మాట వినడంలేదా... అందుకేనేమో!
చేతిలోని బొమ్మను గట్టిగా నేలకేసి కొట్టి, విసురుగా గదిలోకి వెళ్లిపోయింది ఆరేళ్ల సుధ. లోపలికి వెళ్లి తలను గోడకేసి కొట్టుకోవడం ప్రారంభించింది. ‘మంకు పట్టు, ఫోన్ తీసుకుంటేనే ఇంత కోపమా..’ అంటూ తల్లి లోపలికి వెళ్లి, ఆ పాప వీపుపై మరో రెండు దెబ్బలు వేసింది.
ఎనిమిదేళ్ల విజయ్... చాలా గట్టిగా మాట్లాడతాడు. అల్లరి. మాట వినడు. చురుకే కానీ నిలకడ లేదు. చదువూ అంతంత మాత్రమే. ఏం చేస్తే మాట వింటాడో తెలియదు అంటుంది వాళ్లమ్మ.
వీళ్లనే కాదు... చిన్నవయసులోనే మంకుపట్టూ, పేచీకోరు తత్వం.. వంటివన్నీ అతిగారం వల్లే అని తల్లిదండ్రులు అనుకుంటే... కాదు అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ కావచ్చని చెబుతారు డాక్టర్లు. ఈతరం చిన్నారుల్లో ఎక్కువశాతం మందిలో ఈ సమస్య సర్వసాధారణం అంటున్నారు.
పైవి సాధారణంగా కనిపించే లక్షణాలు అయితే...
* స్కూలుకెళ్లే పిల్లలు చెప్పిన సమయానికి హోంవర్క్ చేయకపోవడం...
* దేనిమీదా ఏకాగ్రత లేకపోవడం, కుదురుగా ఉండకపోవడం...
* ఎదుటివాళ్లు చెప్పేది వినకపోవడం...
* అతి చురుకు... భరించలేని దుడుకుతనం... ఇవన్నీ ఆ లక్షణాలే.
పండగ వస్తోంది. దుస్తులు కొనడానికి గౌతమ్‌తో షాపింగ్‌కు వెళ్లింది వాణి. అక్కడ గౌతమ్ అల్లరి హద్దులు దాటిపోయింది. ఏ దుస్తులు చూపించినా ఓ వైపు వద్దని చెబుతూ, మరో వైపు వేరే పిల్లల వద్ద ఉన్న బొమ్మల్లాంటివి తనకూ కావాలంటూ వాడు చేస్తున్న మారాం చూస్తే వాణీకేం చేయాలో తోచలేదు. కాసేపటికి కొంటావా లేదా అంటూ.. కిందపడి ఏడవడం మొదలుపెట్టాడు. తాము కోరుకున్నది వెంటనే దక్కకపోతే పిల్లలు ఈ రకంగా ప్రవర్తించడం కూడా వారిలో ఉన్న హైపర్ యాక్టివిటీ ప్రభావమే అంటున్నారు నిపుణులు. మరి కొందరు చిన్నారులయితే తల్లిదండ్రుల మాటకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు. చిన్నారుల్లో కనిపించే ఈ విపరీత ప్రవర్తనను నియంత్రించడం అనుకున్నంత సులువేం కాదు.
చురుకే కానీ...
ఈ చిన్నారులు సాధారణంగా చాలా తెలివైనవారే. అందులో సందేహం లేదు. కానీ ఇతర అంశాల్లో మాత్రమే వీరు చురుగ్గా ఉంటారు. చదువు విషయంలో ముఖ్యంగా తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినడానికి మాత్రం ఆసక్తి చూపించరు. ఎందుకంటే వీరు ఆడే వీడియోగేమ్స్, ఇతర ఆటలు చాలా వేగంగా ఉంటాయి. దాంతో పోల్చుకుంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చాలా నెమ్మదిగా అనిపించి, పూర్తిగా అనాసక్తులవుతారు. ఏకాగ్రతను కోల్పోతారు.
తల్లిదండ్రులూ కారణమే...
