జయ, విజయులు అంటే ఎవరు?
వైకుంఠంలో శ్రీమహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వారపాలకుల పేర్లు జయుడు, విజయుడు. ఆ ఇద్దరూ పరమ విష్ణుభక్తులు. నిరంతరం శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ తరిస్తూ ఉండేవారు. శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వచ్చేవారిని ముందుగా ఆ ఇద్దరూ విషయం అడిగి లోపలికి ప్రవేశపెట్టడం అలవాటు. ఒక రోజున సనక, సనందన, తదితర మహామునులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు. వారు బ్రహ్మ మానసపుత్రులు. ఎంతో గొప్ప మహిమ గలవారు కూడా. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే మహనీయులు ఆ మునులు. పైగా ఎప్పటికీ ఆ మునులకు అయిదు సంవత్సరాల వయస్సువారిలాగే కనిపించే వరం కూడా ఉంది. శ్రీమహావిష్ణు దర్శనం కోసం ఆరు ద్వారాలు దాటి వైకుంఠంలో ఉన్న ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న జయవిజయులు వారిని లోపలికి పోనీయకుండా అడ్డగించారు. జయవిజయులు ఆ మునుల గొప్పతనాన్ని గ్రహించలేక వారిని పసిపిల్లలుగా భావించి లోపలికి వెళ్లడానికి వీలులేదని తూలనాడారు. శ్రీహరిని దర్శించుకోవడానికి వచ్చిన సనక సనందులకు జయవిజయుల ప్రవర్తన బాగా కోపాన్ని తెప్పించింది. వెంటనే వారు జయవిజయులను పాపాలకు నిలయమైన భూలోకంలో పుట్టమని శపించారు. తమను అడ్డగించినందుకు అదే శిక్ష అని అన్నారు. ఆ మునుల శాప వచనాలు విని జయవిజయులు గడగడలాడారు. తాము చేసిన అపచారాన్ని మన్నించమని, శ్రీమహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాపవిమోచనం ప్రసాదించమని ప్రార్థించారు. సనక, సనందుల, జయవిజయుల సంభాషణలు లోపల లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీమహావిష్ణువుకు వినిపించాయి. వెంటనే ఆయన బయటకు వచ్చాడు. శ్రీమహావిష్ణువును మునులు అనేక విధాలుగా స్తుతి చేశారు. విష్ణువు వారిని ఆశీర్వదించి తన సేవకులు చేసినది అపచారమేనని, ఆ అపచారానికి వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను దేవుడు అనునయించాడు. అప్పుడు ఆ మునులు శ్రీమహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తరువాత జయవిజయులు విష్ణువు పాదాలపై పడి తమను మునుల శాపం నుంచి రక్షించమని వేడుకున్నారు. కానీ విష్ణువు వారి శాపాన్ని అనుభవించాల్సిందేనని పలికాడు. ఆ మాటలకు విపరీతమైన దుఃఖం కలిగిన ఆ సేవకులు శ్రీమహావిష్ణువును విడిచి తాము ఉండలేమని, ఏవిధంగానైనా శాపవిమోచనం కలిగించమని మరీ మరీ వేడుకున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు వారికి అభయాన్నిస్తూ మునుల శాపాన్ని మూడు జన్మల వరకూ అనుభవించమని, ఆ జన్మల్లో తనకు బద్ధవిరోధులైన రాక్షసులుగా వారు జన్మిస్తారని, తన చేతిలో హతమైన తరువాత మళ్ళీ వైకుంఠానికి రావచ్చని, అది ఒక్కటే తనను తొందరగా చేరటానికి మంచి మార్గమని చెప్పాడు. విష్ణువు వచనాలు ముగియగానే జయవిజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు. కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే సోదరులుగానూ, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగానూ, ద్వాపరయుగంలో శిశుపాల, దంతవక్త్రులుగానూ జన్మించి విష్ణువుతో పోరాడారు. వరాహ రూపం ఎత్తి విష్ణువు హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని, రామావతారం ఎత్తి రావణ, కుంభకర్ణులను, కృష్ణావతారంలో శిశుపాల, దంతవక్త్రులను శ్రీ మహావిష్ణువు సంహరించాడు. అనంతరం జయవిజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు.జయ, విజయుల విగ్రహాలను వైష్ణవ ఆలయాల్లో చూడవచ్చు. తిరుమల శ్రీనివాసుని ఆలయంలో గరుడాళ్వర్ ఎదురుగా వుంటారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565