేదవిదుల పర్యవేక్షణలో భక్తుల ‘గోవింద’ నామస్మరణల మధ్య సాగే ఇది విశ్వకల్యాణమే! లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రాన్ని అలంకరిస్తూ స్వామి- ‘లోకకల్యాణం కోసం దీన్ని ధరింపజేస్తున్నాను. నీవు చిరకాలం వర్ధిల్లు’ అంటాడు. భగవంతుడి కల్యాణం సమస్త ప్రపంచానికీ క్షేమదాయకం అనే భావన దీనివల్ల తేటతెల్లం అవుతుంది. మానవుల కల్యాణంలో వధువు మెడలో వరుడు తాళి కడుతూ - ‘నా జీవన హేతువుగా దీన్ని నీ మెడలో ధరింపజేస్తున్నాను. చిరకాలం వర్ధిల్లు’ అంటాడు. దేవతలకు, మానవులకు భేదం ఇదే! దేవతలు సహజంగానే విశ్వక్షేమ కారకులు. ఆత్మానంద స్వభావం వారి సొంతం.

యాదాద్రీశుడైన లక్ష్మీనరసింహుడు అపార కరుణామూర్తి. తలచిన వెంటనే కొలువుతీరే దయాహృదయుడు. భక్తుల కష్టాల్ని తొలగించే మార్గదర్శకుడు. ఆపదల నుంచి రక్షించే ఉదార హృదయుడు. ఆయనకు జరిగే కల్యాణం మానవాళికి ఐహికాముష్మిక ఫలాల్ని అందించే వరం. అందువల్ల యాదాద్రిలో కల్యాణం ప్రపంచ కల్యాణమే!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list