పాము కాటు:
ఏ పాములు ప్రమాదకరం?
కాటేసినపుడు ఏం చేయాలి?
ఒక మహిళ పాము కాటుకు గురవడం.. ఆమెతో పాటు ఆమె పాలు తాగిన మూడేళ్ల కూతురు కూడా చనిపోయిన విషాద ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లోని మండ్లా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నిద్రపోతున్నప్పుడు తల్లిని పాము కాటు వేసింది. ఆ విషయం తెలియని తల్లి.. తన పాపకు చనుబాలు ఇచ్చింది. కొద్దిసేపటికే ఇద్దరూ నోటివెంట నురగలు కక్కారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే తల్లీకూతుళ్లిద్దరూ చనిపోయారు.
పాము కాట్లు ‘‘అంతర్జాతీయ ఆరోగ్య ప్రాధాన్యం’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన రోజే ఈ విషాద వార్త వెలుగుచూసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 81,000 మంది నుంచి 1,38,000 మంది పాము కాట్లకు బలవుతున్నారు. ఈ మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి.
సమస్య ఎంత పెద్దది?
డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం.. ప్రతి ఏటా సుమారు 50 లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారు. అయితే వారిలో కేవలం సగం మందికే పాము విషం ఎక్కుతోంది.
పాము కాట్ల కారణంగా గుడ్డితనం మొదలుకుని అవయవాలు తొలగించటం వరకూ.. వేలాది మంది శాశ్వత వైకల్యానికి లోనవుతున్నారు.
ఉష్ణమండల వ్యాధుల్లో పలు వ్యాదుల్లాగానే ఈ కేసులు కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తుంది.
సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాలు, దక్షిణాసియా, ఆగ్నేయాసియాల్లో.. మనుషులు - పాములు తరచూ తారసపడే జనసమ్మర్థం అధికంగా గల ప్రాంతాల్లో ఈ పాము కాట్లు అధికంగా చోటు చేసుకుంటున్నాయి.
ప్రత్యేకించి పేద, గ్రామీణ జనాభాకు పాము కాట్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాము కాటు విరుగుడు (యాంటీడోట్) వారికి అందుబాటులో లేకపోవటం, ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవటం వల్ల సంప్రదాయ చికిత్సల మీద ఆధారపడుతుండటం దీనికి కారణం.
పాము విషాల వల్ల జరిగే నష్టాన్ని నివారించటానికి, నిలువరించటానికి యాంటీవీనమ్ వేగంగా ఎక్కించాలి. కానీ.. పాము కాట్లు అధికంగా ఉండే చాలా దేశాల్లో సొంతంగా యాంటీవీనమ్ ఉత్పత్తి చేసే సదుపాయాలే లేవు.
పాము కాట్ల నివారణ, చికిత్స, నిర్వహణల విషయంలో ఆయా దేశాలన్నీ ఒక ఉమ్మడి వ్యూహం అనుసరించేందుకు.. ప్రపంచ ఆరోగ్య సభ కొత్త తీర్మానం దోహదపడుతుంది.
విషపూరిత పాము కరిచినపుడు ఏం జరుగుతుంది?
విషపూరిత పాములను సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
ఒక రకం పాముల్లో కోరలు పటిష్టంగా ఉంటాయి. అవి నాడీ మండలం, శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే న్యూరోటాక్సిక్ వీనమ్ (విషం) ఉపయోగిస్తాయి. ఇంకో జాతి పాముల్లో ముడుచుకునే కోరలు ఉంటాయి. ఈ పాములు తమ కోరలను తాము వేటాడేటపుడు, దాడి చేసేటపుడు ఉపయోగిస్తాయి. ఈ తరహా పాముల విషం.. మామూలుగా చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి, అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
అత్యంత ప్రమాదకర విషమున్న పాములు ఏవి?
అత్యంత ప్రమాదకర విషమున్న పాములు ఏమిటి? మనుషులకు అతి పెద్ద ముప్పుగా ఉన్న పాములు ఏమిటి అనే తేడాలు గుర్తించటం ముఖ్యం.
భూమి మీద సంచరించే పాములన్నిటిలోకీ.. ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము అత్యంత విషపూరితమైనది.
ఒక్క కాటుతో వంది మందిని చంపగలిగేంత విషపూరితమైనది ఈ పాము అని చెప్తారు. అయితే.. ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు ఇంతవరకూ లేవు. చాలా బిడియమైన ఈ పాములు మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంలో జీవిస్తుండటంతో పాటు.. ఆస్ట్రేలియాలో యాంటీవీనమ్ విస్తృతంగా అందుబాటులో ఉండటం దీనికి కారణం.
