విజయం అంటే రణక్షేత్రం... రక్తపాతం కాదు... గెలవడం...
తనలోని శత్రువులను... మాలిన్యాలను తుదముట్టించడం...
తనపై తాను యుద్ధం ప్రకటించుకుని అందులో గెలవాలంటే అపారమైన ఆత్మశక్తి కావాలి...
ఈ యుద్ధంలో గెలిచిన వాడే జినుడవుతాడంటుంది జైన ధర్మం.
ఆశలకన్నా ఆశయం... సామ్రాజ్యం కన్నా చైతన్యం ముఖ్యమని నమ్మి పాదాల ముందుకు వచ్చిన రాజ్యాధికారాన్ని, అంతులేని సంపదలను తృణప్రాయంగా భావించిన వాడేే బాహుబలి.
అతని కథ నిత్యస్మరణీయం
జైన ధర్మ ప్రచారకులను తీర్థంకరులంటారు. అంటే తరింపజేసేవారని అర్థం. వీరు ఇరవై నాలుగు మంది. వీరిలో చివరి వాడు వర్థమాన మహావీరుడు. మొదటి వాడు రిషభదేవుడు. ఇతన్నే రిషభనాధుడు, ఆది నాధుడని కూడా పిలుస్తారు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సంతానంలో పెద్ద వాడు భరతుడు. రెండో భార్య కుమారుడు బాహుబలి. తన రాజ్యంలో అయోధ్యను పెద్ద కొడుకు భరతుడికి, తక్షశిలను బాహుబలికి ఇచ్చి రిషభదేవుడు తపస్సుకు వెళ్లిపోయాడు.
భరతుడు రాజ్య విస్తరణ కాంక్షతో తమ్ముడితోనే యుద్ధానికి సిద్ధపడతాడు. పెద్దలు వారించి జనక్షయం కన్నా వారిద్దరూ నిరాయుధులుగా తలపడి గెలిచిన వారు రాజ్యాన్ని పొందేలా ఒప్పిస్తారు. ద్వంద్వ యుద్ధంలో బాహుబలి ముందు భరతుడు నిలవలేక నిబంధనలను ఉల్లంఘించి ‘చక్రరత్న’మనే ఆయుధాన్ని తమ్ముడిమీద ప్రయోగించాడు. ఆగ్రహించిన బాహుబలి తన ఉక్కు పడికిలితో అన్న తల బద్దలు కొట్టబోతాడు. కానీ అదే క్షణంలో ఆయనలో అంతర్మధనం ప్రారంభమైంది. అశాశ్వతమైన రాజ్యం, సంపదల కోసం సొంత సోదరుడినే చంపాలనుకోవడం తప్పని భావించాడు. తన రాజ్యాన్ని కూడా ఏలుకోమని తన సోదరుడికి చెప్పి వైరాగ్యంతో తపోసీమలకు వెళ్లిపోయాడు.
‘త్రయోత్సర్గ’... ఇదో సమాధి స్థితి. నిశ్చలంగా ఒకేచోట కదలకుండా నిలబడి ఆత్మ సాధన చేయడం. యోగమార్గంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రమే ఈ స్థితిలో తపస్సు చేయగలుగుతారు. బాహుబలి తన తపస్సుకు ఇదే మార్గాన్ని అనుసరించారు. శరీరం నిండా లతలు అల్లుకున్నా, చీమలు, పాములు పాకుతున్నా శిలావిగ్రహంలా నిలబడి ఆయన తపస్సును కొనసాగించినా ఆత్మసాక్షాత్కారం కలగలేదు. అప్పుడు తండ్రి రిషభదేవుడు ‘అహంకారం అనే ఏనుగును దిగ’మని సందేశం పంపారు. బాహుబలి అహంకార విముక్తిని, తద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందాడు. తర్వాత తీర్థంకరుడిగా జైన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు.
* బాహుబలి కథే ఒక సందేశం....
* ఆత్మ విజయమే అసలు విజయం...
* ఆత్మ బలమే మహా బలం అని నిరూపించారు
* ఆశ, అహంకారం అనే రెండు బాహువులను నిర్వీర్యం చేసి తపస్సు, జ్ఞానం అనే దివ్య బాహువులను పొందిన మహనీయుడు బాహుబలి.
* ఉపవాసం, ధ్యానం, పరోపకారం, తీర్థంకరుల బోధనలను ఆచరించడం... జైనుల నిత్యజీవన శైలి.
* జైనులు బాహుబలిని గోమఠేశ్వరుడని కూడా ఆప్యాయంగా పిలుచుకుంటారు.
* శ్రావణబెళగొళలోని గోమఠేశ్వరుడి యాభై ఏడు అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చంద్రగిరి కొండల్లో చాముండరాయ సేనాపతి నిర్మించారు.
* పన్నెండేళ్లకోసారి ఆయనకు మహామస్తకాభిషేకం చేస్తారు.
- కాటూరి రవీంద్ర త్రివిక్రమ్
బాహుబలికి మహామస్తకాభిషేకం!
ప్రముఖ జైన క్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెళగొళ ఒకటి. అక్కడి గోమఠేశ్వరుడికి పన్నెండేళ్లకోసారి మహామస్తకాభిషేకాషాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ లక్షల జనం హాజరవుతారు. ఫిబ్రవరి 17 నుంచి 25 వరకూ జరగనున్న ఈ ఉత్సవాలకు ఏడోతారీఖున నాంది పలకనున్నారు.