నెలలు నిండకుండానే పుట్టడం, మెదడు అమరికలో లోపాలూ, జన్యుపరమైన సమస్యలూ, పోషకాహార లోపం వంటివి ఈ సమస్యకు దారితీస్తాయి. కొన్నిసార్లు ఇంటి వాతావరణం కూడా పిల్లల్లో ఈ సమస్యను పెంచుతుంది. తల్లిదండ్రులు ఉద్యోగులు కావడం... పిల్లలతో కలిసి గడిపే సమయం తక్కువైపోవడంతో వారు ఒంటరితనానికి గురి అవుతున్నారు. దాంతో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు దృష్టంతా తమపైనే ఉండాలనే ఉద్దేశంతోనూ అతిగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. సమస్య ఉన్నా, కారణం ఏదయినా వీరిలో తెలివితేటలు మాత్రం ఎక్కువే. ఏ విషయాన్నైనా క్షణాల్లో పట్టేసేంత చురుగ్గా ఉంటారు. అన్నీ వేగంగానే చేస్తారు. అందుకే చేతిరాత కూడా బాగోదు. అలాగని వీరు అసమర్థులు కారు.
సాధారణంగా ఈ ప్రవర్తన మూడు స్థాయుల్లో ఉంటుంది. మొదటి రెండు దశల్లో తల్లిదండ్రుల చేయూతతోనే వారిలో మార్పు తీసుకురావచ్చు. సమస్య మూడో దశలో ఉంటే గనుక మానసిక వైద్య నిపుణుల దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. ముఖ్యంగా బిహేవియరల్ థెరపీ ద్వారా మార్పు తెస్తారు.
ప్రణాళిక పెట్టాలి...
వాళ్ల జీవనవిధానంలోనే కాదు, కుటుంబపరంగానూ కొన్ని మార్పులు చేయడం కూడా అవసరమే. * చిన్నారులకు సమయాన్ని కేటాయించాలి. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. వారు ఏం చెబుతున్నారో ప్రశాంతంగా వినాలి. వారికోసమే ఉన్నామనే విషయాన్ని చిన్నారులకు తరచూ తెలియజేయాలి. వీరితో కలిసి ఆడటం, కబుర్లు చెప్పడం, అనుక్షణం బిజీగా ఉంచడం వంటివి చేయడం వల్ల నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది. * కొందరు తల్లిదండ్రులు ‘నీకు నలుగురిలో ఎలా ఉండాలో తెలియదు..’ అంటూ వారిని బయటకు తీసుకెళ్లరు. కానీ అది పొరపాటు. దగ్గర్లోని పార్కులకూ, బంధువుల ఇళ్లకు తీసుకెళ్లాలి. నలుగురిలో ఎక్కువగా కలవనివ్వాలి. దానివల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది వారే నెమ్మదిగా నేర్చుకుంటారు. * వారిలో ఏకాగ్రత పెరిగేలా చెస్, మ్యాపింగ్, స్పెల్లింగ్ బీ, సుడోకు, పదబంధాలు పూర్తిచేయించడం, వర్డ్ గేమ్స్... వంటివి ఆడించాలి. వీటితో వారిలో నెమ్మదిగా ఏకాగ్రత పెరుగుతుంది. ఒకసారి ఏకాగ్రత పెరిగిందంటే చాలు, ఈ తరహా చిన్నారులు చదువులో ముందుంటారు. * వాళ్ల దినచర్యకు ఓ పక్కా ప్రణాళిక ఉండాలి. నిద్ర లేవడం నుంచీ రాత్రి నిద్రపోయేదాకా అన్నీ ఆ ప్రణాళిక ప్రకారం చేసేలా చూడాలి. అందులో హోంవర్క్ కూడా ఒకటి. కొన్నిరోజులు మీరు పక్కన ఉండి చేయిస్తే... క్రమంగా అలవాటు పడిపోతారు. * పిల్లల ప్రవర్తనను బట్టి ఓ చార్టు పెట్టి మార్కులు లేదా స్టార్ ఇవ్వడం వల్లా వారిలో మార్పు వస్తుంది. అప్పుడప్పుడూ ఓ బహుమతి ఇస్తే... ఇంకా ఎలా మారాలా అని ఆలోచిస్తారు. * వ్యాయామం కూడా తప్పనిసరే. రోజూ ఓ గంట ఆడనిచ్చేలా చూడటమే కాదు, నడకా, తాడాట వాళ్లకిష్టమైన క్రీడ నేర్పించినా మంచిదే. వారికో వ్యాపకం ఉంటుంది. |
ఆహారంలోనూ మార్పులు
ఈ
చిన్నారులకు అందించే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. తీపి, కెఫీన్ ఉండే
పదార్థాలూ, శీతలపానీయాలు వంటివి తగ్గించాలి. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంచాలి.
పండ్లూ, కూరగాయలూ, ఇంట్లో వండిన పోషక పదార్థాలు ఎక్కువ తినిపించాలి. ఒమెగా
త్రీ, సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా అందించాలి. |
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565