సీతమ్మ జాడ ?
రామాయణ కథలో సీతమ్మ జాడను హనుమంతాదులు ఎలా తెలుసుకోగలిగారు? అనే విషయాన్ని ఒకసారిచూస్తే పాఠక లోకానికి ఆసక్తిని ఇనుమడింపచేసే సంఘటనలు ఎన్నెన్నో కనిపిస్తాయి. వానర వీరులు స్వయంప్రభ అనుగ్రహం మేరకు ఓ బిలం నుంచి బయటపడి వింధ్య పర్వత శిఖరానికి వారంతా చేరుకోగలిగారు కానీ అక్కడ శూన్యమైన ప్రాంతమే ఉన్నది. నర సంచారం ఏమాత్రం కనిపించలేదు. అలాంటి ప్రదేశంలో తమకు సీతమ్మ జాడ ఎలా తెలుస్తుందో కదా అని వానరులంతా ఒకచోట గుమికూడి కూర్చొని విచారించసాగారు. అప్పుడు యువరాజైన అంగదుడు మరీమరీ విచారిస్తూ రాజైన సుగ్రీవుడు ఇచ్చిన గడువుదాటితే కిష్కింధకుచేరి ప్రాణాలతో బతకటం అసంభవమని కాబట్టి కిష్కింధకు వెళ్ళకుండా అక్కడే కాలక్షేపం చేద్దామని తన భావాన్ని వ్యక్త పరిచాడు. కానీ అంతలోనే హనుమంతుడు కలుగచేసుకొని రాజశాసనాన్ని నెరవేర్చని సేవకుడు సేవకుడేకాదని అన్నాడు. పైగా ధర్మాత్ముడైన సుగ్రీవుడు తమను నమ్మి ఒక పెద్ద బాధ్యతను అప్పగించనప్పుడు దానిని నెరవేర్చకపోవడం సమంజసంకాదని అన్నాడు. పైగా తమతోపాటు వచ్చిన వానరవీరులంతా కిష్కింధలో తమ భార్యబిడ్డలను వదిలి వింధ్య పర్వతంమీద ఎన్నాళ్ళు ఉండగలరని ప్రశ్నించాడు. హనుమంతుడు ఎన్ని రకాలుగా చెప్పినా అంగదుడికి మనస్సు కుదటపడలేదు. తాను రామ కార్యాన్ని నెరవేర్చపోయినందువల్ల తనకు మరణంతప్ప వేరే మార్గం కనిపించటంలేదని చెప్పి దర్భలు పరిచి ప్రాయోపవేశం చేసుకోవటానికి అంగదుడు కూర్చున్నాడు. తమకు నాయకుడైన అంగదుడే అలా ప్రాయోపవేశానికి సిద్ధపడే సరికి మిగిలిన వానరులు కూడా అదే పద్ధతిని అవలంబించాల్సి వచ్చింది. అప్పుడు హనుమంతాదులను చూసి అంగదుడు పెద్దగా మాట్లాడుతూ జటాయువు తన పరాక్రమాన్నిచూపి రావణుడి చేతిలో మరణించిన చందంగానే తామంతా కూడా మరణిస్తున్నట్లు చెప్పాడు. ఆ మాటలను ఆ వింధ్య పర్వత పరిసరాల మీద ఏనాటినుంచో పడి ఉన్న జటాయువు సోదరుడు సంపాతివిన్నాడు. వెనువెంటనే సంపాతి వానరులందరిని చూసి పెద్దగా అరిచాడు. అసలు జనస్థానంలో జటాయువుకు, రావణుడికి యుద్ధంలో ఎందుకు జరిగిందో, ఆ యుద్ధంలో జటాయువు ఎందుకు మరణించాడో వివరించమని ప్రాధేయపడ్డాడు సంపాతి. ఉన్నట్లుండి జరిగిన ఆ సంఘటనకు వానరులంతా ఒక్కసారి ఉలిక్కిపడి ఆ మాటలు వినవస్తున్న దిశగా చూశారు. అప్పుడు సంపాతి గతంలో సూర్యకిరణాల వేడివల్ల తన రెక్కలు తగలపడ్డాయని అందుకే తాను వానరుల దగ్గరగా రాలేకపోతున్నానని, తనను కొండ శిఖరం మీద నుంచి మెల్లగా కిందకు దింపమని వేడుకున్నాడు. సంపాతి ఆకారాన్ని చూసి వానరులంతా క్షణకాలంపాటు భయపడ్డారు. కానీ అంగదుడు మాత్రంపక్షిరాజుకు తాము ఎవరికోసం వెతుకుతున్నది, ఎందుకోసం వెతుకుతుంది, జటాయువు ఎందుకు మరణించింది అన్నీ చెప్పి రావణ నివాసస్థానం తెలిసివుంటే చెప్పమని అన్నాడు. అప్పుడు సంపాతి తనకు రెక్కలు కాలిన సంఘటన దగ్గర నుంచి అన్నీ వివరించి రావణుడు