MohanPublications Print Books Online store clik Here Devullu.com

శాంతి మంత్రం_ShanthiMantra


శాంతి మంత్రం ShanthiMantra Antaryami Eenadu EenaduEepaper EenaduAntaryami BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu


శాంతి మంత్రం

భారతదేశం శాంతి పరిమళాలు వెదజల్లే పూలతోట వంటిది. ప్రపంచానికి ప్రశాంతతను ప్రబోధించడంలో భారతీయులే ముందుంటారు.
శాంతి సామరస్యాల్ని చాటే వేదమంత్రాలు పూర్వీకుల నుంచి మనకు వారసత్వంగా వచ్చాయి. ప్రాతఃస్మరణీయమైన ఆ వేదఘోష అందరి హృదయాల్లోనూ మారుమోగుతుంటుంది.
కామ క్రోధాల వంటి అరిషడ్వర్గాల నుంచి శమింపజేసేది శాంతం అని ‘అమర కోశం’ చెబుతుంది. సృష్టి మనుగడ కొనసాగాలంటే పంచభూతాల అనుగ్రహం కావాలి. వాటి ఆగ్రహం ప్రాణికోటికి ముప్పు తెస్తుంది. అందువల్ల పంచభూతాలూ శాంతించాలంటాయి యజుర్వేద మంత్రాలు. సూర్యచంద్రులు, ఇంద్రాది దేవతలు శాంతించాలని తైత్తిరీయోపరిషత్తు కోరుతుంది.
విష్ణువు శాంతాకారుడై, ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడని వ్యాసమహర్షి వర్ణించాడు. పరమశివుణ్ని శివస్తోత్రం ‘శాంతుడు’ అని సంబోధిస్తుంది.
జీవహింస తగదని ప్రవచించిన బుద్ధ భగవానుడు శాంతిమంత్రం జపించాడు. ఖండాంతరాలవారికీ ఆరాధనీయుడయ్యాడు. బుద్ధుడి బోధనలకు అశోక చక్రవర్తి ఎంతగానో ప్రభావితుడయ్యాడు. రణరంగంలో విజయుడైనప్పటికీ శాంతికాముకుడిగా మారి, బౌద్ధాన్ని ప్రపంచమంతటికీ పరిచయం చేశాడు. భారతీయుల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయగలిగాడు.
తోటివారిని కష్టపెడితే శాంతి దూరమవుతుంది. అహింస వల్ల అనంత శాంతి సొంతమవుతుందని గాంధీమహాత్ముడు గ్రహించారు. సత్యం, అహింసల్ని ఆయుధాలుగా చేసుకున్నారు. భారత స్వాతంత్య్ర పోరాట కాలంలో వాటిని ప్రయోగాత్మకంగా అమలుపరచారు. జాతిపితగా, శాంతి ప్రచారకులుగా పేరు గడించారు. దక్షిణాఫ్రికా దేశీయులైన నెల్సన్‌ మండేలా ఆయన చూపిన శాంతిమార్గంలో నడిచారు. బానిసత్వం నుంచి తన దేశాన్ని విముక్తం చేశారు. మువ్వన్నెల పతాకంలోని శ్వేతవర్ణం భారత శాంతిప్రియత్వాన్ని చాటుతుంది.
పూర్వం ప్రభువుల యుద్ధకాంక్ష కారణంగా ప్రజల్లో అశాంతి, అలజడి రేగాయి. ప్రతి ఒక్కరూ అభద్రతకు గురయ్యేవారు. యుద్ధానికి ప్రత్యామ్నాయంగా నాటి రుషులు అశ్వమేధ, రాజసూయ యాగాలకు రూపకల్పన చేశారు. యుద్ధాన్ని నిరోధించి, సమాజంలో శాంతిభద్రతల్ని కాపాడటమే వాటి పరమార్థం. సహజంగానే భారతీయులు సున్నిత మనస్కులు. దేవతారాధన కోసం మొక్కల నుంచి పూలు తుంచాలన్నా బాధపడతారు. శతకకర్త బద్దెన చాటినట్లు, అపకారికైనా ఉపకారం చేయడమే మిన్న. అప్పుడే శత్రుత్వం తొలగి, రెండు పక్షాల మధ్యనా మైత్రి కలుగుతుంది. ప్రపంచంలో శాంతిస్థాపనకు సంబంధించి, ఇంతకు మించిన మేలు మార్గం మరొకటి ఉండదు.
మనిషి కోపం శత్రువుల్ని పెంచుతుంది. శాంతం రక్షణనిస్తుందని పెద్దల మాట. కోపం వల్ల విచక్షణాజ్ఞానం లోపిస్తుంది. ఫలితంగా, అయినవారు సైతం శత్రువులుగా కనిపిస్తారంటుంది భృగుమహర్షి చరిత్ర. ఆయన అరికాలిలో మూడో కన్నుతో జన్మించాడంటారు. ఒకరోజు తన రాకను గమనించలేదన్న కోపంతో బ్రహ్మ, మహేశ్వరులను శపిస్తాడు. విష్ణుమూర్తి హృదయంపై కాలితో తంతాడు. ఆ స్వామి శాంతసముద్రుడు. భృగువు పాదాలు నొక్కుతూనే, అరికాలిలోని కంటిని వేలితో పొడుస్తాడు. రుషి క్రోధం పూర్తిగా శమిస్తుంది. ప్రశాంతచిత్తుడై ఆయన, తన తప్పిదానికి క్షమాపణ చెప్పి వెళ్లిపోతాడు.
సత్వగుణ ప్రధానుడైన శ్రీరాముడు శాంతస్వరూపుడుగా వెలుగొందుతాడు. హిరణ్యకశిపుడి వధ కోసం ఉగ్రనరసింహ అవతారమెత్తిన విష్ణుమూర్తి- భక్తప్రహ్లాదుడి స్తోత్ర పఠనంతో తిరిగి శాంతరూపం ధరిస్తాడు.
స్వార్థం శత్రుత్వాన్ని పెంచుతుంది. అంతా తమకే సొంతం కాదని అందరూ గుర్తించాలి. స్వార్థబుద్ధి పూర్తిగా నశిస్తేనే, మనుషుల మధ్య సోదరభావం పెరుగుతుంది. అప్పుడే శాంతి కపోతం విశ్వమంతటా స్వేచ్ఛగా విహరిస్తుంది!
- జి.రామచంద్రరావు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list