చదలాడ తిరుపతి తూర్పు గోదావరి జిల్లా
నేనూ నీ అంతే!
ఎంత మాత్రమున ఎవ్వరు చూసిన అంత మాత్రమే నేను...తిరుపతి అనగానే అందరికీ గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలోని వేంకటనాథుని కొలువు. కానీ తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఓ తిరుపతి ఉందండోయ్. ఇక్కడున్న ఆలయంలో ఉన్నదీ వేంకట రమణులే. తెలుగు గడ్డపై అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటైన ఈ క్షేత్రాన్ని చదలాడ తిరుపతి అని పిలుస్తారు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాలకంటే ముందే ఈ ఆలయం ఉందని చెబుతారు. శృంగార వల్లభస్వామిగా పూజలందుకుంటున్న ఈ స్వామికో ప్రత్యేకత ఉంది. భక్తులు ఎంత ఎత్తులో ఉంటారో స్వామి విగ్రహం కూడా అంతే ఎత్తు కనిపిస్తుంది. పెద్దాపురం మండలంలో ఉన్న ఈ క్షేత్రం సామర్లకోట నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎందుకంటే...
స్వామి ఇలా ఎత్తులో కనిపించడానికి కారణంగా ఓ కథ చెబుతారు. పూర్వం ఈప్రాంతమంతా ఓ కీకారణ్యం. ధ్రువుని సవతి తల్లి సురుచి అతన్ని చక్రవర్తి కాకుండా చూడాలని అనుకుంటుంది. ధ్రువుని పిలిచి నాయనా నీవు సింహాసనం ఎక్కి రాజ్యపాలన చేయాలంటే తపస్సు చేసి నా కడుపున పుట్టాలంటుంది. ఆమె అన్న మాటలకు ధ్రువుడు బాధపడి అడవికి బయలుదేరతాడు. ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలో శాండిల్య మహాముని ఆశ్రమానికి వచ్చి తపస్సు చేస్తాడు. ధ్రువుని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడ్డాడు. అప్పుడు విష్ణువు అతని చెక్కిళ్లు వత్తి నాయనా భయం దేనికి.. నేనూ నీ అంతే ఉన్నాను కదా అని చెప్పి అక్కడే శిలా రూపంలో వెలిశారు. అప్పటి నుంచి స్వామి ఎవరెంత ఎత్తులో ఉంటే అంతే ఎత్తున్నట్లు కనిపిస్తారని నమ్ముతారు. కుడి ఎడమల ఉండాల్సిన స్వామి వారి శంఖుచక్రాలు ఇక్కడ ఎడమ, కుడి వైపుల ఉంటాయి. విష్ణుమూర్తి శిలారూపంలో వెలిసిన తొలి స్థలం ఇదేనని... అందుకే దీన్ని తొలి తిరుపతి అని కూడా పిలుస్తారు. - మహమ్మద్ రియాజ్ పాషా, పెద్దాపురం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565