కడప జిల్లా
వాగ్గేయకారులు, కాలజ్ఞానులకు పురిటి గడ్డ కడప జిల్లా. మత సామరస్యానికి ప్రతీకలుగా నిలిచే ఆధ్యాత్మిక ప్రదేశాలూ, ఉరకలెత్తే పెన్నా నదీ తీరంలో ఆహ్లాదాన్ని కలిగించే ప్రాంతాలూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
కడప జిల్లా
సిద్ధవటం కోట
దక్షిణ కాశీ పుష్పగిరి
కడప జిల్లా
సిద్ధవటం కోట
దక్షిణ కాశీ పుష్పగిరి
పినాకినీ, కుముద్వతి, బహుదా, పాపాఘ్ని, మందాకిని నదులు పెన్నా నదిలో కలిసే తీరంలో వైద్యనాథ స్వామి, చెన్నకేశవ స్వామి ఆలయాలతో శివకేశవ క్షేత్రంగా పుష్పగిరి విలసిల్లుతోంది. ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది. నదికి ఆనుకుని ఉన్న కొండపై చాణక్య ప్రభువులు ఆలయాలు నిర్మించినట్టు శాసనాలు వెల్లడిస్తున్నాయి. కొండపై108 శివాలయాలు ఉండేవని అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఈ
గ్రామంలోని శివాలయంలో
శివుడు లింగం రూపంలో కాకుండా మానవ రూపంలో పార్వతీ సమేతంగా ఉండడం విశేషం.
శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల చేతుల మీదుగా స్థాపితమైన పుష్పగిరి పీఠం
ఇక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక ప్రాచీన పీఠం ఇదే. శ్రీ విద్యా
శంకర భారతి స్వామి ప్రస్తుతం ఈ పీఠానికి అధిపతిగా ఉన్నారు. ఈ పీఠంలో
చంద్రమౌళీశ్వరుడు స్ఫటికలింగం రూపంలో పూజలందుకుంటున్నాడు.
ఎలా వెళ్ళాలి?: కడప పట్టణానికి 18 కి. మీ దూరంలో పుష్పగిరి వుంది. అక్కడి నుండి బస్సులు, ఆటోల్లో పుష్పగిరికి చేరుకోవచ్చు.
పద కవితలు వికసించిన చోటు
ముప్ఫైరెండు
వేల పద కవితలు రచించి, శ్రీ వేంకటేశ్వర స్వామికి అర్పించిన తెలుగు
వాగ్గేయకారుడు అన్నమాచార్యుని జన్మస్థలం కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామం.
తాళ్లపాకకు రాజంపేట- కడప మెయిన్‌రోడ్డు నుంచి వెళ్లే రహదారి ప్రారంభంలో 108
అడుగుల
అన్నమాచార్య విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) ఆధ్వర్యంలో
ఏర్పాటు చేశారు. తాళ్లపాకలో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని కూడా నిర్మించారు.
జిల్లాలోని రైల్వేకోడూరు నుంచి తిరుమలకు దట్టమైన అటవీ ప్రాంతంలో ‘అన్నమయ్య’
పేరుతో ఒక కాలిబాట ఉంది. అన్నమయ్య ఈ బాటలోనే తిరుమలకు వెళ్లేవాడని
ప్రతీతి. అందుకే తిరుమలకు చాలామంది ఈ మార్గంలో నడిచి వెళ్తూ ఉంటారు.
ఎలా వెళ్ళాలి?: కడప
నుంచి 53 కి.మీ. దూరంలో తాళ్లపాక ఉంది. రోడ్డు మార్గంలో అక్కడికి
చేరుకోవచ్చు. తాళ్ళపాకకు సుమారు 6 కి.మీ. దూరంలోని రాజంపేటలో రైల్వే
స్టేషన్ ఉంది.
వసతి: రాజంపేటలో ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్ హౌస్‌లు, లాడ్జిలు అందుబాటులో ఉంటాయి.
కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రుని మఠం
కడప
జిల్లాలోని బ్రహ్మంగారి మఠం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.
క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక సంపన్నుడు, కాలజ్ఞాన
తత్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన ఈ జిల్లాలోని
కందిమల్లాయపల్లెలో జీవసమాధి అయ్యారు. ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని భక్తులు
నిర్మించారు. ఒక మఠం ఏరాటు చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో ఉన్న ఆ మఠం
కాలక్రమేణా ఆ గ్రామం పేరునే
బ్రహ్మంగారిమఠంగా మార్చేసింది. తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర
ప్రాంతాల నుంచి కూడా భక్తులు అసంఖ్యాకంగా ఈ మఠాన్ని సందర్శించడానికి వస్తూ
ఉంటారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంతో పాటు భజన మందిరం, పోలేరమ్మ
గుడి, ఈశ్వరీదేవి మఠం, కక్కయ్యమఠం, సుమారు 15 కి.మీ. దూరంలో సిద్ధయ్య మఠం
చూడదగిన ప్రదేశాలు.
