అంగీకరించు అన్నిటినీ మించు!
జీవితంలో అపజయాల్ని చవిచూసిన వారిని సైతం ప్రపంచం క్షమిస్తుంది. కానీ, జీవితాన్ని ఉద్ధరించుకోవడనికి అవకాశం లభించినా.. అవివేకంతో సదవకాశాలను జారవిడుచుకున్న వారిని ఈ ప్రపంచం క్షమించదు. అలాంటి వారు, ఉరవడిలో కొట్టుకుపోయే గడ్డిపోచలా, జీవన ప్రవాహంలో దారీతెన్నూ లేకుండా అగమ్యగోచరం అవుతారు. మనిషి శక్తి అనంతం, అపారం. ఆ శక్తిని బహిర్గతం చేసుకొని.. లక్ష్యాన్ని ఏర్పర్చుకోవాలి. మన సమయాన్ని భగవంతుడు ప్రసాదించిన శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవన విధానంగా అవలంబించాలి.
అన్నీ ఉన్నాయి...
కానీ ఏదో వెలితి...
అంతుబట్టని భయం...
చివరకు తలలో తెల్ల వెంట్రుక వచ్చినా ఆందోళనే..
ప్రస్తుతాన్ని ఆస్వాదించగలిగితే..
వాస్తవాన్ని అంగీకరించగలిగితే..
భయాలేవీ దరి చేరవు.
ఆందోళనలు లేని మనసు అద్భుతాలు చేయగలిగే శక్తిని సంతరించుకుంటుంది.
అందుకే ఈ జీవన యాత్రలో నావికుడిగా.. నీ పాత్ర అమూల్యమైనది.
నిష్క్రియాపరత్వం అన్నింటి కన్నా ప్రమాదకరమైనది. దానిని వదిలి జీవితేచ్ఛను నిర్వర్తించాలి. నీ జన్మను సార్థకం చేసుకోవాలి. ఆయువు స్వల్పమైనది. జీవితం చాలా చిన్నది. మనిషిగా జన్మించినందుకు మానవత్వ పరిమాళాల్ని వెదజల్లాలి
-కేనోపనిషత్తు
ఎవరైనా ఉత్సాహంగా లేరు అంటే వారి మదిలో ఏదో ఆందోళన ఉందని అర్థం. మనసులో అలజడికి తొలి కారణం భయం. ప్రతి ఒక్కరూ అన్ని వ్యవహారాలు తమకు ఇష్టమైన రీతిలో చక్కబడాలని కోరుకుంటారు. అందుకు విరుద్ధంగా జరిగితే ఆందోళన మొదలవుతుంది. దీనిని అధిగమించి ఫలితం ఎలాంటిదైనా స్వీకరించగల మనస్తత్వాన్ని అలవర్చుకుంటే.. బతుకు దారిలో భయానికి తావుండదు. ఆ భయాన్ని అదుపు చేయగల శక్తి మనసుకే ఉంది. జీవితానికి స్పష్టమైన లక్ష్యం, నిర్దిష్టమైన ఉద్దేశం ఉన్నప్పుడు ఆ భయం తొలగి.. జీవితం సంతోషప్రదం అవుతుంది. లక్ష్యం దిశగా మన ప్రయాణం ముందుకు సాగుతుంది.
