కలి-కల్కి
లోకంలో ధర్మం గాడి తప్పినప్పుడు, తిరిగి దాని ప్రతిష్ఠాపన కోసం భగవానుడు అవతారం ధరిస్తాడు. తాను సృజించినది (సృష్టి) ధర్మనియతితో క్రమపద్ధతిలో సాగేలా చేస్తాడు. ధర్మసంస్థాపనే ధ్యేయంగా గల ఆయన, అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మళ్లీ పరిక్రమ (విహారం) ప్రారంభిస్తాడు.
అనంతమైన కాలప్రవాహాన్ని రుషి ప్రపంచం- కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా విభజించింది. ఇది కలియుగంలోని ప్రథమపాదం. యుగానికి నాలుగు పాదాలుంటాయి. శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి రోజు నుంచి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. అందరూ అభిలషించేది సత్యయుగం. ఇందులో మనుషుల మధ్య మధుర బంధాలుంటాయి. శీలసంపదతో భాసించడం, యజ్ఞ యాగాదులతో పాటు పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యాలు నిర్వహించడం- సత్యయుగ లక్షణాలు. ప్రకృతిని పరమాత్మగా పూజిస్తారు. ఈ గుణాలన్నింటినీ పురాణ వాంగ్మయం వర్ణించింది. ఇటువంటి గుణాలు పరిఢవిల్లే కాలమంతా స్వర్ణయుగం. ఈ సద్గుణాలు అన్ని కాలాలకూ వర్తించేవిగా ఉండాలి. వేదోపనిషత్తుల సంగ్రహ సారమూ ఇదే! కాలం మార్పులకు గురవుతుంటుంది. మానవ చిత్తప్రవృత్తులు మారుతుంటాయి. నిలకడ లేని విధివిధానాలు, భ్రమలు, ఆరాటాలు చుట్టుముడుతుంటాయి. తాపత్రయాలతో మనిషి సతమతమవుతుంటాడు. దీనికి కారణం కలి ప్రభావం అంటారు.
మహావిష్ణువు దశావతారాల్లో చివరిది కల్కి. లోకంలో సద్గుణాలు లోపిస్తే, వక్రగతుల జీవన విధానాలు వ్యాపిస్తే, శారీరక మానసిక సామాజిక రుగ్మతలు ఏర్పడితే- అది కలి ప్రభావమేనని గ్రహించాలి. ధర్మ ప్రామాణికాలు మృగ్యమవుతాయి. అలజడులు, ఆరళ్లతో అసలు ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా ‘కలి రాజ్యం’ కాక మరేమిటి! దీనికి సంబంధించి, జనబాహుళ్యంలో ఒక నానుడి ఉంది. ఎక్కడైనా అన్యాయమో, అఘాయిత్యమో జరిగితే ‘కలికాలం-చెడు బుద్ధులు’ అంటుంటారు.
కలి ప్రవేశం ఎలా జరుగుతుంది? అశుచి, దుష్ట సంస్కృతి పట్ల మనిషి మనసు ఆకర్షితం కావడం, అతడిలో దుర్మార్గపూరిత ఆలోచనలు రేగడమే కలి ప్రవేశంగా భావిస్తారు. నిషధ దేశానికి రాజు నలుడు. అతడు సదాచార సంపన్నుడు. ఒకసారి అశౌచం కారణంగా, అతడిలో కలి ప్రవేశించింది. వెంటనే తన మార్గాన్ని విస్తృతం చేసుకుంది. అంటే- ఒక్క దుర్లక్షణం ఏర్పడితే, వరసగా ఒకదాని వెంట మరొకటి చేరతాయి. అలా నలమహారాజు జూద వ్యసనానికి లోనై, రాజ్యాన్ని పోగొట్టుకొని, ధర్మపత్ని దమయంతితో అరణ్యాల పాలయ్యాడు. ఆ జూద వ్యసనమే మహాభారతంలో కురుపాండవుల మధ్య ఘర్షణ రాజేసింది. కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది.
పరీక్షిన్మహారాజు ధర్మబద్ధంగా పాలన సాగించి, కలిని తన రాజ్యంలో లేకుండా చేస్తాడు. కలియుగంలో కలి ప్రభావాన్ని అంతమొందించేందుకు శ్రీమహావిష్ణువు కల్కి అవతారం ధరిస్తాడు. ఆయన శంబల గ్రామవాసి విష్ణుయశుడికి తనయుడై జన్మిస్తాడంటుంది దశావతార గాథ! దేవదత్తం అనే గుర్రాన్ని అధిరోహించి, ఖడ్గాన్ని చేత ధరించి, కలి ప్రభావాన్ని రూపుమాపుతాడని చెబుతుంది. అశ్వం వేగానికి చిహ్నం. తెలుపు శాంతికి, స్వచ్ఛతకు, సత్వగుణానికి ప్రతీక. ఖడ్గం- చెడును ఖండించే ఆయుధం.
మానసిక కాలుష్యం మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తోంది. మనిషి తనకు తానే సమస్యగా మారుతున్నాడు. కలి ప్రభావం మానవాళిపై పడకుండా, వారిని జాగృతపరచడమే మహాపురుషులు చేసే కృషి. సత్పురుషులు, సత్వగుణ సంపన్నులే నారాయణ స్వరూపులు. తనలోని చెడును, అహాన్ని, అసూయా ద్వేషాల్ని తొలగించుకొని అంతరంగ శుద్ధితో పరిశ్రమించే ప్రతి మనిషీ జ్ఞానసిద్ధుడు.
మీన రూపుడైన మహావిష్ణువు వేదాల్ని రక్షించడంతో దశావతారాలు మొదలయ్యాయి. ఇందులో మానవ జీవన పరిణతిని గ్రహించవచ్చు. మనిషి తాను సముపార్జించిన జ్ఞానంతో ఎదుగుతూ, చెడును నిర్జించే శక్తిగా వెలుగొందాలి. దశావతారాల్లోని అంతరార్థాన్ని గ్రహించడం ద్వారా అతడు తన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి!
- దానం శివప్రసాదరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565