పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో!
పట్టుచీరలు, బాసికాలూ, పూలదండలూ, జీలకర్రాబెల్లం, సన్నికల్లూ, గరికముంతలు... పెళ్లి వేడుకలో ఉపయోగించే వస్తువుల జాబితా చాలానే. వాటిని బజారు నుంచి కొని తెచ్చుకోవడం సులువే. కానీ వాటికీ ఓ ప్రత్యేకత కనిపించాలంటే.. ఆకట్టుకునేలా, అందంగా, వైవిధ్యంగా ఉన్నవి ఎంచుకోవాలి. లేదా తయారు చేసుకోవడం తెలిసుండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే వాటికీ డిజైనర్‌లుక్ తేవాలి. అదెలాగో వివరిస్తున్నారు పెళ్లిపూల జడ నిర్వాహకురాలు కల్పనా రాజేష్.
నిశ్చయతాంబూలాలతో మొదలయ్యే వేడుకలో పెళ్లికూతురుకు తెచ్చే సారెతోనే మొదలవుతోంది ఈ ట్రెండ్. ఆడ, మగపెళ్లి వారి వైపునుంచి జరిగే తంతులను చూపించే విధంగా బొమ్మలూ, పండ్లూ, పూలు పెట్టే ట్రేలు ధగధగలాడే వస్త్రాలూ, చమ్కీలూ, కుందన్లతో మెరిసిపోయేలా ఎంచుకోవచ్చు. లేదా తాటాకు బుట్టలతోనూ సంప్రదాయ లుక్‌ని తేవచ్చు.
* మంగళస్నానాల వేళ ఉపయోగించే నీళ్ల బిందెలూ, జల్లెడలూ ఆ వేడుకకే కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. పసుపు దంచడానికి ఉపయోగించే రాతిరోలూ, రోకలికి కుందన్లూ, పూలూ, బంగారు, వెండి రంగుల్లో నెట్ వస్త్రంతో చేసిన అలంకరణలూ వారెవ్వా అనిపిస్తున్నాయి. మెహెందీ, మంగళస్నానం వంటి సందర్భాల్లో వధువు వేసుకునేందుకు పూల నగలూ, జడల డిజైన్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటు సంప్రదాయాన్నీ, అటు పాశ్చాత్య శైలినీ మేళవించి కనువిందుచేసే పూల జడలు వధువుకి కొత్తందం తెచ్చిపెడతాయి. పైగా వీటిని వధూవరుల దుస్తులూ, మండపం అలంకరణకి నప్పేలా తయారు చేస్తున్నారు.
* వధువుతో పాటే చక్కగా ముస్తాబైపోతుంది కొబ్బరిబొండాం. వాటిపైపేర్లూ, రాధాకృష్ణుల బొమ్మలూ, వివాహఘట్టాలను పెయింట్ చేయడమే కాదు కుందన్లూ, రాళ్లూ, స్థాయిని బట్టి నవరత్నాలనూ వీటికి అలంకరిస్తున్నారు.
* పెళ్లివేడుక మొదలైందని సూచించేలా నుదిటిన కట్టే బాసికం మాత్రం సాదాసీదాగా ఎందుకుండాలి... అందుకే వాటినీ కుందన్లూ, రాళ్లూ పొదిగి ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కాస్త తాహతు ఉన్నవారైతే వాటికి బంగారం, వజ్రాలనూ ఉపయోగిస్తున్నారు. ఎంతైనా పెళ్లి అపురూపఘట్టం కదా!
* వధువు మేనమామలు పెళ్లికూతుర్ని బట్టులో పెట్టి మండపానికి తెస్తారు కదా! ఆ వేడుకకోసం పట్టూ, వెల్వెట్, బెనారస్, వంటి వస్త్రాలూ, జరీ అంచులూ ఉపయోగించే కలువ పువ్వు లాంటి బుట్ట కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఇక వరుడిని కాశీకి పంపే ఘట్టంలోని గొడుగు మల్లెపూలతో అల్లేస్తున్నారు. వీటికి అదనంగా వేలాడే పూల తీగలూ, పూసలూ వావ్ అనిపిస్తున్నాయి.
* పెళ్లిలో వధూవరుల దుస్తులకు నప్పేట్లుగా పూల రేకలతో తయారు చేసిన దండల ప్రత్యేకతే వేరు. కేవలం అక్కడే కాదు దేవుడి పటాలకు వేసే దండల తయారీలోనూ గులాబీలూ, మల్లెలూ, లిల్లీలూ, ఆర్కిడ్‌లు వంటివాటితో పాటు విదేశీ పూలనూ వాడేస్తున్నారు. వాటితో పాటు కర్పూర దండలూ, యాలకుల దండలూ కూడా హంగులు అద్దుకుంటున్నాయి.
* కాబోయే నవదంపతుల దోబూచులాటకు అడ్డుతెర అదనపు హంగుని తెచ్చిపెడుతుంది. కొత్తదుప్పటిని వాడే స్థాయి నుంచి పట్టు వస్త్రాలపై వధూవరుల చిత్రాలూ, సీతారాముల పెళ్లి సంబరాలూ, మల్లెపూలూ, ఆర్కిడ్లూ, గులాబీలూ, లిల్లీలతో అల్లేసిన అడ్డుతెరలే ఇప్పుడు ప్రత్యేకం. జీలకర్రా, బెల్లాన్ని మాత్రం అలా వదిలిపెడితే ఏం బాగుంటుంది. వాటిమీద కాస్త చమ్కీలు చల్లి, ముత్యాలు అద్ది అదరగొట్టేస్తున్నారు. అక్షతల్లో ముత్యాలూ నవరత్నాలనూ కలిపేస్తున్నారు.
* కన్యాదానం చేసే వెండి పళ్లెం, నీళ్లుపోసే వెండి చెంబులకూ నూలు దారపుపోగులే కాదు ముత్యాలూ, పచ్చలూ, కుందన్లు వంటివాటితోపాటు రంగు రంగుల పట్టుదారాలనూ వాడేస్తున్నారు.
* పెళ్లిఘట్టంలో చివరి అంకం సన్నికల్లు తొక్కడం... దీన్ని కూడా జరీనెట్, పచ్చలూ, ముత్యాలను పోలి ఉండే కుచ్చులతో అందంగా అలంకరిస్తున్నారు. అంతాబాగానే ఉందికానీ ఇవన్నీ మాకెక్కడ దొరుకుతాయి అంటారా? కాస్తదృష్టీ, సమయం పెడితే సొంతంగానే తయారు చేసుకోవచ్చు. అందుకోసం వాటిని నేర్పించేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ఛానళ్లు కూడా ఉన్నాయి. అలానే బ్రైడ్స్ ఎసెన్షియల్, పెళ్లిపూలజడా, వెడ్‌సాగా వంటి బ్లాగులూ మీకు మరిన్ని వివరాలు అందిస్తున్నాయి.
* పెళ్లిళ్లలో గరికముంత ప్రత్యేకతే వేరు.... సున్నంతో డిజైను చేయడం పాతమాట. ఇప్పుడు వాటికి కాంతిమంతమైన రంగులేసి కుందన్లూ, అద్దాలు అద్ది అందంగా మార్చేస్తున్నారు.
* తలంబ్రాల వేడుకలో వాడే కొబ్బరిచిప్పలకూ కుందన్లు జతచేస్తున్నారు.
* ఇవనే కాదు.. తలంబ్రాలూ ముత్యాల్లా కనిపించేందుకు నవరత్నాలను పోలిన పూసల్ని వాడటం కూడా ఇప్పుడు నయాశైలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565