MohanPublications Print Books Online store clik Here Devullu.com

మంత్రం మననం_MantraMananam



మంత్రం మననం MantraMananam Mantra Dhayanam Dyanam Meditation Japam Japa BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Japamala



మంత్రం మననం


‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః’- మననం చేస్తూండడం వల్ల రక్షించేది మంత్రం. మంత్రం అనేది ఒక దేవతకు శబ్ద రూపం. మననం అంటే అదే పనిగా మంత్రాన్ని మానసికంగా వల్లె వేసుకోవడం! మంత్రాన్ని స్మరించుకోవడం కూడా మననమే! మంత్ర మననాన్ని భావంతో చెయ్యాలి. ‘భావే చోప లబ్ధేః’ అని బ్రహ్మసూత్రం. అంటే ‘భావంలోనే దొరుకుతుంది’ అని అర్థం. మంత్ర మననం, మంత్ర జపం మంత్ర యోగం అవుతాయి. మంత్ర యోగం దేవతతో సమన్వయాన్ని (సింథసిస్‌) ఇస్తుంది. ‘తతు సమన్వయాత్‌’ అని ‘బ్రహ్మసూత్రం’ చెబుతోంది. ఇక్కడ ‘తత్‌’ అని అన్నది పరమాత్మ అయిన బ్రహ్మన్‌ను ఉద్దేశించే అయినా, ఈ సమన్వయం (కో-ఆర్డినేషన్‌ కాదు) అన్నది ఉద్దేశించబడిన ఏ దేవతకైనా పొసుగుతుంది.

మూడు రకాల జపం!
మంత్ర జపాన్ని మాలతో చేస్తారు. లేదంటే చేతి వేళ్ల కణుపులతో లెక్కించుకుంటూ చేస్తారు. మంత్ర జపం మూడు రకాలు. 1. మానసిక జపం 2. ఉపాంశు జపం. 3. వైఖరీ జపం. మంత్రాన్ని మానసికంగా జపించడం ‘మానసిక జపం’ అవుతుంది. మంత్రాన్ని శబ్దించకుండా నోటితో అనుకుంటూ జపించడం ‘ఉపాంశు’ అవుతుంది. మంత్రాన్ని బయటకు వినిపించేట్లుగా ఉచ్చరిస్తూ జపించడం ‘వైఖరీ జపం’ అవుతుంది. వీటిలో మానసిక జపం ఉత్తమం. ఉపాంశు జపం మధ్యమం. వైఖరీ జపం అధమం.
దేవనాగరి లిపిలో పదహారు అచ్చులు, ముప్ఫైఅయిదు హల్లులు... మొత్తం యాభై ఒక్క అక్షరాలు కదా! ‘అ’ కారం నుంచి ‘క్ష’ కారం వరకూ ఉన్న వర్ణాలను ‘మాతృక’ అని అంటారు. ఆ మాతృక ఆధారంగానే మంత్రాలు పుట్టాయి. మంత్రాలకు మూలాలు వేదాలలోనూ, తంత్ర గ్రంథాలలోనూ ఉన్నాయి.
మంత్రాలలో లింగ భేదాలు
నిజానికి, మంత్రాలు ప్రార్థనలు, కీర్తనలు కావు. మంత్రాలు ఋషులతో ఒక నియమిత పద్ధతిలో నిర్మించబడ్డాయి. మంత్రం అనేది దేవతకు సంకేతం. దానికి నిర్ణీతమైన ’ఒక శబ్ద క్రమం’ ఉంటుంది. మంత్రాలలో ‘ఓం’ కారానికి ప్రత్యేకమైన స్థానముంది. ‘మంత్రాణాం ప్రణవ శ్శిరః’. ఓంకారం మంత్రానికి శిరస్సు. ఓంకారం సర్వాంతర్యామి అయిన బ్రహ్మన్‌కు పేరు. ‘తస్య వాచకం ప్రణవం’ అని పతంజలి యోగ సూత్రాలలో చెప్పారు. ఒక మంత్రాన్ని ‘ఓం’ కారంతో మొదలుపెట్టాలి.