లంకాధిపతిఅని, అతడే సీతమ్మను అపహరించి తీసుకుపోయాడని కూడా చెప్పాడు. తన సోదరుడు జటాయువు మరణవార్త విన్నందుకు తాను స్నానం చెయ్యాలని తనను మెల్లగా సముద్రం ఒడ్డుకు చేర్చమని వానరులను కోరాడు. వారు అలాగే చేశారు. సంపాతి స్నానంచేసి తర్పణాదులు ఆచరించి ఆ తరువాత సీతమ్మ జాడకు సంబంధించిన అనేకానేక విషయాలను వివరించి చెప్పాడు. రెక్కలు కాలి లేవలేనిస్థితిలో ఉన్న తనకు తన కుమారుడైన సుపార్మ్యుడు ప్రతిరోజూ ఆహారం తెచ్చిఇచ్చి పోషిస్తుంటాడని చెప్పాడు. ఓ రోజున సుపార్మ్యుడు తనకు ఆహారం తేవటానికి వెళ్ళి సాయంత్రం దాకా రాలేదని, తాను కోపగించి ఆలస్యం ఎందుకు అయిందో చెప్పమని కోరినప్పుడు అతడు ఒక విషయాన్ని చెప్పాడని అన్నాడు. మహేంద్ర పర్వత ద్వారం దగ్గర తాను పొంచి ఉన్నప్పుడు ఒక భయంకరాకారుడైన రాక్షసుడు ఒక స్త్రీని అపహరించి తీసుకువెళుతున్నాడని తాను ఆదారిలో ఉన్న కారణంగా తనను తొలగమని అడుగగా తాను తొలిగానని చెప్పాడని సంపాతి అన్నాడు. మహేంద్రగిరి ప్రాంతంలో సంచరిస్తున్న సిద్ధగణాలు కూడా భయపడ్డాయని, ఆ సిద్ధులను చూసి సుపార్మ్యుడు ఎందుకు భయపడుతున్నారని అని అడుగగా ఆ స్త్రీని అపహరించుకెళుతున్న రాక్షసుడు రావణుడని, వాడు సామాన్యుడుకాదని, ఆ స్త్రీ శ్రీరామచంద్రుడి భార్య అయిన సీతాదేవి అని సిద్ధులు చెప్పిన వివరణను తన కుమారుడు తనకు చెప్పినట్లు సంపాతి అంగదుడితో చెప్పాడు. లంక అక్కడికి దాదాపు నూరు యోజనాలదూరం ఉంటుందని, ఆ మధ్యలో సముద్రం ఉందని, దానిని దాటి వెళితే లంకను చేరవచ్చని కూడా సంపాతి చెప్పాడు. అసలు ఈ విషయమంత తనకు ముందెప్పుడో తెలుసునని, తన గురువైన నిరాకరుడు అనే ఒక మహర్షి తనకిదంతా చెప్పాడని చెప్పాడు. ఆయన నారదాదుని వల్ల రామకథను విన్నాడని అన్నాడు. నిరాకరుడు గొప్ప మహర్షి అని, నిత్యం సకల జంతు జాలాలు ఆయనను సేవిస్తుండేవని అన్నాడు. ఆ రోజులలో తాను, తన సోదరుడు మానవరూపాలలో వెళ్ళి నిరాకరుడిని సేవించుకుంటూ ఉండేవారమని అన్నాడు. ఆ కారణంగా ఆ మహర్షికి తన మీద ఎంతోప్రేమ ఉండేదని, తన రెక్కలు కాలినప్పుడు ఆ మహర్షి తనకు రెక్కలు ఇచ్చే శక్తి ఉన్నప్పటికీ సీతమ్మ జాడను రామసేవకులైన వానరులకు తెలియచెప్పే కార్యం ఉన్నందుకు వాటిని ఇవ్వలేదని, ఈ నాటికి తన బాధ్యత తీరినట్త్లెందని సంపాతి అంగదుడికి చెప్పాడు. అలా చెప్పీచెప్పగానే ఎంతో విచిత్రంగా సంపాతికి ముసలితనం పోయి గొప్పశక్తి, చూపు, రెక్కలు వచ్చాయి. వానరులంతా ఎంతో ఆనందించారు. లంకను ఎలా చేరటమా అని బలాబలాల సమీక్ష చేయసాగారు. అలా సంపాతి వల్ల సీతమ్మ జాడను అంగదాదులు తెలుసుకోగలిగారు. అనంతరం హనుమంతాదులు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఆంజనేయుడు లంఘించి లంకలో ప్రవేశించి సీతమ్మ జాడను తెలుసుకున్న గాధ తెలిసినదే.ఈ సంఘటన ఇలా రామాయణం కిష్కంధకాండలో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565