ఊరకరారు మహాత్ములు...
పరమేశ్వరుడు తనకు చేసిన దానికన్నా తనను నమ్ముకున్న భక్తులకు సేవ చేస్తే ఎక్కువ ఆనందిస్తాడు. అందుకే పరమభక్తుడైన వాడిని, తనను నమ్ముకుని బతుకుతున్న వాడిని అతిథిగా పంపుతాడు. ఆ అతిథికి చేసిన మర్యాద చేత తను ప్రీతిచెందుతాడు. ఆ ప్రీతిని అడ్డుపెట్టి అభ్యున్నతినిస్తాడు. భాగవతం దశమ స్కంధంలో నందనందుని కుశలం తెలుసుకు రమ్మని వసుదేవుడు తన పురోహితుడైన గర్గుణ్ణి వ్రేపల్లెకు పంపుతాడు.
అతనికి సముచిత సత్కారాలుచేసిన నందుడు....‘‘ఊరకరారు మహాత్ములు వారధముల యిండ్లకడకు వచ్చుటలెల్లం గారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా!’’ అంటాడు. అతిథులు సామాన్యుల ఇళ్ళకు రావడం సర్వశుభాలకు కారణం. ఊరకరారు మహాత్ములు... ఆయనకేం కోరికా? ఆయనకేం పంచలచాపు మీద, లేదా మీరు పెట్టే అన్నం మీద వెర్రా... ఆయనకేం కోరిక లేదు. ఆయన అలా వచ్చేవాడూ కాదు. వచ్చినా ఉండేవాడూ కాదు. కానీ ఆయన రావలసివచ్చింది, ఉండవలసి వచ్చింది. దేనికోసం? భగవత్ కార్యం మీద ఉన్నాడు. అతిథిగా ఈశ్వరుడే అలా పంపాడు.
ఇంటిలోపలికి వచ్చిన అతిథులకే కాదు, బాటసారులకు కూడా మనం పూర్వం అతిథి మర్యాదలు చేసేవాళ్ళం. ప్రధానదారుల వెంబడి ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్పనిసరిగా ప్రహరీగోడల బయట పొడవుపాటి అరుగులు కట్టేవాళ్ళు. అలసిసొలసిన బాటసారులు కాసేపు వాటిమీద సేదదీరేవారు. బయట ఎవరు వచ్చేదీ పోయేదీ కూడా ఆ ఇంటి యజమానికి తెలియదు. చూడటం తటస్థిస్తే మాత్రం ఫలితమేమీ ఆశించకుండా మంచినీళ్ళు, మజ్జిగ వంటివి ఇచ్చి సేవలో తరించేవారు. భక్తుడు సేదతీరడానికి నీ అరుగు ఉపయోగపడింది. కాబట్టి నీ పుణ్యం ఖాతా పెంచేస్తాడు.
భాగవతంలో ఒక ఘట్టం – యశోదాదేవి చిన్ని కృష్ణుడిని పెట్టుకుని కూర్చుని ఉంది. అకస్మాత్తుగా తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలిరూపంలో గిరగిర తిరుగుతూ వచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి మొదట విస్తుపోయినా తరువాత తేరుకుని గుండెలు బాదుకుంటూ... దూడవెంట ఆవు పరుగెత్తినట్లు కృష్ణా, కృష్ణా అంటూ అరుస్తూ పోతున్నది. కృష్ణుడు భయపడిపోయిన పిల్లవాడిలాగా తృణావర్తుడి మెడ గాఠ్ఠిగా పట్టేసుకుని మెల్లగా బిగించడంతో వాడు ఊపిరాడక నేలమీద చచ్చిపడిపోయాడు.
యశోదాదేవి వచ్చి చూసేసరికి తృణావర్తుడి శరీరం మీద పిల్లవాడు ఆడుకుంటున్నాడు. గబగబా వచ్చి వాడిని ఎత్తుకుని... ఏ జన్మలో ఏ నోము నోచుకున్నానో... ఎవ్వరికి ఏమి పెట్టితినో... నా బిడ్డ నాకు క్షేమంగా దక్కాడు... అని అంటుంది యశోద. ఎప్పుడు ఏ అతిథి ఏరూపంలో వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాడో కానీ దాని ఫలితం ఈవేళ నాబిడ్డ పెనుప్రమాదం తప్పించుకున్నాడంటుంది. వాల్మీకి మహర్షి కూడా సుందరకాండలో...‘‘ఏమీ తెలియని చేతకానివాడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమేశ్వర స్వరూపుడే’ అంటాడు.
అయినప్పుడు ప్రాజ్ఞుడు, శాస్త్రం చదువుకున్నవాడు పరమభాగవతోత్తముడయినవాడు, పాత్రత కలిగినవాడు ఇంటిముందుకు వచ్చి నిలబడి ఆయన చేతిలో ఏదయినా పెట్టే అవకాశం దొరకడమంటే జన్మజన్మాంతర సుకృతమే అది. లేకుంటే నీకు అటువంటి అతిథి దొరుకుతాడా! అదృష్టం పడితేనే అటువంటి అతిథి ఇంటికొస్తాడు. లేకపోతే నీ దగ్గరకెందుకొస్తాడు? ఎందుకు చెయ్యి చాపుతాడు? ఎందుకు స్వీకరిస్తాడు? స్వీకరించడు. అటువంటి మహాత్ములు ఇంట్లోకి అడుగుపెట్టడం చాలు. ఒక్కొక్కరికి పెట్టింది ఒక్కొక్కరి దశతిరగడానికి కారణమవుతుంది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565