ఎలా వెళ్ళాలి?:
కడప నుంచి 61 కి.మీ దూరంలో బ్రహ్మంగారి మఠం ఉంది. సమీపంలోని ప్రధాన రైల్వే
స్టేషన్ కడపలో ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
వసతి: యాత్రికుల సౌకర్యార్ధం టీటీడీ సత్రాలు, మరికొన్ని సత్రాలు ఉన్నాయి.
రెండు కొండల గండి కోట
పెన్నానది
ప్రవాహం వల్ల రెండు కొండల మధ్య లోతైన గండి ఏర్పడింది. ఈ గండిలోంచీ సుమారు 6
కిలో మీటర్ల మేర పెన్నా ప్రవాహం సాగుతుంది. నదికి దక్షిణ తీరాన ఎత్తయిన
కొండల మీద కళ్యాణ చాళుక్యుల రాజ ప్రతినిధి కాపరాజు కోట నిర్మించినట్టూ,
విజయనగర రాజుల సామంతుడు తిమ్మానాయుడు రాతితో దాన్ని దృఢంగా
పునర్నిర్మించినట్టూ కథనాలు ఉన్నాయి. తదనంతర కాలంలో గండి కోట ముస్లిం పాలకుల
ఆధీనంలోకి వచ్చింది. కోట లోపల మీర్ జుంబ్లా జామా మసీదు చూడముచ్చటగా ఉంది.
కోటలో ధాన్యాగారం, మందు గుండు సామగ్రి గది, పావురాళ్ల గోపురం, మీనార్లు
ఉన్నాయి. జైలు భవనం కూడా ఉంది. కోటపై నుంచి కిందకు చూస్తే పెన్నా ప్రవాహం
సందర్శకులకు కనువిందు చేస్తుంది. గండికోటకు వారసత్వ సంపదగా ప్రకటించే అర్హత
ఉందని యునెస్కో గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం గండికోటను పర్యాటక
ప్రాంతంగా ప్రకటించింది. మూడు సంవత్సరాలుగా గండికోట ఉత్సవాలు
నిర్వహిస్తోంది. జల సాహస క్రీడలు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది.
ఎలా వెళ్ళాలి?: కాగా కడప నుంచి 92 కి.మీ. దూరంలో గండికోట ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి ప్రయాణ సౌకర్యాలున్నాయి.
వసతి: గండికోటకు 9 కిలోమీటర్ల దూరంలోని జమ్మలమడుగులో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు, లాడ్జీలు ఉన్నాయి.
ఆడపూరు బౌద్ధ స్థూపాలు
కడప
జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. నందలూరు,
పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం తదితర ప్రాంతాల్లో బౌద్ధ స్థూపాలు
ఉన్నాయి. ప్రధానంగా నందలూరు గ్రామానికి తూర్పున ఆడపూరు గుట్టల్లో
ప్రాచీనమైన పదమూడు బౌద్ధ స్థూపాలున్నాయి. ఈ స్థూపాల్లో దేనిపై కూర్చున్నా
ఎదురుగా పిరమిడ్ ఆకారంలోని కొండ కనిపిస్తుంది. బౌద్ధ భిక్షువులు కొండ
దిగువన ఉన్న నదిలో స్నానం చేసి, ఈ స్థూపాలపై కూర్చొని, కొండ శిఖరాన్ని
చూస్తూ ఏకాగ్రతతో ధ్యానం చేసేవారని
తెలుస్తోంది. గుట్ట దిగువన ఉన్న గుహల్లో ఈ భిక్షువులు విశ్రాంతి
తీసుకొనేవారనీ, మిగతా సమయాల్లో సమీప ప్రాంతాల్లోని ప్రజలకు జ్ఞానబోధ
చేసేవారని కథనాలు ఉన్నాయి. ఈ గుట్టపై జరిపిన తవ్వకాల్లో పురాతనమైన సీసపు
నాణేలు, కుండ పెంకులు, మట్టిపాత్రలు లభించాయి.
