మంత్రాలయ యతీంద్రులు
‘ప్రహ్లాదుడు’ అనే మాటకు ఆనంద స్వరూపుడు అని అర్థం. ఆనందంతో ఉండేవాడు, దాన్ని పంచేవాడు ప్రహ్లాదుడు. మంత్రాలయ రాఘవేంద్ర యతీంద్రులను ప్రహ్లాదుడి అవతారంగా భావించడంలో రహస్యం అదే!
భాగవతంలో ‘కలడు కలడు అనెడివాడు కలడో లేడో’ అని కలవరపడిన సంశయాత్ముడు- గజేంద్రుడు. ‘ఎందెందు వెతికి చూసిన అందందే గలడు’ అంటూ సంబరపడిన నిశ్చయాత్ముడు- ప్రహ్లాదుడు. నిరంతరం ఆనందమయ స్థితిలో ఉంటూ, దైవం పట్ల నిశ్చయ జ్ఞానం కలిగిన సద్గురువు రాఘవేంద్రస్వామి. సాత్విక జీవన మార్గంలో భగవంతుణ్ని చేరుకొనే విస్పష్టమైన మార్గాన్ని బోధించి, ఆయన గుర్తింపు పొందారు.
రుగ్వేద భాష్యంలోని మొదటి 40 సూక్తులకు తొలిసారిగా ద్వైత సంప్రదాయంలో చేసిన వ్యాఖ్యానం ఆయనకు విశేష కీర్తిని అందించింది. ద్వైత సిద్ధాంతానికి, వైష్ణవ సంప్రదాయానికి విశ్వఖ్యాతిని చేకూర్చిన గొప్ప ఆచార్యుడిగా, దార్శనికుడిగా ప్రసిద్ధికెక్కారు. ఆయన రూపొందించిన మహిమాన్విత బృందావనం భక్తుల పాలిట కల్పవృక్షంగా, కామధేనువుగా ఇప్పటికీ మన్నన అందుకుంటోంది.
తిమ్మనభట్టు, గోపికాంబకు తిరుమలదేవుడి అనుగ్రహంతో జన్మించిన కారణంగా ‘వేంకట నాథుడు’ అని పేరుపెట్టారు. జాతక చక్రాన్ని పరిశీలించిన కుంభకోణ పీఠాధిపతులు సుధీంద్రతీర్థులు- ఆ బాలుడి ఆత్మతత్వాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కనిపెట్టారు. తన తదుపరి పీఠాధిపతి బాధ్యతను ఆయనకు అప్పగించాలని ఆదేశించారు. వేంకట నాథుడి ఏకాగ్రత, ఉపాసనా పటిమ గొప్పవి. ఒకసారి గంధం తీసే సమయంలో అగ్నిసూక్తం పఠించడం వల్ల, ఆ చల్లని చందనాన్ని ఒంటికి పూసుకొన్నవారికి కాలి మంటలు పుట్టాయట. వరుణసూక్తం పఠిస్తూ తీసిన గంధంతో, ఆ శరీర తాపం చల్లారిందని చరిత్ర చెబుతోంది. మహత్వపూర్ణమైన అటువంటి విశేషాలు ఆయన అనంతర కాలంలోనూ వెలువడ్డాయి.
థామస్ మన్రో కలెక్టరుగా ఉన్న రోజులవి. అప్పట్లో పీఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వాటిని రైతులకు పట్టాలుగా ఇచ్చేందుకు ఆయన వెళ్లారు. రాఘవేంద్రస్వామి దర్శనం లభించింది. తమ భూమి అసలు దస్తావేజులు ఎక్కడున్నాయో స్వామి తెలియజేశారట. వాటిని మన్రో వెతికి తీయించి, భూముల్ని తిరిగి పీఠానికి అప్పగించినట్లుగా ‘బళ్లారి గజెట్’లో ఆయన పేరిట ప్రచురితమైన లేఖ వెల్లడించింది.
రాఘవేంద్రస్వామి మధ్వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి, దేశమంతటా పర్యటించారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించారు. చంద్రిక, న్యాయ సుధ, తంత్ర దీపిక, న్యాయ ముక్తావళి వేదాంత గ్రంథాల్ని రచించారు.
పరివ్రాజకులుగా రాఘవేంద్రుల పాత్ర ఎంతో విశిష్టమైనది. మంత్రాలయంలో తాను ఏర్పాటుచేసిన బృందావనంలో అనంతమైన శక్తిని నిక్షేపించారంటారు. తంత్రశాస్త్ర ప్రక్రియలో నిర్మించారని, 713 లక్ష్మీనారాయణ సాలగ్రామాలను మంత్రసహితంగా పీఠంలో స్థాపించారని చెబుతారు. ఆయన 1671లో ‘బృందావనంలో ప్రవేశిస్తున్నాను. మరో ఏడు శతాబ్దాల కాలం నా చైతన్యం భక్తుల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది’ అని ప్రకటించారు. ఆ మహిమాలయాన్ని సందర్శించిన ప్రతిసారీ అనిర్వచనీయ అనుభూతి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
దివ్యమందిరంలో ఏటా ఫాల్గుణ మాసంలో వారంపాటు జయంతి వేడుకలు, శ్రావణమాసంలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. భక్తులపాలిట కొంగుబంగారం రాఘవేంద్రస్వామి. ‘మంచిచెడుల నిర్ణయానికి శాస్త్రం ఒక్కటే ప్రమాణం’ అనే ఆయన హితబోధ సర్వదా అనుసరణీయం!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565