జీవితం ఓ ఆట
మనిషి ఒకసారి పోగొట్టుకుంటే, తిరిగి పొందలేని విషయాలు మూడు. అవి.. నోటి నుంచి వచ్చిన మాట, చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం. వ్యక్తి పురోగమనానికి అడ్డువచ్చేది ఏంటో తెలుసా? సామర్థ్యం, స్తోమత లేకపోవడం కాదు. ఇక నాకు ఏ అవకాశం రాదు... వేరే దారిలేదు.. నా బతుకు ఇంతే! అనే నిర్ణయానికి రావడమే! ఆటల్లోనైనా గెలుపొందాలంటే.. కేవలం శారీరక దారుఢ్యం ఉంటే సరిపోదు. పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారుడు ్ఞపరిగెడుతున్నప్పుడు నేను ఓడిపోతేనేమ్ఠో అని ఒక్క క్షణం భావించినా అతనిక పరిగెత్తలేడు. అందుకే.. పోటీ పడుతున్నప్పుడు, తర్ఫీదు పొందుతున్నప్పుడు కూడా ఆ క్రీడాకారుడు తనపై అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏర్పరుచుకోవాలి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఇది జీవితమనే ఆటకు కూడా అక్షరాలా వర్తిస్తుంది. గతమంతా గడిచిపోయిన కాలం. భవిష్యత్తు అంతుచిక్కని శేష ప్రశ్న. వర్తమానం దేవుడిచ్చిన వరం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
సంపద, కీర్తి, అధికారం.. ఇవన్నీ కొంతవరకు సంతృప్తినిస్తాయి. వీటన్నింటికీ మించి ఇంకా ఏదో కావాలని మనసు ఏదో ఒక క్షణంలో ఉవ్విళ్లూరుతుంది. లౌకికమైన కోరికలు నెరవేర్చుకోవడమే జీవితం కాదు. మన అంతరంగంలో ఏదో దశలో మథనం మొదలవుతుంది. అన్నీ ఉన్నాయి... కానీ మానసిక పరితృప్తిలేదు. సరిగ్గా మనకు అప్పుడు ఆధ్యాత్మిక చింతన దారి చూపుతుంది. వివేక చూడామణిలో ఆది శంకరులు అదే చెప్పారు. మానవ జన్మ శ్రేష్ఠమైనది. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ముక్తిని పొందేందుకు యోగ్యత సాధించాలి. మహత్తరమైన ఆశయం కోసం నిరంతర అన్వేషణ కొనసాగాలని ప్రబోధించారు. ్ఞఇయంతే యజ్ఞియా తనూః్ఠ అని యజుర్వేదం పేర్కొంది. ఈ జీవితం ఈశ్వర సాక్షాత్కారం కోసం లభించింది. దీనిని వ్యర్థం చేసుకోకూడదని దీని అర్థం. ఆ ఈశ్వరుడు ఎక్కడో లేదు. మన మనోమందిరాన దివ్యజ్ఞాన జ్యోతిలా ప్రకాశిస్తున్నాడు. ఆ దీపకాంతి వెలుగులో చైతన్య స్ఫోరకంగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనసును తీసుకెళ్లకపోతే జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందలేం.
కైజెన్ సూత్రం
జపనీస్ భాషలో కైజెన్ అంటే నిరంతరం, ఎల్లప్పుడూ అని అర్థం. మనం ్ఞనమస్త్ఠే అని అభివాదం చేస్తుంటాం. కానీ, జపనీయులు కలుసుకున్నప్పుడు ్ఞజీవితం అనే నదికి విజయోస్త్ఠు అని చెప్పుకుంటారు. నది లక్షణం నిరంతరం ముందుకు సాగడం. నది అంతిమ గమ్యం సముద్రం. అలా ప్రతి వ్యక్తీ సమున్నతమైన విశాలమైన లక్ష్యం వైపు పురోగమించాలి. జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు.. అనవసరమైన అంశాల చెప్పుచేతల్లో ఉండరాదు. కొత్త ఆలోచనల వైపు పరుగులు తీస్తూ.. స్వయం ఆధిపత్యం సాధించాలి. అలా జరగకపోతే దట్టంగా అలుముకున్న మేఘాల మధ్యలో నుంచి అనంత ఆకాశాన్ని దర్శించడం ఎంత దుర్లభమో.. మన జీవన దృశ్యం అంతే క్లిష్టమవుతుంది. ఎవరికైనా సరే స్వయం శక్తి ధనుస్సు అయితే... పట్టుదల బాణంలాంటిది. రేపటి గురించి ఆలోచిస్తూ.. నేటిని మర్చిపోవడం అవివేకం. ఎప్పుడైనా సరే.. విజేతలు ప్రణాళికలు తయారు చేస్తారు. అదే పరాజితులైతే క్షమాపణల పరంపర కొనసాగిస్తారు. నిన్నటి గురించి సమీక్ష చేసుకుంటూ, నేటిని ఆస్వాదిస్తూ, రేపటిని ప్రణాళికయుతంగా మల్చుకోవడమే జీవన గమనంలో కాలక్రమణిక.
