అధిక ఫలితాల అద్భుత కాలం
విళంబి నామ సంవత్సరం ప్రత్యేమైనది. ఈ ఏడాది అధిక మాసం రావడమే అందుకు కారణం. జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. అధిక మాసం.. నిజమాసం కన్నా ముందుగా వస్తుంది. ‘అధికస్య అధికం ఫలం’ అంటారు. అంటే అధికమాసంలో చేసే ఆధ్యాత్మిక సాధన, దానధర్మాలు మంచి ఫలితాన్నిస్తాయంటారు.అధికమాసం ప్రస్తావన మహాభారతంలో కనిపిస్తుంది. విరాటపర్వంలో భీష్ముడి నోట అధికమాసాన్ని గురించి వివరించారు వ్యాస మహర్షి. ఉత్తరగోగ్రహణం సందర్భంగా అర్జునుడు.. బృహన్నల రూపంలో కురుసేనలను సమీపించాడు. అర్జునుడిని గుర్తించిన కౌరవులు.. అజ్ఞాతవాసం భంగమైందనీ, పాండవులు మళ్లీ అరణ్య, అజ్ఞాతవాసాలు చేయాలని వాదించారు. అప్పుడు భీష్ముడు కల్పించుకొని.. అధికమాసాలతో లెక్కిస్తే పాండవుల అజ్ఞాతవాస సమయం ముగిసిందనీ చెబుతూ అధికమాసాలు ఎలా గుర్తించవచ్చునో కూడా తెలియజేశాడు. అమావాస్య, అమావాస్య గడువు మధ్య రవి సంక్రమణ జరగకపోతే (సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడం) ఆ మాసాన్ని అధికమాసంగా పరిగణించాలని వివరించాడు.
బ్రహ్మకు ప్రీతిపాత్రం: ఒక్కోమాసం ఒక్కో దేవతకు ప్రీతిపాత్రమైనదని పెద్దలు చెబుతారు. వైశాఖం, మార్గశిరం విష్ణుమూర్తికి, కార్తీకం శివుడికి ప్రీతికరమని పేర్కొంటారు. జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైనదిగా చెబుతారు. ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు. కలియుగంలో బ్రహ్మకు అర్చనలు చేయకూడదు కదా! కానీ, ఈ మాసంలో ఇంటిలోని పూజామందిరంలో పూజలు చేయవచ్చు. బియ్యపుపిండితో గానీ, గోధుమ పిండితో గానీ బ్రహ్మదేవుని మూర్తిని సిద్ధం చేసుకొని..షోడశోపచార పూజలు చేయాలి. ఇలా అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
గంగలో స్నానం: జ్యేష్ఠ మాసంలో కొన్ని వ్రతాలు, నోములు ఆచరించాలని పలు గ్రంథాలు సూచించాయి. ఈ మాసంలో నదీస్నానం విశేష ఫలితం ఇస్తుందని పేర్కొన్నాయి. వారణాసిలోని గంగానదిలో స్నానం చేస్తే పుణ్యప్రదమని వ్రత రత్నాకరం చెబుతోంది. ఇది సాధ్యం కాని పక్షంలో ఏదైనా నదిలో, తటాకంలో పుణ్యస్నానం ఆచరించవచ్చు.
ముహూర్తాల్లేవ్:పంచాంగ గణనను అనుసరించి సుమారు రెండున్నరేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. అధిక మాసంలో వివాహాది శుభకార్యాలు కూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. విళంబి నామ సంవత్సరంలో జ్యేష్ఠం అధికంగా వచ్చింది. అందుకే పంచాంగకర్తలు అధిక జ్యేష్ఠమాసంలో శుభముహూర్తాలు ప్రకటించలేదు. నిజ జ్యేష్ఠ మాసంలో యధావిధిగా ముహూర్తాలు పేర్కొన్నారు.
దాహం తీర్చాలి: అధికమాసంలో దానానికి అంత్యంత ప్రాధాన్యం ఉంది. జ్యేష్ఠమాసంతో గ్రీష్మ రుతువు ప్రారంభమవుతుంది. వేసవి తాపం హెచ్చుతుంది. కనుక ఈ మాసంలో దాహార్తులకు నీరు అందించడం ద్వారా త్రిమూర్తులకు పూజలు చేసిన ఫలితం లభిస్తుందని పెద్దల మాట. సాధారణంగా జ్యేష్ఠమాసంలో నీటితో ఉన్న కుండను దానమిచ్చే సంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ధర్మం తెలిసిన పెద్దలు చలివేంద్రాలు నిర్వహించడం దానికి కొనసాగింపే!
- మల్లాప్రగఢ శ్రీమన్నారాయణమూర్తి
ReplyDeleteHey there,
Nice blog
check out our blogs
Digital marketing agency Noida