కష్టించు సృష్టించు - స్వామి వివేకానంద
Create it swamy vivekananda
ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు... ప్రతి అద్భుతం వెనకా అవిరళ కృషి ఉంటుంది... ప్రతి విజయం వెనకా అద్భుతమైన పరిశ్రమ ఉంటుంది... అందుకే అంటారు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అని... నిజానికి ఈ దేహం ఉంది సాధించడానికే... పరమార్థాన్ని తెలుసుకుని పట్టుదలతో పనిచేసేవారికి ఈ దేహం దేవాలయం... అందులోని జీవుడే దేవుడు...
శ్రమశక్తి సకల సంపదలకూ మూలం. భౌతిక సంపదలకు మొదలుకొని ఆధ్యాత్మిక సంపదల వరకు కష్టపడే తత్వమే పునాది. మౌనంగా శ్రమించడం ప్రకృతి లక్షణం. పరిశ్రమించే ధర్మం ప్రకృతిలో ఉంది. నేలపై నీటిని ఆవిరిగా మార్చడానికి సూర్యకాంతి శ్రమిస్తుంది. ఆవిరిని చల్లబరచి, మబ్బులను మళ్లీ నీటిగా మార్చేందుకు గాలీ, కొండలూ, చెట్లూ తమవైన పాత్రలను ప్రతిఫలాపేక్ష లేకుండా పోషిస్తూనే ఉంటాయి. పల్లమెరిగిన నీరు ప్రాణికోటికి తనవంతు సేవలను అందించేందుకు తన శ్రమను ప్రవాహ రూపంలో వెచ్చిస్తూనే ఉంటుంది. అందుకే ‘శ్రమయేవ జయతే’ నానుడి మానవ జీవితంలో అంతర్భాగం కావాలి. శ్రమశక్తి ఆధ్యాత్మిక ప్రవృత్తిలో మమేకం కావాలి.
శ్రమ అనే మాటకు తపస్సు అనే అర్థం కూడా ఉండటం విశేషం. లౌకికమైన అర్థంలో శ్రమశక్తిని గౌరవిస్తూనే ఆధ్యాత్మిక కోణంలో ఆవిష్కరించిన వైతాళికులూ ఉన్నారు. వస్త్రం నేస్తూ కబీరుదాసు, కుండలు చేస్తూ కుంభారుడు ఆధ్యాత్మిక జీవితాచరణకు ఆదర్శమూర్తులుగా నిలిచారు.
మహాభారతంలో ధర్మవ్యాధుడు తన సాధారణ జీవిత విధానంతో తపస్సంపన్నుడైన కౌశికుడికి జ్ఞాననేత్రం తెరిపించాడు. క్రాంతిమూర్తి బసవేశ్వరుడు అంతకు మునుపే అదే పునాదికి సామాజిక కోణం జోడించి ‘కాయకవే కైలాస’ (శ్రమించి పని చేయడం కైలాసం) అన్నారు. తన ఆరాధ్య దైవమైన ‘కూడల సంగ దేవర’ను సంబోధిస్తూ ‘‘ఎన్న కాలే కంబ, దేహవే దేగుల’’ అంటూ బసవేశ్వరుడు క్లుప్తంగా రాసిన వచనంలో.. శ్రమశక్తికి విస్తృతమైన అర్థముంది. తన కాళ్లను స్తంభాలుగా, దేహాన్ని దేవాలయంగా, శిరస్సును బంగారు కలశంగా అభివర్ణిస్తూ.. కదలని ఆలయం కూలిపోతుందనీ, పదిమంది మేలు కోసం నిత్యం కదులుతూ పరమేశ్వరార్పణంగా పని కోసం శ్రమించడం ద్వారా దేహమనే దేవాలయం నిలిచే ఉంటుందని బసవేశ్వర వచనం తేట పరిచింది. శ్రమను గౌరవించమనీ, కష్టానికి తగిన ఫలితం శ్రామికులకు చెల్లించక తప్పదనీ శిరిడీ సాయిబాబా తమ నిత్య జీవితంలో ఆచరణాత్మకంగా ప్రబోధించారు. పని చేసే వారికీ, చేయించేవారికీ మధ్య సదవగాహన ఉన్నప్పుడు పనిచేసే చోట సంఘర్షణకు, అశాంతికీ తావు ఉండదని బాబా తనదైన పద్ధతిలో వివరించారు.‘శ్రమ’ అంటే కష్టం, అలసట, చెమట లాంటి లౌకికమైన అర్థాలున్నాయి. వీటితో పాటు పారమార్థికమైన ‘తపస్సు’ అనే అర్థం కూడా ఉండటం విశేషం. అర్ధశాస్త్ర పరంగా శ్రమశక్తి ఓ ఉత్పత్తి కారకం. సామ్యవాద సిద్ధాంతం దానికి పెద్దపీట వేసింది. ఆలోచనపరులు ఈ మాటను రకరకాల కోణాల్లోంచి పరామర్శించారు. కంటికి కనిపించేవైనా, కనిపించనివైనా మనిషి అవసరాలు తీర్చేవేవైనా సరే అయాచితంగా ఊడిపడవు. వాటన్నిటి వెనకా శ్రమ ప్రచోదక శక్తిలాగా పని చేస్తూనే ఉంటుంది. మనుషులు ఆచరించే ధార్మిక పద్ధతులు ఏవైనా నైతిక విలువలకు కట్టుబడి తమవైన కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే ఉండటం మౌలిక ధర్మమని ప్రతి పద్ధతీ చెబుతుంది.
