శిరోజాలకు పూల సొగసు!
పెళ్లంటే- పందిళ్లు, సందళ్లు తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు... అన్నది పాతకాలం పాట. పెళ్లంటే- పట్టు చీరలూ వర్కు బ్లౌజులూ, లంగాఓణీలూ గాగ్రా చోళీలూ, సరికొత్త నగలూ శిరోజాలంకరణలూ... ఇలా ఎన్నో ఎన్నెన్నో... అన్నది నేటితరం మాట. మొత్తమ్మీద చెప్పొచ్చేదేమంటే పెళ్లంటేనే పెళ్లికూతురి అలంకారం. అందులో మరీ ప్రత్యేకం... పూల కేశాలంకారం.
పెళ్లి అలంకారంలో శిరోజాలంకరణకే ఈతరం అమ్మాయిలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పెళ్లి కుదరగానే ఓ హెయిర్‌స్టైలిస్ట్‌నీ మాట్లాడుకుంటున్నారు. అయితే పెళ్లికూతురు అలంకరణ అనగానే ఎవరికైనా ముఖ్యంగా దక్షిణాదివాళ్లకి ముందుగా గుర్చుకొచ్చేది పూలజడే. ఎందుకంటే కుందనపుబొమ్మలా తీర్చిదిద్దినట్లు పొందికగా చీర కట్టడం, ముఖానికి చెరిగిపోకుండా మేకప్ వేయడం, కదలకుండా నగల్ని పెట్టడం... ఇవన్నీ ఒక ఎత్తయితే, చెక్కు చెదరకుండా శిరోజాల్ని జడగా అల్లి, పూల జడ కుట్టడం ఒక్కటీ మరో ఎత్తు. అందుకే కుటుంబసభ్యుల్లో బాగా వచ్చినవాళ్లే ఈ జడ అల్లి, పూలవాళ్లు తెచ్చిన రెడీమేడ్ పూలజడను కదలకుండా కుడతారు. అయితే అది ఒకప్పటి సంగతి.
డిజైనర్ పూలజడ!
ఈనాటి అమ్మాయిలకి జడ వేయాలన్నా కూడా హెయిర్ స్టైలిస్టులు రావాల్సిందే. లేదంటే జడల అల్లికలో బాగా నైపుణ్యం ఉన్నవాళ్లే వేయాలి. ఎందుకంటే పూలజడకోసమైనా ఏదో సాదా సీదా జడ అల్లేస్తే అస్సలు కుదరదు మరి. ముందుభాగంలో పఫ్ మాదిరిగా పైకి లేచినట్లో మెలి తిప్పినట్లో లేదూ పై భాగంలో కూడా ఏదో కిరీటం పెట్టినట్లో పక్కకు దువ్వినట్లో... ఇలా రకరకాలుగా జుట్టుని మడిచి పిన్నులు పెట్టి మరీ జడ అల్లాలి.
అల్లికలో కూడా ఫిష్, ఫిష్ టెయిల్, ఫ్రెంచ్, డచ్, మల్టీ బ్రెయిడ్... ఇలా చాలానే ఉన్నాయి. ఇదంతా పూర్తయ్యాక అలంకరించే పూలజడల్లో కూడా వందల రకాలు. గతంలో మాదిరిగా మల్లెలూ గులాబీలూ కనకాంబరాలూ లిల్లీలూ... వీటితోనే నేరుగా జడ తయారుచేయడం లేదు.
