హనుమజ్జయంతి
ప్రసన్నాంజనేయం ప్రకీర్తి ప్రదాయం
‘బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వందే మారుతీమ్’!!
హనుమంతుడు చిరంజీవి. మన మధ్య తిరిగే దైవం. మనకు జ్ఞానాన్ని బోధించే గురువు.
శ్రీమద్రామాయణం మానవ విలువలకు దిక్సూచి. మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ఆ తరం నుంచి ఏతరం వారికైనా జీవన వేదం రామాయణమే. ఆ మహా కావ్యంలోని సుందరకాండ హనుమంతుని బుద్ధిని, బలాన్ని చాటుతుంది. అందులో వాల్మీకి మహర్షి హనుమ నడవడిక, కార్య నిర్వహణ సామర్ధ్యం, దక్షతలను పలు విధాలుగా వర్ణించారు. ఒక సందర్భానికి, కాలానికి తగినట్లు విజ్ఞతతో కూడిన ఆలోచనా దృక్పథం ఎలా ఉండాలో ఆ పాత్రలో చూపారు. అశోకవనంలో ఉన్నప్పుడు
‘త్వ మస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమాన్ యత్న మాస్థాయ దుఃఖ క్షయకరోభవ!’
ఈ కపిశ్రేష్ఘుడు భక్తుడు, నిర్మల మనస్కుడు, నిగ్రహవంతుడు, ఒక యోగి. నమ్మకంగా ఈయనే నా దుఃఖం పోగొట్టగలవని సీతమ్మ తల్లి అన్నదంటే హనుమ శారీరక శక్తిని చూసి మాత్రమే కాదు... ఆయన ధీశక్తి, మాటల్లో నేర్పు, పని పట్ల చిత్త శుద్ధి, ఏకాగ్రత... అన్నీ గమనించిన తర్వాతే ఆమె ఆ మాట అనగలిగింది. వీటన్నిటినీ కలిపే దక్షత అంటారు.
మాటల్లో మంచితనం... పనిలో దృఢ సంకల్పం... ఎన్ని ప్రలోభాలు, అడ్డంకులు ఎదురైనా దేనికీ లొంగని తత్త్వం... కాలమాన పరిస్థితులకు తగ్గట్లుగా మార్పు...నేర్పు... కాలాలకు అతీతమైన వినయం... అవసరమైన సమయంలో అసమాన పరాక్రమం... ఇవీ హనుమ తత్త్వం ప్రతి మనిషికీ నేర్పే పాఠాలు...
* హనుమ ప్రవేశమే రామాయణంలో కీలకఘట్టం. తొలిసారి ఆయన అరణ్యకాండ చివర్లో దర్శనమిస్తారు. రామలక్ష్మణులు రుష్యమూక పర్వతం వద్దకు చేరుకున్నప్పుడు వారిని చూసి సుగ్రీవుడు భయపడతాడు. తన అన్న వాలి వారిని పంపారేమో ఆరా తీయమని హనుమంతుని పంపుతాడు. మారువేషంలో వారి వద్దకు వచ్చిన హనుమంతుడు రామలక్ష్మణులను చూడగానే వారికి దాసోహం అవుతాడు. అయినా వారి వచ్చిన పనిని మర్చిపోడు. చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాడు. రామలక్ష్మణులను ప్రేమగానే అనేక రకాలుగా ప్రశ్నిస్తాడు. మీ ఆకారానికి, ధరించిన ఆయుధాలకు పొంతన లేదని సందేహం వ్యక్తం చేస్తాడు. ఎదుటివారు నొచ్చుకోకుండా... ప్రశ్నించిన వారిపై కూడా ప్రేమ కలిగేలా హనుమ మాట్లాడిన తీరుకు రాముడు ఆశ్చర్యపోతాడు. లక్ష్మణా! ఇతను గొప్ప పండితుడు... నాలుగు వేదాలు చదివినట్లున్నాడు. వ్యాకరాణాన్ని ఔపోసన పట్టినట్లున్నాడు. అత్యంత స్పష్టంగా, సందిగ్ధతకు తావులేకుండా మాట్లాడుతున్నాడు. నిజంగా ఇతను చాలా గొప్పవాడని ప్రశంసిస్తాడు. ఎదుటివారి మనసును నొప్పించకుండా మాట్లాడడం, వచ్చిన పనిని వ్యామోహాలకు తావివ్వకుండా పూర్తిచేయగలగడం హనుమ ఏ తరానికైనా నేర్పే పాఠాలు.