శ్రమ చేయు హస్తాలు సిరుల నేస్తాలు తిలకించి, పులకించు కనులు జలదాలు వనరులెన్నో ఉన్న అవని పనిపాట లేదన్న మాట మరవాలని ఉద్యమించాలింక శ్రమ సంస్కృతి నిట్టూర్చితే లేదు నిష్కృతి వగచితే ప్రగతి ఇటు వాలుతుందా? పొగిలితే గతి మారుతుందా? తనువులే వంగాలి ధనువులై గనులు, కార్ఖానాలు నవ రుధిర ధమనులై శ్రమించని వాడికీ, శ్రమశక్తిని గౌరవించని వాడికీ, ఫలితాన్ని ఆశించే యోగ్యతా, ఫలాన్ని అనుభవించే అర్హతా లేవని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శ్రమశక్తిని గౌరవిస్తూ సమస్త వృత్తుల సమస్త చిహ్నాలను పూజించడం దసరా వేడుకల్లో కనిపిస్తుంది. ఇందులో శారీరక శ్రమశక్తి చిహ్నాలతో పాటు బౌద్ధిక శ్రమశక్తి సంకేతాలైన పుస్తకం, కలం కూడా పూజలందుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వేడుకలు అనేక తెగలలో వివిధ రూపాల్లో ఉన్నాయి. కర్మాచరణ గురించి భగవద్గీత లోతుగా చర్చించింది. కేవలం ఫలితంపైనే దృష్టిని పెట్టకుండా శ్రమించాలన్న బోధ అందులో ఉంది. అంతిమ ఫలితాన్నీ, దాని అనుభవాన్నీ భగవదార్పణ చేసి.. పరమాత్మ తలపులో శ్రమించమని సాధారణ మానవుడికి సైతం అర్థమయ్యేలా చాటి చెప్పే ‘దిల్ మే రామ్... హాత్ మే కామ్’ (హృదయంలో రాముడు, చేతిలో పని), ‘కష్టే ఫలి’ లాంటి సూక్తులు అనేక భాషల్లో ఉన్నాయి.
నిరంతరంగా.. నిర్నిరోధంగా..
శ్రమించడమంటే నిరవధికంగా కృషి చేస్తూనే ఉండటం. రిలే పరుగు పందెంలో ‘బాటన్’ను ఆటగాళ్లు ఒకరి మించి మరొకరు అందుకొని లక్ష్యం వైపు దూసుకుపోయినట్లుగా ఎక్కడో కాలం లెక్కకు అందని తరాల నాడు ఆరంభమైన శ్రమ సంస్కృతిని ఈతరం కొనసాగిస్తూ రాబోయే తరానికి అందజేయడం లోనే మానవాళి మనుగడ అనంత దూరాలకు కొనసాగుతుంది. అందుకే విశ్వకవి ‘‘ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువులను పరిపూర్ణత వైపు సారిస్తుందో.. అలాంటి స్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు’’ అని తన గీతాంజలిలో ప్రార్థించారు. ఇక్కడ ‘అలసట యెరుగని శ్రమ’ను భౌతిక దృష్టికి మాత్రమే పరిమితం కాదు. సంపదలు సృష్టించడంతో పాటు మానసిక దృక్పథాన్ని సుసంపన్నం చేసుకొనే రంగాల్లోనూ శ్రమ కొనసాగాలి. సమున్నత మానవీయ స్థాయికి చేర్చే సంగీతం, కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం లాంటి లలిత కళలతో పాటు ఆధ్యాత్మిక పరిణితిని సాధించే దిశగా శ్రమ సంస్కృతి విస్తరించే జాతి ప్రపంచ మానవాళికి దిశా నిర్దేశం చేయగలుగుతుంది. ‘కూలివాని లక్ష్మీనివాసం’ అన్న కవి పాటను భౌతికమైన సంపదల సృష్టితో పాటు బౌద్ధిక సంపదలకు కూడా అన్వయిస్తే.. మనిషి ఆలోచనలు విస్తృతమవుతాయి. కొండరాళ్ల సందుల్లోంచి వెలువడే సంకుచిత ప్రవాహం సమతల మైదానాల్లో సువిశాలంగా విస్తరించినట్లుగా మానవాళి దృక్పథం విస్తృతిని సంతరించుకుంటుంది. ఉపనిషత్తులు పేర్కొన్న ‘విశ్వమానవ సౌభ్రాతృత్వం’ సాకారమవుతుంది.
వెలిగే సూర్యుణ్ని చూసి చీకటి, శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడతాయి - స్వామి వివేకానంద
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565