అందాల తులసి కోట
బృందావని, కృష్ణజీవని, నందిని, విశ్వపావని, బృంద, పుష్పరాస... ఇవన్నీ తులసీమాత పేర్లే. హిందువులకి తులసి ఆరాధ్య దైవం. దేశవ్యాప్తంగా తులసిని పరమ పవిత్రమైనదిగా పూజిస్తారు. మిగిలిన మొక్కలకన్నా ప్రత్యేకంగా కనిపించేలా దానికో చక్కని కోటను కట్టి ఆ కోటకు రంగులేసి అలంకరించడంతోబాటు, ఆ కోటను రకరకాల ఆకారాల్లో కట్టి, అందులో మొక్కను ప్రతిష్ఠించి, రోజూ దీపం పెట్టి పూజిస్తారు. గుడియా వైష్ణవులయితే కార్తీకమాసంలో తులసీవివాహం కూడా జరిపిస్తారు.
తులసి శ్రీమహాలక్ష్మి అంశ అనీ, శాపవశాత్తూ భూలోకంలో పుట్టి, విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై, ‘శంఖుచూడుడు అనే రాక్షసుణ్ణి వివాహం చేసుకున్నాక, ఆ శ్రీహరితో కల్యాణం జరుగుతుంది’ అని వరమిచ్చాడనేది ఐతిహ్యం. భార్య పవిత్రంగా ఉన్నంతవరకూ శంఖుచూడుడికి మరణం లేదనే వరం ఉంది. రోజురోజుకీ అతని ఆగడాలు శృతిమించడంతో, శ్రీహరి ఆ రాక్షసుడి వేషంలో తులసిని పొంది, అతన్ని సంహరిస్తాడు. అప్పుడు తులసి తనకు కళంకం తీసుకొచ్చింది సాక్షాత్తూ మహావిష్ణువే అయినా క్షమించకుండా శిలైపొమ్మని శాపమిస్తుంది. అంతట విష్ణువు ఆమె గత జన్మ వృత్తాంతం చెప్పి, ఆమె శరీరం గండకీనదిగా ప్రవహిస్తుందనీ, అందులో తాను సాలగ్రామంగా ఉంటాననీ, ఆమె శిరోజాలు తులసి మొక్కగా మారి, పూజలందుకునేలా వరమిచ్చాడనేది దేవీ భాగవత వ్యాఖ్యానం.
ఆ విధంగా శ్రీహరి సన్నిధానాన్ని చేరుకున్న ఆ శ్రీమహాలక్ష్మి అంశ కాబట్టే తులసిని విశ్వపావనిగా పూజిస్తారు.
ఔషధాల తులసికోట!
తులసి పూజనీయమైనది మాత్రమే కాదు, ఔషధపరమైనదిగానూ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. ఇంట్లో పెంచుకునే మిగిలిన మొక్కలకీ తులసి మొక్కకీ వ్యత్యాసం ఉంది. ఇతర మొక్కలన్నీ రాత్రివేళల్లో ఆక్సిజన్‌ని పీల్చుకుని, పగటివేళల్లో ప్రాణవాయువుని విడుదల చేస్తాయి. కానీ రాత్రీపగలూ తేడా లేకుండా ఆక్సిజన్‌ని విడుదల చేయడమే తులసి గొప్పతనం. ఆ కారణంతోనే తులసిని ఔషధమొక్కగా భావించి ఇంటి ముందు పెంచుతారు. దాని ఆకుల్లో యూజెనాల్ అనే పసుపురంగు నూనె ఉంటుంది. ఇది బాష్పవాయువు రూపంలో గాల్లోకి విడుదలవుతూ బ్యాక్టీరియా, క్రిమికీటకాలు దగ్గరికి రాకుండా చేస్తుంది. తులసి గాలి పీల్చితే ఆరోగ్యమని చెప్పడంలోని అంతర్లీన సూత్రం ఇదే. అందుకే తులసిని ఇంటిముందో వెనక పెరట్లో పెంచుతారనేది శాస్త్రీయ కథనం.
ఎవరు ఏ కారణంతో పెంచుకున్నా తులసి ప్రత్యేకమైనది. దాన్ని పెంచుకునే కోట అంతే ప్రత్యేకంగానూ అందంగానూ ఉండాలన్నదే నేటి గృహాలంకరణ నిపుణుల అభిప్రాయం. అందుకోసమే తులసి కోటల్ని చెక్క, పాలరాయి, టెర్రకోట... వంటి వాటితో రకరకాల ఆకారాల్లో రూపొందించి, ఆపై రంగురాళ్లతో అలంకారాలూ చేస్తున్నారు. ఒకప్పుడు దీపంకోసం కిందిభాగంలో చిన్న గూడు కట్టేవారు. ఇప్పుడు దీపంతోబాటు ఇతర పూజాసామగ్రి పెట్టుకునేలానూ ఏర్పాటుచేస్తున్నారు. కోటలోనే మందిరం ఉన్నట్లూ కడుతున్నారు. అటు సంప్రదాయ, ఇటు ఆధునిక నిర్మాణశైలి కలగలిపి మరీ వీటిని నిర్మిస్తున్నారు. మొత్తమ్మీద తమ తులసికోట వినూత్నమైన డిజైన్లలో ఆకర్షణీయంగా కనిపించాలన్నదే గృహాలంకరణ ప్రియుల అభిమతం కూడా.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565