ఇంటి రుణం.. భారం తగ్గాలంటే..
గృహరుణం.. ఒక వ్యక్తి జీవితంలో ఇదో అతి పెద్ద అప్పు. సొంతింటి కలను నిజం చేసుకోవాలని భావించేవారు.. ఈ అప్పుతో తమ లక్ష్యాన్ని సులభంగా తీర్చుకోవచ్చు. అయితే, ఈ దీర్ఘకాలిక రుణానికి నెలనెలా వాయిదాలను చెల్లించడం అన్ని వేళలా సులభమేమీ కాదు. అప్పు తీసుకునేప్పుడూ.. ఆ తర్వాత తీర్చే సమయంలోనూ రుణగ్రహీతలు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.. అవేమిటో చూద్దామా!
క్రెడిట్ స్కోరును చూసుకోండి...
మీరు ఇప్పటికే తీసుకున్న అప్పులను ఎలా చెల్లించారో తెలిపేది క్రెడిట్ స్కోరు. ఈ స్కోరు 700కన్నా అధికంగా ఉన్నప్పుడు గృహరుణానికి ఏ ఇబ్బందీ ఉండదు. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పుడు సులభంగానే మీ రుణ మంజూరు ప్రక్రియ వేగంగానే సాగుతుంది. క్రెడిట్ స్కోరు రుణం మంజూరీలో కీలకమే కాకుండా.. ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థ మీకు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తుందని నిర్ణయించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే.. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు రుణాన్నిస్తాయి. అదే సమయంలో మీ ఆస్తి విలువలో 80-90శాతం వరకూ రుణం పొందేందుకు అవకాశం కల్పిస్తాయి. అందుకే, ముందుగా మీ క్రెడిట్ స్కోరును పరిశీలించుకోండి. ఏదైనా తప్పులు ఉంటే దిద్దుకోండి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి కాస్త అధిక వడ్డీకి రుణం అందుతుంది.
బేరమాడండి..
చాలామందికి తమ క్రెడిట్ నివేదికను చూపించి వడ్డీ రేట్ల విషయంలో బేరమాడొచ్చనే సంగతి తెలియదు. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పుడు బ్యాంకు అధికారులతో మీకు అందిస్తున్న వడ్డీ రేటు విషయంలో బేరమాడేందుకు అవకాశం ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించడమో.. లేదా పరిశీలనా రుసుములు రద్దు చేయడమో చేయాల్సిందిగా కోరవచ్చు. దీనివల్ల మీపై అదనపు భారం లేకుండా ఉంటుంది.
తక్కువ వడ్డీకి ఎక్కడ..
ఇప్పటికే మీ పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచే ఇంటి రుణం తీసుకోవాలని అనుకోవద్దు. దీనికన్నా.. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయా చూసుకోవాలి. ముందుగా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? మీకు అవసరమైన మొత్తం రుణం లభిస్తుందా లేదా అనే విషయాల కోసం కొంత ముందస్తు సన్నద్ధత తప్పనిసరిగా అవసరం. మీకు ఇప్పటికే ఇంటి రుణం తీసుకొని ఉంటే.. ఏదైనా బ్యాంకు దీనికన్నా తక్కువ వడ్డీకే రుణం ఇస్తుందా పరిశీలించండి. వీలైనంత వరకూ ఎక్కడ తక్కువ వడ్డీకి రుణం దొరుకుతుందో చూసుకోండి. దీనివల్ల మీకు కొంత భారం తగ్గినా.. ఉపయోగమే కదా.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ముందస్తు చెల్లింపులు చేస్తే.. ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయవు బ్యాంకులు.
అధికంగా చెల్లించండి
రుణం తీసుకున్న తొలినాళ్లలో వీలైనంత వరకూ ఎక్కువ ఈఎంఐని చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే.. రుణం తీసుకున్న తర్వాత వాయిదాలు చెల్లిస్తున్నప్పుడు తొలినాళ్లలో వాయిదాలోని అధిక మొత్తం వడ్డీకిందకే వెళ్తుంది. దీనివల్ల మీకు అదనపు భారమే.. దీన్ని నివారించాలంటే.. మొదటి నెలల్లో కాస్త అధిక మొత్తంలో వాయిదాలు చెల్లించాలి. ఇక్కడ మరో విషయం.. ఎప్పుడైనా సరే.. బ్యాంకులు రుణ మొత్తంలో రుణగ్రహీతలు 15-20శాతం వరకూ ముందస్తు చెల్లింపు చేయాల్సిందిగా కోరుతుంటాయి. వీలైనంత మొత్తాన్ని మీరు చెల్లించి, మిగతాదే రుణం తీసుకోండి. మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లిస్తుంటే.. బ్యాంకులు కూడా మీకు రుణం ఇవ్వడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాయి. కొన్నిసార్లు తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు కూడా సిద్ధం కావచ్చు.
వీలైనంత ఎక్కువగా..
రుణ వ్యవధి కొనసాగుతున్నప్పుడు వీలైనప్పుడు కొంత మొత్తాన్ని అసలులో చెల్లించాలి. దీనివల్ల రుణం తొందరగా తీరేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికోసారి వచ్చే బోనస్‌లాంటివి ఇందుకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. పైగా అసలు మొత్తం తగ్గడంతో రుణం తొందరగా తీరేందుకు అవకాశం ఉంటుంది. మీరు ఎంత మొత్తం ఎక్కువగా కడితే.. అంత భారం తొందరగా తగ్గించుకోవచ్చు. గృహరుణ భారం తగ్గించుకోవాలంటే.. ముందుగా మన రుణ నిర్వహణ, పెట్టుబడుల ప్రణాళిక కచ్చితంగా ఉండాలి. అనుకోకుండా వచ్చిన డబ్బును రుణ చెల్లింపులకు వాడటం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది..
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565