* కష్టమైన లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు కావాల్సిన మొదటి లక్షణం దృఢ సంకల్పం. రాముని ఆజ్ఞ మేరకు లంకకు వెళ్లడానికి సాగరం దాటాలని నిర్ణయించుకోగానే ఈ శరీరం మరింత శ్రమించాల్సి ఉందని, దానికి తగ్గట్లు సిద్ధమవుతానని, శరీరాన్ని విశేషంగా పెంచి బాణంలా దూసుకుపోతానని, ఎక్కడా ఆగకుండా రామ కార్యాన్ని పూర్తి చేసుకుని వస్తానని అంగదాదులకు చెప్పాడు. ఇదంతా తనను తాను మానసికంగా సిద్ధం చేసుకోవడమే.
* మనస్సు, బుద్ధిని నియంత్రించడం కార్యసాధకుల తక్షణ కర్తవ్యం. సాధకుడి మార్గంలో ఎన్నో అడ్డంకులు, వ్యామోహాలు ఎదురవుతాయి. వాటన్నిటినీ జయించి కార్యసాధనపై దృష్టి లగ్నం చేసిన వాడే విజయుడవుతాడు. హనుమంతుడు అదే చేశాడు. సాగరాన్ని దాటే క్రమంలో ఇతర ఆలోచనలన్నీ అరికట్టి వేగంపై దృష్టిపెట్టాడు. గగనంలో పయనిస్తున్న వాయుపుత్రుని సేద తీర్చుకోమని మైనాక పర్వతం కోరినప్పుడు హనుమంతుడు సున్నితంగా తిరస్కరించాడు. విశ్రాంతి వద్దని కర్తవ్య నిర్వహణ దీక్షలో అలసటకు, ఆవేదనకు తావులేదని వివరించాడు. నాగమాత సురస ఆంజనేయుని మింగడానికి తన నోటిలోకి రమ్మంది. ఆ మహావీరుడు తిరుగు ప్రయాణంలో వస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు. హనుమ శరీరాన్ని పెంచగా ఆమె తన నోటిని ఇంకా పెద్దది చేసింది. అప్పుడు సూక్ష్మరూపంతో ఆమె నోటిలోకి ప్రవేశించి తక్షణం బయటకు వచ్చి హనుమ తన పయనాన్ని కొనసాగించాడు. సురస అసూయకు చిహ్నం. ఎంతో ఎత్తున వేగంగా పయనిస్తున్న హనుమకు మరో ఆటంకం వచ్చింది. సింహిక అనే రాక్షసి నీటిలో నివసిస్తూ ఆకాశంలో ఎగిరే వాటి నీడలు లాగి వారిని కిందకు దించి తింటుంది. సింహిక అంటే నాలుక. జిహ్వను నియంత్రించడం సాధకులకు చాలా అవసరం. హనుమ ఆమె నోటిలో ప్రవేశించి చీల్చి వధించాడు. లంకా నగర క్షేత్రపాలిని లంకిణిని ముష్టిఘాతంతో ఓడించాడు. మనస్సుకు సంకేతం సురస, ఇంద్రియానికి సింహిక, దేహానికి ప్రతీక అయిన లంకిణిని జయించిన ఉన్నతుడు హనుమ. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యమనే నాలుగు లక్షణాల ద్వారా అసాధ్యమైన ఈ పనులను సుసాధ్యం చేశాడు.
* వినయమనేది ప్రగతి సాధనకు మొదటి మెట్టు. కార్యసిద్ధికి పెద్దల ఆశీర్వాదం కూడా చాలా అవసరం. సాగరోల్లంఘనకు బయల్దేరుతూ హనుమ జ్ఞానాన్నిచ్చే సూర్యుడికి, ఇంద్రియాలకు రాజైన ఇంద్రుడికి, తండ్రి వాయుదేవుడికి, ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు ఎందరో సహకరిస్తారు కాబట్టి భూతకోటికి నమస్కరించి బయల్దేరాడు. సీతమ్మ కోసం రావణాసురుడి మందిరాలన్నీ వెదికినా కనిపించలేదు. కార్యసాధకులకు ఏదో ఒక సమయంలో నిరాశ ఎదురవుతుంది. అప్పుడు పెద్దల ఆశీర్వాదబలం, భగవదానుగ్రహం సహకరిస్తాయి. హనుమ ఇక్కడ అదే చేశాడు. అందరికీ ప్రార్థన చేశాడు.
‘నమోస్తు రామాయ లక్ష్మణాయ!