నారింజ, పసుపు, గులాబీ, పీచ్... ఇలా భిన్న రంగుల్లో ఉండే విభిన్న రకాల ఆర్కిడ్లూ గులాబీ రేకులతో కూడా జడల్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కిడ్లతో చేస్తే త్వరగా వాడిపోకుండా ఉంటాయన్న కారణంతో వాటిని ఎక్కువగా వాడుతున్నారు. అలాగే తాజా మల్లెలతోబాటు బంగారురంగు వేసిన ఎండు మల్లెల్నీ ఆకుల్నీ జడ మొదల్లో అందంగా కుడుతున్నారు. కొందరయితే కాగితం, ప్లాస్టిక్ పూలతోబాటు ముత్యాలూ రాళ్లూ కూడా మధ్యమధ్యలో చొప్పిస్తున్నారు. అలాగే మొత్తంగా పూలతో కుట్టిన జడలు కొన్నయితే, మల్లె మొగ్గల్ని నెట్ మాదిరిగా గుది గుచ్చి జడ చుట్టూ తొడిగినట్లుగా ఉండేవి మరికొన్ని. బంగారు జడ పెట్టి ఆపైన మాత్రమే గుండ్రంగా పూలు పెట్టి వదిలేస్తున్నారు కొందరు. జడబిళ్లల్నీ పూలనీ కలగలిపిన డిజైన్లతో జడను అలంకరించుకునేవాళ్లు ఇంకొందరు. మొత్తమ్మీద పూలజడ అనేది ఓ ప్రత్యేకమైన ముస్తాబుగా మారింది. దాంతో వీటిని తయారుచేసేందుకు పెళ్లి పూలజడడాట్‌కామ్ వంటి ప్రత్యేకమైన ఆన్‌లైబ్ వెబ్‌సైట్లు మనదగ్గరా పుట్టుకొచ్చాయి. దాంతో చీర డిజైనూ రంగూ దృష్టిలో పెట్టుకుని మరీ జడను రకరకాల పద్ధతుల్లో డిజైన్ చేయించుకుంటున్నారు. ఆ చేసే జడలు ఒకదాన్ని ఒకటి పోలి ఉండకుండా ఒక్కో జడనీ ఒక్కో ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తున్నారు. అందుకే నేటి పూలజడలన్నీ డిజైనర్ పూల జడలే సుమీ.
సిగలో పూల సోకు:
పెళ్లయిపోయింది. రిసెప్షన్ ఇంకా మిగిలే ఉంది. అప్పుడు కూడా కుప్పెలూ సవరాలూ పెట్టి జడ అల్లితే ఏం బాగుంటుంది... అందుకే పెళ్లికి పూలజడ తప్పనిసరి అయినట్లే, రిసెప్షన్‌కి ప్రత్యేకమైన పూల హెయిర్‌స్టైల్ కావాల్సిందే అంటున్నారు కొత్త పెళ్లికూతుళ్లు. అందులో భాగంగా కాస్త వెరైటీగా ఉండేలా సిగల్ని చుట్టడం లేదా పిన్నులు పెట్టి జుట్టును రకరకాల పద్ధతుల్లో మడవడం, రింగులు తిప్పి వదిలేయడం... వంటి ప్రత్యేక హెయిర్‌స్టైల్స్‌ని ఆశ్రయిస్తున్నారు. సిగల్లో నడినెత్తిన పెట్టేవీ, మెడమీదుగా వేసేవీ, పక్కకు వేసేవీ కొన్నయితే; ముడిని సైతం జడ కోసం వేసినట్లే ముందుభాగంలో రకరకాల పద్ధతుల్లో జుట్టును మడిచి, పాయలుగా అల్లి, ఆపై పిన్నులు పెట్టి చుడుతున్నవి కొన్ని. సిగల్లో కూడా ముందు జట్టును కర్ల్స్ తిప్పి వేసేవీ ఉన్నాయి. పైగా ఈ ముడుల్లోనూ ఫ్రెంచ్ ట్విస్ట్, క్రిస్ క్రాస్, సైడ్ పార్టెడ్ రింగ్లెట్, ఎలిగెంట్ ట్విస్టెడ్, కర్లీ టెండ్రిల్స్, ఇంట్రికేట్ ఫ్లోరల్, డచ్ బ్రెయిడ్ బన్, రోజీ రింక్లెట్, పూల బొకె... ఇలా పలు రకాలు.
ఇక, రింగులు తిప్పి వదిలేసే హెయిర్ స్టైల్స్ అయితే లెక్కే లేదు. సగం రింగులు తిప్పినవీ, ఉంగరాల మాదిరిగా మొత్తంగా తిప్పినవీ పైన తిప్పకుండా కింద మాత్రమే తిప్పి వదిలేసేవీ... ఇలా ఎన్నో వెరైటీలు.
హెయిర్ స్టైల్ పూర్తయ్యాక, ఆ స్టైల్‌కి తగ్గట్లుగా వాటిని గిన్నెపూలూ ఆర్కిడ్లూ కార్నేషన్లూ చామంతులూ గులాబీ రేకులూ మల్లెలతోబాటు బంగారుపూత పూసిన లోహపు పూలూ ప్లాస్టిక్ పూల కొమ్మలతో రకరకాల పద్ధతుల్లో ఎంతో అందంగా అలంకరిస్తున్నారు. మొత్తమ్మీద హెయిర్‌స్టైల్ ఏదయినా రంగుల పూల సోకులతో గుబాళిస్తూ పెళ్లి కొడుకునే కాదు, అతిథుల్నీ ఆకట్టుకుంటోంది నేటి పెళ్లికూతురు!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565