పరశురాముడి
పాపం పోయింది ఇక్కడే!
ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఉన్న క్షేత్రం త్రేతేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఒకవైపు హత్యరాల మడుగు, మరోవైపు గధాధర స్వామి ఆలయం దర్శనమిస్తాయి. సుదూర ప్రాంతాలకు సైతం కనిపించే దీపపుస్తంభం ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ.
స్థలపురాణం
పూర్వం దండకారణ్యంలో అంతర్భాగంగా ఉండే ఈ ప్రాంతంలోనే భైరవుడు అనే రాక్షసుడు పరమ శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివయ్య ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అని అడగగా, ‘ఎప్పుడూ మీ పాదాల చెంతే ఉండేలా వరాన్ని అనుగ్రహించ’మని అన్నాడట. అందుకు అంగీకరించి శివుడు భైరవకొండగా మారి తన రాకకోసం ఎదురుచూస్తూ ఉండమని తెలిపాడట. త్రేతాయుగంలో ఈ కొండమీదే నారద, శుక్ర, భరద్వాజ, వశిష్ఠ మహర్షులు చేపట్టిన మహా యజ్ఞం ఫలితంగా మహాశివుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశాడు. అందుకే ఇక్కడ స్వామిని త్రేతేశ్వరుడిగా పూజిస్తారు. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. లింగం మీద పుట్ట పెరిగిపోయింది. ఈ ప్రాంతానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని పొత్తాపిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న ధర్మపాలుడు అనే రాజుకు స్వామి కలలో కనిపించి పుట్టలో ఉన్న లింగాన్నీ, ఉత్తర దిశలో మడుగు వద్ద ఉండే కామాక్షీదేవి విగ్రహాన్నీ ఒకే దగ్గర ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడట. మరుసటిరోజు ఉదయం పుట్టదగ్గరకు చేరుకున్న రాజు జాగ్రత్తగా దాన్ని తవ్వించి లింగాన్ని బయటకు తీసి, ఆ ప్రదేశంలోనే కామాక్షీ దేవి సమేతంగా త్రేతేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది. అప్పటి నుంచీ తరతరాలుగా ఆ వంశానికి చెందినవారే ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ వచ్చారు. ఈ ప్రాంగణంలోనే నందీశ్వరుడు, పంచ శివలింగాలు, శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ మండపం, చండీశ్వరుడి విగ్రహాలూ కొలువుదీరి ఉన్నాయి.పేరు ఇలా...
పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞానుసారం తల్లిని వధిస్తాడు. ఆ తర్వాత మాతృహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఫలితం లభించదు. చివరికి మహర్షుల సూచన మేరకు బహుదా నదిలో స్నానం ఆచరించి, ఆ త్రేతేశ్వరుడిని అర్చించిన తర్వాత పరశురాముడి మాతృహత్యా పాతకం రాలిపోయిందనీ అందుకే ఈ ప్రాంతానికి హత్యరాలె అనే పేరొచ్చిందనే కథ ప్రచారంలో ఉంది. తర్వాతి కాలంలో అది హత్యరాల, అత్తిరాలగా మారిందని చెబుతారు. పరశురామాలయం సాధారణంగా మనదేశంలో పరశురామ క్షేత్రాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిల్లో హత్యరాల పరశురాముడి ఆలయం అతి పురాతనమైంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా పురాణ కథనాల్లోని పరశురాముడు నార వస్త్రాలతో, రుద్రాక్షమాలలు ధరించి ఉంటాడు. కానీ, ఇక్కడ మాత్రం కిరీటం, మెడలో ఆభరణాలతో దర్శనమిస్తాడు.
దీప స్తంభాలు...
హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయం ప్రకృతి సౌందర్యానికి నెలవు. చుట్టూ ఉండే ఆలయాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభనూ సంతరించుకుంటుంది. కొండమీది రాజగోపురానికి మెట్లదారి ఒకటి ఉంది. ఆ గోపురానికి పై భాగంలో ఎత్తయిన దీపస్తంభం ఉంది. అక్కడ ఏటా మహాశివరాత్రి, కార్తిక పౌర్ణమి రోజుల్లో శిఖర దీపాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగును చూసే చుట్టుపక్కల ప్రాంతాలను పాలించే రాజులు ఉపవాస దీక్షలు పాటించేవారని ప్రతీతి. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు త్రేతేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కార్తిక మాసంలో ప్రత్యేక అభిషేకాలు చేస్తారు.
ఇలా చేరుకోవచ్చు
హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సు సౌకర్యం ఉంది. ప్రత్యేక రైళ్లు మినహా దాదాపు అన్ని రైళ్లూ రాజంపేట రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి నేరుగా ఆటోరిక్షా ద్వారా కానీ, లేదా పాతబస్టాండు నుంచి బస్సులో ప్రయాణించీ స్వామిని దర్శించుకోవచ్చు. ఆర్‌టీసీ సంస్థ మహాశివరాత్రిలాంటి పర్వదినాల్లో, ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆలయానికి చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
- కమ్మర వీరాచారి, రాజంపేట
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565