శ్రావణబెళగొళ పేరు పరిచయమున్నవారెవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కడ కొలువై ఉండే ఎత్తైన గోమఠేశ్వరుడి విగ్రహమే. పొడవాటి చేతులూ బలిష్ఠమైన దేహం నిర్వికారమైన నవ్వుతో దిగంబరుడిగా కనిపించే ఈయన్నే బాహుబలి అనీ పిలుస్తారు. జ్ఞాన బోధకుడిగా, అహింసా మార్గాన్ని అనుసరిస్తూ శాంతిని పాదుగొల్పిన మహనీయుడిగా ఆయనకు జైన మతంలో పవిత్రస్థానముంది. కర్ణాటకరాష్ట్రం హాసన జిల్లా శ్రావణబెళగొళలో ఉన్న ఈయన విగ్రహానికి ఈ ఏడాది 89వ మహామస్తకాభిషేకాన్ని నిర్వహించనున్నారు.

ఎవరీ బాహుబలి...
జైన, విష్ణు పురాణాల్లో బాహుబలి ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం, జైన తీర్థంకరుల్లో మొదటివాడూ ఇక్ష్వాకు వంశస్థుడైన వృషభనాథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలన చేసేవాడు. ఆయనకు సునందాదేవి, యశస్వతీదేవి అనే ఇద్దరు భార్యల ద్వారా భరతుడు, బాహుబలి అనే పుత్రులు కలిగారు. కొన్ని కారణాలవల్ల వృషభనాథుడు విరక్తుడై రాజ్యాన్ని విభజించి అయోధ్యకు భరతుడినీ, పోదనపురానికి(ఇప్పటి తెలంగాణలోని బోధన్‌ను) బాహుబలినీ రాజులుగా చేసి సర్వసంగపరిత్యాగుడయ్యాడు. జైత్రయాత్రలో భాగంగా బాహుబలితోనూ భరతుడు యుద్ధం చేయాలనుకున్నాడు. ఇద్దరూ యుద్ధ విద్యాసంపన్నులు కాబట్టి వీరి పోరు వల్ల అపార సైన్య నష్టం వాటిల్లుతుందని భయపడ్డ ఇరు పక్షాల మంత్రులూ సోదరులిద్దరే ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనను వీరిద్దరూ అంగీకరించారు. మల్లయుద్ధంలో బాహుబలి భరతుణ్ణి పిడికిలితో గుద్ది చంపేయాలని చెయ్యి పైకెత్తాడు. అప్పుడు సోదరుడి కళ్లలో మరణ భయాన్ని చూసి చలించిపోయిన బాహుబలి, వెంటనే విరక్తుడయ్యాడు. రాజ్యం కోసం అన్నతో యుధ్ధమా అని బాధపడి, తన రాజ్యాన్ని సైతం భరతుడికి అప్పగించి, సన్యాసం తీసుకుని తపస్సుచేసి మహత్తర జ్ఞాన సంపన్నుడయ్యాడు.

అదే స్ఫూర్తితో...
అప్పట్లో బాహుబలి పాలించిన బోధన్‌లో అతి ఎత్తైన బాహుబలి విగ్రహం ఉండేదట. దాని స్ఫూర్తితో అప్పటి గంగరాజుల మంత్రి చాముండరాయ కర్ణాటకలోనూ అలాంటిదే నిర్మించాలని తలపెట్టి జైన మతానికి ఆలవాలంగా ఉన్న వింధ్యగిరిపై క్రీ.శ.981లో దీన్ని ప్రతిష్ఠించి పన్నెండేళ్లకొకసారి మహామస్తకాభిషేకాన్ని జరిపే ఆనవాయితీని ప్రారంభించాడు. విగ్రహాన్ని చెక్కించాడు కాబట్టి తనొక్కడే దానికి అభిషేకం చేయాలని భావించి తొలుత అభిషేకోత్సవాల్లో ఎవర్నీ పాల్గొననివ్వలేదు. తెప్పించిన ద్రవ్యాలన్నీ అయిపోయినా బాహుబలి విగ్రహం కాళ్లదాకా తడవకపోవడం వల్ల అక్కడికి వచ్చిన ఒక వృద్ధురాలు తాను తెచ్చిన పాలు పోస్తానని అడగడంతో తప్పని పరిస్థితుల్లో ఆమెను అనుమతించాడట. అయితే ఆ పాలు విగ్రహాన్ని తడపడమే కాదు నేల మీది దాకా ఒక ధారలా ప్రవహించాయట. ఆ రోజు చాముండరాయ కళ్లు తెరిపించింది జైన దేవతేనని చెప్పుకుంటారు. అప్పటి నుంచీ ఆ వేడుకకి హాజరయిన జనమంతా అభిషేకంలో భాగస్వాములవుతూ ఉంటారు. 17వ తారీఖు నుంచి జరగబోయే ఈ అభిషేకానికి నీళ్లు, పసుపు, చందనం, సర్వౌషధి కషాయం, పువ్వులూ తదితరాలను వినియోగిస్తారు. విగ్రహానికి ఎదురుగా కూర్చుని ఆరువేల మంది దాకా పూజలు తిలకించొచ్చు. ఈ కొండకు ఎదురుగా ఉండే చంద్రగిరిపైనుంచీ రెండు లక్షల మంది వేడుకను వీక్షించగలిగేలా ఏర్పాట్లు చేశారు.
- జి.జగదీశ్వరి, న్యూస్‌టుడే, బెంగళూరు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565