ఈ మంత్రాలలో పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగ భేదాలున్నాయి. పుంలింగ దేవతలవి... పుంలింగ మంత్రాలు. స్త్రీ లింగ దేవతలవి... స్త్రీలింగ మంత్రాలు. పుంలింగ మంత్రాలను ‘సౌర మంత్రాలు’ అని అంటారు. స్త్రీ లింగ, నపుంసక లింగ మంత్రాలను ‘సౌమ్య మంత్రాలు’ అంటారు. స్త్రీ లింగ మంత్రాలను ‘విద్య’ అని కూడా అంటారు. పుంలింగ మంత్రాలు ‘హుం’ లేదా ‘ఫట్‌’ అని ముగుస్తాయి. స్త్రీ లింగ మంత్రాలు ‘స్వాహా’ లేదా ‘ఠం’ అని ముగుస్తాయి. నపుంసక లింగ మంత్రాలు ‘నమః’ అని ముగుస్తాయి. ‘నమః’ అని ముగిసే నపుంసక లింగ, లేదా ‘పౌరాణిక’ మంత్రాలో శక్తి, జీవం ఉండవు అని ‘శారదా తిలక’, ‘ప్రపంచ సార’ లాంటి గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎంతో ముఖ్యమైన ఈ విషయం వాడుకలో లోపించింది.

సరిగ్గానే జపిస్తున్నామా?
కాలక్రమంలో తప్పులు దొర్లడం అన్నది మంత్రాల విషయంలోనూ జరిగింది. ఏడు కోట్ల మంత్రాలు ఉండేవని తెలుస్తోంది. కానీ మనకు ఇప్పుడు చాలా కొద్ది మంత్రాలు మాత్రమే తెలుస్తున్నాయి. అవీ తప్పులతోనే మనలో చలామణిలో ఉన్నాయి. గాయత్రీ మంత్రం మొదలుకుని ప్రతి మంత్రమూ తప్పులతోనే వాడుకలో ఉంది.

జాగ్రత్తగా తెలుసుకోవలసినదేమిటంటే పుంలింగ దేవతల మంత్రాలు ‘హుం’ లేదా ‘ఫట్‌’ అనే శబ్దాలతోనే ముగియాలి. స్త్రీ లింగ దేవతల మంత్రాలు ‘స్వాహా’ లేదా ‘ఠం’ అనే శబ్దాలతోనే ముగియాలి. ఇవాళ మనంపుంలింగ మంత్రాలనూ, స్త్రీ లింగ మంత్రాలనూ కూడా ‘నమః’ అన్న శబ్దంతో ముగిస్తున్నాం. అంటే మనం ‘శబ్దం ద్వారా మంత్రాలను నిర్వీర్యం చేసేసుకుంటున్నాం’ అన్నది నిజం. ఇప్పటికైనా మనం ఈ తప్పును సరిదిద్దుకోవాలి.

మంత్రం దైవత్వం. శబ్దరూపమైన దైవశక్తి. ‘నిర్ణీతమైన ఆ శబ్దరూపం పాడవకూడదు. దైవత్వం చెడకూడదు’ అని గుర్తుంచుకొని, ప్రామాణికమైన తంత్ర గ్రంథాల ఆధారంగా మంత్రాన్ని శబ్ద దోషం లేకుండా మననం చేసుకుంటూ, అనుసంధానం చేసుకోవాలి.
రోచిష్మాన్‌

1 comment:

  1. ‘స్వాహా’ ఫట్‌’ ane sabdalato unde mantralu aadavaaru japinchakoodadu antaru. asalu e mantralanu evaru japinchachochu. mantralaki unde niyamaalalu enti enka vivaram ga cheppagalaru.

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list