సముద్ర పాములు కూడా చాలా విషపూరితమైనవి. కానీ అవి మనుషులకు తారసపడటం చాలా అరుదు కాబట్టి.. మనుషులు ఈ పాము కాట్లకు గురవటం కూడా అత్యంత అరుదుగా ఉంటుంది.
తక్కువ విషపూరితమైనవే అయినా.. బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్ (ఆస్ట్రేలియా) పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదం ఉంది.
ఈ రెండు పాములదీ ఒకే జాతి కుటుంబం. వీటి విషం.. ఇతర పాముల విషాలకన్నా వేగంగా ప్రభావం చూపుతుంది. అంటే.. ఈ పాములు కాటువేసినపుడు తక్షణమే చికిత్స అందించకపోతే అర గంటలోనే మరణం సంభవిస్తుంది.
బ్లాక్ మాంబా అని పిలిచే పాము నిజానికి గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఆ పాము నోరు లోపలి రంగు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది.
సహారాకు దక్షిణంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. మూడు మీటర్ల పొడవు వరకూ పెరుగుతుంది.
ఇక ఇన్‌లాండ్ తాయ్‌పాన్‌తో పోలిస్తే కోస్టల్ తాయ్‌పాన్ చాలా దుందుడుకు స్వభావం గలది.
ఏ పాముల వల్ల మరణాలు ఎక్కువ?
పాము కాటు కేసులు, మరణాల సంఖ్యల విషయంలో.. చిన్నదిగా కనిపించే పింజేరి (సా-స్కేల్డ్ వైపర్) అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటి. పశ్చిమ ఆఫ్రికా మొదలుకుని భారత ఉపఖండం వరకూ చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చీకట్లో ఎక్కువగా కాటు వేస్తుంటుంది.
ప్రపంచంలో దాదాపు సగం పాము కాట్లు సంభవిస్తున్నట్లుగా భావించే భారతదేశంలో.. మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే నాలుగు రకాల పాముల్లో పింజేరి ఒకటి.
ప్రమాదకరమైన నాలుగు పాముల్లో మిగతా మూడు ఇవీ...
కట్ల పాము (ఇండియన్ క్రెయిట్): పగటిపూట మొహమాటంగా కనిపించే ఈ పాము.. రాత్రిపూట చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఇది 1.75 మీటర్ల (5 అడుగుల 9 అంగుళాల) వరకూ పొడవు ఉంటుంది.
రక్త పింజేరి (రసెల్స్ వైపర్): ఇది మామూలుగా దూకుడు స్వభావమున్న పాము. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది.
నాగు పాము / తాచు పాము (ఇండియన్ కోబ్రా): నాగు పాము భారత ఉపఖండమంతటా కనిపిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. చీకట్లో ఇది ఎక్కువగా దాడి చేస్తుంది. అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
పాము కాటు వేసినపుడు ఏం చేయాలి?
ఎవరినైనా పాము కాటు వేసినపుడు ఈ చర్యలు చేపట్టాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది:
శాంతంగా ఉండి తక్షణమే వైద్య చికిత్స పొందాలి.
శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచీల వంటి వాటిని తొలగించాలి.
దుస్తులను వదులు చేయాలి.. కానీ విప్పేయవద్దు.
ఈ కింది పనులేవీ చేయకూడదు:
పాము కాటు ప్రాంతం నుంచి విషయాన్ని నోటితో లాగివేయటం
పాము కాటు ప్రాంతాన్ని కోసివేసి విషాన్ని తొలగించటం లేదా రక్తస్రావం జరిగేలా చేయటం
పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం
పాము కాటు వ్యక్తిని వదిలి వెళ్లటం
కాటు వేసిన ప్రాంతం నుంచి రక్తప్రసరణను నిలిపివేస్తూ కట్టుకట్టటం వంటివి చేయరాదు. అలా చేయటం వల్ల విషం వ్యాపించకుండా ఆగదు. పైగా వాపు మరింత విషమించటానికి, ఆ అవయవం తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు.
విషపూరితమైన పామును పట్టుకోవటానికి ప్రయత్నించకుండా ఉండటం కూడా ముఖ్యం. చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పామును చంపేసిన కొంతసేపటి వరకూ దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉండొచ్చు.. దానివల్ల విషపూరిత కాటు వేయవచ్చు.
Courtesy:BBC
ReplyDeleteHey there,
Nice blog
check out our blogs
Digital marketing agency in Mumbai