దేవ్యై చ తస్మై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేన్ద యమానీలేభ్యో!
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః’
ప్రార్థన పూర్తవగానే తాను అశోకవనంలో వెదకలేదనే విషయం గుర్తుకువచ్చింది. అక్కడ వెదికినప్పుడు సీతమ్మ తల్లి కనిపించింది. దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాద ఫలం ఎంత గొప్పవో హనుమంతుడి చరితం నిరూపిస్తుంది.
* తెల్లవారుతోంది. రావణుడు వచ్చి సీతను దుర్భాషలాడాడు. రాక్షస స్త్రీలు భయపెట్టారు. దీనంగా కూర్చుని ఉన్న సీతను త్రిజట అనే రాక్షస స్త్రీ ఓదార్చింది. రాముడు తప్పకుండా వస్తాడని, విజయం సాధిస్తాడని చెప్పింది. మారుతి సీతమ్మతో సంభాషించే సమయం కోసం చెట్టు మీద ఆకుల చాటున వేచి చూస్తున్నాడు. తాను రామదూతననే నమ్మకం కలిగించాలి. ఇక్కడ హనుమ ప్రజ్ఞ కనిపిస్తుంది. వారందరూ ఏమరుపాటుగా ఉన్న సమయంలో సీతను ఊరడించే విధంగా రామకథను గానం చేశాడు. ఆమె సంశయాలను వీడిన తర్వాత రాముడిచ్చిన ఉంగరాన్నిచ్చి రాముడు త్వరలో ఆమెను చెర నుంచి విడిపిస్తాడని చెప్పాడు. అందరూ హనుమంతుణ్ణి సీతను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడంటారు. కానీ హనుమ ఇక్కడ మున్ముందు జరగబోయే రామ రావణ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో వ్యూహాత్మకంగా ప్రవర్తించాడు. రాక్షసులు తోకకి నిప్పంటించి అతన్ని లంకంతా తిప్పుతుంటే నగరాన్ని, రావణుడి బలగాన్ని, లంకలోని ప్రముఖ సైనిక స్థావరాలను, భవనాలను ఆ వెలుగులో చూసి ఓ అంచనాకు వచ్చాడు. కొన్నిటిని దహించాడు. సమయస్ఫూర్తితో కూడిన వాక్చాతుర్యం, నమ్రతతో కూడిన జ్ఞానం హనుమది.
ఆకు పూజలిందుకు...
హనుమంతునికి తమలపాకులతో అర్చన చేయడానికి కారణం కూడా సుందరకాండ వివరించింది. లంకలో ఉన్న సీత జాడ తెలుసుకుని వాయునందనుడు విజయవంతంగా తిరిగివచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి వానర వీరులు హనుమను సన్మానించారు. అడవిలో దొరికిన తీగలన్నీ దండలుగా చేసి హనుమ మెడలో వేశారు. ఆ తీగలు, పత్రాలన్నీ తమలపాకులే. దీనికి సంబంధించి మరో వివరణ కూడా ఉంది. ఆంజనేయుడు శంకరుడి అంశ. ఆయన తాపోపశమనానికి లేత తమలపాకులతో అర్చన చేస్తారని చెబుతారు.
ఈ పేరెందుకు?
వాల్మీకి రామాయణంలో ప్రతి భాగానికి సందర్భానికి తగ్గట్టుగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ వంటి పేర్లే కనిపిస్తాయి. సుందరకాండ ఒక్కటే మినహాయింపు. ఆ భాగానికి ఆ పేరు రావడానికి పండితులు పలు రకాల వివరణలు చెబుతారు. రామాయణంలో కథా నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. అత్యంత సుందరమైన వాడు. ఎన్నో సుగుణాలున్న వాడు. ఆయనను వర్ణించేది కాబట్టి ఇది సుందరకాండ అయిందంటారు. సీతామాత భువనైక సుందరి... సుందరమైన అశోకవనాన్ని, హనుమంతుడి లీలలను గురించిన భాగం కాబట్టి ఆ పేరు వచ్చిందని మరికొందరంటారు. ఇందులోని మంత్రాలన్నీ దివ్యమైనవి, సుందమైనవి, శక్తివంతమైనవి. అందమైన అంత్యానుప్రాసలతో ఉండడం వల్ల దీన్ని సుందరకాండ అంటారని ఇంకొందరు వివరిస్తారు.
-నిమ్మగడ్డ అరుణ శర్మ, సిడ్నీ, ఆస్ట్రేలియా.
------------------------------------------
జయహో కపికుల సార్వభౌమ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565