ఎలా వెళ్ళాలి?: కడప నుంచి సుమారు 47 కి.మీ. దూరంలో ఆడపూరు ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
ఘన వైభవ చిహ్నం సిద్ధవటం కోట
విజయనగర
రాజుల కాలంలో ఘనమైన వైభవంతో వెలిగిన ప్రాంతం సిద్ధవటం. ఇక్కడ
వట(మర్రి)వృక్షం నీడలో సిద్ధులు ఉండేవారనీ, అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం
అనే పేరు వచ్చిందనీ పెద్దలు చెబుతారు. తొలుత రాయల వంశం సామంతులు, తరువాత
శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు, తరువాత మట్లి యల్లమరాజు, అతని కుమారుడు
అనంతరాజు సిద్ధవటం కోటను పాలించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అనంతరం
ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా, ఆర్కాట్ నవాబులు, కడప పాలకుడు అబ్దుల్
నబీఖాన్... ఇలా పలువురు ముస్లిం పాలకుల చేతులు మారిన ఈ కోట 1799లో
ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది. ఈ కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం,
కామాక్షిమాత ఆలయం, రాణిదర్బార్, ఈద్గా మసీద్, నగారా ఖానా, కోనేరు
ఉన్నాయి. టిప్పు సుల్తాన్ సమీప బంధువు బిస్మిల్లాఖాన్ షావలి దర్గా కూడా
ఉంది.
ఎలా వెళ్ళాలి?: కడప నుంచి 20 కి.మీ. దూరంలో సిద్ధవటం ఉంది.
వసతి: పర్యాటకులు కడపలో బస చేయవచ్చు.
జీవ వైవిధ్యానికి నెలవు లంకమల
కడప జిల్లాలో విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం వైవిధ్యభరితమైన వన్య ప్రాణులకు ఆవాసంగా నిలుస్తోంది. అపారమైన, అపురూపమైన వృక్ష సంపద ఈ ప్రాంతంలో
ఉంది. లోతైన లోయలూ, అద్భుతమైన జలపాతాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి.
అంతరించిపోయాయని భావిస్తున్న కలివికోడి, హనీబాడ్జర్ లాంటి అరుదైన జీవులు ఈ
ప్రాంతంలో కనిపించాయి. ఎలా వెళ్ళాలి?: కడప నుంచి సుమారు 60 కిలోమీటర్ల
దూరంలో ఈ అభయారణ్యం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
చారిత్రక నిధి
కడప
నగరంలోని శ్రీభగవాన్ మహవీర్ ప్రభుత్వ మ్యూజియం వేల సంవత్సరాల చరిత్రకు
నిధి. ఈ మ్యూజియంలో నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. ఒకటవ గ్యాలరీలో వివిధ దేవతా
విగ్రహాలు, రెండవ గ్యాలరీలో జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, మూడవ
గ్యాలరీలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లతో సహా ప్రాచీనమైన నాణేలు,
ఆయుధాలు భద్రపరిచారు. నాలుగో గ్యాలరీలో వీర సైనికులకు చిహ్నాలైన శిలలు
ఉన్నాయి. రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ మ్యూజియం నడుస్తోంది.
జిల్లాలోని మైలవరం వద్ద మరో మ్యూజియం ఉంది.
ఎలా వెళ్ళాలి?: ఈ మ్యూజియం కడప నగరంలో ఉంది.
రెండో అజ్మీర్ కడప పెద్ద దర్గా
కడప
నగరంలో ఉన్న అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా) దేశంలోని ప్రముఖ దర్గాలలో
ఒకటి. రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గా తరువాత ‘రెండో అజ్మీర్’గా కడప పెద్ద
దర్గాను పరిగణిస్తూ ఉంటారు. రాజకీయ నేతలు, సినీ నటులు, ప్రముఖ
పారిశ్రామికవేత్తలు.., ఇలా అన్ని రంగాలకు చెందిన ముఖ్యులు, అన్ని మతాలకు
చెందిన భక్తులు పెద్ద దర్గాను దర్శించుకుంటారు. మహమ్మద్ ప్రవక్త
వంశీయునిగా పరిగణించే పీరుల్లా హుస్సేనీ సాహెబ్ 1716లో ఇక్కడ జీవసమాధి
అయ్యారు. ఆయనకు అప్పటి కడప నవాబు సమాధి
నిర్మించారు. పీరుల్లా మాలిక్ పెద్ద కుమారుడు ఆరిఫుల్లా హుస్సేనీ ఈ
దర్గాకు తొలి పీఠాధిపత్యం వహించారు. మరో కుమారుడు అహ్మద్ హుస్సేనీ నందలూరు
పీఠానికి అధిపతి అయ్యారు. ప్రస్తుతం కడప దర్గా 11వ పీఠాధిపతిగా హజరత్
సయ్యద్‌షా ఆరిఫుల్లా హుస్సేనీ సాహెబ్ కొనసాగుతున్నారు. పీరుల్లా మాలిక్,
ఆరిఫుల్లా, అమీనుల్లా, యదుల్లా హుస్సేనీలకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉరుసు
ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అన్ని మతాల వారూ పాల్గొంటారు.
ఎలా వెళ్ళాలి?: జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఈ దర్గా ఉంది
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565