అంబలి
అంబలి.. మండు వేసవిలో, కరువు కాలంలో కాలే కడుపునకు కాసింత అంబలి తాగితే దాహం తీరడమే కాదు, ఆకలిని కూడా తట్టుకుంటుంది. పాదచారులకు ఎండాకాలంలో అంబలి పోసి వారి దప్పిక తీర్చే సేవాతత్పరులు కూడా ఈ రోజులలో ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం!
-కనికె నర్సింలు
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం గ్రామానికి సమీపంలో బసవణ్న దేవాలయం దగ్గర తారాపురం నీలప్ప, సిద్దిలింగప్ప, ఈరప్ప, బస్వరాజు కుంటుంబాల వారు ప్రతి ఏటా అంబలి కేంద్రం ఏర్పాటు చేసి పాదచారులకు అంబలిని అందిస్తున్నారు. ఐదు వారాలపాటు వారు ఇలా అంబలిని పంపిణీ చేస్తారు. బుధవారం పండుగ: ముందురోజు రాత్రి ఇంటి దగ్గర తెల్ల జొన్నలను నానబెట్టి ఉదయం దేవాలయం దగ్గరకు తారాపురం కుటుంబానికి చెందిన మహిళలు వచ్చి నాలుగు మట్టి కుండలలో అంబలిని కాస్తారు. తరువాత ఓ చిన్న పాత్రలో వండిన అన్నాన్ని విస్తరిలో ఐదు ముద్దలుగా పెట్టి బసవణ్నకు నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కాసిన అంబలి పంపిణీని ప్రారంభిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభించి అంబలి అయిపోయేదాక మహిళలు అక్కడే ఉండి దారిన వచ్చిపోయే వారికి, గ్రామస్థులకు, రైతులకు అందిస్తారు. బుధవారం వచ్చిందంటే చాలు రేగడి మైలారం గ్రామానికి చెందిన చాలా మంది పాత్రలతో వచ్చి అంబలిని తీసుకెళ్తారు. పొలాలకు వెళ్ళేవారు టిఫిన్ బాక్సులు, ముంతలలో అంబలిని తీసుకొని పోతారు. దారిన పోయేవారు కూడా అక్కడ కొద్దిసేపు ఆగి అంబలిని సేవించి సేద తీరుతారు. రెండు గ్లాసుల అంబలి తాగినా ఎండా కాలంలో ఎంతో హాయిగా, చల్లగా ఉంటుంది.
వారసత్వంగా: గ్రామానికి చెందిన తారాపురం కుటుంబీకులు సుమారు వంద సంవత్సరాలకు పైబడి ఈ అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వకాలంలో వాహన సౌకర్యం లేనపుడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు రేగడి మైలారం గ్రామానికి చెందిన ప్రజలు కొడంగల్‌కు బుధవారం జరిగే అంగడికి కాలినడకన వెళ్లేవారు. అలా అంగడికి వెళ్లే వారికి, పొలానికి వెళ్లే రైతులకు దాహం వేస్తే అంబలి ద్వారా దూప తీర్చాలని అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
బసవ జయంతి సందర్భంగా: తారాపురం కుటుంబాలకు చెందిన రేగడి పొలాల్లో తెల్ల జొన్నలు పండించకున్నా జొన్నలను కొని అంబలిని పంపిణీ చేస్తున్నారు. అంబలి తయారు చేయడానికి 15 కిలోల జొన్నలు అవసరమవుతాయి. అందరూ కలిసి ఈ ఖర్చును భరిస్తారు. ఎంత ఖర్చు అయినా పూర్వీకుల ఆచారాన్ని ఇంకా వీరు కొనసాగిస్తున్నారు. తారాపురం కుటుంబీకులు ధనవంతులు కారు. ఏటా శ్రీరామనవమి తరువాత అంబలి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. బసవ జయంతి రోజు దేవాలయం దగ్గర అన్నదానం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు.
ఆకలిని తగ్గిస్తుంది:అంబలి ఆకలిని తగ్గిస్తుంది. రాగులతో తయారు చేసిన అంబలిలో కాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉండటం మూలంగా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది, త్వరగా జీర్ణమవుతుంది. గర్భిణీలు అంబలి తాగడం వల్ల పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. గోధుములు, జొన్నలతో తయారు చేసిన అంబలిలో ప్రొటీన్లు, మిటమిన్లు ఉంటాయి.
-రవీంద్రయాదవ్, వైద్యుడు
తాత ముత్తాతల నుంచి: మా తాత ముత్తాతల నుండి ఇస్తున్న ఆచారం ఇది. మంచి లక్ష్యంతో ప్రారంభించిన అంబలి పంపిణీని నేటికీ ఆపకుండా కొనసాగిస్తున్నాం. ఎండాకాలంలో ప్రజలకు కొంత దప్పిక తీర్చామన్న సంతృప్తి ఉంటుంది.
-తారాపురం సిద్దమ్మ, -అంబలి కేంద్రం నిర్వాహకురాలు.
మంచి అవకాశం: అంబలి మంచి పౌష్టికాహారం. వీరు ఏర్పాటుచేస్తున్న అంబలి కేంద్రం ద్వారా ఎంతోమందికి ఆసరా అవుతున్నది. ఎండాకాలంలో చలువ పొందేందుకు ఇది మంచి అవకాశం. నేను చిన్నప్పట్నుంచీ ఇక్కడ అంబలి తాగుతున్నా. తారాపురం కుటుంబీకుల సేవాగుణం అభినందనీయం.
-బసప్ప, టీచర్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565