వర్తమానం ఓ వరం...
మన మనోస్థితిలో మార్పు రావాలి. జీవితంలో మన దగ్గర నుంచి విడదీయరాని సంపద ఏమిటి? అదే వర్తమానం... అది ముంగిట ఉన్న షడ్రసోపేతమైన భోజనం లాంటిది. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి. సద్వినియోగం చేసుకోవాలి. అయితే మన ఆలోచనలన్నీ గడిచిపోయిన కాలం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. భవిష్యత్తు సంబంధించిన భయాల వెంట పరుగులు పెడుతున్నాయి. ఈ సమయంలో ఆధ్యాత్మిక పథం మనకు మంచి మార్గాలను చూపుతుంది. యోగ, ఆత్మ సాధనల వల్ల సంయమనం, స్థితప్రజ్ఞత చేకూరతాయి. ఫలితాన్ని యథాతథంగా స్వీకరించే సమున్నత స్థితి లభిస్తుంది. ఆధ్యాత్మిక ధోరణి అనేది వయసు మీద పడ్డాక, వృద్ధాప్యంలో ఆచరించే అంశం కాదు. అది నవనవోన్మేషం, నిత్యనూతనం. దివ్యతమ మార్గాన్ని ఆ చింతన అందిస్తుంది. సూక్ష్మమైన, సంకుచితమైన దృష్టికోణం నుంచి.. స్థూలమైన, విశాలమైన ఆధ్యాత్మిక భావజాలం వైపు మన మనసును మళ్లించాలి. ప్రగతి శీలమైన జీవన దృష్టివైపు మనం పురోగమించినప్పుడు మన ఉనికి కూడా మారిపోతుంది. చుట్టూ ఉన్న ప్రపంచం, వ్యక్తుల విషయంలో మన దృక్పథం మారాలి. సానుకూలత సర్వత్రా అలవర్చుకోవాలి.
ధర్మాచరణ అనే మాటకు విస్తృతార్థం ఉంది. నీతి, న్యాయం, దయ, సౌభ్రాతృత్వం, సహనం వంటి అంశాలతో జీవితాన్ని మేళవించి ఆంతరంగికంగా, బాహ్యంగా ధర్మంతో మమేకం కావడం ఆద్యాత్మిక సాధనలో ముఖ్యాంశం. పర్వతారోహకులు, పర్వత పాదపీఠం నుంచి వివిధ మార్గాలలో ఓర్పుగా, నేర్పుగా వివిధ ఉపకరణాల సహాయంతో ముందుకు సాగుతూ పర్వతాగ్రానికి చేరుకుంటారు. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సాధన కూడా అలాంటిదే. మతాలేవైనా సరే, మానవీయత, సన్మార్గం వైపు ప్రయాణించాలని నిర్దేశించాయి. తనని తాను, హృద్యమైన శిల్పంలా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి వ్యక్తికి ఆద్యాత్మిక ధోరణి ఉపకరిస్తుంది. మృత్యువు ఎప్పుడు.. ఎవరికి ఏ విధంగా ముంచుకొస్తుందో తెలియదు. అందుకే సత్కర్మలు చేయడానికి తొందరపడాలి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది. ఆ బాణానికి లక్ష్యం ఉండాలి. గురి తప్పకూడదు. కర్మయోగుల్లా నిరంతరం ప్రజ్వరిల్లుతూ.. సాఫల్యం సాధించాలి.
-డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565